చంద్రబాబు బీసీల ద్రోహి | YS Jagan Mohan Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బీసీల ద్రోహి

Published Tue, Jul 23 2019 3:30 AM | Last Updated on Tue, Jul 23 2019 4:55 AM

YS Jagan Mohan Reddy Fires On Chandrababu - Sakshi

సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు తీసుకువస్తుంటే ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోంది. ఇంత అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం దేశంలో ఎక్కడా ఉండదు. బడుగు, బలహీన వర్గాల ద్రోహులు వీళ్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లులను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం ఇచ్చే బిల్లులు, అన్ని నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చే బిల్లులు, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టి ఆమోదించారు. కాగా ఈ బిల్లులు ప్రవేశ పెడుతున్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు రాజధానిపై చర్చను కొనసాగించాలనే నెపంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే రాజధాని అంశంపై సుదీర్ఘ చర్చ ముగిసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరణ కూడా ఇచ్చారు. కానీ దీన్ని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు స్పీకర్‌ తమ్మినేని సీతారాం పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు.. 

క్లారిఫికేషన్‌ తర్వాతా చర్చ ఉంటుందా? 
‘40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటారు. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినైన రాజకీయ నేత అంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఒక అంశంపై ప్రకటన చేసిన తర్వాత కేవలం క్లారిఫికేషన్‌ (వివరణ) మాత్రమే ఉంటుందని తెలిసినా కూడా దానిపై అర గంటపాటు మాట్లాడిన తర్వాత కూడా తృప్తి చెందకుండా ఇంకా గొడవ చేస్తున్నారు. 

ఇలాంటి విపక్షం ఎక్కడైనా ఉంటుందా? 
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీ బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో? 

టీడీపీ ఓర్వలేకపోతోంది..
రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం  ఇస్తుంటే టీడీపీ ఓర్వలేక పోతోంది. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష నేత మరొకరు ఉంటారా? ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీ మరొకటి ఉంటుందా? దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన పార్టీ దేశంలో టీడీపీ తప్ప మరొకటి ఉండదు. ఉద్యోగాలు లేక మన పిల్లలు అల్లాడిపోతున్నారు. వారి జీవితాలు బాగు పరిచేందుకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లు తీసుకువస్తుంటే దీన్ని కూడా అడ్డుకుంటారా? ఇంతకంటే అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం మరెక్కడా ఉండదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెడుతుంటే ఈ ప్రతిపక్షం అడ్డం పడుతోంది. ఇలాంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొకటి లేదు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కాకుండా మరొకరు దేశంలోనే ఉండరు.

బీసీ స్పీకర్‌ను అవమానిస్తున్నారు 
గతంలో మేము ప్రతిపక్షంలో ఉండగా వాళ్లు అటువైపు నుంచి స్టేట్‌మెంట్‌ ఇస్తే క్లారిఫికేషన్‌కు మాకు రెండు మూడు నిముషాలు కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. మరి ఇవాళ మేము స్టేట్‌మెంట్‌ చదివిన తర్వాత అరగంట సేపు చంద్రబాబు మాట్లాడారు. ఆ మాటల్లో ఏమాత్రం పస లేకుండా మాట్లాడారు. మళ్లీ దాని గురించి ఏకంగా పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానిస్తున్నారు. స్పీకర్‌ అన్న గౌరవం ఏమాత్రం లేకుండా అవమానిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారు. వీళ్లు బడుగు, బలహీన వర్గాల ద్రోహులు. వీళ్లకు జ్జానోదయం కలగాలని భగవంతుని కోరుకుంటున్నా. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా సరే వీళ్లకు బుద్ధి రాలేదు. ఈ ద్రోహులను భగవంతుడే శిక్షిస్తాడు’ అని సీఎం మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement