నేడు, రేపు కేఎంసీ వార్షికోత్సవం
నేడు, రేపు కేఎంసీ వార్షికోత్సవం
Published Thu, Jul 28 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
–హాజరుకానున్న డీఎంఈ సుబ్బారావు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల(కేఎంసీ) 59వ వార్షికోత్సవాన్ని ఈ నెల 28, 29వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. లక్ష్య–16 పేరుతో 28వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల 1975 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థి, ఆనాటి మిస్టర్ కేఎంసీ డాక్టర్ ఎ. శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా జిల్లా ఎస్‌పీ ఆకే రవికృష్ణ హాజరవుతారన్నారు.మయూక–16 పేరుతో 29వ తేదిన సాయంత్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ ఎన్. సుబ్బారావు హాజరవుతారన్నారు. సినీ సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ ఎల్‌వీ. గంగాధరశాస్త్రి హాజరై వైద్యులు–మానవతావిలువల గురించి ప్రసంగిస్తారని వివరించారు. వీరితో పాటు గౌరవ అతిథులుగా రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్‌ఏ సత్తార్, డీఐజీ రమణకుమార్, శ్రీశైలం దేవస్థానం ఈవో, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎన్.భరత్‌గుప్తా, నాటా ఓవర్‌సీస్ కో ఆర్డినేటర్ ఎస్. వెంకటరమణ హాజరవుతారన్నారు. వచ్చే ఏడాది 60వ వార్షికోత్సవాన్ని డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌గా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏడాది పొడవునా ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జోజిరెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement