ముంబయి నుంచి రూ.18వేల విలువ చేసే మందులను సొంత ఖర్చులతో తెప్పించినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌కు చెబుతున్న శివరాముడు తల్లిదండ్రులు
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం
కర్నూలు(హాస్పిటల్):
‘అయ్యా నా పెద్దకుమారుడు వారం క్రితమే ఇదే రోగంతో చచ్చిపోయాడు. ఇప్పుడు అదే రోగం నా చిన్నకుమారున్నీ పట్టుకుంది. ఈ ఆసుపత్రిలో చూస్తే డాక్టర్లు మందులు లేవంటున్నారు. అప్పులు చేసి ముంబయి నుంచి రూ.18వేలు పెట్టి మందులు తెప్పించినాము. నా బిడ్డను ఎలాగైనా బతికించండయ్యా...’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఓ పేద కుటుంబం మొరపెట్టుకుంది. వారి మాటలు చెవికెక్కించుకోకుండానే మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు. పేద కుటుంబం తెచ్చుకున్న ఖరీదైన మందులను సైతం వెంటనే వాడకుండా వైద్యులు తాత్సారం చేశారు. ఫలితంగా ఆ పేద కుటుంబం రెండో కుమారున్ని కూడా పోగొట్టుకుంది.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన ఎంగన్న, నాగలక్ష్మమ్మల పెద్ద కుమారుడు శివయ్య రెండు వారాల క్రితం డిఫ్తీరియాతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయాడు. ఇదే వ్యాధి వారి చిన్న కుమారుడు శివరాముడుకు కూడా సోకింది. అతన్ని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం మళ్లీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకొచ్చారు. ఖరీదైన మందులు వాడితే గానీ రోగం తగ్గదని, ఆ మందులు ఇక్కడ లేవని డాక్టర్లు చెప్పడంతో వారి గుండెపగిలిగింది. ఊళ్లో అప్పులు చేసి డాక్టర్లు చెప్పిన మేరకు మందులను ముంబయి నుంచి ఆఘమేఘాలపై తెప్పించారు. అప్పటికే వారు బాలుని ఆరోగ్యం కోసం రూ.30వేల దాకా ఖర్చు చేశారు. పెద్దకుమారుని కోసం మరో రూ.10వేలు ఖర్చు పెట్టారు. ఇదే తరుణంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెల 11న ఆసుపత్రిని తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న బాలుడు శివరాముడును చూసి అతనికున్న వ్యాధి గురించి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా బాలుని తల్లిదండ్రులు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అలాగా.. అనే నిట్టూర్పుతో మంత్రి సరిపెట్టారు. బాలుని ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టండన్న భరోసాను అధికారులకు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అంత ఖరీదైన మందులు ఎవరు కొనమన్నారంటూ శివరాముడు తల్లిదండ్రులను వైద్యులు నిలదీశారు. డాక్టర్లు చెప్పినందుకే కొన్నామని చెప్పినా పట్టించుకోలేదు. పైగా తెచ్చిన మందులను సైతం కొన్నాళ్ల పాటు వాడకుండా పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. ఈలోగా బాలుని ఆరోగ్య పరిస్థితి వికటించి మంగళవారం మతి చెందాడు. మంత్రి, అధికారులు స్పందించి ఉంటే తమ కుమారుడు దక్కేవాడని, మాయదారి రోగానికి తమ ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నామని బాలుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డిప్తీరియా వ్యాధి లక్షణాలతో గత సంవత్సరం 47 మంది, ఈ యేడాది 15 మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందారు. వీరి గళ్లను పరీక్షించిన కర్నూలు మెడికల్ కాలేజి మైక్రోబయాలజి ల్యాబ్ అధికారులు ఏ ఒక్కరికీ డిఫ్తీరియా సోకలేదని నివేదిక అందజేశారు. అయితే చిన్నారులు ఎందుకు చనిపోతున్నారో మాత్రం చెప్పలేకపోతున్నారు.