కెనెడీ జూనియర్‌ను నియమించిన ట్రంప్
ప్రజారోగ్య నిపుణుల్లో తీవ్ర ఆందోళన
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు.
కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’’ అని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది.
రాజకీయ కుటుంబం
కెనెడీ ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీకి తమ్ముడు. అమెరికాకు అటార్నీ జనరల్‌గా పని చేశారు. ఈసారి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌తో కెనెడీ పోటీ పడ్డారు. తర్వాత స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచారు. తాను గెలిస్తే ఆరోగ్య విధాన పర్యవేక్షణను అప్పగిస్తానని ట్రంప్ హామీ ఇవ్వడంతో ఆయనకు మద్దతుగా పోటీ నుంచి తప్పుతకున్నారు. అనంతరం ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎన్నికల చివరి దశలో ట్రంప్ కోసం కెనెడీ ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు.
వ్యాక్సిన్లకు ఫక్తు వ్యతిరేకి
ప్రపంచంలోనే ప్రముఖ వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుల్లో కెనెడీ ఒకరు. ఆటిజం తదితర ఆరోగ్య సమస్యలకు టీకాలు కారణమవుతాయన్నది ఆయన వాదన. వ్యాక్సిన్ అస్సలు సురక్షితం కావని, ప్రభావవంతమైనవీ కావని తానిప్పటికీ నమ్ముతున్నానని చెబుతారు. పిల్లలకు టీకాలను సూచించే సీడీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించాలని 2021లో ప్రజలకు పిలుపునిచ్చారు. టీకాలకు వ్యతిరేకంగా ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించారు.
అది టీకా సంస్థలతో పాటు వాటికి మద్దతిచ్చే పలు వార్తా సంస్థలపై కూడా కోర్టుల్లో పోరాడుతోంది. ప్రముఖ న్యాయవాది అయిన కెనెడీ పురుగుమందులు, ఫార్మా కంపెనీలపై కేసుల్లో స్వయంగా వాదిస్తుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, కలుపు మందుల వాడకానికి కూడా ఆయన ఫక్తు వ్యతిరేకి. అమెరికాలో ఆహార పరిశ్రమపై చిరకాలంగా పెత్తనం చలాయిస్తున్న భారీ వాణిజ్య కమతాలు, దాణా పరిశ్రమలను బాగా విమర్శిస్తుంటారు.
దశాబ్దాలుగా దేశమంతటా నమ్మకమైన అనుచరగణాన్ని నిర్మించుకున్నారు. ఆహార పదార్థాల విషయంలో కఠిన నిబంధనలు విధించాలన్నది కెనెడీ వైఖరి. అమెరికాలో ఆహారాన్ని ఆరోగ్యకరంగా మారుస్తానని, ఈ విషయంలో యూరప్ తరహా నిబంధనలు తెస్తానని చెబుతున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పలు విభాగాల ఉద్యోగుల నేపథ్యాన్ని లోతుగా పరిశీలిస్తామని కూడా ప్రకటించారు. ఫార్మా తదితర కంపెనీల్లో చేసిన నేపథ్యమున్న వారిని ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పరిశోధనలను పర్యవేక్షించే వందలాది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పడం కలకలం రేపింది.
వివాదాస్పదుడు కూడా
పలు వివాదాల్లో కూడా కెనెడీ పతాక శీర్షికలకెక్కారు. ఎలుగుబంటి కళేబరాన్ని న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో పడేసి అది బైక్ ఢీకొని చనిపోయినట్టు చిత్రీకరించారు. దాన్ని ఆయనే కారుతో గుద్ది చంపారంటారు. బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచి్చన ఓ తిమింగలం తలను కత్తిరించి కారుకు కట్టి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తే వెల్లడించింది. దాంతో కెనెడీ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది.
తీవ్ర ఆందోళనలు
కెనెడీ నియామకం ప్రజారోగ్య నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారులను మహమ్మారుల బారినుంచి కాపాడే టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వ్యక్తి చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని బలి పెడుతున్నారంటూ వారంతా మండిపడుతున్నారు. ఆరోగ్య మంత్రి పదవికి అవసరమైన ఒక్క అర్హత కూడా ఆయనకు లేదని అమెరికాలోని ప్రఖ్యాత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ లురీ అన్నారు. ఆ పదవికి ఆయన పూర్తిగా అనర్హుడంటూ సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ మండీ కోహెన్ ధ్వజమెత్తారు. ‘‘ఆరోగ్యం విషయంలో అమెరికన్లు మళ్లీ తిరోగమన బాటను కోరుకోవడం లేదు. పిల్లలు, పెద్దలు ఆరోగ్య సమస్యల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవడం వంటివి చూడాలనుకోవడం లేదు’’ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్గత వ్యవహారాల మంత్రిగా డౌగ్ బర్గమ్
అంతర్గత వ్యవహారాల మంత్రిగా నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్‌ను ట్రంప్ ఎంచుకున్నారు. నిజానికి ఆ యన ట్రంప్ రన్నింగ్‌మేట్ అవుతారని తొలుత అంతా భావించారు. 67 ఏళ్ల బర్గం రెండోసారి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. తొలుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో కూడా కొనసాగారు. తర్వాత తప్పుకుని ట్రంప్‌కు మద్దతుగా ముమ్మరంగా ప్రచా రం చేశారు. పూర్వాశ్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజమైన ఆయన అనంతరం ట్రంప్ మాదిరిగానే రియల్టీ వ్యాపారంలో కూడా రాణించారు.
‘హష్ మనీ’ లాయర్‌కు అందలం
తన హష్ మనీ కేసును వాదిస్తున్న న్యాయ బృందం సారథి టాడ్ బ్లాంచ్‌ను దేశ డిప్యూటీ అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎంపిక చేశారు. న్యాయ శాఖలో ఇది రెండో అత్యున్నత పదవి. అటార్నీ జనరల్‌గా మాట్ గేట్జ్ ఆయన ఇప్పటికే ఎంచుకోవడం తెలిసిందే. కాంగ్రెస్ మాజీ సభ్యుడు డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ వ్యవహారాల మంత్రిగా ట్రంప్ ఎంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment