కర్నూలు(హాస్పిటల్): ధనార్జనే ధ్యేయం కాకుండా సమాజ హితాన్ని కోరాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సి. వెంకటేశ్వరరావు వైద్యులు, వైద్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. కర్నూలు మెడికల్ కళాశాల 2012 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శనివారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 200 మెడికల్ సీట్లున్న ఏకైక కళాశాల కేఎంసీ మాత్రమేనన్నారు. ఈ కళాశాలకు దేశంలోనే ప్రత్యేకత ఉందని, ఇందులో అభ్యసించడం అదృష్టమన్నారు. గతంతో పోల్చితే వైద్యవిద్యలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయన్నారు. ఒక విధంగా ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కాస్త దూరం పెంచిందన్నారు. ఇప్పటి విద్యార్థులు ఎక్కువ శాతం సాంకేతికతపై ఆధారపడుతున్నారన్నారు.
ఈ కారణంగా చాలా మందిలో నైతికత లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో రోగులు వేగవంతమైన చికిత్స కోరుకుంటున్నారని, ఇందుకు తగ్గట్టు వైద్యులు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. రోగుల ఇబ్బందులు పూర్తిగా తెలుసుకుని వైద్యం చేయాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈఎస్‌ఏ సత్తార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ మాట్లాడారు. చివరగా వివిధ సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు, స్నాతకోత్సవ పట్టాలను అతిథులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ రాంప్రసాద్, పెద్దాసుపత్రి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు పి. చంద్రశేఖర్, నరేంద్రనాథ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి అందజేశారు.
గోల్డ్‌మెడల్ సాధించిన వారు
బి. మేఘనారెడ్డి, 2. సి. ప్రవల్లిక, 3. కె. జయసత్య(పీడియాట్రిక్స్), ఎ. కావ్యలహరి(గైనిక్, ఫార్మకాలజి, అనాటమి, ఫార్మకాలజి), జి. వైష్ణవి(జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, అన్నపూర్ణమ్మ మెమోరియల్ మెడల్), యు. శివ(ఈఎన్‌టీ, కమ్యూనిటీ మెడిసిన్, ఈ. శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ మెడల్ ), ఎన్. సాయిచరిత(ఆఫ్తమాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పాలుట్ల మహాలక్ష్మమ్మ మెమోరియల్ మెడల్), యాస్మిన్ షేక్(ఫార్మకాలజీ, ఫిజియాలజీ), ఎ. సాహితి, జి.సుమాంజలి(మైక్రోబయాలజి), కోనేటి శ్రీదేవి(బయోకెమిస్ట్రీ, సుబ్బారెడ్డి మెమోరియల్ మెడల్), కేబీ. నవనీత్‌యాదవ్(బయోకెమిస్ట్రీ, ముక్కామల ఈశ్వరరెడ్డి మెమోరియల్ మెడల్).
Comments
Please login to add a commentAdd a comment