కార్పొరేషన్‌పై శీతకన్ను! | unlove on corporation | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌పై శీతకన్ను!

Published Fri, Nov 4 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

కార్పొరేషన్‌పై శీతకన్ను!

కార్పొరేషన్‌పై శీతకన్ను!

కేంద్ర నిధులతో ప్రభుత్వ ప్రచారం
- నగరాభివృద్ధికి రూ.50కోట్లు ఇస్తామని సీఎం ప్రకటన
- ఏడు నెలలు గడిచినా ఆ ఊసే కరువు
- ఒక్క రూపాయి కూడా ఇవ్వని వైనం
- అభివృద్ధి పనులన్నీ నత్తతో పోటీ
- కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతల అనుయాయులకే..
- కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పనులు
- కేవీఆర్‌ కళాశాల స్థలంపై నేతల కన్ను
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు కార్పొరేషన్‌పై శీతకన్ను వేసింది. కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విదిల్చని పరిస్థితి. కేవలం కేంద్ర నిధులతోనే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కేంద్రం సాక్షిగా కార్పొరేషన్‌కు రూ.50 కోట్లను కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీకే దిక్కులేకుండా పోయింది. ఆరేడు నెలలు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కర్నూలుపై ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. పైగా కేంద్ర నిధులతో కార్యక్రమాలు చేపడుతూ క్రెడిట్‌ కొట్టేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. అంతేకాకుండా ఈ పనులన్నీ తమ అనుయాయులకే అప్పగిస్తూ పర్సెంటేజీల వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఫలితంగా కృష్ణా పుష్కరాల సందర్భంగా పూర్తి చేయాల్సిన పనులు సైతం ఇప్పటికీ నత్తతో పోటీపడుతున్నాయి. మొత్తం మీద కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం పర్యటనతోనైనా ఇస్తామన్న నిధులు విదుల్చుతారో లేదో చూడాల్సి ఉంది.
 
అన్నీ కేంద్రం నిధులతోనే..
వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులతో చేపడుతున్నవే. అమృత్‌ పథకం కింద వచ్చిన నిధులతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్ల విస్తరణతో పాటు డ్రెయినేజీల నిర్మాణం, తదితర పనులన్నీ అమృత్‌ పథకం కింద వచ్చిన నిధులవే. వీటితో కార్యక్రమాలు చేపడుతూ ఈ క్రెడిట్‌ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే దక్కేలా చేసుకుంటున్నారు. కేంద్రం నిధులతో చేపడుతున్న ఈ పనుల కాంట్రాక్టులు మాత్రం అధికార పార్టీ నేతలే చేస్తున్నారు. ఇక నిధుల కేటాయింపులోనూ కేవలం కొన్ని ప్రాంతాలకే కేటాయిస్తున్నారు మినహా సమదృష్టితో అన్ని వార్డులకు కేటాయిస్తున్న సందర్భాలు లేవు. అన్ని పనుల్లోనూ అధికార పార్టీ నేతలు పర్సెంటేజీలు డిమాండ్‌ చేస్తూ పనులు సాగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. 
 
కొనసా..గుతున్న పనులు
కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టిన పనులు కూడా నత్తతో పోటీ పడుతున్నాయి. రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచిన పనులు కూడా ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. ఇక కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన.. వై–జంక్షన్‌ నుంచి రైల్వే స్టేషన్, సి.క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రోడ్ల వెడల్పు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు ఒక్క రోజు జరిగితే మూడు రోజులు నిలిచిపోతున్నాయి. అంతేకాకుండా అధికార పార్టీ నేతల అనుచరులకు బంకులు వేయించేందుకు కేవీఆర్‌ కాలేజీ స్థలాన్ని దౌర్జన్యంగా లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. చెత్త సేకరణ పేరుతో అధికార పార్టీ నేతలు మాత్రం నాలుగైదు ట్రాక్టర్లను అద్దెకు ఇచ్చి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనతోనైనా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాళ్లు విదులుస్తుందా? మళ్లీ హామీలతోనే సరిపెడుతుందా అనేది వేచి చచూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement