గజ్జె ఘల్లుమంది.. గుండె జల్లుమంది
గజ్జె ఘల్లుమంది.. గుండె జల్లుమంది
Published Sun, Jun 4 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
– కేఎంసీలో సాంస్కృతిక పోటీలు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు వైద్యకళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సంగీత, సాహిత్య, నృత్యపోటీలు (సాంస్కృతిక పోటీలు) ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరిగే ఈ పోటీలను రిటైర్డ్ డీఎంఈ, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్‌ఏ.సత్తార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సాంస్కృతిక శోభ తగ్గిపోయిందన్నారు. నిత్యం వారు చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఆటలు, పాటలు, మంచి సాహిత్యం వల్ల వారు జీవితంలో మరింతగా రాణిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం వైద్యవిద్యార్థినిలు హర్షిణి బృందంచే గణేష కేతంచే పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్థోపెడిక్ హెచ్‌వోడి డాక్టర్ రఘునందన్ ఆలపించిన అలనాటి సినీగీతం ‘ఈ దివిలో విరిసిన పారిజాతమో...’ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలనాటి ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ నుంచి యువనటుల సినిమాల వరకు గీతాలను కూర్చి వైద్యవిద్యార్థులు నృత్యం చేశారు. ఆ తర్వాత ఫిజియాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పావని శాస్త్రీయ నృత్యప్రదర్శన అలరించింది. 2012 బ్యాచ్ వైద్యవిద్యార్థిని సాయిహారిక ఆలపించిన సినీగీతం, సాహితి, వెన్నెల, భరత్, శ్రీహర్ష గ్రూప్ డ్యాన్స్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆకాశవాణి అనౌన్సర్ పోతన, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ గెలివి సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement