రైతుకు చేదోడుగా ‘ఫార్మ్ రోబో ఆర్–1’.. కోతుల్ని తరిమికొట్టే ‘మంకీగన్’
రైతులను ఆకట్టుకొంటున్న కిసాన్ మేళా.. వ్యవసాయ వర్సిటీ వజ్రోత్సవాల్లో భాగంగా వివిధ స్టాళ్ల ఏర్పాటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కిసాన్‌మేళాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ స్టాళ్లను ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు పశు వైద్య విశ్వవిద్యాల యానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించారు.
ఆగ్రో, బయోటెక్, ఫెర్టిలైజర్ కంపెనీలు తమ ఉత్ప త్తులు, యంత్రాలను ప్రదర్శించాయి. సంప్రదాయ చిరుధాన్యాలే కాకుండా వివిధ రకాల పండ్లు, వివిధ పంటల్లో వచ్చిన కొత్త వంగడాలు, యంత్ర పరికరాలతోపాటు కోళ్లు, కుందేళ్లు, పందులు, గొర్రెలు, పక్షుల పెంపకానికి సంబంధించిన స్టాళ్లు కూడా కొలువుదీరాయి.
‘ఈ కెనాన్’తో కోతులు పరార్
కోతులు, పందులు, ఇతర జంతు వుల నుంచి పంటలకు విముక్తి కల్పించేందుకు ‘సోలార్ ఆటోమేటిక్ ఈ కెనాన్’తోపాటు ఈ కెనాన్ (మంకీగన్)ను ప్రదర్శ నలో ఉంచా రు. సోలార్ ఆటోమేటిక్ ఈ కెనా న్ ధర రూ.26 వేలు. ఇది సోలార్ బ్యాట రీతో పనిచేస్తుంది.
జంతువులు, పక్షులు పంటలపై దాడి చేయకుండా ఆటోమేటిక్‌గా సౌండ్స్ చేస్తాయి. ఈ సౌండ్స్ భయానికి అవి పారిపోతాయి. మంకీగన్ ధర రూ.3,500. క్యాల్షియం కార్బైడ్ దీనిలో నింపి, కొంచెం నీటిని వేయడం వల్ల గన్‌లోపల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ట్రిగ్గర్ నొక్కిన వెంటనే బాంబు పేలి న శబ్దం బయటకు వస్తుంది. ఈభారీ శబ్దానికి కోతులు, పందులు పారిపోతాయి.
మంకీగన్ కొంటా..
మాకు 15 ఎకరాల భూమి ఉంది. పత్తి, మొక్క జొన్న వరిసాగు చేశాం. కోతుల బెడద ఎక్కువగా ఉంది. పండ్లు, కూరగాయలు ఏ పంట వేసినా చేతికి రావడం లేదు. కిసాన్‌మేళాలో మంకీగన్ చూశాను. ఖర్చు కూడా చాలా తక్కువే అనిపించింది. దీనిని కొనుగోలు చేసి కోతల బెడద నుంచి పంటను కాపాడుకుంటాను. – కల్యాణి, మహిళా రైతు, ఖమ్మం
ఆహార వ్యర్థాల నుంచి వంటగ్యాస్
ఇంట్లో సహా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర వ్యర్థాలను వృథాగా పడేస్తుంటారు. ఇవి ఒకటి రెండు రోజుల్లోనే కుళ్లి, దుర్వాసన వెదజల్లుతాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయి. ఈ ఆహార వ్యర్థాల నుంచి ‘నానో బయోగ్యాస్ ప్లాంట్’ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
ప్రస్తుతం కేరళలో విరివిగా వాడుతున్న ఈ నానో బయోగ్యాస్ ప్లాంట్‌ను కిసాన్ మేళాలో ప్రదర్శించారు.దీనికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఖర్చుకూడా తక్కువే. దీని ధర రూ.28 వేలు. ఐదు లీటర్ల సామర్థ్యంతో ఏకధాటిగా రెండు గంటల పాటు వంట చేసుకోవచ్చు.
ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలో తెలిసింది
కొత్త టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలో అర్థమైంది. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ పంట దిగుబడి ఎలా సాధించాలో తెలిసింది. వచ్చే సీజన్ నుంచి పూర్తిగా ఈ యాంత్రీకరణపైనే ఆధారపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా. రైతులకు తోడుగా ఎన్ని రకాల యంత్ర పరికరాలు వచ్చాయో తెలిసింది. – ఎట్టయ్య, మనగల్ రైతు
‘ఫార్మ్‌రోబో ఆర్–1’తో గొర్రు, గుంటుక
పొలంలో గొర్రుకు ఎద్దులను వాడుతుంటారు. రైతు కూడా రోజంతా పని చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఫార్మ్ రోబో ఆర్–1’ అందు బాటులోకి వచ్చింది. ఇది మనిషితో పనిలేకుండా పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తుంది. కేవలం విద్యుత్ చార్జింగ్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. గుంటక, గొర్రు, రోటావేటర్‌గా పనిచేస్తుంది.
ఎరువులను కూడా వెదజల్లుతుంది. చేలో ఏపుగా పెరిగిన కలుపు మొక్కలను కూడా తొలగిస్తుంది. రూ.4.25 లక్షలు దీని ధర. డ్రైవర్‌తో పనిలేదు. బ్యాటరీలను ఒకసారి చార్జింగ్ చేస్తే 3 – 4 గంటల పాటు పని చేస్తుంది. గంట వ్యవధిలోనే ఎకరం భూమిలో గుంటుక కొడుతుంది. పటాన్‌చెరుకు చెందిన సంస్థ దీన్ని ప్రదర్శనలో ఉంచింది.
స్మార్ట్ వ్యవసాయానికి ‘స్మార్ట్ డ్రోన్లు’
చీడపీడల నివారణకు రైతులు చేతి పంపులు, పెట్రోల్ పంపులను వాడుతారు. ఇది అనేక వ్యయ ప్రయాసలతో కూడినది. రైతు శ్రమ, ఖర్చు తగ్గించేందుకు పవ్‌మెన్ ఏవియేషన్ కంపెనీ సహా మారుతి డ్రోన్స్ ఏజీ 335హెచ్, వ్యవసాయ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఇవి 120 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. క్రిమిసంహారక మందులను నేరుగా పంటపై వెదజల్లుతాయి. వీటి ధర రూ.4.15 లక్షలు. బ్యాటరీ బ్యాకప్‌తో పనిచేస్తుంది. పైలెట్‌కు సదరు సంస్థే శిక్షణ సహా లైసెన్స్‌ను కూడా ఇప్పిస్తుంది. పది లీటర్ల ట్యాంకు సహా రోజుకు కనీసం 25 నుంచి 30 ఎకరాలు పిచికారీ సామర్థ్యం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment