దమ్ముంటే..మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి
దమ్ముంటే..మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి
Published Sat, Mar 25 2017 10:34 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
– కర్నూలు నగర సమస్యలు ప్రభుత్వానికి కనిపించవా ?
– వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
– నగరపాలక సంస్థ ఎదుట మహా ధర్నా
కర్నూలు(టౌన్): అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే.. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ సవాల్ విసిరారు. కర్నూలు నగరంలో దోమలు, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో శనివారం.. నగరపాలక సంస్థ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.
అంతకు ముందు చిల్డ్రన్స్ పార్కు నుంచి సీఎస్‌ఐ చర్చి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ.. ఇన్‌కంటాక్స్ కార్యాలయం మీదుగా నగరపాలక సంస్థ వరకు సాగింది. అక్కడే పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలను రూ. కోట్లు డబ్బు పెట్టి కోనుగోలు చేయడం సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు..టీడీపీకి మంచి తీర్పు ఇచ్చారన్నారు.
రూ. 200 కోట్లు దండుకున్నారు..
దోమలపై దండయాత్ర పేరుతో టీడీపీ నాయకులు.. రూ. 200 కోట్లు దండుకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య, మాజీ ఎమ్మెల్యే, కోత్తకోట ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలు నగరానికి రూ. 400 కోట్లు వచ్చాయని చెబుతున్న అ«ధికారపార్టీ నేతలు ఏ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద ఎందుకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు. టీడీపీపై విసుగు చెందిన ప్రజలు, మహిళలు ఎన్నికలు వస్తే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ మైనార్టీ సెల్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు రెహ్మన్, మద్దయ్య మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల ఇళ్లకే ఫాగింగ్ చేస్తున్నారన్నారు.
కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. పన్నులు కడుతున్న ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. నీళ్ల కోసం జాగరణ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కర్నూలు నగర సమస్యలు ఎమ్మెల్యేకు కనిపించవా? అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, దళిత సంఘం నాయకులు సోమసుందరం, మహిళా నాయకులు సోఫియాఖాతూన్, సలోమి, విజయలక్ష్మీ, మంగమ్మలు మాట్లాడారు. అనంతరం నగరపాలక మేనేజర్ చిన్నరాముడుకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి, బీసీ సంఘం నాయకులు రాజశేఖర్, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement