సాక్షి, అమరావతి : ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్. జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) ప్రద్యుమ్న. ఎన్నికల నిర్వహణలో కంచే చేను మేసిన చందంగా వ్యవహరించారని పక్కాగా నిరూపితమైంది. ‘పచ్చ’ పాతం చూపినట్లు వెల్లడైంది. జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న టీడీపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారంటూ గత నెల 11వ తేదీ ఎన్నికలు జరగకముందే పలు ఫిర్యాదులు వచ్చాయి. దళితులను గత 40 ఏళ్లుగా ఓట్లు వేయనీయకుండా టీడీపీ వారే రిగ్గింగ్ చేసుకుంటున్నారని స్పష్టమైన ఆధారాలు, అధికారిక నివేదికలు ఉన్నా జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న వాటిని బుట్టదాఖలు చేసినట్లు బహిర్గతమైంది. తద్వారా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటానని, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలు తనకు పట్టవని చాటుకున్నట్లయింది.
గతంలోకూడా చంద్రబాబు దగ్గర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో పనిచేసిన ప్రద్యుమ్న తన విధులను పక్కనపెట్టి ప్రభు (బాబు) భక్తి చాటుకున్నారు. ఇవి ఎవరో రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలు కాదు. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలనలోనే ప్రద్యుమ్న వ్యవహారం బట్టబయలైంది. ప్రద్యుమ్న టీడీపీకి చాలా అనుకూలంగా, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేశారనడానికి అనేక నిదర్శనాలున్నాయి. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముందు, తర్వాత జిల్లా కలెక్టరు అనుసరించిన తీరును పరిశీలిస్తే ఆయన టీడీపీ కోసం ఎలా పరితపిస్తూ పనిచేశారో అర్థమవుతోంది.
ఇదీ అసలు కథ....
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్.ఆర్. కమ్మపల్లి, వెంకటరామపురం, కొత్తకండ్రిగ, రావిళ్లవారిపల్లె, పరకాల్వ, కమ్మపల్లి, పులివర్తిపాలిపల్లి పోలింగ్ కేంద్రాల పరిధిలోని అగ్రవర్ణాల వారు తమను గత 40 ఏళ్లుగా ఓట్లు వేయనీయకుండా వారే రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఎన్నికల షెడ్యూలు వచ్చిన వెంటనే దళితులు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న వ్యవహారాలను వివరిస్తూ దళితులకు వేరేగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చారు. ‘ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో దళితులను టీడీపీ వారు ఓట్లు వేయనీయడం లేదు. అందువల్ల ఇక్కడ దళితులకు వేరేగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలి’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు.
ఇక్కడ ఏకపక్ష రిగ్గింగ్ జరుగుతోందనడానికి 2014 ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓట్ల వివరాలను ఆధారాలుగా కూడా సమర్పించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగు జరుగుతూ వస్తోందని 2014 ఎన్నికల్లో ఒకే పార్టీకి (టీడీపీకి) వంద శాతం ఓట్లు పోలవడం ఇందుకు నిదర్శనమంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ), రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ), జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ)కు చెవిరెడ్డి ఫిర్యాదు చేశారు. గత 40 ఏళ్లుగా ఈ కేంద్రాల పరిధిలోని ఒక సామాజికవర్గం వారు దళితులను ఓట్లు వేయనీయకుండా రిగ్గింగ్ చేస్తూ వస్తున్నందున ఈ ఎన్నికల్లో అయినా వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా దళితులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ఏడాది జనవరి మార్చి 31న రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. ఈ కేంద్రాల్లో స్వేచ్చాయుత ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, డీఈఓలను ఆదేశించింది. దీనిపై తహసీల్దారు, ఆర్డీఓ కూడా డీఈఓకు నివేదిక సమర్పించారు.
టీడీపీకి జీహుజూర్!
మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతోందని, దళితులకు వేరే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ, తహసీల్దారు కలిíసి కలెక్టరుకు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నారు. ఇలా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన పాపానికి తహసీల్దారు, ఆర్డీఓలను కలెక్టరు బదిలీ చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవని ఈసీఐ పేర్కొన్నప్పటికీ రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ), డీఈఓ అక్కడ అవసరమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంలోనూ, స్వేచ్ఛాయుత ఓటింగ్ జరిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ముగ్గురు కానిస్టేబుళ్లను మాత్రమే నియమించారు. వారిని కూడా టీడీపీకి అనుకూలంగా సహకరించాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేశారు. వెంటనే టీడీపీ వారు రిగ్గింగ్ చేసుకున్నారు. అధికారులు, పోలీసులు దీన్ని అడ్డుకోలేదు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న మహిళను కూడా పోలింగ్ స్టేషన్ (నం. 320) నుంచి బలవంతంగా బయటకు నెట్టేశారు. ఇదే విషయాలను వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏప్రిల్ 12నే (పోలింగ్ జరిగిన మరుసటి రోజే) జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినందున సీసీటీవీ పుటేజ్ పరిశీలించి రీపోలింగ్‌కు ఆదేశించాలని కోరారు. అయితే డీఈఓ ఎలాంటి చర్యలు తీసుకోకుండా జరగాల్సిందే (తాను కోరుకున్నదే) జరిగిందన్నట్లుగా సీసీటీవీ పుటేజ్ చూడకుండా వదిలేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ కేంద్రాల్లో అక్రమాలు, రిగ్గింగ్ జరిగినట్లు నిర్ధారించి రీపోలింగ్‌కు ఆదేశించి ఈనెల 19వ తేదీన ప్రశాంతంగా పూర్తి చేయించింది. ‘దళితులను ఓట్లు వేయనీయడం లేదని తెలిసినా వారికి వేరే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని డీఈఓ ప్రద్యుమ్న నిర్ణయించారు. పోలింగ్ తర్వాత వచ్చిన ఫిర్యాదులనూ పట్టించుకోకుండా వ్యవహరించారు. కలెక్టర్ టీడీపీకి అనుకూలంగా పనిచేశారనడానికి ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు’ అని ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దళితులు, రాజకీయ విశ్లేషకులతోపాటు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment