సాక్షి, అమరావతి: ఒకట్రెండు చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ చెప్పారు. మార్చి 9వ తేదీన మొదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం మూడు రోజుల నామినేషనల కార్యక్రమంలో బుధవారం ఒక్కరోజే మంచి రోజు కావడంతో ఎక్కువ మంది సాయంత్రం మూడు గంటల తర్వాతే నామినేషన్‌ల దాఖలుకు ఆసక్తి చూపారు. రాత్రి 12 గంటలకు అందిన సమాచారం ప్రకారం 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 4,012.. 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను 33,600 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా ఇతర పార్టీల నేతలు చేసిన విమర్శలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ స్పందించారు. ఆయన ఏం చెప్పారంటే..
- విమర్శలు చేయడం సరైంది కాదు. ఒకట్రెండు చోట్ల ఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని తెలిసి కలెక్టర్ తనంతట తాను చర్యలు చేపట్టారు. దీనిపై నివేదిక తెప్పించుకున్నాం. ఒక ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ కేసులో సయ్యద్ బాషా, ఇమ్రాన్ బాషా అనే ఇద్దరిని అరెస్టు చేశారు.
- డీజీతో బుధవారం మాట్లాడాను. గుంటూరు జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలను వారి దృష్టికి తీసుకొచ్చా. ప్రత్యేకంగా సూచన చేశాను.
- ఎవరైనా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణించాలి. తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు.
- పరిశీలకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలోనే అందుబాటులో ఉంటారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు
రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. హైకోర్టు తీర్పు దరిమిలా, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం చూసినా.. ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే ఏ పథకమైనా ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాదు.
ఏకగ్రీవం దిశగా..
సాక్షి నెట్‌వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం స్పష్టం అవుతోంది. నామినేషన్ల ఘట్టం బుధవారం ముగియడంతో పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. కొన్ని మండలాల్లో క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
సదుం మండలం వైఎస్సార్‌సీపీదే...
చిత్తూరు జిల్లా సదుం మండలంలోని జెడ్పీటీసీ, పది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తప్ప ఇతర పార్టీల వారెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. జెడ్పీటీసీ స్థానానికి కూడా వైఎస్సార్‌సీపీ తరఫున సోమశేఖర్‌రెడ్డి నామినేషన్ ఒక్కటే దాఖలైంది. అలాగే జిల్లాలోని యాదమరి జెడ్పీటీసీ సభ్యుడిగా బి.ధనంజయరెడ్డి ఏకగ్రీవంకానున్నారు.
పెళ్లకూరు క్లీన్ స్వీప్
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్నట్లే. మండలంలోని మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీకి చెందిన 15 మంది, జెడ్పీటీసీకి ఆ పార్టీ తరఫున ప్రిస్కిల్లా మాత్రమే నామినేషన్లు వేశారు.
వైఎస్సార్ జిల్లాలో ప్రభంజనం
వైఎస్సార్ జిల్లాలో 61 ఎంపీటీసీ స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులవే కావడం విశేషం. అందులోనూ పులివెందుల నియోజకవర్గంలోనే 30 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక వేముల మండలంలో మొత్తం ఎంపీటీసీలు ఆ పార్టీ పరం అయినట్లే.
శ్రీకాకుళం జిల్లాలోనూ అదే జోరు..
జిల్లాలో పలు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నువ్వలరేవు ఎంపీటీసీ–1, ఎంపీటీసీ–2 స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట, రేగిడి మండలంలోని ఖండ్యాం, కొమెర, కందిశ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు.
విశాఖపట్నం జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు..
విశాఖ జిల్లా కోటవురట్ల రాజుపేట, రాజుకోడూరు, గబుడుపుట్టు స్థానాల్లో నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లే. కాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది.
ఏకగ్రీవం దిశగా..
Published Thu, Mar 12 2020 5:08 AM | Last Updated on Thu, Mar 12 2020 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment