state elections commission
-
మళ్లీ ఎన్నికలు.. తీర్పు మా హక్కులను కాలరాస్తోంది
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏ దశలో ఆగిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ కృష్ణాజిల్లాకు చెందిన జొన్నల రామ్మోహనరెడ్డి, వేమూరి సురేశ్, భీమవరపు శ్రీలక్ష్మి, మండవ దేదీప్య, బేబీ షాలిని తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాలను కూడా ఈ నెల 27న విచారణకు రానున్న ఎస్ఈసీ అప్పీల్‌తో జతచేస్తున్నట్లు తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చే విషయంపై ఆ రోజున నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అప్పీళ్ల దాఖలుకు అనుమతి ఇస్తే మరింతమంది పోటీదారులు అప్పీళ్లు వేస్తారని, ఇలా ఎంతమంది వేస్తారో తెలియదని, అవన్నీ విచారించడం సాధ్యం కాదని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాదులు వీఆర్ఎన్ ప్రశాంత్, నాగిరెడ్డి తదితరులు స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ వాదనలు పూర్తిచేసిన తరువాత అవసరమైన మేరకు కోర్టుకు సహకరిస్తామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాలను ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌కు జతచేస్తామని, అప్పీల్ దాఖలుకు అనుమతినివ్వాలో లేదో ఆరోజు తేలుస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. -
వాళ్ల వ్యక్తి ఆ సీటులో లేకపోతే హాజరుకారా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) పట్ల రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల వైఖరి ఒక్క రోజులోనే మారిపోయిందని వైఎస్సార్సీపీ తప్పుపట్టింది. ఆ పార్టీలకు కావాల్సిన వ్యక్తి, చెప్పినట్టు నడిచే వ్యక్తి ఆ స్థానంలో లేకపోతే ఎస్ఈసీ నిర్వహించే సమావేశాలకు రాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఎస్ఈసీ నీలం సాహ్ని అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ముస్లింలీగ్, సమాజ్‌వాది, టీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం అనంతరం.. అందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యదర్శి ఎల్.అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏడాది కిందట మధ్యలో ఆగిపోయాయని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆగిన చోటునుంచే మొదలు పెట్టాలని చెప్పారు. గత ఎస్ఈసీ వాటి జోలికి పోకుండా పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు పూర్తిచేశారని గుర్తుచేశారు. అప్పట్లో మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ప్రస్తుత ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీలు తప్పులు పడుతున్నాయని విమర్శించారు. ఎక్కువ రోజులు ప్రత్యేకాధికారుల పాలన మంచిది కాదు: సీపీఎం స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన ఎక్కువ రోజులు కొనసాగడం మంచిది కాదని, ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల పాలన కొనసాగాలన్నది తమ పార్టీ విధానమని సీపీఎం ప్రతినిధిగా హాజరైన వై.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సహకారం తెలిపామన్నారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ప్రతినిధి మస్తాన్‌వలి.. తాము బహిష్కరిస్తున్నట్టు చెప్పి బయటికొచ్చినట్టు తెలిపారు. -
ఆ అధికారం నిమ్మగడ్డకు ఉందా..?
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారులను అభిశంసించే అధికారం ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా, కనీసం వివరణ అయినా కోరకుండా తనంత తాను నేరుగా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించవచ్చా.. అసలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి? ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అడ్డగోలుగా తనకు లేని అధికారాలను దొడ్డిదారిన చెలాయించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆయన వ్యవహార శైలి.. దుందుడుకు నిర్ణయాలు.. ఉన్నతాధికార వర్గాలలోనే కాదు సామాన్య ప్రజలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారులను భయపెట్టి తాను అనుకున్నది చేయాలనుకుంటున్నారని, అందుకే తనకు లేని అధికారాలను చలాయించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లపై నిమ్మగడ్డ నేరుగా సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రొసీడింగ్స్ అర్థం లేనివని, న్యాయస్థానం ఎదుట నిలబడవని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అధికారుల వివరణ కోరకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం చర్యలకు సిఫార్సు చేయదని, అలాంటిది ఎస్ఈసీ నేరుగా చర్యలకు ఉపక్రమించడం ద్వారా తన పరిధిని అతిక్రమించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ ‘ఎన్నికల విధుల్లో ఎవరైనా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కమిషన్ తొలుత వారి నుంచి వివరణ కోరుతుంది. దీనిపై సంతృప్తి చెందని పక్షంలో క్రమశిక్షణ చర్యల కోసం సంబంధిత అథారిటీకి సిఫార్సు చేస్తుంది. అంతేగానీ నేరుగా చర్యలు తీసుకోదు’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఓ ఐపీఎస్ అధికారి ఓ పార్టీ నాయకుడిని కలవడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తప్ప నేరుగా చర్యలకు ఉపక్రమించలేదని ఉన్నతాధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. నిబంధనలు ఏమి చెబుతున్నాయి..? ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2000 నవంబర్ 7వతేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టంగా ఓ ఆఫీస్ మెమొరాండం జారీ చేసింది. దాని ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎన్నికల కమిషన్‌కు ఉంది. అంతిమంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిని స్పష్టం చేస్తూ 2008 జూలై 28వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మరో మెమొరాండం జారీ చేసింది. ఆ మెమొరాండం ప్రకారం ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. సంబంధిత అథారిటీ మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసిన ఆరు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ విషయాన్ని కమిషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించాలన్నా సంబంధిత అథారిటీ ఆ అధికారి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకుని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని బట్టి అర్థం కావడం లేదూ నిమ్మగడ్డ ఎంత బరితెగించి వ్యవహరించారో అని అధికార వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమే.. నిమ్మగడ్డ అడ్డగోలు ప్రొసీడింగ్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిమ్మగడ్డ తన పరిధిని దాటి ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడుతున్నారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లేని అధికారాలతో నిమ్మగడ్డ ఏకపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా ద్వివేది, గిరిజాశంకర్‌లపై సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వాటిని తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకునే పరిధి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాడర్లో పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సిఫార్సు మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఎస్ఈసీ జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి చొచ్చుకుని రావడమేనని, ఇది చట్టపరమైన తప్పిదమన్నారు. నిబంధనలు పాటించకుండా జారీ చేసిన ‘సెన్సూర్’ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సెన్సూర్ ప్రొసీడింగ్స్ విషయంలో మాత్రమే కాదు ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీని బదిలీ చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా నిమ్మగడ్డ అభ్యంతరకర పదజాలాన్ని వాడారని అధికారులు గుర్తు చేస్తున్నారు. -
నేడే గ్రేటర్ పోరు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు. -సాక్షి, హైదరాబాద్: పోలింగ్‌కు సర్వం సిద్ధం.. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి ప్రకటించారు. సోమవారం రాత్రి కల్లా పోలింగ్ సిబ్బంది ఎన్నికల సరంజామాతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. ఎన్నికల్లో 28,683 బ్యాలెట్ పెట్టె్టలను సిద్ధంగా చేయగా, 81,88,686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. బల్దియా ఎన్నికలు కావడంతో తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పత్రాలపై నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. 2,831 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఇందులో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు 260 మంది కరోనా బాధితులు కూడా ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పెట్టె్టలను ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. ఇందుకోసం 150 స్ట్రాంగ్ రూంలను నగరంలో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఇక ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, దుకాణాలు, ఇతర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఓటర్లు జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో పనిచేస్తుంటే, ఓటేసేందుకు అవకాశం కల్పించేలా వారి పనివేళల్లో కొంత రిలీఫ్ కల్పించాలని పరిశ్రమలు, ఇతర సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఆ పార్టీలకు ప్రతిష్టాత్మకం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి ఈసారి సైతం గణనీయ సంఖ్యలో సీట్లను గెలవాలనుకుంటోంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలపడాలని భావిస్తోంది. ఇటు బల్దియా ఎన్నికల్లో తాము సైతం గట్టి పోటీ ఇచ్చి చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పేర్కొంటోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలవగా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో 82 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవగా, ఈ సారి కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యంపై నగర ఓటర్లు కీలక తీర్పు ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. గత ఎన్నికల్లో ఇలా... గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకోగలిగారు. -
రాజ్యాంగం అపహాస్యం
కరోనా వైరస్‌ను సాకుగా చూపుతూ స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషనర్ ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఓ వైపు ఎన్నికలను వాయిదా వేస్తూనే పలువురు అధికారులను బదిలీ చేశారు. నిరు పేదలకు ఇళ్లపట్టాలిచ్చే కార్యక్రమాన్ని ముందే ఆపేశారు. ఇది ఆరువారాలతో ఆగుతుందా.. ఇంకా సంతృప్తి చెందలేదనే కారణంతో ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఈసీ అధికారాన్ని చెలాయించే అవకాశం ఉందని విమర్శకులంటున్నారు..ఆరువారాలే కాక ఎన్నిరోజులైనా దానిని కొనసాగించే ప్రమాదం ఉందని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా ఎవరో చెప్పింది చేస్తున్నట్లు.. ఎవరో రాసిచ్చింది చదువుతున్నట్లు... ఎన్నికల కమిషనర్ వ్యవహరించడం రాజ్యాంగాన్ని అపహాస్యం పాల్జేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీ మాట.. వైరస్ కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఆరువారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఆరువారాల తర్వాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తదనంతరం ఎన్నికల ప్రక్రియ పునః ప్రారంభమౌతుందని ఆయన తెలిపారు. అత్యున్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి పరిస్థితులను మదింపుచేసి ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అప్పటి వరకు ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఆయన అన్నారు. సీఎం ధర్మాగ్రహం కరోనా వైరస్‌ను సాకుగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయడం ధర్మమేనా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ నిష్పాక్షికతతో పాటు విచక్షణ కూడా కోల్పోయారని విలేకరుల సమావేశంలో విమర్శించారు. ‘‘ఎన్నికలు పూర్తయి స్థానిక సంస్థల ప్రతినిధులంతా బాధ్యతలు చేపడితే కరోనా వంటి వైరస్‌లను తరిమికొట్టడం మరింత సులువవుతుంది.. ప్రజారంజక పాలనతో అధికార పార్టీ మంచి విజయాలను సాధిస్తున్నందునే వ్యవస్థలను నీరుగార్చి చంద్రబాబు ఎన్నికలను అడ్డుకుంటున్నారు.. ఈసీ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకపోతే ఈ అంశాన్ని ఇంకా పైకి తీసుకువెళతాం’’అని పేర్కొన్నారు. ఈసీ.. మారిన వాయిస్ ఎన్నికల వాయిదాపై గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిర్యాదుచేయడం, విలేకరుల సమావేశం పెట్టి అనేక ప్రశ్నలు సంధించడంతో సాయంత్రం కల్లా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట మార్చారు. కరోనా వైరస్ సాకుగా చూపడం సరే.. ఆ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితోగానీ, సీఎస్‌తో గానీ సంప్రదించారా.. పాటించాల్సిన ప్రొసీజర్స్ ఏమైనా పాటించారా అని ముఖ్యమంత్రి అడిగేసరికి.. సాయంత్రానికి ఒక నోట్ రిలీజ్ చేశారు.. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడినట్లు అందులో పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేది ఓ సాకు మాత్రమేనని దీనిని బట్టి అర్ధమౌతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘సుప్రీం’ వైపు సర్కార్ తొమ్మిది నెలల సంక్షేమ పాలన చూసి ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాల సంఖ్య చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుందని వైఎస్సార్సీపీ నాయకులంటున్నారు. ఇది చూసి ఓర్వలేకే తమ సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఉపయోగించుకుని ఎన్నికలు వాయిదా వేయించారని వారు పేర్కొంటున్నారు. ఈసీ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించిందని తెలుస్తోంది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
సాక్షి, అమరావతి: ఒకట్రెండు చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ చెప్పారు. మార్చి 9వ తేదీన మొదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం మూడు రోజుల నామినేషనల కార్యక్రమంలో బుధవారం ఒక్కరోజే మంచి రోజు కావడంతో ఎక్కువ మంది సాయంత్రం మూడు గంటల తర్వాతే నామినేషన్ల దాఖలుకు ఆసక్తి చూపారు. రాత్రి 12 గంటలకు అందిన సమాచారం ప్రకారం 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 4,012.. 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను 33,600 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా ఇతర పార్టీల నేతలు చేసిన విమర్శలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ స్పందించారు. ఆయన ఏం చెప్పారంటే.. - విమర్శలు చేయడం సరైంది కాదు. ఒకట్రెండు చోట్ల ఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని తెలిసి కలెక్టర్ తనంతట తాను చర్యలు చేపట్టారు. దీనిపై నివేదిక తెప్పించుకున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ కేసులో సయ్యద్ బాషా, ఇమ్రాన్ బాషా అనే ఇద్దరిని అరెస్టు చేశారు. - డీజీతో బుధవారం మాట్లాడాను. గుంటూరు జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలను వారి దృష్టికి తీసుకొచ్చా. ప్రత్యేకంగా సూచన చేశాను. - ఎవరైనా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణించాలి. తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. - పరిశీలకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలోనే అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. హైకోర్టు తీర్పు దరిమిలా, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం చూసినా.. ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే ఏ పథకమైనా ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాదు. ఏకగ్రీవం దిశగా.. సాక్షి నెట్వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం స్పష్టం అవుతోంది. నామినేషన్ల ఘట్టం బుధవారం ముగియడంతో పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. కొన్ని మండలాల్లో క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. సదుం మండలం వైఎస్సార్సీపీదే... చిత్తూరు జిల్లా సదుం మండలంలోని జెడ్పీటీసీ, పది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు తప్ప ఇతర పార్టీల వారెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. జెడ్పీటీసీ స్థానానికి కూడా వైఎస్సార్సీపీ తరఫున సోమశేఖర్‌రెడ్డి నామినేషన్ ఒక్కటే దాఖలైంది. అలాగే జిల్లాలోని యాదమరి జెడ్పీటీసీ సభ్యుడిగా బి.ధనంజయరెడ్డి ఏకగ్రీవంకానున్నారు. పెళ్లకూరు క్లీన్ స్వీప్ నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్నట్లే. మండలంలోని మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీకి చెందిన 15 మంది, జెడ్పీటీసీకి ఆ పార్టీ తరఫున ప్రిస్కిల్లా మాత్రమే నామినేషన్లు వేశారు. వైఎస్సార్ జిల్లాలో ప్రభంజనం వైఎస్సార్ జిల్లాలో 61 ఎంపీటీసీ స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ అభ్యర్థులవే కావడం విశేషం. అందులోనూ పులివెందుల నియోజకవర్గంలోనే 30 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక వేముల మండలంలో మొత్తం ఎంపీటీసీలు ఆ పార్టీ పరం అయినట్లే. శ్రీకాకుళం జిల్లాలోనూ అదే జోరు.. జిల్లాలో పలు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నువ్వలరేవు ఎంపీటీసీ–1, ఎంపీటీసీ–2 స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట, రేగిడి మండలంలోని ఖండ్యాం, కొమెర, కందిశ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. విశాఖపట్నం జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు.. విశాఖ జిల్లా కోటవురట్ల రాజుపేట, రాజుకోడూరు, గబుడుపుట్టు స్థానాల్లో నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లే. కాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. -
ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు,హోర్డింగులు 'నిషేధం'
సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనల జారీ, బహిరంగ ప్రదేశాలలో హోర్డింగ్‌ల ఏర్పాటుపై నిషేధం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుల విగ్రహాలకు ముసుగు వెయ్యాల్సిందేనని స్పష్టంచేశారు. మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కోడ్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళిని నిష్పాక్షికంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రకటనలో ఎన్నికల కమిషనర్ తెలిపిన మరికొన్ని అంశాలు.. - ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో మంత్రుల ఫొటోలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారిక వెబ్సైట్ల నుంచి రాజకీయ నాయకులందరి ఫొటోలను వెంటనే తొలగిస్తాం. - ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు తదితర పార్టీల నాయకుల ఫొటోలను ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో ప్రదర్శించడంపైనా నిషేధం. - ఈ నిబంధన జాతీయ నాయకులు, కవులు, గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల ఫొటోలకు, రాష్ట్రపతి, గవర్నర్ల చిత్రాలకు వర్తించదు. - విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులపైనా ఫొటోలు, ప్రకటనలు ఉండకూడదు. - ఈ సూచనలు ఇప్పటివరకు అమలు చేయనట్లయితే వెంటనే అమలు చేయాలి. - ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. - అభ్యర్థులను నామినేషన్ దాఖలు చెయ్యకుండా అడ్డుకునే చర్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. - స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. - పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న సమాచారంతో బాధ్యులపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
మేం సిద్ధం
సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం మార్చి 31వ తేదీలోగా ‘స్థానిక’ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ చెప్పారు. తాము కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలియజేశామని వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఎంత మేర పోలీస్ బలగాలను రప్పించగలరో.. వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్‌ను కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందన్నారు. అంతకుముందు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా డీజీపీ వివరించినట్టు తెలిసింది. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయ్యారు. త్వరితగతిన ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని వారు తెలియజేశారు. -
రాజకీయ పార్టీలతో.. 17న ఈసీ భేటీ
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 17వ తేదీ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు. జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. వీటితో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు దశల్లో ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 45 రోజుల్లో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు నూతన చైర్మన్లు, అధ్యక్షులు కొలువుదీరనున్నారు. వచ్చే నెలన్నర రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియ ముగిసి నూతన సారథులను ఎన్నుకోవడం పూర్తి కానుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 333 మండలాల్లో తొలివిడతలో, 327 మండలాల్లో రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో సగం మండలాల చొప్పున రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజులకు రెండో దశ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. 17 సాయంత్రం షెడ్యూల్ విడుదల.. - ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. - ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. - రాష్ట్రంలో 660 మండలాలు ఉండగా 333 జడ్పీటీసీలకు, 5,352 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 327 జడ్పీటీసీలకు, 4877 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల అనంతరం మూడు రోజుల వ్యవధితో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. - 660 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికను కూడా ఒకే రోజు నిర్వహిస్తారు. - జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - రెండు విడతల్లో మొత్తం 660 జడ్పీటీసీ, 10,229 ఎంపీటీసీ స్థానాలకు 34,320 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. - బ్యాలెట్ పేపర్ విధానంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల నిర్వహణకు మొత్తం నాలుగు రకాల బ్యాలెట్ బాక్స్‌లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. చిన్నది, మధ్యస్తం, పెద్దది, జంబో తరహాలో బ్యాలెట్ బాక్స్‌లను వర్గీకరించారు. అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. - పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం 30 గుర్తులను (ఫ్రీ సింబల్స్) సిద్ధం చేశారు. - మొదటి దశ ఎన్నికల్లో 1,45,05,502 మంది ఓటర్లు, రెండో దశలో 1,36,17,833 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. - మొత్తం 2,17,908 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. - ప్రతి కేంద్రంలో పోలింగ్ అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది ఉంటారు. మండల పరిధిలో కొంతమంది సిబ్బందిని అదనంగా ఉంచుతారు. ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 17వ తేదీన షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ శుక్రవారం కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటైన చోట, ఉన్నవాటిని రెండుగా విభజించిన చోట ఎన్నికల నిర్వహణకు కొత్తగా ఓటర్ల జాబితా, వార్డులను వర్గీకరించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ పూర్తి కావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తెప్పించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020లో భాగంగా గత నెల 16న ముసాయి దా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ నెల 15వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పుల్ని సరిచేయడానికి విజ్ఞప్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్ర వరి 7న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఓటర్లను భౌగోళికంగా సులువుగా గుర్తించేందుకు వారి గృహాల మ్యాపు(నజరీ నక్షా)ను తయారు చేస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యోమాలు నిర్వహించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి. -
కొత్త మున్సిపల్ చట్టాన్ని సరిచూసుకోండి
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు, చట్టంలోని ఆయా సెక్షన్లకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్న మార్పులను సరిచూసుకోవాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సూచించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం వార్డుల పునర్విభ జన తదితరాల్లో తప్పులు, పొరబాట్లు దొర్లాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించిందని తెలిపింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మళ్లీ కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన వివిధ అంశాలతో మళ్లీ ఫారమ్స్, కవర్స్, బుక్లెట్ల ముద్ర ణ అసాధ్యమని తెలిపింది. దీనికోసం మరింత సమయం పట్టి ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొత్త, పాత చట్టా ల్లోని నిబంధనల్లో పెద్దగా మార్పులేమీ లేవని పేర్కొంది. అయితే ఈ రెండు చట్టాలను సరిచూసినప్పుడు వీటిల్లోని వివిధ సెక్షన్లు, ఆయా అంశాలకు సంబంధించిన సీరియల్ నంబర్లు మాత్రమే మారినట్లు స్పష్టమైందని తెలిపింది. ఇదిలావుండగా.. పాత, కొత్త చట్టాల్లోని ఆయా అంశాలు, సెక్షన్ల గురించి ముఖ్యంగా ఫారమ్స్, బుక్లెట్లు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, నోటిఫికేషన్లు తదితరాల్లో ఇప్పటికే ఎస్ఈసీ విడుదల చేసిన అంశాలపై స్పష్టతనిస్తూ ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
రేపటి నుంచి ఓటర్ల జాబితాలో సవరణలు
సాక్షి,, అమరావతి: ఓటర్ల జాబితాలో తప్పులు సరి చేసేందుకు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి 30 వరకూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటరు కార్డులోని పేర్లలో తప్పులు, బంధుత్వాలు, చిరునామాల్లో తేడాలు వంటి వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని పోలింగ్ బూత్‌ల్లోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) అందుబాటులో ఉంటారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సవరణలకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 11 వేల మీసేవా కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని వివరించారు. దీనికోసం ఓటర్లు తమ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డ్, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాన్ని చూపిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఎన్వీఎస్పీ (నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్), ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, 1950 కాల్ సెంటర్ ద్వారా కూడా సవరణలకు అవకాశం ఉంటుందన్నారు. మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, మృతి చెందిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫామ్–7 పోలింగ్ బూత్‌లు, ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో నిర్ధారణ చేశాక మార్పులకు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. సవరణ తర్వాత అక్టోబర్ 15న ముసాయిదా ఓటర్ల జాబితాను, 2020, జనవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. -
నేడు ఎస్ఈసీకి ‘పంచాయతీ’ జాబితా!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ల జాబితాను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పంచాయతీరాజ్ శాఖ సమర్పించనున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రికి రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారై, శనివారం జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రచురించే గెజిట్లు అందుబాటులోకి రాగానే ఎస్ఈసీ కార్యాలయానికి వీటిని చేరవేయనున్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో ఇంకా సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కొలిక్కి రాలేదన్న వార్తలొస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సమాచారం అందుబాటులో ఉన్నందున వీటి ఖరారు పెద్దగా కష్టం కాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. శనివారంలోగా రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసి తుది జాబితాను అందించాలని గతంలోనే జిల్లా అధికారులను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో ఒకట్రెండు జిల్లాల్లో మినహా రిజర్వేషన్ల కసరత్తు పూర్తయినట్లు సమాచారం. సర్పంచ్ రిజర్వేషన్ల గెజిట్ ఎస్ఈసీకి అందగానే ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. పీఆర్ శాఖ నుంచి వచ్చిన రిజర్వేషన్ల ఖరారు సమాచారాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా విశ్లేషించి, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాలపై న్యాయసలహా తీసుకునేందుకు ఎస్ఈసీకి కొంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. -
స్థానిక పాలకవర్గాల కోసం రంగం సిద్ధం
కడప కార్పొరేషన్: కడప నగరపాలకసంస్థతోపాటు, ఏడు మున్సిపాలిటీలలో పాలకవ ర్గాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు పరోక్షంగా జరిగే ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఖరారు చేసింది. జూలై 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ైచె ర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం నగరపాలకసంస్థ ఓ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది. జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. మొదట కార్పొరేటర్లతో కలె క్టర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే మున్సిపాలిటీలలో కలె క్టర్చే నియమితులైన జిల్లా అధికారులు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు సమావేశాలకు హాజరు కావాలని ఎక్స్ అఫిషియో మెంబర్లకు, గెలిచిన ప్రజాప్రతినిధులకు కడప కార్పొరేషన్ అధికారులు, ఆయా మున్సిపాలిటీల అధికారులు ఇప్పటికే నోటీసులు అందజేశారు. మొదట కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఓటు హక్కు కలిగిన మొత్తం సభ్యుల సంఖ్యలో 50 శాతం మంది హాజరైతే కోరం ఉన్నట్లు లెక్క. కోరం లేకపోతే గంట వరకు వేచిచూసి మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. సెలవు రోజైనా సరే ఆ రోజు సమావేశం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే ఎన్నికల కమిషన్‌కు నివేదించిన తర్వాత మూడోసారి కోరం ఉన్నా లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్ ఎన్నిక తర్వాతే డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. అలాగే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తర్వాతే వైస్‌ఛైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు. అనర్హత వేటు తప్పదు : పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టం స్థానిక సంస్థలకు వర్తించదు. 1/3వ వంతు సభ్యులు పార్టీ మారితే వర్తించే ఈ చట్టం ఎమ్మెల్యే, ఎంపీలకే పరిమితం. అదే స్థానిక సంస్థల్లో అయితే ఎంతమంది విప్ ధిక్కరించి ఓటేసినా అందరిపైనా అనర్హత వేటు పడుతుంది. విప్‌ను తిరస్కరించిన వారు కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు. ఓటింగ్ సందర్భంలో విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే సభ్యత్వం రద్దవుతుంది గానీ ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. తమ పార్టీ తరపున గెలుపొందిన వ్యక్తి విప్‌ను ధిక్కరించాడని విప్ జారీచేసిన వ్యక్తి మూడు రోజుల్లోపు ఆధారాలతో ప్రీసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి ధిక్కరించిన వారికి నోటీసు జారీచేసి వారం రోజుల్లో వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. విప్ జారీ చేసే విధానం : ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఎం, సీపీఐలకు విప్ జారీచేసే అధికారముంటుంది. ఇండిపెండెంట్లు రిజిష్టర్డ్ పార్టీలకు విప్ వర్తించదు. విప్‌ను అపాయింట్ చేయడానికి పార్టీ ప్రెసిడెంట్ లేదా కార్యదర్శి తమ పార్టీ తరపున ఒకరిని నామినేటెడ్ చేస్తే అనెగ్జర్-1 జారీచేస్తారు. పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన అధికారంతో ఆయన జిల్లాల వారీగా ఒక్కొక్కరికి అనెగ్జర్-2 ద్వారా విప్‌ను బదలాయిస్తారు. ఈ మేరకు ఆయన తమ సభ్యులందరికీ అనెగ్జర్-3 ద్వారా విప్ జారీచేస్తారు. ఇలా తనకు పార్టీ విప్ జారీచేసే అవకాశం కల్పించినట్లుగా అన్ని ఒరిజినల్స్‌తో ఎన్నిక జరగడానికి ముందురోజు ప్రీసైడింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే అనెగ్జర్-3 ద్వారా తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసి ఉంటారో సదరు ఆర్డర్ వారికి అందినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఎన్నిక జరగడానికి గంట ముందు ప్రీసైడింగ్ అధికారికి సమర్పించాలి. ప్రిసైడింగ్ అధికారులు వీరే.. కడప నగరపాలక సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి జాయింట్ కలెక్టర్ రామారావు, పులివెందులకు డీఆర్డీఏ పీడి అనిల్‌కుమార్, బద్వేల్‌కు స్పెషల్ కలెక్టర్ లవన్న, రాయచోటికి స్పెషల్ కలెక్టర్ నరసింహులు, యర్ర గుంట్లకు స్పెషల్ కలెక్టర్ రంగన్న, మైదుకూరుకు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, జమ్మలమడుగుకు ఆర్డీఓ రఘునాథరెడ్డిప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు 60 రోజుల సమయం : జిల్లా పరిషత్‌లో అయితే కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక తర్వాతే జెడ్పీ ఛైర్మన్, వైస్ఛైర్మన్ల ఎన్నిక ఉంటుంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలలో మాత్రం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు 60 రోజుల సమయం ఉంటుంది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. కడప కార్పొరేషన్లో ఐదు మందికి అవకాశముండగా వారిలో ఇద్దరు మహిళలు ఉండాలి. మున్సిపాలిటీల్లో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులకు అవకాశముంటుంది. ఎక్కడ ఆప్షన్ ఇస్తే అక్కడే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించుకుంటామని ఆప్షన్ ఇచ్చి ఉంటారో అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీలైతే ఎక్కడ తమకు ఓటు హక్కు కలిగివుంటే ఆ మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కడప కార్పొరేషన్‌కు సంబంధించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ హుస్సేన్ రాజీనామా చేసినందున ఆయనకు అవకాశముండకపోవచ్చు. -
ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు
హైదరాబాద్: ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక రెండు రాష్ట్ర్రాలో శాశ్వత ప్రాతిపదికన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది. -
వైఎస్సార్ సీపీకి రాష్ట్ర ఈసీ ‘గుర్తింపు’
* రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ * మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విప్ జారీ అధికారం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా లభించింది. ఇప్పటి వరకూ రిజిస్టర్డ పార్టీగానే పరిగణిస్తూ వచ్చిన ఈ పార్టీని ఇకపై గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్సార్సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదని, ఆ పార్టీకి స్థానిక సంస్థ ల పాలకవర్గాల ఎన్నికల్లో ‘విప్’ జారీ చేసే అధికారం లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి దీంతో తెరపడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే వైఎస్సార్ సీపీని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చినందున, ఆ నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాసనసభ, కేంద్రంలో లోక్‌సభ కొలువుదీరిన అనంతరం జరగబోయే మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు ఫలానా వారికి ఓటు చేయాలని ‘విప్’ (ఆదేశాలు) జారీ చేసే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇపుడు లభించింది. స్థానిక సంస్థల చట్టాలను పరిశీలించి నిర్ణయం.. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గుర్తింపు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ వైఎస్సార్సీపీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఈ నెల 27న తమకు ఒక లేఖను సమర్పించారని, దానిలోని అంశాలను పరిశీలించి తాము ఈ గుర్తింపునిస్తున్నామని రాష్ట్ర కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994, జీహెచ్ఎంసీ చట్టం- 1955, ఏపీ మున్సిపాలిటీల చట్టం-1965 ప్రకారం, 1968లో జారీ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ చిహ్నా ల కేటాయింపు ఆదేశాల ప్రకారం వైఎస్సార్సీపీ అన్ని రకాల అర్హతలను పూర్తి చేసినందున గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వడంతో పాటు ‘సీలింగ్ ఫ్యాన్’ చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. -
సీఐపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
ఘట్కేసర్, న్యూస్‌లైన్: ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న సీఐ జగన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని మండలంలోని చౌదరిగూడ మాజీ సర్పంచ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బైరు రాములు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని కొర్రెముల గ్రామానికి చెందిన గ్యార జగన్ నగరంలో సీఐగా విధులుగా నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి లక్ష్మయ్య ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన తండ్రిని ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని రాత్రి 11 గంటలకు ప్రభుత్వ వాహనంలో వచ్చి కొర్రెముల గ్రామ పరిథిలోని పలు కాలనీలో తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సైతం ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఐ జగన్‌పై విచారణ జరిపించి చర్య తీసుకోవాలని బైరు రాములు కోరారు. -
ఆ ఆరు పంచాయతీలకు ఎన్నికలు జరపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాల్లోని బండ్లగూడ, నార్సింగి, నెక్నాంపూర్, ఖానాపూర్, మంచిరేవుల, జవహర్‌నగర్ గ్రామ పంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ మొదట జారీ చేసిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఎస్.దేవదాస్, మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు. ఈ ఆరు గ్రామాలను కలిపి నగర పంచాయతీగా చేయాలని భావిస్తున్నందున ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వం చెప్పిందని, ప్రస్తుతం ఆ అవకాశం లేనందున వీటికి వెంటనే ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కోర్టును అభ్యర్థించారు. మూడేళ్లనుంచి ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. -
నేరస్తుల జాబితా పంపండి
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ నేరస్తుల చిట్టాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలను పూర్తి శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాత నేరస్తుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పోలింగ్ సందర్భంగా హింస ప్రేరేపితం కాకుండా ఉండటంతో పాటు పాత నేరస్తులపై నిఘా వేసేందుకు పోలీసు శాఖ వ్యూహం సిద్ధం చేస్తోంది. పోలీస్స్టేషన్ల వారీగా... స్టేషన్ల వారీగా నేరస్తులు, అందులో ప్రధానంగా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారు, ఆయా పోలింగ్ సందర్భాల్లో జరిగిన ఘర్షణలు, వాటితో సంబంధం ఉన్న వారెవరనే అంశాలపై సెక్షన్ల వారీగా జాబితాను సిద్ధం చేసి పంపాలని డీజీపీ నుంచి ఆదేశాలు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీల్లో చురుకుగా పనిచేస్తున్న వారిపై ఎన్ని కేసులున్నాయి.. ఆయా సెక్షన్లు, కోర్టుల్లో వాటి పరిస్థితి, శిక్షలు పడినట్లయితే వాటి అమలు తదితర వాటిని సమగ్రంగా తయారు చేస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా స్క్రూటినీ సమయంలో ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తే వాటి వివరాలను వెనువెంటనే అందించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముందుగా స్టేషన్ల వారీగా జాబితాను సిద్ధం చేసి, ఆ జాబితాను డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో తయారు చేస్తున్నారు. తుది జాబితాను జిల్లా ఎస్పీ పరిశీలించి డీజీపీ కార్యాలయానికి పంపించనున్నట్లు తెలుస్తోంది. 2004 నుంచి నమోదైన కేసులు 2004 సార్వత్రిక ఎన్నికల్లో 50 కేసులు, 2009 ఎన్నికల్లో 46 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వచ్చిన 2010 ఉప ఎన్నికల్లో 11 కేసులు, 2012లో ఉప ఎన్నికల్లో 12 కేసులు, ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 27 కేసులు నమోదయ్యాయి. మొత్తం 2004 నుంచి ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 146 కేసులు నమోదయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉండడంతో పోలీసు అధికారులు వివరాల సేకరణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను త్వరలో అందజేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా కట్టుదిట్టం చేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తుగా సున్నితమైన, అతి సున్నితమైన, సమస్యాత్మక, అతి సమసాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించనున్నారు. వీటిలో ఆయా పోలీసుస్టేషన్ పరిధిలోని సున్నితమైన , అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా సేకరిస్తారు. ఇలా గుర్తించిన అనంతరం ఏయే ప్రాంతాల్లో ఎంత బందోబస్తు ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక తయారు చేస్తారు. దాని ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తారు. వీలైనంత త్వరగా... రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వారిలో మహిళలపై దాడులకు, గృహహింస కేసులుంటే వాటి వివరాలు ప్రత్యేకంగా నివేదించనున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నివేదిక పంపించేందుకు అధికారుల పనులు వేగవంతం చేశారు.