సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 17వ తేదీ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు.
జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. వీటితో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీలతో.. 17న ఈసీ భేటీ
Published Wed, Jan 15 2020 5:23 AM | Last Updated on Wed, Jan 15 2020 5:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment