
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ల జాబితాను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) పంచాయతీరాజ్ శాఖ సమర్పించనున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రికి రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారై, శనివారం జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రచురించే గెజిట్లు అందుబాటులోకి రాగానే ఎస్‌ఈసీ కార్యాలయానికి వీటిని చేరవేయనున్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో ఇంకా సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కొలిక్కి రాలేదన్న వార్తలొస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సమాచారం అందుబాటులో ఉన్నందున వీటి ఖరారు పెద్దగా కష్టం కాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
శనివారంలోగా రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసి తుది జాబితాను అందించాలని గతంలోనే జిల్లా అధికారులను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో ఒకట్రెండు జిల్లాల్లో మినహా రిజర్వేషన్ల కసరత్తు పూర్తయినట్లు సమాచారం. సర్పంచ్ రిజర్వేషన్ల గెజిట్ ఎస్‌ఈసీకి అందగానే ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. పీఆర్ శాఖ నుంచి వచ్చిన రిజర్వేషన్ల ఖరారు సమాచారాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా విశ్లేషించి, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాలపై న్యాయసలహా తీసుకునేందుకు ఎస్‌ఈసీకి కొంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment