ఆ ఆరు పంచాయతీలకు ఎన్నికలు జరపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాల్లోని బండ్లగూడ, నార్సింగి, నెక్నాంపూర్, ఖానాపూర్, మంచిరేవుల, జవహర్‌నగర్ గ్రామ పంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ మొదట జారీ చేసిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఎస్.దేవదాస్, మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు.
ఈ ఆరు గ్రామాలను కలిపి నగర పంచాయతీగా చేయాలని భావిస్తున్నందున ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వం చెప్పిందని, ప్రస్తుతం ఆ అవకాశం లేనందున వీటికి వెంటనే ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కోర్టును అభ్యర్థించారు. మూడేళ్లనుంచి ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.