Village panchayati
-
Untouchability: మీకు సరుకులు అమ్మొద్దని చెప్పారన్నా!
క్రైమ్: అంటరానితనం.. శిక్షార్హమైన నేరం. టీవీ ప్రకటనలు, మైకుల్లో వినిపించడం వరకే పరిమితమైందా?. అక్కడక్కడా ఇలాంటి ఘటనపై ఫిర్యాదులు-చర్యలు ఉంటున్నా.. చాలా వరకు ఉదంతాలు వెలుగులోకి మాత్రం రావడం లేదు. తాజాగా తమిళనాడులో ఓ ఊరు ఊరు మొత్తం తక్కువ కులమంటూ కొందరి పట్ల అస్పృశ్యత కనబర్చడం వీడియో సాక్షిగా బయటపడింది. తమిళనాడు తంజావూరు జిల్లా పాపకాడు పరిధిలోని కేళామంగళం గ్రామంలో నవంబర్ 28వ తేదీన హిందూ కులాల ఆధ్వర్యంలో పంచాయితీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎస్సీ కులస్తులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ముందు చర్యలుగా వాళ్లకు ఎలాంటి ఉత్పత్తులు అమ్మకూడదని కిరాణ షాపు యాజమానులను ఆదేశించారు. అలాగే హోటల్లోకి రానివ్వొద్దని, క్షవరాలు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. ఇది దృష్టికి రావడంతో ఓ ఎస్సీ యువకుడు.. ఆ మరుసటి రోజే ఓ దుకాణానికి వెళ్లాడు. అయితే తాను సరుకులు అమ్మలేనని, ఇది ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయమని తెగేసి చెప్పాడు ఆ ఓనర్. ఇదంతా వీడియో తీసిన ఆ యువకుడు.. సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. విల్లుపురం ఎంపీ రవికుమార్ దృష్టికి ఈ విషయం రావడంతో.. ఆయన సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసి చర్యలకు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలప్పుడు ఎస్సీఎస్టీ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వీఏవో దర్యాప్తు అనంతరం ఊరిలో షెడ్యూల్డ్ కులాల కమ్యూనిట్పై వివక్షత చూపిస్తున్న విషయం వాస్తవమేనని తేల్చారు. ఇక వీడియో ఆధారంగా షాప్ ఓనర్ వైరముత్తును అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని దుకాణానికి సీల్ వేశారు. అంతేకాదు.. ఊరిలో టీ దుకాణాల్లో రెండు గ్లాసుల విధానం అమలు అవుతోందని, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ల కోసం ఒక గ్లాస్, ఇతర కులాల కోసం మరో గ్లాస్ విధానం అమలు అవుతోందని గుర్తించారు. అలాగే బార్బర్ దుకాణాల్లోనూ కొన్నిసార్లు వాళ్లకు క్షవరం, కటింగ్‌లు చేసేందుకు కూడా నిర్వాహకులు అంగీకరించడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో.. గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో.. పోలీసులను మోహరించారు అక్కడ. అఫ్కోర్స్.. ఇలాంటి ఊర్లు తమిళనాడులోనే కాదు.. అంతటా ఉన్నాయనుకోండి!. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌లో తమిళనాడు తెన్‌కాశీ పంజాన్కుళంకు చెందిన ఓ దుకాణ యజమాని.. దళిత కులానికి చెందిన పిల్లలకు చాక్లెట్లు అమ్మలేదు. తాను గ్రామ పంచాయితీ ఆదేశాలను పాటిస్తున్నానని చూపించేందుకు అతగాడు అదంతా వీడియో తీశాడు. అయితే ఆ వీడియో బయటకు రావడంతో.. శంకరన్‌కోయిల్ పోలీసులు మహేశ్వరన్ అనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
కులాంతర వివాహం చేసుకున్నాడని..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు అతని కుటుంబాన్ని గ్రామ పెద్దలు తీవ్రంగా అవమానించారు. బులంద్హహర్కు చెందిన ఓ దళితుడు యువకుడు ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గ్రామ కట్టుబాట్లకి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నాడని, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతని తండ్రి చేత నేలపై ఉమ్మించి నోటితో నాకించారు. అంతటితో ఆగని గ్రామస్థులు అతని భార్యని, కుతుర్ని పంచాయతీలో నగ్నంగా నిలుచోపెట్టారు. తన కుమారుడు ముస్లిం యువతిని వివాహం చేసుకున్నందుకు తమను తీవ్రంగా అవమానించి గ్రామం నుంచి వెలివేశారని యువకుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితులకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ డెహత్ తెలిపారు. కాగా, గత ఏడాది బులంద్హహర్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గ్రామస్థుల చేతిలో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. -
జీ+2 భవనాలకు పంచాయతీలు అనుమతివ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పరిధిలో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల భవన నిర్మాణాలకు పంచాయతీలు అనుమతులివ్వొచ్చని, ఈ మేరకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధికారాన్ని బదలాయించిందని తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఇంతకు మించిన భారీ ప్రాజెక్టులకు అనుమతినిచ్చే బాధ్యతలను హెచ్ఎండీఏ చేపడుతోందని తెలిపింది. గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్లు అభివృద్ధి చేస్తూ భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని, తద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వడం లేదని, దీంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతోందని రంగారెడ్డి జిల్లా కొంపల్లి సర్పంచ్ జమ్మి నాగమణి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డెరైక్టర్ (ప్రణాళిక) ఎస్.బాలకృష్ణ ఓ అఫిడవిట్‌ను సోమవారం ధర్మాసనం ముందు ంచారు. పంచాయతీలు వాటి పరిధిలో లేఔట్ల అభివృద్ధి చార్జీలను వసూలు చేసి హెచ్ఎండీఏ ఖాతాకు బదలాయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, కొంపల్లి పంచాయతీ మాత్రం అలా బదలాయించడం లేదని చెప్పారు. పంచాయతీల పరిధిలోని లేఔట్లకు సంబంధించి హెచ్ఎండీఏ వసూలు చేసే చార్జీలను ఆ గ్రామ పంచాయతీలతో పంచుకోవాలని నిబంధనల్లో ఎక్కడా లేదని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. -
ఆ ఆరు పంచాయతీలకు ఎన్నికలు జరపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాల్లోని బండ్లగూడ, నార్సింగి, నెక్నాంపూర్, ఖానాపూర్, మంచిరేవుల, జవహర్‌నగర్ గ్రామ పంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ మొదట జారీ చేసిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఎస్.దేవదాస్, మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు. ఈ ఆరు గ్రామాలను కలిపి నగర పంచాయతీగా చేయాలని భావిస్తున్నందున ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వం చెప్పిందని, ప్రస్తుతం ఆ అవకాశం లేనందున వీటికి వెంటనే ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కోర్టును అభ్యర్థించారు. మూడేళ్లనుంచి ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.