సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పరిధిలో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల భవన నిర్మాణాలకు పంచాయతీలు అనుమతులివ్వొచ్చని, ఈ మేరకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారాన్ని బదలాయించిందని తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఇంతకు మించిన భారీ ప్రాజెక్టులకు అనుమతినిచ్చే బాధ్యతలను హెచ్‌ఎండీఏ చేపడుతోందని తెలిపింది.
గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్‌ఎండీఏ లేఔట్లు అభివృద్ధి చేస్తూ భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని, తద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వడం లేదని, దీంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతోందని రంగారెడ్డి జిల్లా కొంపల్లి సర్పంచ్ జమ్మి నాగమణి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డెరైక్టర్ (ప్రణాళిక) ఎస్.బాలకృష్ణ ఓ అఫిడవిట్‌ను సోమవారం ధర్మాసనం ముందు ంచారు.
పంచాయతీలు వాటి పరిధిలో లేఔట్ల అభివృద్ధి చార్జీలను వసూలు చేసి హెచ్‌ఎండీఏ ఖాతాకు బదలాయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, కొంపల్లి పంచాయతీ మాత్రం అలా బదలాయించడం లేదని చెప్పారు. పంచాయతీల పరిధిలోని లేఔట్లకు సంబంధించి హెచ్‌ఎండీఏ వసూలు చేసే చార్జీలను ఆ గ్రామ పంచాయతీలతో పంచుకోవాలని నిబంధనల్లో ఎక్కడా లేదని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది.
జీ+2 భవనాలకు పంచాయతీలు అనుమతివ్వొచ్చు
Published Wed, Jul 20 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
Advertisement
Advertisement