అదుపుతప్పి రోడ్డు పక్కన కూరగాయల విక్రేతలపైకి దూసుకెళ్లిన లారీ
నలుగురు దుర్మరణం.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు బస్ స్టేజీ వద్ద ఘోర ప్రమాదం
చెట్టును ఢీకొని లారీ ఆగడంతో ముందుభాగం నుజ్జునుజ్జు
విరిగిన డ్రైవర్ కాలు.. క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయిన వైనం
చేవెళ్ల: రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నచిరువ్యాపారులను దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. లారీ రూపంలో వచ్చి వారిని చిదిమేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగి ఉన్న బస్సును దాటి వెళ్తూ..: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు, నాంచేరి, ఖానాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాల వారు నిత్యం ఆలూరు బస్ స్టేజీ వద్ద, రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కూరగాయలు విక్రయిస్తుండగా చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆలూరు స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటి వెళ్లే క్రమంలో అదుపుతప్పి టీస్టాల్ స్టాండ్‌ను ఢీకొడుతూ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు (48), దామరగిద్ద కృష్ణ (19), నాంచేరికి చెందిన శ్యామల సుజాత (42) అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే కూరగాయలు కొనేందుకు అక్కడకు వచ్చిన జమీల్ (25), బాలమణి, చల్ల మాల్యాద్రి, కూరగాయల విక్రేతలు ఆకుల పద్మమ్మ, నక్కలపల్లి రేణకతోపాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జమీల్ మృతిచెందాడు.అతను ఆలూరులోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. మిగతా క్షతగాత్రులను వారివారి బంధువులు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.
షాక్‌లో డ్రైవర్..: ఈ ఘటనలో లారీ చివరకు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అవగా డ్రైవర్ కాలు విరిగి క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జేసీబీల సాయంతో అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో షాక్‌లో ఉన్న డ్రైవర్ తన వివరాలు చెప్పలేకపోయాడు.
ప్రమాద తీవ్రతకు చెట్టు విరిగిపడటంతో చెట్టు కింద, లారీ ముందు భాగంలో ఎవరైనా ఇరుక్కుపోయారా? అనే విషయం వెంటనే తెలియరాక మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. చివరకు చెట్టును తొలగించాక దాని కింద ఎవరూ లేరని నిర్ధారణ అయింది. ఆ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న మరో 30 మంది ప్రమాదం బారిన పడేవారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ దిగ్బ్రాంతి..: ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment