
సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం మార్చి 31వ తేదీలోగా ‘స్థానిక’ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ చెప్పారు. తాము కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలియజేశామని వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఎంత మేర పోలీస్ బలగాలను రప్పించగలరో.. వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్‌ను కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందన్నారు.
అంతకుముందు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా డీజీపీ వివరించినట్టు తెలిసింది. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయ్యారు. త్వరితగతిన ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని వారు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment