Panchayatiraj department
-
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష; కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఉపాధిహామీ పనులు ►ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలి అధికారులకు సీఎం ఆదేశం ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ►అమూల్ పాలసేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బీఎంసీయూలను పూర్తిచేయాలన్న సీఎం ►జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేయడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ కార్యక్రమాలు ►జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెస్‌లపై సీఎం సమీక్ష ►నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్లనుంచి చెత్తసేకరణ ప్రారంభమై ప్రస్తుతం 61.5శాతానికి చేరుకున్నామన్న అధికారులు ►అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటున్నామన్న అధికారులు ►గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని సీఎం ఆదేశాలు ►మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం ►వివిధ గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ప్రత్యేక సర్వేద్వారా గుర్తించిన అధికారులు ►దాదాపు 582 ప్రాంతాలను గుర్తించిన అధికారులు ►ఇక్కడ సాయిల్ బయోట్రీట్‌మెంట్, వెట్ ల్యాండ్‌ట్రీట్‌మెంట్, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ తదితర పద్ధతుల్లో శుద్ధికి ప్రణాళికను వివరించిన అధికారులు ►వెంటనే ఈపనులు చేపట్టాలని సీఎం ఆదేశం ►ఏడాదిలోగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►కట్టిన తర్వాత వాటి నిర్వహణపైనా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్లాలన్న సీఎం ►పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిందన్న సీఎం ►అలాంటి పరిస్థితులను మార్చాలన్న సీఎం ►నివాసప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉండకూడదన్న సీఎం ►ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలన్న సీఎం ►ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటుపైనా ప్రణాళిక వివరించిన అధికారులు ►వీటి నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం వైఎస్సార్ జలకళ ►వైయస్సార్ జలకళపైనా సీఎం సమీక్ష ►ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలన్న సీఎం ►ఆ రిగ్గు ద్వారా రైతులకుబోర్లు వేయించాలన్న సీఎం ►దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందన్న సీఎం ►బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలన్న సీఎం రోడ్ల నిర్మాణం, నిర్వహణ ►రోడ్ల నిర్మాణం, నిర్వహణపైనా సీఎం సమీక్ష ►గత ప్రభుత్వం హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారు ►ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి ►క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేయడంతో అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింది ►ఈసారి రోడ్ల నిర్మాణం, మర్మతులను పూర్తిచేయాలి ►భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాలి ►ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్ పనులు నిర్వహించాలి ►దీనికోసం నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను ఆలోచించాలని అధికారులకు సీఎం ఆదేశం జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు ►జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►ఇళ్ల నిర్మాణం పూర్తయ్కేనాటికి అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ధ్యాస పెట్టాలన్న సీఎం ►గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. ►నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన విధానం తీసుకురావాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, సెర్ఫ్ సీఈఓ ఎండి ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియా పాండే ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పంచాయతీరాజ్ ఏఈ కేసులో కొత్త కోణం
సాక్షి, ఆదిలాబాద్: పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. ఏఈ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిపి.. పంచాయతీరాజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్ జాదవ్, విద్యార్థి రమేశ్ ఇరువురు కలిసి ఏఈ సోదరుడైన ఉపాధ్యాయుడు తాడిచర్ల రఘునాథ్ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరగవచ్చని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. ఆయన ఇంట్లోని ఆస్తి దస్త్రాలు, ఎల్ఐసీ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో వన్‌టౌన్‌లో తాడిచర్ల రఘునాథ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ ఎన్.రామకృష్ణ, ఎస్సై జి.అప్పారావు, జాదవ్ గుణవంత్‌రావు ఒక్క రోజులోనే దర్యాప్తు చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సీఐ ఎన్.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో అదే శాఖలో పనిచేస్తున్న నవీన్ జాదవ్, విద్యార్థి రమేశ్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. కుట్రలో భాగంగా ఇరువురు కలిసి స్థానిక పాత హౌసింగ్‌బోర్డు కాలనీలోని చంద్రశేఖర్ సోదరుని ఇంటికివెళ్లి మాయమాటలు చెప్పి ఆస్తికి సంబంధించిన దస్త్రాలు ఎత్తుకెళ్లారు. అనంతరం ఫోన్ ద్వారా రఘునాథ్‌ను బెదిరించి దస్త్రాలు కావాలంటే దస్త్రాల విలువలో 20 శాతం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్థానిక సివిల్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ ద్వారా ఫోన్ చేసి బెదిరించ సాగారు. ఆయన నుంచీ ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక భుక్తాపూర్ కాలనీలోని ఐటీ కన్సల్టెంట్ నరోత్తంరెడ్డిని సంప్రదించి ఆయన ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విధంగా నలుగురని కుట్రలో భాగస్వామ్యం చేసి రఘునాథ్‌ను బూతులు తిడుతూ బెదిరించారు. తరుచూ ఫోన్ రావడంతో వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు అనంతరం ఫోన్ నంబర్ల ఆధారంగా ఆరుగురు నిందితులు కుట్రలో భాగస్వాములు అయినట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశామన్నారు. కుట్రకు పాల్పడిన పంచాయతీరాజ్ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్ జాదవ్, విద్యార్థి బొడ్డెండ్ల రమేశ్, సివిల్ కాంట్రాక్టర్ బొడ్డెండ్ల శ్రీనివాస్, ఐటీ కన్సల్టెంట్ నరోత్తంరెడ్డి, జనగాం సంతోష్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు డీఎస్పీ వివరించారు. ఆరో ముద్దాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి బాలు జైస్వాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆరుగురుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
మేం సిద్ధం
సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం మార్చి 31వ తేదీలోగా ‘స్థానిక’ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ చెప్పారు. తాము కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలియజేశామని వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఎంత మేర పోలీస్ బలగాలను రప్పించగలరో.. వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్‌ను కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందన్నారు. అంతకుముందు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా డీజీపీ వివరించినట్టు తెలిసింది. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయ్యారు. త్వరితగతిన ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని వారు తెలియజేశారు. -
నా మిసెస్‌కే ఫైన్ వేశా..!
సాక్షి, జనగామ: ‘పరిశుభ్రత పాటించని వారిపై ఫైన్ వేయాలి.. భయం లేక పోతే మార్పు రాదు.. ఇటీవల మా ఊరికి పోయిన.. ఊర్లో తిరిగిన.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయడంతో మొదట నా మిసెస్‌కే ఫైన్ వేశా.. అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామలో బుధవారం కలెక్టర్ నిఖిల అధ్యక్షతన జరిగిన ‘పల్లె ప్రగతి–పట్టణ ప్రగతి’ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. మంత్రుల కంటే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి.. గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై వారు చర్యలు తీసుకుంటారు.. అధికారులే పని చేయకపోతే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ.330 కోట్లను విడుదల చేస్తున్నామన్నారు. నాటే మొక్కల్లో 85 శాతం బతకాలని, లేక పోతే సర్పంచ్ల పదవి ఊడిపోతుందని హెచ్చరించారు. j -
‘మీ అమ్మ రావాలి కానీ.. నువ్వు వచ్చావేంటి ?’
రాష్ట్రంలోనే ప్రగతి రేటింగ్‌లో సంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉందని, మొదటి స్థానంలో నిలపడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. సంగారెడ్డి పట్టణంలో సోమవారం పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ ఉత్తమ పంచాయతీల రేటింగ్‌లో రాష్ట్రంలో సిరిసిల్ల 82.49 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా..సంగారెడ్డి జిల్లా 82.01 పాయింట్లతో అంటే కేవలం అరపాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. మొదటి స్థానంలోకి రావడానికి సర్పంచ్‌లు, అధికారులు కృషి చేయాలని సూచించారు. – సాక్షి, సంగారెడ్డి సాక్షి, సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా ఏడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, ఇంకుడు గుంతలు నిర్మించి జిల్లాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించాలని, చేసిన పనులకు సాధ్యమైనంత త్వరలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగించడానికి వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. బాగా పనిచేసిన వారికి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జూన్ 2న సన్మానాలతోపాటు బహుమానాలు అందజేస్తామన్నారు. సింగూరులో ఇప్పటికీ 1.5 టీఎంసీల నీరు ఉందని, వారం రోజుల్లోగా రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో 771 కిలోమీటర్ల మేరకు ఎవిన్యూ ప్లాంటేషన్ చేశామని, వాటికి నీరు పోసి బతికించాలని సూచించారు. ఈ నెలాఖరు నుంచి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటిస్తారని చెప్పారు. బాగా పని చేయని సర్పంచ్‌లు, కార్యదర్శులపై వేటు వేస్తామని హెచ్చరించారు. పల్లె ప్రగతిలాగే త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన పంచాయతీలు కరెంటు బిల్లులు చెల్లించాలని, పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలని సూచించారు. చర్యలు తీసుకోండి బిల్లులపై సంతకాలు పెట్టడానికి సర్పంచ్‌లను ఇబ్బందులు పెడుతున్న ఉపసర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ హనుమంతరావును ఆదేశించారు. జాయింట్ చెక్‌పవర్ విషయం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచామని, ఇదే అదనుగా చేసుకొని చెక్కులపై సంతకాలు పెట్టడానికి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి తన జేబులో 5 చెక్కులు ఉన్నాయని, జాయింట్ సంతకం పెట్టడానికి ఉపసర్పంచ్ ఇబ్బంది పెడుతున్నాడని కంగ్టి మండలంలోని దామరగిద్ద సర్పంచ్ మామ శంకర్ (సర్పంచ్ ఆసం లక్ష్మికి బదులుగా ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు) మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా పై విధంగా ఆదేశించారు. ఉప సర్పంచ్‌లపై ఫిర్యాదులు అందుతున్నాయని, చట్టంలోనే పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. జాయింట్ చెక్‌పవర్‌పై సంతకాల కోసం ఇబ్బందులు పెడుతున్నట్లు నిర్దారణ అయితే వారిని పదవుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పల్లెల ముఖ చిత్రాలు మారుతున్నాయి పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖ చిత్రాలు మారుతున్నాయని, ఈ ఆరు నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచి్చన తర్వాత పల్లెల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచి్చందని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. గ్రామంలో అభివృద్ధి, నిర్వహణ కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఫరిదుద్దీన్ మాట్లాడుతూ..గ్రామాల్లో మార్పు కనిపిస్తుస్తోంని, అభివృద్ధి విషయంలో గతం కంటే బాగా మెరుగుపడిందని చెప్పారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ..గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీడీఓకు సన్మానం జిల్లాలోనే కంగ్టి మండలంలో ఎక్కువ గ్రామాల్లో డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు పూర్తి చేయడానికి కృషి చేసిన ఎంపీడీఓ జైసింగ్‌ను మంత్రి హరీశ్‌రావు శాలువాతో సత్కరించారు. కంగ్టి మండలంలో 34 గ్రామాలకు గాను 24 గ్రామాలలో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ వివరించారు. ఈ అధికారిని ఆదర్శంగా తీసుకొని ఈ నెలాఖరులోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సర్పంచ్‌లతో ముఖాముఖి జిల్లాలోని పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లాలోని పలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలను మంత్రి వివరాలడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆయన వారికి సూచించారు. అదే విధంగా పొడి చెత్త, తడి చెత్తను వేరు చేయాలన్నారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని తెలిపారు. ఇలా చేసిన వారిని సన్మానిస్తామని ఆయన వివరించారు. ప్రతీ ఇంటికి రెండు చెత్త బుట్టలను అందించాలన్నారు. పలువురు సర్పంచ్‌లు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ట్రాక్టర్ల పంపిణీ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. జిల్లాలోని 647 పంచాయతీలకు గాను ఇప్పటికే 410 అందించినట్లు తెలిపారు. మిగతా పంచాయతీలకు త్వరలో ట్రాక్టర్లను అందించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కుటుంబీకులు హాజరు.. సాక్షి, సంగారెడ్డి: పట్టణంలో నిర్వహించిన పల్లె ప్రగతి–పంచాయతీరాజ్ సమ్మేళనం అనే అధికారిక కార్యక్రమంలో కొందరు మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబీకులు, బంధువులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారిక సమావేశానికి సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలను ఆహ్వనించారు. కాగా కొందరు మహిళా సర్పంచ్‌లకు బదులు వారి కుటుంబీకులు, బంధువులు హాజరవ్వడమే కాకుండా ఏకంగా మంత్రితో ముఖాముఖిలో పాలుపంచుకున్నారు. ఏకంగా ఓ సర్పంచ్ కుమారుడు మంత్రితో మా అమ్మ సర్పంచ్ సార్ అంటూ చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. మీ అమ్మ రావాలి కాని..నీవు రావడమేమిటి.. మరోసారి ఇలా రావద్దంటూ హితవు పలికారు. నీవు వచ్చినా సరే.. మీ అమ్మను కూడా తీసుకురావాలి అంటూ మంత్రి అతనికి చెప్పారు. అదే విధంగా ఓ మహిళా సర్పంచ్‌కు బదులుగా ఆమె మామ సమావేశానికి వచ్చారు. ఆయన మంత్రికి సమస్యలు విన్నవించుకోవడం కొసమెరుపు. వీరే కాకుండా సుమారుగా 15 నుంచి 20 శాతం మంది మహిళా సభ్యులకు బదులుగా బంధువులు వచి్చనట్లు తెలుస్తోంది. జిల్లాలోని దాదాపుగా 70 నుంచి 80 శాతం గ్రామాలలో మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా పరిపాలనా వ్యవహారాలలో వారి కుటుంబీకులే పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు రాజకీయ అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో చట్టాలు చేస్తే వారి బదులుగా పురుషులే పరిపాలనలో జోక్యం చేసుకుని అన్నీ తామై చలాయిస్తున్నారు. -
ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్ష!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. మొత్తంగా 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాల నియామకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే.. ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని కూడా తెలిపారు. రానున్న వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించి రాత పరీక్షల తేదీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
వీధి దీపం వెలగలేదా?
సాక్షి, అమరావతి: ఎల్ఈడీ వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు అందిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన యంత్రాంగాన్ని (రాపిడ్ రెస్పాన్స్ మెకానిజం–ఆర్ఆర్ఎం) ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కమిటీతో మంత్రి సోమవారం భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లో నూరు శాతం వీధిదీపాలు వెలగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్ఈడీ వీధిదీపాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన, విస్తృతస్థాయి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించి 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి సదరు పోర్టల్‌లో నమోదు చేస్తే ఈఈఎస్ఎల్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో దాదాపు 25.04 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చామని, వీటిలో 1.5 లక్షల వీధి దీపాలు నెడ్‌క్యాప్ చేయగా, 23.54 లక్షల వీధి దీపాలను ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.156 కోట్ల నిధులు ఆదా అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మరో 35 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ఎల్ఈడీ కార్యక్రమం అమలుతీరుపై వెరిఫికేషన్ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తుందని, దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు అనువైన సిఫారసులను చేస్తుందని వివరించారు. -
14,061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు. దరఖాస్తులు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. దరఖాస్తుకు వెబ్సైట్లు: wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in -
కేసీఆర్ భిక్ష వల్లే మంత్రి పదవి
పర్వతగిరి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయుడు.. ఈ మంత్రి పదవి ఆయన పెట్టిన భిక్షే’అని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని తన స్వగ్రామం పర్వతగిరిలో బుధవారం పల్లె ప్రగతి–2 పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ పసునూరి దయాకర్, సర్పంచ్ మాలతితో కలసి పరిశీలించారు. తాను ఏ స్థాయికి ఎదిగినా పుట్టి పెరిగిన గ్రామాన్ని మరిచిపోనని, ఊరు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పారు. వర్ధన్నపేట నుంచి మూడు సార్లు, పాలకుర్తి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనను ఏ ముఖ్యమంత్రి గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దయాకర్‌రావు మంగళవారం రాత్రి పర్వతగిరిలో బస చేశారు. పర్వతగిరి నుంచి అన్నారం రోడ్డు వరకు వెళ్లే పద్మశాలి కాలనీలోని తన సొంత స్థలంలో చెత్తను గమనించిన మంత్రి.. తనకు రూ.500 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శి రమేష్‌ను కోరారు. -
వీధి దీపం వెలగాల్సిందే!
సాక్షి, అమరావతి : పల్లెల్లో నూటికి నూరుశాతం ఎల్ఈడీ వీధి దీపాలు వెలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పర్ఫెక్ట్ కంప్లైంట్ రిపోర్టింగ్ మెకానిజం’ (పీసీఆర్‌ఎం) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తోంది. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవస్థపై విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. ఇంధన పొదుపులో భాగంగా రాష్ట్రంలో 23.54 లక్షల వీధి దీపాలు ఏర్పాటుచేశారు. దీనికి అవసరమైన పెట్టుబడిని కేంద్ర ఇ«ంధన పొదుపు సంస్థ ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) అందించింది. అయితే, చాలావరకు వీధి దీపాలు పనిచేయడంలేదని కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తున్నాయి. నిర్వహణ చేపట్టాల్సిన కాంట్రాక్టు సంస్థలు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదనే విమర్శలు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. 72 గంటల్లోనే చర్యలు గ్రామాలలో వీధిదీపాలు వెలగడం లేదన్న ఫిర్యాదులను 72 గంటల్లోగా కాంట్రాక్టు సంస్థ పరిష్కరించాలి. లేదంటే చర్యలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ వీధి దీపాలు వెలగడం లేదన్న సమాచారాన్ని గ్రామ సచివాలయాల నుంచి కూడా పొందవచ్చు. కాగా, వీధి దీపాలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి చిత్తూరులో 15 నుంచి 9 శాతానికి, కడపలో 12 నుంచి 7 శాతానికి ఫిర్యాదుల సంఖ్య తగ్గిందని విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకూ దీన్ని విస్తరించామని, త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. బాగుందని ప్రజలే చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయంటూ ప్రజలే సంతృప్తి వ్యక్తంచేయాలని, అప్పటివరకూ క్షేత్రస్థాయి సిబ్బంది విశ్రమించొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయమై గ్రామాలలో థర్డ్ పార్టీ పరిశీలన జరిపిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఫిర్యాదుల సంఖ్యను కనిష్ట స్థాయికి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈఈఎస్ఎల్ సంస్థ 23.54 లక్షల ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటుచేసినప్పటికీ, పంచాయతీల నుంచి మరిన్ని అభ్యర్థనలు వస్తున్నాయని చెప్పగా.. వాటిపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. -
ఇసుక మాఫియాకు చెక్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటు న్నామని పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియాను నియంత్రించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారికి రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఇసు కకు ఎక్కడా కొరత లేదని, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
‘స్పందన’ సమస్యలకు అధిక ప్రాధాన్యం
సాక్షి, అమరావతి బ్యూరో: ‘స్పందన’లో వస్తున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు సూచించారు. ప్రజా హృదయ స్పందనను మానవీయ కోణంలో పరిశీలించి సంతృప్త స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్పందన అర్జీల పరిష్కారంపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా, పురపాలక, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. జనవరి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, వాటిలో స్పందన కౌంటర్లు నిర్వహిస్తారని తెలిపారు. ఇకపై స్పందనలో వచ్చే అర్జీల పరిష్కార తీరుపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులను జనవరి నుంచి అందజేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ స్పందనలో అర్జీలను చిరునవ్వుతో స్వీకరిస్తే సగం సమస్య పరిష్కరించినట్టేనన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం లక్ష్యమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో 53 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, జనవరి నాటికి మరో 7 లక్షల మందికి ఇస్తామన్నారు. పట్టణ పాలన కమిషనర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో అంకితభావంతో నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సదస్సులో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్, ముత్యాలరాజు, విజయవాడ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పౌరసరఫరాల శాఖ సీఈవో అరుణ్‌బాబు, సెర్ప్ సీఈవో రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న గ్రామ సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయలను ఏర్పాటు చేస్తుండగా.. అక్టోబరు 2న ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామంలోని సచివాలయంలో ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు తదితర అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ నవరత్న హామీలతో కూడిన బోర్డులను ఉంచాలని చెప్పారు. ఎమ్మెల్యేను తప్పక ఆహ్వానించాలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో సచివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను తప్పక ఆహ్వానించాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతలను మండల ఎంపీడీవోలకు అప్పగించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పని చేసేందుకు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆ మండల పరిధిలోని వలంటీర్లందరూ మండలానికి ఒక గ్రామంలో జరిగే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్న సందర్భంగా ఆయన ప్రసంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం కాపీని మండల ఈవోపీఆర్డీ అక్కడి ప్రజలకు చదివి వినిపించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా బ్యానర్లు, కళా జాతాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వార్డు సచివాలయాల నుంచే పౌర సేవలు పురపాలక శాఖ కమిషనర్ జె.విజయ్‌కుమార్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో అక్టోబర్ 2 నుంచి వార్డు సచివాలయాల ద్వారానే పౌర సేవలు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ జె.విజయ్‌కుమార్ తెలిపారు. వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ఈనెల 30న నియామక ఉత్తర్వులు అందిస్తారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను 72 గంటల్లో అందిస్తామన్నారు. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో 10 సేవలను ప్రారంభిస్తామన్నారు. తరువాత ఆ సేవలను దశల వారీగా పెంచుతామన్నారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. వారిలో పరిపాలన కార్యదర్శి ‘స్పందన’ కార్యక్రమంతో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తారని చెప్పారు. -
సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు
సాక్షి, అమరావతి : కనీవినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1,26,728 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేర్వేరు ఉద్యోగాలకు విడివిడిగా రాతపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయకుమార్‌లు మంగళవారం ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా.. 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి మొత్తం 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తుండగా.. 10 రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈనెల 22 నుంచి హాల్ టికెట్లను అన్లైన్లో ఉంచుతున్నామని, అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. -
గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నెల్లూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొత్తం 1,70,543 గ్రామ వలంటీర్ల నియామకానికి కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచించారు. ఈ వెబ్‌పోర్టల్‌ను కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే (ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయానికే) 1,47,376 మంది సందర్శించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణాల్లో 40 వేల వార్డు వలంటీర్ల నియామకాలకు సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మంగళవారం జిల్లాల వారీగా వీటి నియామకానికి సంబంధించిన ప్రకటనలు రెండు దినపత్రికల్లో ప్రచురితం కానున్నాయి. -
కక్కుర్తి ‘వర్క్’!
- పీఆర్లో వర్క్ ఇన్స్పెక్టర్ల ఇష్టారాజ్యం - క్షేత్రస్థాయి పనులన్నీ వారి కనుసన్నల్లోనే.. - కమీషన్ ఇవ్వాలని కూలీలకు బెదిరింపులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా వీరికి బదిలీలు లేకపోవడంతో ఏఈలను కూడా కాదని వీరి కనుసన్నల్లోనే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. పనులపై పర్యవేక్షణ వదిలి.. కాంట్రాక్టు కమీషన్ల మీదే వీరి దృష్టి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పనులు చేసే కూలీలు కూడా తమకు కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తుండటంతో ఓ మండలంలోని కూలీలు ఏకంగా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. వరంలా మారిన ఏఈల బదిలీలు.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా పంచాయతీరాజ్ శాఖలో 454 పనులకు.. రూ.336.26కోట్లు మంజూరయ్యాయి. గ్రామాల్లో ఈ పనులన్నీ పలు దశల్లో పురోగతిలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయినేజీలు, బ్రిడ్జిలు, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రధానంగా ఆయా మండలాల ఏఈలది. ఏఈల బదిలీలు జరుగుతుండటంతో ఆ మండలాల్లో ఐదు నుంచి పదేళ్ల వరకు దీర్ఘకాలికంగా తిష్టవేసిన కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంచాయతీ రాజ్ శాఖతోపాటు నాబార్డు, పీఎంజీఎస్‌వై ఇతర పథకాల నుంచి గ్రామాలకు మంజూర య్యే నిధులతో చేపట్టే పనులు ఈ శాఖ పరిధిలోనే జరుగుతాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వర్క్ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఏఈలను తోసిరాజని కాంట్రాక్టర్లతో వర్క్ ఇన్స్పెక్టర్లు సంబంధాలు పెట్టుకుని.. పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చి.. కమీషన్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు పనులు చేసే కూలీల నుంచి కూడా నెలకు తమకింత ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఓ ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఏకంగా బినామీ ముసుగులో చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా దక్కించుకుని పను లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం డివిజన్లోని ఓ మండలానికి చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ ఇలా కూలీలకు రోజువారీ ఇచ్చే వేతనంలో తనకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి కూలీలు ససేమిరా అనడంతో.. మీరు అధికార పార్టీకి చెందిన కూలీలు కాదని, ఆ పార్టీకి చెందిన కూలీలనే పనిలో పెట్టుకుంటామని సదరు కూలీలకు చెప్పారు. ఆ కూలీలంతా తమ పొట్టకొట్టొద్దని.. పక్క మండలంలో ఉన్న అధికార పార్టీ నేతను ఆశ్రయించి సదరు వర్క్ ఇన్స్పెక్టర్కు నచ్చజెప్పినా.. ససేమిరా అనడం గమనార్హం. కూలీ వేతనంలో తమ నుంచి కమీషన్ అడిగిన సదరు వర్క్ ఇన్స్పెక్టర్పై వారు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
పంచాయతీరాజ్ శాఖపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: గ్రామ పంచాయతీలను పటిష్టం చేసేందుకు అవసరమైతే కొత్త చట్టం తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆదివారం పంచాయతీరాజ్ శాఖఫై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల బాగోగుల బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కేసీఆర్ అన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం 25 వేల సైకిల్ రిక్షాల పంపిణీ చేయనున్నట్టు సీఎం వెల్లడించారు.