కక్కుర్తి ‘వర్క్’!
- పీఆర్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల ఇష్టారాజ్యం
- క్షేత్రస్థాయి పనులన్నీ వారి కనుసన్నల్లోనే..
- కమీషన్ ఇవ్వాలని కూలీలకు బెదిరింపులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా వీరికి బదిలీలు లేకపోవడంతో ఏఈలను కూడా కాదని వీరి కనుసన్నల్లోనే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. పనులపై పర్యవేక్షణ వదిలి.. కాంట్రాక్టు కమీషన్ల మీదే వీరి దృష్టి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పనులు చేసే కూలీలు కూడా తమకు కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తుండటంతో ఓ మండలంలోని కూలీలు ఏకంగా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
వరంలా మారిన ఏఈల బదిలీలు..
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా పంచాయతీరాజ్ శాఖలో 454 పనులకు.. రూ.336.26కోట్లు మంజూరయ్యాయి. గ్రామాల్లో ఈ పనులన్నీ పలు దశల్లో పురోగతిలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయినేజీలు, బ్రిడ్జిలు, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రధానంగా ఆయా మండలాల ఏఈలది. ఏఈల బదిలీలు జరుగుతుండటంతో ఆ మండలాల్లో ఐదు నుంచి పదేళ్ల వరకు దీర్ఘకాలికంగా తిష్టవేసిన కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంచాయతీ రాజ్ శాఖతోపాటు నాబార్డు, పీఎంజీఎస్‌వై ఇతర పథకాల నుంచి గ్రామాలకు మంజూర య్యే నిధులతో చేపట్టే పనులు ఈ శాఖ పరిధిలోనే జరుగుతాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వర్క్‌ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో పనులు చేస్తున్నట్లు సమాచారం.
ఏఈలను తోసిరాజని కాంట్రాక్టర్లతో వర్క్ ఇన్‌స్పెక్టర్లు సంబంధాలు పెట్టుకుని.. పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చి.. కమీషన్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు పనులు చేసే కూలీల నుంచి కూడా నెలకు తమకింత ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఓ ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఏకంగా బినామీ ముసుగులో చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా దక్కించుకుని పను లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం డివిజన్‌లోని ఓ మండలానికి చెందిన వర్క్ ఇన్‌స్పెక్టర్ ఇలా కూలీలకు రోజువారీ ఇచ్చే వేతనంలో తనకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి కూలీలు ససేమిరా అనడంతో.. మీరు అధికార పార్టీకి చెందిన కూలీలు కాదని, ఆ పార్టీకి చెందిన కూలీలనే పనిలో పెట్టుకుంటామని సదరు కూలీలకు చెప్పారు.
ఆ కూలీలంతా తమ పొట్టకొట్టొద్దని.. పక్క మండలంలో ఉన్న అధికార పార్టీ నేతను ఆశ్రయించి సదరు వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు నచ్చజెప్పినా.. ససేమిరా అనడం గమనార్హం. కూలీ వేతనంలో తమ నుంచి కమీషన్ అడిగిన సదరు వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై వారు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.