సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేశ్‌బాబు అవినీతికి పాల్పడినట్లు తేలినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవినీతిపరుడైన అతనికే మరో రెండు ఆసుపత్రుల ఫుడ్ కాంట్రాక్టును ఎలా అప్పగిస్తారని నిలదీసింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిలోఫర్ ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ సురేశ్‌బాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలంటూ నగరానికి చెందిన డాక్టర్ భగవంతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. సురేశ్‌బాబు తప్పుడు బిల్లులు పెట్టి అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారుల విచారణలో తేలిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు.
ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. ‘అవినీతికి పాల్పడ్డాడని తేలినా వెంటనే చర్యలు తీసుకోకుండా ఇంకా ఎందుకు అతన్ని ఉపేక్షిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా తప్పు చేసిన వ్యక్తికే మరో రెండు ఆసుపత్రుల ఫుడ్ కాంట్రాక్టును అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారుల విచారణ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలి’అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా విచారణ జరిపి, వివరణ ఇచ్చే అవకాశమిచ్చిన తర్వాతే సురేశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నివేదించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ 3 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, వాటిని వివరిస్తూ నివేదికను సెప్టెంబర్ 16న తమకు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
రూ.1.13 కోట్ల అవినీతి..
నిలోఫర్ ఆసుపత్రి ఫుడ్ కాంట్రాక్టర్ సురేశ్ బాబు 2017–2020 మధ్య రూ.1,13,28,320 అవినీతికి పాల్పడ్డాడని విచారణ కమిటీ నివేదికలో తేలిందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డాక్టర్ల ఆహారానికి రూ.86, సాధారణ ఆహారానికి రూ.40, హైప్రొటీన్ ఆహారానికి రూ.56 చొప్పున చెల్లించేవారని తెలిపింది. అయితే డాక్టర్లు, పోషకాహార నిపుణులు సూచించకుండానే 90 నుంచి 95 శాతం రోగులకు సాధారణ ఆహారాన్నే ఇచ్చి హైప్రొటీన్ ఆహారాన్ని ఇచ్చినట్లుగా సురేశ్ బాబు తప్పుడు రికార్డులు సృష్టించాడని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment