contracters works
-
‘నిలోఫర్’ ఫుడ్ కాంట్రాక్టర్‌పై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేశ్‌బాబు అవినీతికి పాల్పడినట్లు తేలినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవినీతిపరుడైన అతనికే మరో రెండు ఆసుపత్రుల ఫుడ్ కాంట్రాక్టును ఎలా అప్పగిస్తారని నిలదీసింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిలోఫర్ ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ సురేశ్‌బాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలంటూ నగరానికి చెందిన డాక్టర్ భగవంతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. సురేశ్‌బాబు తప్పుడు బిల్లులు పెట్టి అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారుల విచారణలో తేలిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. ‘అవినీతికి పాల్పడ్డాడని తేలినా వెంటనే చర్యలు తీసుకోకుండా ఇంకా ఎందుకు అతన్ని ఉపేక్షిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా తప్పు చేసిన వ్యక్తికే మరో రెండు ఆసుపత్రుల ఫుడ్ కాంట్రాక్టును అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారుల విచారణ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలి’అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా విచారణ జరిపి, వివరణ ఇచ్చే అవకాశమిచ్చిన తర్వాతే సురేశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నివేదించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ 3 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, వాటిని వివరిస్తూ నివేదికను సెప్టెంబర్ 16న తమకు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. రూ.1.13 కోట్ల అవినీతి.. నిలోఫర్ ఆసుపత్రి ఫుడ్ కాంట్రాక్టర్ సురేశ్ బాబు 2017–2020 మధ్య రూ.1,13,28,320 అవినీతికి పాల్పడ్డాడని విచారణ కమిటీ నివేదికలో తేలిందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డాక్టర్ల ఆహారానికి రూ.86, సాధారణ ఆహారానికి రూ.40, హైప్రొటీన్ ఆహారానికి రూ.56 చొప్పున చెల్లించేవారని తెలిపింది. అయితే డాక్టర్లు, పోషకాహార నిపుణులు సూచించకుండానే 90 నుంచి 95 శాతం రోగులకు సాధారణ ఆహారాన్నే ఇచ్చి హైప్రొటీన్ ఆహారాన్ని ఇచ్చినట్లుగా సురేశ్ బాబు తప్పుడు రికార్డులు సృష్టించాడని వివరించింది. -
పేదింటిపై సిమెంట్ పిడుగు
సాక్షి, ఇల్లంతకుంట (కరీంనగర్): అందమైన సొంతిల్లు ప్రతీ ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకునేందుకు బ్యాంకులోనో, ఇతరు వద్దనో అప్పు చేసి తమ కలలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బడ్జెట్లో ఏ కొంత మొత్తం పెరిగిన ఆ ఇంటి నిర్మాణ వ్యయం తలకిందులవుతుంది. నిర్మాణం మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఇలాగే ఉంది. పెరిగిన సిమెంట్ ధరలతో గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా బస్తాకు రూ.50 నుంచి రూ.80 పెరగడంతో నిర్మాణాలు కొనసాగించాలా వద్దా అని నిర్మాణదారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఒక్కో బస్తా రూ.250 ఉంటే ఇప్పుడు ధర రూ.340కి చేరింది. ఒక్క బస్తా సిమెంట్ బస్తా ధర రూ.50 నుంచి రూ.80 వరకు పెరగడంతో ఇంటి నిర్మాణాలపై పిడుగు పడినట్లయింది. పెద్దోళ్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా సామాన్యుల పేదోళ్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగించడం కష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సిమెంట్ దుకాణాల్లోనూ గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలచిపోతున్నాయి. ఒక్కో బస్తాకు రూ.50ల చొప్పున లెక్కేసుకున్నా 100 బస్తాలకు రూ.5 వేల అదనపు భారం కావడం, ఇంకా పెరిగితే మరింత భారం తప్పదని సామాన్యులు వాపోతున్నారు. మరోవైపు గ్రామాల్లో పలు కాలనీల్లో చేపడుతున్న మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు సైతం సిమెంట్ ధరల పెరుగుదలతో నిలిచిపోయాయి. సదరు కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేసి ముఖం చాటేస్తున్నారు. ఇలా çమండలంలో సిమెంట్ ధరల పెరుగుదల ప్రభావం అటు అభివృద్ధి పనులపై, ఇటు సామాన్యులపై ఇంటి నిర్మాణాలపై పడిందని పలువురు వాపోతున్నారు. సిమెంట్ బస్తా ధర రూ.280, రూ, 290, రూ.300 వరకు ఇలా కంపెనీల వారిగా పలికేవి. ఇప్పుడు వాటిపై ఏకంగా రూ.50 నుంచి రూ.60 వరకు అదనంగా పెరగడంతో భారంగా మారింది. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందో లేక పెరుగుతుందోనని సామాన్యులు వాపోతున్నారు. దీంతో నిర్మాణాలు ఇప్పట్లో చేపట్టడం మంచిది కాదని మద్యలోనే నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు కట్టడం కష్టమే త్వరలో కొత్తగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని పనులు చేసుకుంటున్నా. ఈలోగా సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో నిర్మాణం చేపట్టాలంటే భయమేస్తోంది. ఇంటి నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయింది. ఇంతటితో ఆగకుండా ఇంకా ధర పెరిగితే అదనపు భారం భరించలేం. అందుకే ఇంటి నిర్మాణం ఆలోచన మానుకుంటున్నా. – పొనగంటి సుధాకర్, నిర్మాణదారుడు గిరాకీ తగ్గింది పెంచిన సిమెంట్ బస్తాల ధరతో ఒక్కసారిగా సిమెంట్‌కు ధరలు పెరిగాయి. దీంతో గృహ నిర్మాణదారులు సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో రోజురోజూకి గిరాకీ తగ్గుతుం ది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో కొనేందుకు వచ్చి నిరాశతో వెళుతున్నారు. – బొడ్ల కుమార్, సిమెంట్ షాపు యాజమాని పని దొరుకుతలేదు పెరిగిన సిమెంట్ ధరలతో గృహ నిర్మాణదారులు ఇళ్లను నిర్మించుకోవాలంటే జంకుతున్నారు. పెరిగిన సిమెంట్ ధరల కారణంగా ఇంటి నిర్మాణాలు జరగకపోవడంతో కూలీ దొరకడం లేదు. పెంచిన సిమెంట్ ధరలను తగ్గించాలని కోరుతున్నా. – రావుల నాగరాజు, తాపీ మేస్త్రీ -
‘డబుల్’ ట్రబుల్
గొల్లపల్లి : మండలకేంద్రానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఎప్పుడెప్పుడాఅని ఎదురు చూస్తున్న డబుల్బెడ్రూం ఇళ్ల పనులు కొనసా..గుతున్నాయి. మండల కేంద్రంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చిల్వాకోడూర్, చెందోళి, వెన్గుమట్ల, శెకల్ల లొత్తునూర్ గ్రామాల్లో భూమి పూజ చేశారు. గ్రామాల్లో 75 ఇళ్ల లబ్ధిదారులు ఎంపికయ్యారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ముందుకు సాగని పనులు.. గొల్లపల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం బాలారిష్టాలు దాటడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టడానికి ముగ్గు కూడా పడడం లేదు. కేటాయించిన ఇళ్లను నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా, అధికారులు కాంట్రాక్టర్లను అదే పనిగా బుజ్జగిస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజలు విపరీతమైన ఆశలు పెంచుకున్న ఈ పథకం నత్తనడకకు నేర్పుతున్నాయి. రూ.12 కోట్ల 4 వేలు..240 ఇళ్లు మండలకేంద్రంలో రూ.12.4 కోట్లతో మొత్తం 240 ఇళ్ల నిర్మాణానికి మంజూరు లభించింది. దీంతో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చించి డబుల్బెడ్రూం, కిచెన్, హాల్, అటాచ్డ్ టాయిలెట్లు వంటి సకల సౌకర్యాలతో 240 ఇళ్లు నిర్మించాలి. మొదటి విడతలో 125 ఇళ్లు మంజూరు కాగా 75 ఇళ్లు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామానికి 15 ఇళ్ల చొప్పున చిల్వాకోడూర్, వెన్గుమట్ల, చెందోళి, లొత్తునూర్, శెకల్ల గ్రామాల్లో ప్రారంభానికి నోచుకోగా చిల్వాకోడూర్‌లో స్లాబ్‌దశలో, చెందోళి, శెకల్లలో పునాది దశలో ఉన్నాయి. వెన్గుమట్ల, లొత్తునూర్ గ్రామాల్లో పనులు ప్రారంభించారు. అదనంగా ఈ గ్రామాలకు మరో10 ఇళ్లచొప్పున మంజూరు అయ్యాయి. రెండో విడతలో గొల్లపల్లికి 50, ఆత్మకూర్ 20, గుంజపడుగు 25, ఇస్రాజ్‌పల్లి 20 మంజూరు కాగా మిగతా 165 ఇళ్లు టెండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి అంతే. మౌలిక వసతులు 75 ఇళ్లకే.. ఒక్కో ఇంటికి మౌలిక సౌకర్యాలు కల్పించడానికి రూ.1.25 లక్షలు కేటాయించారు. దీంతో కేవలం ఇళ్లు మాత్రమే నిర్మించడం కాకుండా విద్యుత్‌లైన్, డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి అన్నిరకాల వసతులు కల్పించనున్నారు. మొదటి విడతలో నిర్మాణం జరుగుతున్న 75 ఇళ్లకు మాత్రమే మౌలిక వసతుల సౌకర్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరుణించని కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో కాదని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్ ధరలు భారీగా పెరగడంతో ఈరేటు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించే ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ వరకు పూర్తి మండలంలో కొనసాగుతున్న డబులుబెడ్రూం ఇళ్ల పనులు మొదలై 75 ఇళ్లకు మాత్రం ఏప్రిల్ వరకు పూర్తయ్యేలా పనులు చేపడుతున్నాం. మిగతా 165 ఇళ్లకు టెండర్ల ప్రాస్స్ జరుగుతోంది. అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ప్రక్రియ సాగుతుంది. కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో కాస్త ఆలస్యం అయింది. ఉన్నతాధికారులనుగడువు పెంచాలని కోరాం. – రాహూఫ్, పీఆర్ ఏఈ -
కక్కుర్తి ‘వర్క్’!
- పీఆర్లో వర్క్ ఇన్స్పెక్టర్ల ఇష్టారాజ్యం - క్షేత్రస్థాయి పనులన్నీ వారి కనుసన్నల్లోనే.. - కమీషన్ ఇవ్వాలని కూలీలకు బెదిరింపులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా వీరికి బదిలీలు లేకపోవడంతో ఏఈలను కూడా కాదని వీరి కనుసన్నల్లోనే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. పనులపై పర్యవేక్షణ వదిలి.. కాంట్రాక్టు కమీషన్ల మీదే వీరి దృష్టి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పనులు చేసే కూలీలు కూడా తమకు కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తుండటంతో ఓ మండలంలోని కూలీలు ఏకంగా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. వరంలా మారిన ఏఈల బదిలీలు.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా పంచాయతీరాజ్ శాఖలో 454 పనులకు.. రూ.336.26కోట్లు మంజూరయ్యాయి. గ్రామాల్లో ఈ పనులన్నీ పలు దశల్లో పురోగతిలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయినేజీలు, బ్రిడ్జిలు, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రధానంగా ఆయా మండలాల ఏఈలది. ఏఈల బదిలీలు జరుగుతుండటంతో ఆ మండలాల్లో ఐదు నుంచి పదేళ్ల వరకు దీర్ఘకాలికంగా తిష్టవేసిన కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంచాయతీ రాజ్ శాఖతోపాటు నాబార్డు, పీఎంజీఎస్‌వై ఇతర పథకాల నుంచి గ్రామాలకు మంజూర య్యే నిధులతో చేపట్టే పనులు ఈ శాఖ పరిధిలోనే జరుగుతాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వర్క్ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఏఈలను తోసిరాజని కాంట్రాక్టర్లతో వర్క్ ఇన్స్పెక్టర్లు సంబంధాలు పెట్టుకుని.. పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చి.. కమీషన్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు పనులు చేసే కూలీల నుంచి కూడా నెలకు తమకింత ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఓ ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఏకంగా బినామీ ముసుగులో చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా దక్కించుకుని పను లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం డివిజన్లోని ఓ మండలానికి చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ ఇలా కూలీలకు రోజువారీ ఇచ్చే వేతనంలో తనకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి కూలీలు ససేమిరా అనడంతో.. మీరు అధికార పార్టీకి చెందిన కూలీలు కాదని, ఆ పార్టీకి చెందిన కూలీలనే పనిలో పెట్టుకుంటామని సదరు కూలీలకు చెప్పారు. ఆ కూలీలంతా తమ పొట్టకొట్టొద్దని.. పక్క మండలంలో ఉన్న అధికార పార్టీ నేతను ఆశ్రయించి సదరు వర్క్ ఇన్స్పెక్టర్కు నచ్చజెప్పినా.. ససేమిరా అనడం గమనార్హం. కూలీ వేతనంలో తమ నుంచి కమీషన్ అడిగిన సదరు వర్క్ ఇన్స్పెక్టర్పై వారు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.