చిల్వాకోడూర్‌లో స్లాబ్‌లెవల్ వరకు నిర్మాణమైన ఇళ్లు
గొల్లపల్లి : మండలకేంద్రానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఎప్పుడెప్పుడాఅని ఎదురు చూస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పనులు కొనసా..గుతున్నాయి. మండల కేంద్రంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చిల్వాకోడూర్, చెందోళి, వెన్గుమట్ల, శెకల్ల లొత్తునూర్ గ్రామాల్లో భూమి పూజ చేశారు. గ్రామాల్లో 75 ఇళ్ల లబ్ధిదారులు ఎంపికయ్యారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.
ముందుకు సాగని పనులు..
గొల్లపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం బాలారిష్టాలు దాటడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టడానికి ముగ్గు కూడా పడడం లేదు. కేటాయించిన ఇళ్లను నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా, అధికారులు కాంట్రాక్టర్లను అదే పనిగా బుజ్జగిస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజలు విపరీతమైన ఆశలు పెంచుకున్న ఈ పథకం నత్తనడకకు నేర్పుతున్నాయి.
రూ.12 కోట్ల 4 వేలు..240 ఇళ్లు
మండలకేంద్రంలో రూ.12.4 కోట్లతో మొత్తం 240 ఇళ్ల నిర్మాణానికి మంజూరు లభించింది. దీంతో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చించి డబుల్‌బెడ్‌రూం, కిచెన్, హాల్, అటాచ్డ్ టాయిలెట్లు వంటి సకల సౌకర్యాలతో 240 ఇళ్లు నిర్మించాలి. మొదటి విడతలో 125 ఇళ్లు మంజూరు కాగా 75 ఇళ్లు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామానికి 15 ఇళ్ల చొప్పున చిల్వాకోడూర్, వెన్గుమట్ల, చెందోళి, లొత్తునూర్, శెకల్ల గ్రామాల్లో ప్రారంభానికి నోచుకోగా చిల్వాకోడూర్‌లో స్లాబ్‌దశలో, చెందోళి, శెకల్లలో పునాది దశలో ఉన్నాయి. వెన్గుమట్ల, లొత్తునూర్ గ్రామాల్లో పనులు ప్రారంభించారు. అదనంగా ఈ గ్రామాలకు మరో10 ఇళ్లచొప్పున మంజూరు అయ్యాయి. రెండో విడతలో గొల్లపల్లికి 50, ఆత్మకూర్ 20, గుంజపడుగు 25, ఇస్రాజ్‌పల్లి 20 మంజూరు కాగా మిగతా 165 ఇళ్లు టెండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి అంతే.
మౌలిక వసతులు 75 ఇళ్లకే..
ఒక్కో ఇంటికి మౌలిక సౌకర్యాలు కల్పించడానికి రూ.1.25 లక్షలు కేటాయించారు. దీంతో కేవలం ఇళ్లు మాత్రమే నిర్మించడం కాకుండా విద్యుత్‌లైన్, డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి అన్నిరకాల వసతులు కల్పించనున్నారు. మొదటి విడతలో నిర్మాణం జరుగుతున్న 75 ఇళ్లకు మాత్రమే మౌలిక వసతుల సౌకర్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కరుణించని కాంట్రాక్టర్లు
ప్రభుత్వం నిర్దేశించిన ధరకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో కాదని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్ ధరలు భారీగా పెరగడంతో ఈరేటు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించే ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి.
ఏప్రిల్ వరకు పూర్తి
మండలంలో కొనసాగుతున్న డబులుబెడ్‌రూం ఇళ్ల పనులు మొదలై 75 ఇళ్లకు మాత్రం ఏప్రిల్ వరకు పూర్తయ్యేలా పనులు చేపడుతున్నాం. మిగతా 165 ఇళ్లకు టెండర్ల ప్రాస్‌స్ జరుగుతోంది. అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ప్రక్రియ సాగుతుంది. కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో కాస్త ఆలస్యం అయింది. ఉన్నతాధికారులనుగడువు పెంచాలని కోరాం.
– రాహూఫ్, పీఆర్ ఏఈ
Comments
Please login to add a commentAdd a comment