Delay works
-
ప్రాజెక్టుల్లో జాప్యంతో రూ.4.52 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల్లో జాప్యం వాటి నిర్మాణ వ్యయ అంచనాలను భారీగా పెంచేస్తోంది. రూ.150 కోట్లు, అంతకుమించి వ్యయంతో కూడిన మొత్తం 1,529 ప్రాజెక్టులకు గాను 384 ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల.. రూ.4.52 లక్షల కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక వెల్లడించింది. అలాగే, మొత్తం 662 ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నట్టు పేర్కొంది. ‘‘1,529 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.21,25,851 కోట్లు. కానీ, నిర్మాణం పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.25,78,197 కోట్లకు చేరనుంది. అంటే రూ.4,52,345 కోట్ల అదనపు వ్యయం కానుంది’’అని వివరించింది. 2022 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులపై చేసిన వ్యయం రూ.13,78,142 కోట్లుగా ఉంది. 662 ప్రాజెక్టుల్లో 1–12 నెలల ఆలస్యంతో నడుస్తున్నవి 133 ఉన్నాయి. 124 ప్రాజెక్టులు 13–24 నెలలు, 276 ప్రాజెక్టులు 25–60 నెలలు, 129 ప్రాజెక్టులు వాస్తవ గడువుతో పోలిస్తే 61 నెలలకు మించి ఆలస్యంగా సాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టులకు కావాల్సిన రుణాల సమీకరణలో ఆలస్యం కారణాలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
భారత్ మాల @ రూ.10.63 లక్షల కోట్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాలా (జాతీయ రహదారుల విస్తరణ) ప్రాజెక్టు తీవ్ర జాప్యాన్ని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 23 శాతం పనులే కాగా, 2028 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వాస్తవానికి 2022 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించగా సాధ్యపడలేదు. ఆరేళ్లు ఆలస్యంగా, అది కూడా ముందు అంచనాలకు రెట్టింపు వెచ్చిస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. అది కూడా ప్రస్తుత ధరల ప్రకారమే వ్యయాలు రెట్టింపు అవుతాయన్నది అంచనా. భూముల ధరలు, ఇన్పుట్ వ్యయాలను కూడా కలిపి చూస్తే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మరో 15–20 శాతం మేర వ్యయాలు పెరిగిపోవచ్చని ఇక్రా తన నివేదికలో తెలిపింది. భూ సమీకరణ పెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. ప్రాజెక్టులో 60 శాతానికే అవార్డ్ భారత్‌మాలా ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం 34,800 కిలోమీటర్లు కాగా, ఇందులో 60 శాతానికే అంటే 20,632 కోట్ల మేర రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డర్లు (2021 డిసెంబర్ నాటికి) ఇచ్చింది. భూ సమీకరణలో సమస్యలు, భూముల కొనుగోలు వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం, కరోనా మహమ్మారిని ప్రాజెక్టు జాప్యానికి కారణాలుగా ఇక్రా తెలియజేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అదనపు రుణాల సమీకరణను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. రహదారుల నిర్మాణానికి క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయిస్తామని, చిన్న ఇన్వెస్టర్లకు 8 శాతం వడ్డీని ఆఫర్ చేసి తగినన్ని నిధులను సమీకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ గతవారమే ప్రకటించడం గమనార్హం. భారత్‌మాలా కింద పూర్తి విస్తీర్ణం మేరకు రహదారుల నిర్మాణ అవార్డులను జారీ చేయడం 2024 మార్చి నాటికి పూర్తవుతుందని ఇక్రా అంచాన వేస్తోంది. ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంటే ఇది 2025 మార్చి వరకు పట్టొచ్చని తెలిపింది. ఏటా 4,500–5,000 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగితే 2028 మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంది. -
పట్టణాల్లో పీఎంఏవై ఇళ్ల పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. 2015లో పథకం ఆరంభ సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అయితే పక్కా ఇళ్ల కోసం రాష్ట్రాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వాటికి అనుమతులివ్వడం, నిర్మాణాలు జరపడం సకాలంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గడువును మార్చి 2024 వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పథకం కింద మొత్తంగా 1.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ.2.01 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా, ఇందులో 99 లక్షల ఇళ్ల పనులు మొదలవ్వగా, 59 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే..తెలంగాణలో 2.47లక్షల ఇళ్లకు గానూ 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమో లేక లబ్ధిదారులకు అందించడమో చేసినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 20.71 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 17.88 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వగా, ఇందులోనూ 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12,559 కోట్లను విడుదల చేసింది. -
khammam: ఉపాధి పనుల ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం
సాక్షి, గద్వాల(మహబూబ్ నగర్): జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న మండలంలో కూడా ఉపాధిహామీ పనులు ఆలస్యంగా కొనసాగడమేంటని, పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శృతిఓఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మండలంలోని తెలుగోనిపల్లి, ముల్కలపల్లి, బీరెల్లిలో పర్యటించి ఉధిహామీ పనులను పరిశీలించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లు పనులను పరిశీలించారు. అదేవిధంగా ఉపాధి పనులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఖచ్చితంగా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జాబ్‌కార్డులున్న ప్రతిఒక్కరికి పనులు కల్పించాలని, పనులు జరిగే సమయంలో కూలీల వద్ద జాబ్ కార్డులుండేలా చూడాలని సూచించారు. మస్టర్, డాక్యుమెంట్లు వంటివి ఎప్పటికపుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ సూరి, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం -
అభినందించాలంటే సిగ్గుగా ఉంది..
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అధికారుల నిర్లక్ష్యం, ప్రాజెక్టుల జాప్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్‌పూర్‌లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ భవనం నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ ఆలస్యానికి బాధ్యులైన అధికారుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు జాతీయ రహదారి అథారిటీలో తక్షణమే సంస్కరణలు అవసరమన్నారు. పనిచేయని ఉద్యోగులపై చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని కేవలం రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నామని, ఇందుకు గర్వంగా ఉందని ప్రకటించిన ఆయన కేవలం 250 కోట్ల ఈ ప్రాజెక్టును పూర్తికి జరిగిన ఆలస్యాన్ని ప్రశ్నించారు. అనవసరమైన గందరగోళాలను సృష్టించి జాప్యం చేస్తున్న అధికారుల ఫోటోలను సంబంధిత భవనం గోడలపై వేలాడదీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ప్రజలు ఈ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ భవనం ప్రారంభోత్సవంగా సందర్బంగా అధికారునుద్దేశించి మాట్లాడుతూ "ఎలా పలకరించాలోఅర్థం కావడంలేదు.. మిమ్మల్ని అభినందించాలంటే నాగే సిగ్గుగా ఉందంటూ'' మొదలుపెట్టారు. ఎన్హెచ్ఏఐ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యం తనకు అవమానకరంగా ఉందన్నారు. 2008లో ఈ భవన నిర్మాణానికి నిర్ణయించాం. 2011లో టెండర్ పిలిచాం.. 200-250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 9 సంవత్సరాల కాలం పట్టిందని ఆరోపించారు. ఇందుకు సంబంధిత అధికారుల ఫోటోల భవన గోడలపై వేలాడదీస్తే.. ఆ అధికారుల నిర్వాకం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పని పూర్తి కావడానికి రెండు ప్రభుత్వాలు, ఎనిమిది మంది అధ్యక్షులు మారారని ఆయన గుర్తు చేశారు. భవిషత్తులో ఈ లోపాలను సరిచేసుకుని, వేగంగా పనులు పూర్తి చేయల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు సూచించారు. -
హైదరాబాద్‌లో గృహ నిర్మాణాలు ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో నివాస విభాగం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఢిల్లీ, ఎన్సీఆర్, పుణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఏడు ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఎగువ మధ్య తరగతి, ప్రీమియం విభాగాల ప్రాజెక్ట్స్‌ల్లో మాత్రమే ఈ జాప్యం ఉందని జేఎల్ఎల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ► గృహ నిర్మాణాలను ప్రారంభించిన కాలం నుంచి ఐదేళ్ల కాల పరిమితిని దాటిన ప్రాజెక్ట్‌లను నిర్మాణ గడువు ముగిసిన/ ఆగిపోయిన ప్రాజెక్ట్‌లుగా జేఎల్ఎల్ రీసెర్చ్ పరిగణించింది. ఈ లెక్కన చూస్తే దేశంలో 2014 లేదా అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తి కానివి మొత్తం 4.54 లక్షల గృహాలున్నాయి. వీటి విలువ రూ.4.62 లక్షల కోట్లు. వీటిల్లో ఢిల్లీ–ఎన్సీఆర్లో 62 శాతం, ముంబైలో 22 శాతం గృహాలున్నాయి. ఆయా నగరాల్లో ప్రతి మూడు గృహాల్లో ఒకటి నిర్మాణ గడువు ముగిసిందే ఉంది. ► నగరాల వారీగా జాప్యమైన గృహాల సంఖ్య చూస్తే.. హైదరాబాద్‌లో 2,400 గృహాలు (0.5 శాతం), బెంగళూరులో 28,400 (6.3 శాతం), చెన్నైలో 8,500 (1.9 శాతం), కోల్‌కతాలో 17,800 (3.9 శాతం), పుణేలో 16,400 గృహాలు (3.6 శాతంగా ఉన్నాయి. నగరంలో అద్దెవాసులే ఎక్కువ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 1.19 కోట్ల గృహాలు ఖాళీగా ఉన్నాయి. తక్కువ అద్దెలు, సరిగా లేని నిర్వహణ, అద్దెదారుల బాధ్యతారాహిత్యం, అద్దె గృహాల రాయితీలు లేకపోవటం వంటి రకరకాల కారణాలతో రెంట్ హౌస్‌లు వేకెంట్‌గా ఉంటున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా, కైటాన్ అండ్ కో సంయుక్త నివేదిక తెలిపింది. ► దేశ జనాభాలో 2.73 కోట్ల కుటుంబాలు అద్దె గృహాల్లో నివాసముంటున్నాయి. 79.4 శాతం అంటే 2.17 కోట్ల కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లోనే రెంట్‌కు ఉంటున్నాయి. అత్యధిక అద్దె కుటుంబాలు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ 35,90,179 మంది అద్దె గృహాల్లో ఉంటున్నారు. రెండో స్థానంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ 3,004,702 కుటుంబాలు రెంట్ హౌస్‌లలో ఉంటున్నాయి. హైదరాబాద్ వాటా 6 శాతంగా ఉంది. ► మహారాష్ట్రలో 29,40,731, కర్నాటకలో 24,47,718, గుజరాత్లో 13,15,157, వెస్ట్ బెంగాల్లో 12,92,263, ఉత్తర ప్రదేశ్‌లో 11,14,832, ఢిల్లీలో 9,29,112 అద్దె గృహాలున్నాయి. -
డబుల్.. గుబుల్
నర్సాపూర్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో నర్సాపూర్‌లో పనులు జరగడం లేదు. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయిన కొద్దిరోజులకే చిన్న సమస్యతో పనులు నిలిచిపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణానికి ఐదు వందల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న 79 సర్వే నంబరులోని మూడెకరాల్లో 160, యార్డు పక్కన ఉన్న అదే సర్వే నంబరులోని మరో ఏడెకరాల్లో 340 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. మొదటగా యార్డు ఎదురుగా నిర్మాణ పనులను జనవరి నెలలో చేపట్టారు. ఈ నిర్మాణ పనులను రాహు కన్ర్çస్టక్షన్స్ అనే సంస్థకాంట్రాక్టు తీసుకుంది. విద్యుత్ వైర్లు ఉన్నందునే.. ఇళ్లు నిర్మాణ పనులు ప్రారంభించని స్థలం పైనుంచి విద్యుత్ వైర్లు ఉన్నాయి. కండక్టర్ వైర్ల కింద నిర్మాణ పనులు చేపట్టడం ప్రమాదకరంగా ఉండడంతో సుమారు నెల రోజుల క్రితం పనులు నిలిపివేశారు. ఇప్పటివరకు గోతులు తీసి ఫిల్లర్లు ఏర్పాటు చేశారు. ఈ వైర్లు తొలగించాలని సదరు కాంట్రాక్టరు పంచాయితీ రాజ్ శాఖ అధికారులను కోరారని తెలిసింది. కాగా వారు కరెంటు వైర్లను తొలగించాలని విద్యుత్తు శాఖ అధికారులను కోరారు. వైర్లు తొలించడానికి గాను షిఫ్టింగ్ చేసిన చార్జీలు ఇస్తే వాటిని తొలగిస్తామని చెప్పడంతో పాటు సుమారు రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా తయారు చేసి పంచాయతీ రాజ్ శాఖకు అందచేశారని సమాచారం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే అందజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెప్పినా విద్యుత్ శాఖ అధికారులు వైర్లను తొలగించే పనులు చేపట్టడం లేదని తెలిసింది. అంతటా అయోమయం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరి«ధిలోని శివ్వంపేట మండలంలోని దంతాన్పల్లి, సికింద్లాపూర్ పిట్టలవాడలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయి. కౌడిపల్లికి 65 ఇళ్లు, తునికి గ్రామానికి 30, కొల్చారం, ఎనగండ్ల గ్రామాలకు 20 ఇళ్ల చొప్పున చడూర్ గ్రామానికి 35 ఇళ్లు మంజూరయ్యాయి.ఈ గ్రామాల్లో ఇంత వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఉన్నతాధికారులకు తెలిపాం.. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్న స్థలం పైన ఉన్న కరెంటు వైర్లు తొలగించెందుకు షిఫ్టింగ్ చార్జీలు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు విద్యుత్తు శాఖ అధికారులు ఇచ్చిన అంచనాలను పంపించాం. నిధులు మంజూరు కాగానే విద్యుత్ శాఖకు అందజేస్తాం. త్వరలో నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైర్లు తొలగించగానే నిర్మాణ పనులు మొదలయ్యెలా చర్యలు తీసుకుంటాం. –స్వామిదాస్, పంచాయితీ రాజ్ ఏఈ, నర్సాపూర్ -
పనుల నత్తనడకపై కమిషనర్ ఆగ్రహం
పటమట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు నత్తనడక సాగటంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్ట్రామ్ పనులు జామ్’ శీర్షికన ఈనెల 2వ తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కమిషనర్ జె.నివాస్ బుధవారం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, ఎల్‌అంట్‌టీ అధికారులతో సమావేశమయ్యారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో కాలువలను బ్లాక్ చేయటం వల్ల మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రెయిన్‌లో వచ్చే మురుగునీటిని మోటర్ల ద్వారా పక్కనున్న డ్రెయిన్లలోకి మళ్లించటంతోపాటు పనులు పూర్తయిన వెంటనే మిగిలిన మట్టి, వ్యర్థ పదార్థాలను తొలగించి రోడ్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రెయినేజీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో యూజీడీ పైప్‌లైన్, తాగునీటి పైప్‌లైన్ ఎలాంటి డ్యామేజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అవుట్‌ఫాల్ డ్రైయినేజీ పనులు నిర్మాణం పూర్తయిన వెంటనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రెయిన్లపై శ్లాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రామ్‌వాటర్ డ్రైయిన్ పనులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్‌హెల్త్ విభాగం అధికారులు వివరణ ఇచ్చారు. నగరంలో ఇప్పటివరకు సుమారు 98 కిలోమీటర్ల దూరం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిర్మాణపు పనులు పూర్తయ్యిన అన్నిచోట్ల గ్యాపులను అనుసంధానం చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. విశాలాంధ్ర రోడ్డు, ప్రకాశం రోడ్డు, రవీంద్రభారతి స్కూలు వద్ద కల్వర్టుల నిర్మాణపు పనులు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం, లయోలా కళాశాల, పుల్లేటి కాలువ వంటి ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం ప్రాంతాల్లో విస్తరణ జరుగుతున్న కారణంగా సర్వే పూర్తిచేసి ఎలైన్మెంట్ ప్రకారం డ్రైయిన్ నిర్మాణాలను అడ్డుగా ఉన్న భవన యజమానులకు టీడీఆర్ బాండ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశించారు. మూడు మిక్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం స్ట్రామ్‌వాటర్ డ్రెయినేజీ పనులు నిర్వహణ నిమిత్తం మూడు మిక్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని, పనులువేగవంతం చేయటానికి చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. మరో మిక్సింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఎల్అండ్టీకి సూచించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే అధికారులతో సమన్వయం అయ్యి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ పి.ఆదిశేషు, ఎస్ఈ రామచంద్రరావు, ఈఈ ప్రభాకర్; విద్యుత్ శాఖ ఎస్ఈ తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడక
మండపేట: జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం డిమాండ్ రూ.115.31 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.61.63 కోట్లు మాత్రమే వసూలైంది. 74.5 శాతం పన్నుల వసూళ్లతో జిల్లాలో పెద్దాపురం పురపాలకసంఘం ముందంజలో ఉండగా 43 శాతంతో పిఠాపురం చివరిస్థానంలో ఉంది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా నూరుశాతం వసూళ్లు ప్రశార్థకంగా మారింది. ఆర్థిక సంఘం నిధుల విడుదలకు నూరుశాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేయడంతో అధికారుల అలసత్వం పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరకార్పొరేషన్లతోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 2,41,493 ప్రైవేటు భవనాలున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు నాటికి ఆయా భవనాలు ద్వారా మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 115.31లు డిమాండ్ కాగా ఇప్పటి వరకు కేవలం రూ. 61.63 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాకినాడ నగర పాలక సంస్థలో 52.8 శాతం వసూలు కాగా, రాజమహేంద్రవరంలో 51.27 శాతం వసూలయ్యాయి. అమలాపురం మున్సిపాల్టీలో 56.3 శాతం, రామచంద్రపురంలో 48.8 శాతం, పిఠాపురంలో 43.9 శాతం, మండపేటలో 68.2 శాతం, తునిలో 72 శాతం, పెద్దాపురంలో 74.5 శాతం, సామర్లకోటలో 49.6 శాతం పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 69.2 శాతం, ఏలేశ్వరంలో 65 శాతం, ముమ్మిడివరంలో 50 శాతం పన్నులు వసూలయ్యాయి. నూరుశాతం వసూలు గగనమే 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు మేరకు స్థానిక సంస్థలు నూరుశాతం పన్నులు వసూలు తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్నుల వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతర సమీక్ష జరుగుతోంది. మరో ఐదు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితితో నూరుశాతం వసూలు గగనమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘డబుల్’ ట్రబుల్
గొల్లపల్లి : మండలకేంద్రానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఎప్పుడెప్పుడాఅని ఎదురు చూస్తున్న డబుల్బెడ్రూం ఇళ్ల పనులు కొనసా..గుతున్నాయి. మండల కేంద్రంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చిల్వాకోడూర్, చెందోళి, వెన్గుమట్ల, శెకల్ల లొత్తునూర్ గ్రామాల్లో భూమి పూజ చేశారు. గ్రామాల్లో 75 ఇళ్ల లబ్ధిదారులు ఎంపికయ్యారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ముందుకు సాగని పనులు.. గొల్లపల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం బాలారిష్టాలు దాటడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టడానికి ముగ్గు కూడా పడడం లేదు. కేటాయించిన ఇళ్లను నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా, అధికారులు కాంట్రాక్టర్లను అదే పనిగా బుజ్జగిస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజలు విపరీతమైన ఆశలు పెంచుకున్న ఈ పథకం నత్తనడకకు నేర్పుతున్నాయి. రూ.12 కోట్ల 4 వేలు..240 ఇళ్లు మండలకేంద్రంలో రూ.12.4 కోట్లతో మొత్తం 240 ఇళ్ల నిర్మాణానికి మంజూరు లభించింది. దీంతో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చించి డబుల్బెడ్రూం, కిచెన్, హాల్, అటాచ్డ్ టాయిలెట్లు వంటి సకల సౌకర్యాలతో 240 ఇళ్లు నిర్మించాలి. మొదటి విడతలో 125 ఇళ్లు మంజూరు కాగా 75 ఇళ్లు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామానికి 15 ఇళ్ల చొప్పున చిల్వాకోడూర్, వెన్గుమట్ల, చెందోళి, లొత్తునూర్, శెకల్ల గ్రామాల్లో ప్రారంభానికి నోచుకోగా చిల్వాకోడూర్‌లో స్లాబ్‌దశలో, చెందోళి, శెకల్లలో పునాది దశలో ఉన్నాయి. వెన్గుమట్ల, లొత్తునూర్ గ్రామాల్లో పనులు ప్రారంభించారు. అదనంగా ఈ గ్రామాలకు మరో10 ఇళ్లచొప్పున మంజూరు అయ్యాయి. రెండో విడతలో గొల్లపల్లికి 50, ఆత్మకూర్ 20, గుంజపడుగు 25, ఇస్రాజ్‌పల్లి 20 మంజూరు కాగా మిగతా 165 ఇళ్లు టెండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి అంతే. మౌలిక వసతులు 75 ఇళ్లకే.. ఒక్కో ఇంటికి మౌలిక సౌకర్యాలు కల్పించడానికి రూ.1.25 లక్షలు కేటాయించారు. దీంతో కేవలం ఇళ్లు మాత్రమే నిర్మించడం కాకుండా విద్యుత్‌లైన్, డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి అన్నిరకాల వసతులు కల్పించనున్నారు. మొదటి విడతలో నిర్మాణం జరుగుతున్న 75 ఇళ్లకు మాత్రమే మౌలిక వసతుల సౌకర్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరుణించని కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో కాదని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్ ధరలు భారీగా పెరగడంతో ఈరేటు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించే ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ వరకు పూర్తి మండలంలో కొనసాగుతున్న డబులుబెడ్రూం ఇళ్ల పనులు మొదలై 75 ఇళ్లకు మాత్రం ఏప్రిల్ వరకు పూర్తయ్యేలా పనులు చేపడుతున్నాం. మిగతా 165 ఇళ్లకు టెండర్ల ప్రాస్స్ జరుగుతోంది. అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ప్రక్రియ సాగుతుంది. కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో కాస్త ఆలస్యం అయింది. ఉన్నతాధికారులనుగడువు పెంచాలని కోరాం. – రాహూఫ్, పీఆర్ ఏఈ -
ఘాటు.. నిర్లక్ష్యంతో చేటు
ఘాట్‌రోడ్డు పనుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా నిపుణులు సూచించిన వాటిని తక్షణమే అమలులోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. కానీ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనుల విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. సాక్షి, తిరుమల: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా ఉంది తిరుమల ఘాట్ రోడ్డు అభివృద్ధి çపరిస్థితి. మొదటి, రెండో ఘాట్రోడ్లకు అనుసంధానంగా ఉండే లింక్ రోడ్డును మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల వరకు నాలుగు లేన్లుగా విస్తరించాలని రెండేళ్లకు ముందే నిర్ణయించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రెండో ఘాట్ రోడ్డులో తరచూ కొండచరియలు కూలుతున్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలు ముం దుకు కదలటం లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల దూరం ఉన్న రెండో ఘాట్‌రోడ్డు ప్రమాద స్థితికి చేరుకుంటోంది. కొంతకాలంగా తరచూ ఈ ఘాట్ రోడ్డులో కొండచరియలు కూలుతూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలకు మరింత ఎక్కువ స్థాయిలో కొండచరియలు కూలాయి. ఏడో కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు ఎక్కువ మోతాదులో కూలుతున్నాయి. భవిష్యత్‌లో ఈ రోడ్డు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణుల బృందం తేల్చింది. ప్రత్యామ్నాయ లింకు రోడ్డును పట్టించుకోని టీటీడీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డు మోకాళ్ల పర్వతం వరకు అనుసంధానంగా లింక్‌రోడ్డు ఉంది. విపత్కర పరిస్థితుల్లో ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయితే ఈ రోడ్డు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంది. రెండేళ్లకు ముందు రెండో ఘాట్‌లోని 15వ కిలోమీటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడిన కొండ చరియల వల్ల 20 రోజులపాటు రెండో ఘాట్‌రోడ్డులోని ఐదు మలుపులు మూసేశారు. ప్రత్యామ్నాయంగా వాహనాలను లింక్‌రోడ్డు మీదుగా తిరుమలకు అనుమతించారు. అరగంటపాటు అటుఇటుగా ఆపేసి పంపటం వల్ల రెండు వైపులా భక్తుల రాకపోకలు ఆగిపోవడమేగాక రైళ్లు, విమాన ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నిపుణుల సూచన బేఖాతరు మొదటి, రెండో ఘాట్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్డు నుంచి తిరుమల వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని రోడ్డును నాల్గు లేన్లు విస్తరించాలని గతంలో నిపుణులు సూచించారు. దీనికోసం ప్రముఖ నిర్మాణం సంస్థలతో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లు పిలిచారు. వివిధ కారణాలతో టెండర్లు తెరుచుకోలేదు. మరోసారి టెండర్లు పిలిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ టెండర్ దాఖలు చేసింది. అయితే, ఆ టెండరు ఫైల్ ఇంకా తెరుచుకోలేదు. సుమారు రెండు నెలలు గడచినా ఆ ఫైలుకు మోక్షం రాలేదు. సంబంధిత ఇంజినీరింగ్ అధికా రుల నిర్లక్ష్యం కారణంగానే ఆగిందని సమాచారం. దీంతో అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రమాదం అంచుల్లో అవ్వాచ్చారి కోన కొండ తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డు 1945, ఏప్రిల్ 10వ తేదీ ప్రారంభించారు. ఈ మార్గంలో మోకాళ్ల పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 1.5 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం అతి ప్రమాదకరమైనది. ఈ మార్గంలో తొలిసారి ఈ నెల 13వ తేదీ భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో గంటన్నరపాటు వాహనాలు స్తంభించాయి. మరింత తీవ్ర స్థాయిలో కొండచరియలు విరిగిపడితే మొదటి ఘాట్‌రోడ్డు మూసివేయక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు లింక్ రోడ్డు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గమవుతుంది. నిటారుగా ఉండే ఈ అవ్వాచ్చారికోన కొండ మీద నుంచి బండరాళ్లు భవిష్యత్‌లో మరిన్ని కూలే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు తేల్చారు. -
వానొస్తే..బురదే!
- రోడ్లు ఎరుగని 17వ వార్డు - వర్షం కురిస్తే చాలు.. కాలనీ అంతా ఏరులై పారుతున్న మురుగు - కంపువాసన భరించలేకపోతున్న కాలనీవాసులు సంగారెడ్డి మున్సిపాలిటీ: అభివృద్ధి అంటే ఈ వార్డుకు తెలియదు. పాలకులు హామీలిచ్చారు. నిధులు సైతం మంజూరయినా.. అధికారుల నిర్లక్ష్యం పాలకుల పక్షపాతం కారణంగా పనులు ప్రారంభం కాలేకపోతున్నాయి. పట్టణంలోని17వ వార్డులో గల మగ్దూంనగర్, సంతోష్‌నగర్‌తో పాటు మరో రెండు కాలనీలు మురికి కాల్వలు లేక ఎక్కడికక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం ఈ వార్డులో ఇంత వరకు ఫార్మేషన్ రోడ్లు కూడా నిర్మించలేదు. దీంతో వర్షకాలం వస్తే చాలు.. కాలనీ వాసులు మోకాళ్లలోతు బురదలో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ వార్డులో వర్షం కురిస్తే చాలు ఆ కాలనీ నుంచి బయటకు వచ్చేందుకే వృద్ధులు భయపడుతున్నారు. ఇక్కడ ఎక్కువగా పోలీసుశాఖలో పని చేసే వారే ఉండటంతో అధికారులకు.. నాయకులకు అడిగే పరిస్థితి లేకపోవడంతో ఈ కాల నీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ కాలనీలో ఎటు చూసినా వరద నీటితో పాటు మురుగు చేరుతోంది. ఈ ప్రాంతంలో మురికి కాల్వలున్నా వాటిని శుభ్రం చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల మురికి కాల్వలు లేకపోవడం తో సొంత డబ్బులతో పైప్‌లైన్ వేసుకొని నీటిని తరలిస్తున్నారు. ప్రధానంగా ఈ కాలనీ లో డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఎక్కడికక్కడ మురుగు నిల్వఉండటంతో దుర్గంధం వెదజల్లుతుంది. మరోవైపు కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ప్రెసిడెంట్ ఫంక్షన్ హాల్, స్టూడెంట్ ఇస్లామిక్ కార్యాలయం, మెదడిస్ట్ చర్చ్ మార్గాలలో రోడ్లు లేక ఆ ప్రాంత వాసు లు బురదలోనుంచే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ అభివృద్ధి పనులు చేశాం.. రూ.34 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేశాం. మరో రూ.25 లక్షలు మంజూరై నిధులు సిద్ధంగా ఉన్నాయి. రూ.4 లక్షలతో సీసీ డ్రైన్, మరో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2 లక్షలతో మొరం రోడ్డు వేశాం. రూ.3 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ కోసం రూ.25 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించక జాప్యం జరుగుతోంది. - సమీనా, కౌన్సిలర్ అభివృద్దికి పాటుపడతాం.. పట్టణంలోని అన్ని వార్డులను సమాంతరంగా అభివృద్ధి చేసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే తాము ముదంజలో ఉన్నాం. వరద కాల్వ నిర్మాణం చేశాం. 17వ వార్డులో ఇప్పటికే రూ.34 లక్షల పనులు చేశాం. మరో రూ.35 నుంచి రూ.40 లక్షల విలువ చేసే పనులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి. పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామనడానికి వార్డు అభివృద్ధే నిదర్శనం. - బొంగుల విజయలక్ష్మి, మున్సిపల్‌చైర్ పర్సన్