సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. 2015లో పథకం ఆరంభ సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అయితే పక్కా ఇళ్ల కోసం రాష్ట్రాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వాటికి అనుమతులివ్వడం, నిర్మాణాలు జరపడం సకాలంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గడువును మార్చి 2024 వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి పథకం కింద మొత్తంగా 1.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ.2.01 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా, ఇందులో 99 లక్షల ఇళ్ల పనులు మొదలవ్వగా, 59 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే..తెలంగాణలో 2.47లక్షల ఇళ్లకు గానూ 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమో లేక లబ్ధిదారులకు అందించడమో చేసినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 20.71 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 17.88 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వగా, ఇందులోనూ 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12,559 కోట్లను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment