రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్య పెంపు ఫలితం
‘పట్టణ’ పరిధిలోకి రానున్న వేలాది పంచాయతీలు
రూ.72 వేల బదులు రూ.లక్షన్నర దక్కే చాన్స్
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచటంతో చాలా గ్రామాలు ‘పట్టణ పరిధి’లోకి చేరటంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపు కానుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలుగా ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మూడొంతులకు పైగా గ్రామ పంచాయతీలు పట్టణాభివృద్ధి సంస్థల జాబితాలోకి వెళ్లాయి. గతంలో 9 పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా, వాటి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 28కు పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరనున్నాయి. దీంతో వీటికి పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందుతాయి.
రెండో దశలోనూ పాత యూనిట్ కాస్ట్‌లే..
చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర ఖజానాపై అతిపెద్ద భారం మోపనుంది. పీఎంఏవై పథకం మొదటి దశ కాలపరిమితి తీరిపోవటంతో, కేంద్రం రెండో దశకు శ్రీకారం చుడుతోంది.
ఇందులో పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.2.25 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్‌లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా, గతంలో ఉన్న రూ.1.5 లక్షలే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ కూడా రూ.72 వేలుగానే ఉంది.
గ్రామీణ యూనిట్లకు పట్టణ కాస్ట్ దక్కేలా..
కేంద్రం నుంచి గ్రామీణ యూనిట్ కాస్ట్ రూ.72 వేలు మాత్రమే అందితే, ఆ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కొంతైనా ఊరట దక్కేలా వ్యూహరచన చేసిన ప్రభుత్వం.. సింహ భాగం గ్రామాలకు పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ (రూ.1.5 లక్షలు) దక్కేలా పట్ణణాభివృద్ధి సంస్థల సంఖ్యను పెంచేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు ‘పట్టణ’ పరిధిలోకి రానున్నాయి. తద్వారా వాటికి ‘పట్టణ’ యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం గృహనిర్మాణ పథకానికే పరిమితం కాకుండా, కొన్ని ఇతర పథకాలకు కూడా లబ్ధి చేకూర్చనుండటం గమనార్హం.
సాయంపై స్పష్టతకు మరింత సమయం
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికే రాష్ట్రంలో పథకాల ప్రకటన జరిగిపోయింది. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం పథకాలను సమీక్షించుకుంటూ మార్పు చేర్పులు చేసేసరికి మరింత ఆలస్యం అయింది. ఫలితంగా కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందో రాష్ట్రానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా పట్టణాభివృద్ధి సంస్థల పెంపు నేపథ్యంలో, ఎన్ని పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.
అంటే తాజా నిర్ణయం మేరకు పట్టణ ప్రాంత ఇళ్ల సంఖ్యను తేల్చాల్సి ఉంది. ఆ మేరకు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి వివరాలు క్రోడీకరించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఎన్ని యూనిట్లను మంజూరు చేస్తుందో ఆ తర్వాతే తేలుతుంది. అప్పుడే కేంద్రం నుంచి వచ్చే సాయంపై స్పష్టత వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఆ సాయం భారీగా పెరుగుతుందని మాత్రం తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment