కేంద్రానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
పీఎంఏవైలో ఎక్కువ నిధులు పొందే యోచన
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఊతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రాంతం పట్టణీకరణ చెందిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలోని 28 పట్టణాభివృద్ధి సంస్థల జాబితాతోపాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాల వివరాలను అందజేసింది. గతంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలే ఉండగా, పట్టణీకరణ నేపథ్యంలో వాటిని 28కి పెంచిన ఉత్తర్వుల ప్రతులను కూడా జత చేసింది.
పట్టణ ప్రాంతాల సంఖ్య, పరిధి బాగా పెరిగినందున ఈసారి ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) పథకం కింద రాష్ట్రానికి ఇళ్ల యూనిట్ల సంఖ్యను పెంచాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి భారీగా నిధులు పొందే ఉద్దేశంతో ఈ వివరాలను అందజేసింది.
రూ.6 వేల కోట్లు అందేలా..
ఇందిరమ్మ పథకం కింద తొలుత 4.20 లక్షల ఇళ్లను పేదలకు ప్రభుత్వం ఇవ్వబోతోంది. వీటి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారంగానే ఉండనుంది. దీంతో కేంద్రం నుంచి ఎన్ని ఎక్కువ నిధులు అందితే అంత భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా, గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్‌ను రూ.72 వేలుగా ఖరారు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం ఇచ్చే పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నర అందితే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. మొదటి విడతలో కేంద్రం నుంచి రూ.6 వేల కోట్ల నిధులు అందుతాయని అంచనా వేస్తోంది. రాష్ట్ర వినతిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముందు ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను అందజేయాలని కోరింది.
సంక్రాంతి నాటికి జాబితా..
ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం అర్హుల గుర్తింపు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌లో సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నారు. గతంలో ప్రజా పాలన పథకం కింద అందిన 80.54 లక్షల దరఖాస్తుల వివరాలను దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి నమోదు చేస్తు న్నారు. దీంతో ఆటోమేటిక్‌గా అర్హుల జాబితా ను యాప్ సిద్ధం చేస్తుంది.
ఈ ప్రక్రియ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే వివరాలను కేంద్రం రూపొందించిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ వివరాలను కేంద్రప్రభుత్వం సరిచూసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యూనిట్లను మంజూరు చేసి నిధులు విడుదల చేస్తుంది.
సమగ్రంగా వివరాల సేకరణ
దరఖాస్తు పత్రాల్లో నమోదు చేసిన వివరాలు కాకుండా, దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు రాబట్టి యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఏడు ప్రశ్నలకు జవాబులుగా వాటిని సేకరిస్తున్నా.. గతంలో వారి కుటుంబాల్లో ఎవరికైనా పక్కా ఇంటి పథకం కింద లబ్ధి చేకూరిందేమో నన్న అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇల్లు వచ్చినవారు ఆ కుటుంబాల్లో ఉంటే ఆ దరఖాస్తును అనర్హమైందిగా తేలుస్తారు.
ఇక ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు రేషన్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్‌కార్డు నంబర్ ద్వారా ఇతర ఆర్థికపరమైన లావాదేవీలతో సరిపోల్చుకునే కసరత్తు కూడా జరుగుతోంది. వెరసి అనర్హులు ఎవరికీ పొరపాటున కూడా జాబితాలో చోటు దక్కుకుండా చూస్తున్నారు. అనర్హులను గుర్తిస్తే నిధుల మంజూరులో కేంద్రం కొర్రీలు విధించే ప్రమాదం ఉండటమే దీనికి కారణం.
పేదల్లో అతి పేదలను గుర్తించేందుకు కొన్ని మార్కులు కేటాయిస్తున్నారు. ఆ మార్కులు ఎక్కువగా వచ్చిన దరఖాస్తులకు ర్యాంకులు ఇచ్చి మొదటి 4.20 లక్షల ర్యాంకులను ఎంపిక చేయనున్నారు. వారినే లబ్ధిదారులుగా గ్రామ సభల ముందు ఉంచి చర్చించి ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment