
అభిప్రాయం
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని తెలంగాణ (Telangana) ప్రజలు గుర్తించారు. పథకాల అమలులో జరుగుతున్న అవకతవకలను, సాచివేత ధోరణిని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను నిలదీస్తు న్నారు. ప్రభుత్వ భూసేకరణపై లగచర్ల (Lagcherla) లాంటి గ్రామాలు కదం తొక్కాయి. ఏకంగా కలెక్టర్ సహా ఉన్నతాధికారులను అడ్డుకొని తమ నిరసన తెలియజేశారు. కేసులు, జైళ్లను లెక్కచేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ ఊరుకోలేదు. రేషన్ కార్డులు, (Ration Cards) ‘రైతు భరోసా’, ‘ఆత్మీయ భరోసా’, ‘ఇందిరమ్మ ఇండ్లు’... ఇలా అనేక పథకాల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభల్లోనే (Grama Sabha) దరఖాస్తులు తీసుకోవటం వల్ల గందరగోళం ఏర్పడుతుందన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి లేదు.
కేవలం వీటి గురించే కాకుండా ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీ’ల గురించీ నిలదీస్తున్నారు. ‘కల్యాణ లక్ష్మి’ స్థానంలో తీసుకవచ్చిన ‘తులం బంగారం’ పథకం ఎప్పుడు అమలు చేస్తారని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ‘రైతు భరోసా’, రుణమాఫీ, ‘మహాలక్ష్మి’ పథకం ఇంకా అమలు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని ప్రజలు అడిగితే ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు. గ్రామ సభల్లోంచి ఎమ్మెల్యేలు మధ్యలోనే వెళ్లిపోవటం ప్రభుత్వం దుఃస్థితికి అద్దం పడుతోంది. పోలీసు పహారా మధ్య సభల్ని నిర్వహించినా ప్రజలు ఏమాత్రం భయపడటం లేదు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏడాది పాలనకే ఇంతలా భయపడితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ పార్టీ నాయకులు ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్ల గలరా అన్నది ప్రశ్న.
లబ్ధిదారుల ఎంపిక చూస్తే... లోపభూయిష్ఠంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్ కార్డును ఆధారంగా చేసుకోవటం అతిపెద్ద సమస్య. ఇంటి జాగా గ్రామంలో ఉండి... వాళ్లు పట్టణంలో నివసించి, ఆధార్ కార్డు పొందితే వాళ్లు అనర్హులవుతారు. ఈ కారణంగా గ్రామసభల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజాపాలనలో, కులగణనలో తీసుకున్న వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకోవటం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం కల్గించటానికేనని ప్రజలు అనుమానిస్తున్నారు.
ఇక ‘ఆత్మీయ భరోసా’ విధివిధానాలపై పల్లె జనం భగ్గుమంటున్నారు. గత సంవత్సరంలో 20 రోజులు ‘ఉపాధి హామీ’ పనికి వెళ్లిన వారికే భరోసా ఇస్తామంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు కూలీలందరికీ ఇస్తామని చెప్పినకాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మోసం చేస్తున్నారన్న ఆవేదన రైతు కూలీల్లో ఉంది. మున్సి పాల్టీల్లో విలీనమైన గ్రామాలకు ఉపాధి హామీ పథకం వర్తించదు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతాల్లోని వాళ్లు వ్యవసాయంపై ఆధారపడే జీవిస్తున్నారు. వీళ్లు ఏరకంగా ఆత్మీయ భరోసాకు అనర్హులవుతారో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆధార్, బ్యాంకు లింక్ లేని కారణంగా చాలా కార్డులు తొలగింపునకు గురయ్యాయి. లక్షలాదిమంది దగ్గరలోని పట్టణాలు, హైదరాబాద్‌లో మెరుగైన కూలీ కోసం తాత్కాలికంగా వెళ్లిన వలసకూలీలు ఉపాధి పనులకు వెళ్లలేదు. కొందరు వర్షాకాలం, యాసంగి పంటలకు మాత్రమే ఊళ్లోకి వస్తారు. జీవనపోరాటంలో తలమునకలవుతున్న వీళ్లంతా ఏవిధంగా అనర్హులవుతారు?
చదవండి: ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇన్ని నిరసనలు ఏ ప్రభుత్వమూ ఎదుర్కొని ఉండదు. పాలనలో ఎలాంటి అనుభవం లేని రేవంత్ రెడ్డి ఈ నిరసనల్ని ఎదుర్కోవటానికి పోలీసుల్ని ఆశ్రయించటమే పెద్ద సమస్య. ఏ ప్రజాపోరాటాల్నీ, నిరసనల్నీ బల ప్రయోగం ద్వారా ఎదుర్కోలేమన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతివాడూ ఆకలినైనా సహిస్తాడు, కానీ మోసాన్ని ఎండగడతాడు!
- డాక్టర్ బీఎన్ రావు
బీఎన్ రావు ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్