Urbanization
-
చల్లని రేయే వేడెక్కెనులే!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చల్లని రాత్రులు కరువవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని 140కి పైగా భారత నగరాల్లో 60 శాతానికి పైగా రాత్రులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బృందం జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. నేచర్ సిటీస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిళ్లు పెరుగుతున్న వేడిమి వర్షపాతం, కాలుష్యంతో సహా వాతావరణంలోని ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్‌కోట్ నగరాలు తీవ్ర పట్టణ ప్రభావ రాత్రులను అనుభవిస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, పూణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వేడి రాత్రుల తాకిడి బాగానే ఉంది. అర్బన్ హీట్ ఐలాండ్‌కు పట్టణీకరణే కారణం అర్బన్ హీట్ ఐలాండ్‌కు విపరీతమైన పట్టణీకరణే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించారు. పట్టణీకరణలో భాగంగా కాంక్రీటు, తారు (రోడ్లు, పేవ్మెంట్లను నిర్మాణాలతో) ఉపరితలాలు పగటిపూట వేడిని గ్రహించి నిల్వ చేసి, సాయంత్రం ఆ వేడిమిని తిరిగి బయటకు విడుదల చేస్తాయి. తద్వారా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. గత రెండు దశాబ్దాలుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి పట్టణీకరణ, స్థానిక వాతావరణ మార్పు ఎంతవరకు దోహదపడిందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిచారు. 37.73 శాతం పట్టణీకరణ జరిగితే దశాబ్దానికి సగటున 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాయువ్య, ఈశాన్య భారతంలోనే.. దేశంలోని వాయువ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువ పెరుగుదల కనిపించింది. వేగవంతమైన అభివృద్ధి, పట్టణాల విస్తరణ వేగంగా జరుగుతున్న తూర్పు, మధ్య భారతీయ నగరాల్లో కూడా రాత్రిపూట వేడి పెరుగుతోందని తేల్చారు. రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి సగటున 0.53 డిగ్రీలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల నగరాలకే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా ప్రతి దశాబ్దానికి సగటున 0.26 డిగ్రీలు పెరుగుతున్నట్లు గుర్తించారు. అంటే దేశం మొత్తం వేడెక్కుతున్న రేటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయని నివేదిక సూచిస్తోంది. 2050 నాటికి పట్టణాల్లో 80 కోట్ల మందిపెరిగిన మానవ కార్యకలాపాలు, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక ఉత్పత్తి అధిక స్థాయిలో గ్రీన్హౌస్ వాయువులకు దోహదం చేస్తున్నాయి. ఇవి పట్టణాల్లో పగటితో పాటు రాత్రిళ్లు వేడిమిని మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 2050 నాటికి దేశ జనాభాలో పట్టణ జనాభా 68 శాతానికి చేరుతుందని అధ్యయనం పేర్కొనడం మరింత ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) ఇండియా రాస్ సెంటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. ప్రస్తుతం దేశ జనాభాలో 36 శాతం అంటే దాదాపు 40 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటే.. ఇది 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇది రాత్రి వేడిమి మరింత పెరగడానికి దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లోనూ పచ్చదనం పెంపు ద్వారా పగటి వేడిని నిరోధించవచ్చని, రాత్రిపూట వేడిని నిరోధించడానికి ఈ విధానం పనికిరాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా భారీ భవంతులు, తారు, సిమెంట్ రోడ్లతో కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడం, చెరువులు కనుమరుగు కావడంతో రాత్రిపూట నగరాలు అస్సలు చల్లబడట్లేదని న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక సైతం వెల్లడించడం గమనార్హం. -
నగరాలు.. నిండుతున్నాయ్! టాప్–35 మహా నగరాల్లోకి హైదరాబాద్
అవకాశాల కల్పన,హక్కుల పరిరక్షణ,సుస్థిర భవిష్యత్..ఈ మూడు అంశాలే ప్రధానఎజెండాగా ముందుకు వెళ్లాలని ప్రపంచ జనాభా దినోత్సవంసందర్భంగా ఐక్యరాజ్యసమితి (2023, జూలై 11) ప్రపంచానికి పిలుపునిచ్చింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన, సౌకర్యాల కల్పన వంటివి జనాభా పెరుగుదల సగటుకంటే వేగంగా జరగాలని కూడా నిర్ధేశించింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి ఏదైనా జనం పట్టణాలు, నగరాల వైపే చూస్తున్నారు. క్రమంగా వలస బాట పడుతున్నారు. దీనితో తెలంగాణలో పట్టణ జనాభా శాతం ఏడాదికేడాది పెరిగిపోతూ వస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ జనాభాలో సగానికి పైగా పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని ‘నేషనల్ పాపులేషన్ రిపోర్ట్–2023’ అంచనా వేసింది. అర్బన్ జనాభా శాతం జాతీయ సగటు కంటే.. తెలంగాణలో 12 శాతం అధికంగా ఉంది. గత తొమ్మిదేళ్లలోనే ఏకంగా 8.61శాతం జనం పల్లెలను విడిచి పట్టణాలకు చేరారు. ఇది వచ్చే రెండేళ్లలో మరింత పెరుగుతుందని.. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో పెరుగుదల రేటు భారీగా ఉండొచ్చని అంచనా వేశారు. హైదరాబాద్ మహానగర జనాభా వచ్చే రెండేళ్లలో కోటికి మించిపోతుందని, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్–35 మహా నగరాల జాబితాలో చేరుతుందని పేర్కొంటున్నారు. వరంగల్ నగరం పది లక్షలు, ఆపై జనాభా ఉన్న నగరాల జాబితాలో చేరుతుందని అంటున్నారు. అవకాశాలు, భవిష్యత్తే అసలు సమస్య తెలంగాణ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలు, బిహార్, యూపీ వంటి ఉత్తర భారత రాష్ట్రాలు, పలు ఈశాన్య రాష్ట్రాల వారు కూడా ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో మౌలిక సదుపాయాల సమస్య తలెత్తుతోంది. భారీగా పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా సదుపాయాల కల్పన వేగం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజారవాణాలో వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం ట్రాఫిక్ ఇబ్బందులకు దారి తీస్తోంది. విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూగర్భ, వరద నీటి ప్రవాహ డ్రైనేజీలు లేక, ఉన్నవాటిని ఆధునీకరించక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా నగరం స్తంభించిపోయే పరిస్థితి నెలకొంటోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని 1,476 మురికివాడల్లో ఉన్న పది లక్షల మందికిపైగా ప్రజలు గౌరవ ప్రద నివాసాలకు నోచుకోలేదని.. ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను సిద్ధం చేసినా దరఖాస్తుదారులు పదిలక్షలకు పైగానే ఉన్నారని ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల కింద చేపట్టిన పనులు ఐదేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. నగరాల స్పీడ్,వసతులు ఇలా.. ప్రస్తుతం దేశ జనాభాలో 35.1 శాతం అర్బన్ జనాభా ఉంటే.. తెలంగాణలో ఇది 47.6 శాతం. 2036 నాటికి అర్బన్ జనాభా జాతీయ స్థాయి లో 39.1 శాతానికి చేరితే.. తెలంగాణలో 57.3 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో అర్బన్ జనాభా దేశంలోనే అత్యధికంగా 18శాతం పెరుగుతుందని పాపులేషన్ రిపోర్టులో పేర్కొన్నారు. తెలంగాణలో 2014లో అర్బన్ పాపులేషన్39శాతం కాగా.. 2023 చివరి నాటికి 47.61శాతానికి,2025 నాటికి 50శాతానికి చేరుతుందని అంచనా. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం గత తొమ్మిదేళ్లలో 1.21 లక్షల కోట్లను ఖర్చుచేశారు. ఈ నిధులతో భద్రమైన రహదారులు, ప్రజారవాణా, మంచినీరు, మురుగు నీటి శుద్ధి వంటి పనులు చేశారు. సదుపాయాల కల్పనలో వేగం లేదు తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా జనాభా పెరుగుతున్నంత వేగంగా శిక్షణ, ఉపాధి, కనీస అవసరాల కల్పన లేదు. పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి బాగాలేదు. మహిళల అభ్యున్నతికి అవసరమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు లభించటం లేదు. మహానగరం అంటే ఫ్లైఓవర్లు, సుందరీకరణ పనులు కాదు. అన్ని రకాల ప్రజలు గౌరవంగా జీవించే పరిస్థితి ఉండాలి. ఇప్పటికైనా తక్షణ ప్లానింగ్, పక్కాగా అమలు చేయడం మంచిది. - కరుణా గోపాల్, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ సిటీస్ హైదరాబాద్‌ను అత్యుత్తమ నగరంగా .. జాతీయ సగటును మించి తెలంగాణలో పట్టణ జనాభా పెరుగుతోంది. ఈ దిశగా ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సౌకర్యాలు సమకూరుస్తున్నాం. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం రూ.1.21 లక్షల కోట్ల వ్యయం చేశాం. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల, స్థిరమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం తదితర నగరాల్లోనూ విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాం. - అరవింద్‌కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్–పట్టణాభివృద్ధిశాఖ మాస్టర్ ప్లాన్లు తక్షణ అవసరం తెలంగాణలో నగరాలు, పట్టణాలు జనంతో నిండిపోతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగటం లేదు. హైదరాబాద్‌లో అయితే సహజసిద్ధ వనరులన్నీ ధ్వంసం అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లు, కాలనీలు, అపార్ట్మెంట్ల సెల్లార్లు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడమే దీనికి కారణం. హైదరాబాద్‌కు మోక్షగుండం విశ్వశ్వేరయ్య ఇచ్చిన ప్లాన్ తప్ప కొత్త ప్లాన్ తీసుకురాలేదు. కొత్త ప్లాన్ తక్షణ అవసరం. - పి.తిమ్మారెడ్డి,టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ -
Arvind, IAS Opinion : పట్టణీకరణలో ఒక మెట్టు పైనే!
సహజ వనరులపై ఆధారపడిన ప్రాథమిక రంగం వాటా తగ్గి... ఉత్పత్తి, సేవల రంగం వాటా పెరిగిన ఆర్థిక వ్యవస్థలో పట్టణీ కరణ అనివార్యం అవుతుంది. పట్టణాలు ఆర్థికవృద్ధికి ఇంజిన్లు అవుతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి, ఆదాయ స్థాయులు అనేక రెట్లు అధికం అవుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కువ. ‘తెలంగాణ సోషియో, ఎకనమిక్ అవుట్‌లుక్ 2022’ నివేదిక ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా వాటా జాతీయ సగటు అయిన 31.16 కన్నా ఎక్కువగా 48.6 శాతంగా ఉంది. ఇది దేశంలోని మొదటి మూడు పట్టణీకరణ రాష్ట్రాలలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపింది. తమిళనాడు 48.45 శాతం, కేరళ 47.23 శాతం, మహారాష్ట్ర 45.23 శాతం పట్టణ జనాభాను కలిగి ఉన్నాయి. సంతోషకరమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో పట్టణీకరణ వేగం కూడా దేశంలోని ఇతర ప్రాంతాలకంటే ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ GSDP (స్థూల రాష్ట్ర జాతీయోత్పతి) శీఘ్ర శిఖర గమనానికీ, తెలంగాణలో ఉద్యోగావకాశాల పెరుగుదలకూ సూచిక. 2028 నాటికి తెలంగాణ 50 శాతం కంటే ఎక్కువగా పట్టణ జనాభాను కలిగి ఉంటుందని అంచనా. ఒక్క హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమరేషన్ (HUA – హైదరాబాద్ సహా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం) లోనే అప్పటికి రాష్ట్ర జనాభాలో కనీసం 40 శాతం ఉంటారు. మన పట్టణీకరణ మాత్రమే కాదు, మన GSDP కూడా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువగా వృద్ధి చెందుతోంది అనడానికి ఇది నిదర్శనం. ప్రణాళికాబద్ధంగా పటిష్ఠమైన పట్టణీకరణను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వాటిలో కొన్ని. ఎ) ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అపరిమితంగా ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ను ఆమోదిస్తోంది. అంటే భవన నిర్మాణ స్థలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే సదుపాయం. ఇది పట్టణ ప్రాంతాలలో నిటారు వృద్ధిని సూచిస్తుంది. అగ్ని మాపక భద్రత, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ ప్రభావ అంచనాల పరంగా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుని నిర్మాణాన్ని ప్లాన్ చేసేందుకు అపరిమిత FSI వీలు కల్పిస్తుంది. బి) టి.ఎస్–బి.పాస్: తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన TS-B Pass (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణతోనే భవన నిర్మాణానికి అను మతిని మంజూరు చేస్తోంది. ఇందులో 600 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు తక్షణమే, అంతకు మించి ఉంటే 21 రోజుల లోపు అనుమతులు లభిస్తాయి. ఇందు కోసం ఏ అధికారినీ నేరుగా కలవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు. 2.1 లక్షల భవన నిర్మాణ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం జరిగింది. సి) ఇన్నొవేటివ్ ప్రాజెక్ట్ ఫండింగ్ మెకానిజం: ఏదైనా మౌలిక సదుపాయాల పనిని చేపట్టాలంటే పట్టణ స్థానిక సంస్థలకు ఇన్ఫ్రా నిధులు అవసరం. అందుకే జి.హెచ్.ఎం.సి. రహదారులకు ఇరు వైపుల భవన నిర్మాణ ఛార్జీలు, ఆస్తిపన్ను వాటికవే పెరిగేలా ఒక మెకానిజంను తీసుకొచ్చింది. దాంతో స్థానిక సంస్థల ఆదాయం మెరుగై ఆ పరిధిలోని భవన నిర్మాణాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. డి) ప్రాజెక్ట్ ఆధారిత SPVలు : పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారి ప్రాజె క్టులకే పూర్తిగా నిర్దేశించిన SPV (స్పెషల్ పర్పస్ వెహికిల్ – ప్రాజెక్టు నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన వ్యవస్థ)లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1. రెండు వైపులా దారి ఉన్న ప్రధాన వాహన మార్గాల్లో రద్దీని తగ్గిస్తూ, అదే సమయంలో సగటు వాహన వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ అర్బన్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) పథకానికి రూపకల్పన చేసింది. 2. రోడ్డు మార్గాలను గుర్తించడం, కొత్త లింకు రోడ్లను వేయడం ద్వారా ఇన్ఫ్రా పెట్టుబడికి గరిష్ఠ విలువను తీసుకురావడమే లక్ష్యంగా 2017లో ‘హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్’ (HRDC)ను ఏర్పాటు చేసింది. 3. కాంప్రెహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రాజెక్టు (CRMP) కింద హైదరాబాద్‌లోని 930 కి.మీ.ల ముఖ్యమైన ప్రధాన ఆర్డెరియల్ రోడ్లు (మూడు లేదా అంతకంటే ఎక్కువ లైన్లు ఉన్నవి) గుర్తించి ప్రైవేట్ ఇన్ఫ్రా ఏజెన్సీలకు ఓపెన్ బిడ్ ద్వారా అప్పగించింది. 4. స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ (SNDP) కింద నీటి వనరుల పరస్పర అనుసంధానం కోసం, వరద ముంపు ప్రమాదాన్ని నివారించడానికి 2021లో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రాజధాని వరకే కాకుండా రాష్ట్ర స్థాయిలో పట్టణీ కరణను నడిపిస్తున్న కొన్ని ప్రణాళికలు కూడా ఎంతో కీలకమైనవి. 2019లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల చట్టం (TMA) పౌరులకు పార దర్శకంగా మున్సిపల్ సేవలు అందిస్తోంది. అలాగే మున్సిపల్ బడ్జెట్‌ను తయారు చేయడంలో, నిర్వహించ డంలో ఈ చట్టం వృత్తి నైపుణ్యాన్ని తెస్తుంది. మున్సిపల్ బడ్జెట్లో తప్పని సరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా ఉంటుంది. అన్ని మున్సిపల్ సేవలు అన్లైన్లో సమయానుకూలంగా జరిగిపోతుంటాయి. పట్టణ శ్వాసావరణ స్థలం ఏ విధంగానూ ప్రభావితం కాకుండా, వాస్తవానికి మరింత పెరగకుండా చూసేందుకు హైదరాబాద్ పరిసరాల్లో 19 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు (అభి వృద్ధి చేయాలనుకున్న మొత్తం 129లో) ఒక్కొక్కటి 500 నుంచి 2,500 ఎకరాలలో విస్తరించాయి. ఇవి హరితా వరణాన్ని, వారాంతపు విహార అనుభూతులను అందిస్తు న్నాయి. హైదరాబాద్ సహా అన్ని ULB (అర్బన్ లోకల్ బాడీ)లలో గత దశాబ్దంలో గ్రీన్ కవర్ పెరిగింది. 2020, 2021లలో హైదరాబాద్ రెండుసార్లు ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ఎంపిక అయింది. ది ఆర్బర్ డే ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ వారి FAO నుండి రెండుసార్లు భారతీయ విజేతగా నిలిచిన ఏకైక నగరం హైదరాబాద్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన AIPH వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు – 2022ను కూడా హైదరాబాద్ గెలుచుకుంది. భవిష్యత్తులోనూ తెలంగాణలో పట్టణాభివృద్ధి అత్యంత వేగంగా ఉండబోతోంది. పట్టణీకరణ జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది. ప్రజలకు సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాలను బలమైన భద్రతను అందిస్తోంది. వారిని ఆర్థిక, సామాజిక సాధికారత వైపు నడిపిస్తోంది. గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తోంది. అరవింద్ కుమార్, IAS తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్), మెట్రోపాలిటన్ కమిషనర్ (HMDA) -
అందనంత దూరాన ఆవాసం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ గృహాల కొరతను తీవ్రం చేస్తోంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో 1.9 కోట్ల గృహాల కొరత ఉంటే.. 2030 నాటికి ఇది 3.8 కోట్లుగా ఉండనుందని పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర గృహ, పట్టణ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా దాదాపు నాలుగు కోట్ల గృహాల కొరత ఏర్పడుతుందని పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో దాదాపు 36 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తుండగా, నిపుణులు సైతం ఇదే అంచనా వేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తుండడమే పట్టణీకరణకు ప్రధాన కారణమని, గ్రామీణ ప్రాంతాల నుంచి సామాన్య జనం నగరాల బాట పడుతున్నారని చెబుతున్నారు. భూముల ధరలు,నిర్మాణ వ్యయం పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు అమాంతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సొంతంగా ఓ గూడు దొరకడం గగనమవుతోంది. పట్టణాలు, నగరాల్లో వివాద రహిత భూములు లేకపోవడం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ఆచరణ సాధ్యమైన రెంటల్ మార్కెట్ లేకపోవడం తదితర అంశాలు గృహాల కొరతకు కారణమవుతున్నాయి, అందరికీ అందుబాటు ధరలో గృహాలు ఉండేందుకు వీలుగా భూముల ధరలు, నిర్మాణ వ్యయం తగ్గేలా చర్యలు తీసుకోవడమేగాక, ఆర్థిక సహకారం కూడా అందిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పట్టణాల్లో ఒకప్పుడు భారీగా స్థలాలు సేకరించిన పలు కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకుని రాలేకపోయాయి. అలాంటి స్థలాలను గృహ నిర్మాణ రంగానికి కేటాయిస్తే పరిస్థితులు మెరుగు అవుతాయని అంటున్నారు. సింగిల్ విండో పద్ధతి బెటర్.. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు త్వరగా అనుమతులు రావడానికి వీలుగా సింగిల్ విండో పద్ధతిని కూడా అమలు చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ‘రెరా’(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) అనుమతుల పేరిట కొంతవరకు అలాంటి వెసులుబాటు వచ్చినా.. అది భారీ ప్రాజెక్టులకు మాత్రమే ఉపయోగపడుతోంది. మధ్య, దిగువ తరగతులకు అనుకూలంగా గృహాల నిర్మాణానికి అవసరమైన లే అవుట్లు, ఇళ్ల నిర్మాణానికి సులువుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అనుమతుల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, సకాలంలో అనుమతులు రాక నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడం వల్ల కూడా పేదలకు గృహాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం, క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం కేవలం ఆర్థికంగా వెనుకబడిన, దిగువ ఆదాయ వర్గాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని, వీటిని మధ్యాదాయ వర్గాలకు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మౌలిక సదుపాయాలూ సమస్యే.. గ్రామీణ ప్రాంతాల నుంచి 2030 నాటికి అదనంగా 8.33 కోట్ల మంది ప్రజలు నగరాలకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క గృహవసతే కాకుండా పరిశుభ్రమైన నీరు, ముగురునీటి పారుదల, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. పట్టణాలు, నగర జనాభాలో 17% మంది (అల్పాదాయ వర్గాలు) మురికివాడల్లోనే నివసిస్తున్నట్లు అంచనా. 71 శాతం ప్రజలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. 60 శాతం ప్రజలకు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ ఉంటే.. మరుగుదొడ్ల సౌకర్యం లేని మురికివాడలు సైతం ఉన్నాయి. గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలకు వస్తున్న వారి ఆదాయాల్లో మార్పుల కారణంగా నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భూ సేకరణ వ్యయానికీప్రోత్సాహకాలు ఇవ్వాలి అందుబాటులో ఉండే గృహాలకు సంబంధించి నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ఆకర్షించేందుకు కేంద్రం పలు రాయితీలను ప్రకటించింది. పన్ను ప్రోత్సాహకాలతో డెవలపర్లను, వడ్డీ రాయితీలతో కొనుగోలుదారులను సంతృప్తి పరుస్తోంది. అయితే ప్రధాన నగరాల్లో ఈ ప్రాజెక్టులకు భూమి సేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. అందువల్ల కేంద్రం ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ వ్యయాలపై కూడా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. – అన్షుల్ జైన్, ఎండీ, కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా మౌలిక వసతులు కల్పించాలి నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా గృహాలను నిర్మించాలంటే స్థలం కొరత ప్రధాన సమస్య. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అలా వెళ్లాలంటే శివారుల్లో ముందుగా రహదారులు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. హైదరాబాద్ డెవలపర్ల విషయానికొస్తే.. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు గ్రిడ్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయాలి. అప్పుడే ఓఆర్ఆర్ పరిధిలో ఈ తరహా గృహాల నిర్మాణం ఊపందుకుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి. స్థానిక సంస్థల ఫీజులను తగ్గించాలి. – శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ నెరవేరని పీఎంఏవై లక్ష్యం పీఎంఏవై పథకం కింద 2015 నుంచి 2022 మధ్య మొత్తంగా 1.23 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు లబ్ది దారులకు అప్పగించింది అందులో సగమే. 61 లక్షల గృహాలను మాత్రమే అందించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్షలో బయటపడింది. వాస్తవానికి 1.07 కోట్ల గృహాల పనులు ప్రారంభించినా.. అన్నీ పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు లేని కారణంగా 5.61 గృహాలను లబ్ది దారులకు అందించలేకపోవడం గమనార్హం. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల వాటాతో పాటు లబ్ధిదారుల వాటా కూడా ఉంటుంది. అయితే పలు రాష్ట్రాలు తమ వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీగుర్తించింది. -
భారత్‌లో ఇంధనానికి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్‌లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్ డిమాండ్‌లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ మొత్తం ఇంధన డిమాండ్‌లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది. శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్‌గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్‌కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంధనాల వారీగా డిమాండ్.. ► భారత్‌లో 2030 నాటికి బొగ్గు డిమాండ్ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది. ► చమురుకి డిమాండ్ 2021కి రోజువారీగా 4.7 మిలియన్ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. ► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి. ► సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 115 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్ వాటా 5 శాతంగానే ఉంటుంది. ► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. -
పోయిన వారందరూ తిరిగి రావలసిందే.. నాన్న చెప్పింది నిజమే అన్పిస్తోంది!
న్యూయార్క్ నగరం. అమెరికాలో జనాభా పరంగా నెంబర్ వన్ సిటీ. నెంబర్ టు లాస్ ఏంజెల్స్ నాగరానికంటే రెట్టింపు జనాభా! నాలుగు వందల సంవత్సరాల చరిత్ర. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. కానీ.. కరోనా పాండెమిక్ సమయంలో... అంతకు మించి ఇప్పుడు..... వేలాది మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారు. కారణాలు 1. నెలసరి ఆదాయం అద్దెకు సరిపోతుంది.. లేదా సరిపోదు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్.. అద్దెలు అతి భారీ స్థాయిలో. నెలకు మూడున్నర వేల డాలర్లు. అంటే సుమారుగా రెండు లక్షల ఎనభై వేలు. విల్లాకు కాదండీ... సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె. సంపాదనంతా అద్దెకు పోతుంది. ఇక బతికేదెట్టా? 2 . తీవ్ర స్థాయిలో ఆర్థిక అసమానతలు . ప్రపంచ కుబేరులు ఇక్కడే . అతి తక్కువ ఆదాయం ఉన్న వారు , నిరుద్యోగులు భారీ సంఖ్యలో .. క్రైమ్ రేట్ భయపెట్టేలా. ౩. ట్రాఫిక్ జామ్స్ , కాలుష్యం 4. కారు ఎక్కడైనా పార్క్ చేయాలంటే గంటకు కనీసం 50 డాలర్లు, కొన్ని సార్లు వందకు పైగా...! పెరుగుట విరుగుట కొరకే.. నగరీకరణ ఒక స్థాయికి మించితే ఏమి జరుగుతుందో న్యూయార్క్ ఒక ఉదాహరణ. టోక్యో మరో రకం.. పెద్ద సంఖ్యలో న్యూ యార్క్ నగరాన్ని వదిలి పెట్టి వెళుతున్న ప్రజలు .. గ్రామాలకు , చిన్న నగరాలకు వలస . మన దేశంలో కూడా ముంబై, ఢిల్లీ , కోల్‌కతా , ఒక విధంగా బెంగళూరు ఇదే స్థితికి చేరుకున్నాయనిపిస్తుంది. మా అమ్మ నాన్న టీచర్ లు . చుట్టుపక్కల చాలా మంది బెంగళూరులో ప్లాట్స్ కొనుక్కొని వలస వెళ్లిపోయారు. మా నాన్న మా సొంత ఊళ్ళో పొలం కొన్నాడు . ‘‘అందరూ నగరాలకు వెళుతుంటే ఇదేంటి నువ్వు గ్రామం లో పొలం కొంటున్నావు?" అని అడిగా. "పోయినవారందరూ తిరిగి రావలసిందే" అన్నాడు . అయన మాటలు ఇన్నాళ్లు వాస్తవం దాల్చలేదు కానీ .. ఇప్పుడు నెమ్మదిగా ట్రెండ్..... రివర్స్ మైగ్రేషన్ అనిపిస్తోంది. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
తెలంగాణకు పట్టణ కళ
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణలో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఎంతగా అంటే.. 2025 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నీతిఆయోగ్ వెల్లడించింది. ఇక్కడ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదిక వివరాలను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని పట్టణ జనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతంగా ఉండగా.. తెలంగాణ మొత్తం జనాభాలో 46.8 శాతంగా నమోదైంది. ఈ అంశంలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. పట్టణీకరణ వేంగంగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు మొత్తం జనాభాలో సగటున 48.45 శాతం పట్టణ జనాభాను నమోదు చేస్తే, కేరళలో 47.23 శాతంగా నమోదైంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 45.23 శాతంతో ఉంది. కాగా, వచ్చే మూడేళ్లలో తెలంగాణ పట్టణ జనాభా తమిళనాడు, కేరళను దాటి తొలి స్థానానికి చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్ర జీడీపీలో మూడింట రెండొంతుల వాటా పట్టణాల్లోనే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే ఆర్థిక కార్యకలాపాల ప్రభావంతో ఉపాధి, ఆదాయ స్థాయిలు అధికంగా ఉంటాయని నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్యను 142కు పెంచారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల్లో మౌలికవసతులు మెరుగుపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు అధికంగా జరగడంతో రాష్ట్ర జీడీపీలో మూడింట రెండు వంతుల వాటాను పట్టణాలే అందిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో విద్య, ఉపాధి అవకాశాలు, మంచి జీవన స్థితిగతులు ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి కారణమవుతున్నాయి. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక‘లో దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. పట్టణ ప్రాంతాలలో జనాభా పెరుగుదల రాష్ట్రాన్ని పట్టణీకరణలో ప్రధాన సాధకంగా మారుస్తుండగా, 2025 నాటికి తెలంగాణ రాష్ట్రం యాభై శాతం పట్టణ జనాభా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేశారు. 2050 నాటికి దేశంలో ఇదే తరహా పట్టణీకరణ ప్రక్రియ సాగుతుందని, తద్వారా తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రెండున్నర దశాబ్దాలు ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్ అన్ని రకాల ప్రమాణాల్లో మేటిగా ఉండటం కూడా రాష్ట్రం పట్టణీకరణలో ముందుండడానికి కారణంగా చెపుతున్నారు. అన్ని సూచికల్లో హైదరాబాద్ టాప్ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం అన్ని సూచికల్లో అగ్రభాగాన కొనసాగుతోంది. కొనుగోలు శక్తి సూచిక, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయం, ఆస్తి ధర మొదలు ఆదాయ నిష్పత్తి, ట్రాఫిక్ ప్రయాణ సమయం, కాలుష్యం/వాతావరణ సూచికలో హైదరాబాద్ నగరం ముందంజలో ఉంది. ఇటువంటి పలు అంశాలతో హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలిచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. -
'పల్లె' వించిన పట్టణీకరణ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలయ్యాయి.. పట్టణాలకు ఆనుకుని ఉన్న పల్లెలు వాటిలో అంతర్భాగమయ్యాయి. గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనువుగా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పట్టణ స్థానిక సంస్థలుగా మారడంతోపాటు తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 15 మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని.. అభివృద్ధికి వినియోగించుకోవడంతో ఆయా గ్రామాల స్థాయి పెరిగింది. జిల్లాలవారీగా కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలు ఇవే.. అనంతపురం జిల్లాలోని కోనపురం, వెంకటరెడ్డిపల్లిని కలిపి పెనుగొండ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ని 2020 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇదే నెలలో పలు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ► చిత్తూరు జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంలో సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా మార్చారు. ఇదే జిల్లాలో జనాభా పరంగా పెద్దదైన బి.కొత్తకోట కూడా యూఎల్‌బీగా మారింది. ► గుంటూరు జిల్లాలోని గురజాల, జంగమహేశ్వరపురం పంచాయతీలు కలిసి గురజాల మునిసిపాలిటీగా, దాచేపల్లి, నడికుడి గ్రామాలు కలిసి దాచేపల్లి మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► కృష్ణా జిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిసి కొండపల్లి మునిసిపాలిటీగా, తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలు కలిసి వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీగా ఏర్పాటయ్యాయి. ► కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బుగ్గనపల్లి కలిపి బేతంచర్ల యూఎల్‌బీగా ఏర్పాటు చేశారు. ► ప్రకాశం జిల్లాలోని పొదిలి, కంబాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలు కలిసి పొదిలి యూఎల్‌బీగా, దర్శి గ్రామ పంచాయతీ ఒక్కటీ మరో యూఎల్‌బీగా ఏర్పాటయ్యాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అల్లూరు, సింగంపేట, నార్త్ మోపూరు గ్రామాలు కలిసి అల్లూరు మునిసిపాలిటీగా, ఇదే జిల్లాలోని అవ్వేరు, కట్టుబడిపాలెం, ఇసకపాలెం, పల్లిపాలెం కలిసి బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, చింతలపూడి గ్రామ పంచాయతీలు వేర్వేరు పట్టణ స్థానిక సంస్థలుగా మారాయి. ► వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం గ్రామ పంచాయతీ సైతం యూఎల్‌బీగా మారింది. ► రాష్ట్రంలో కమలాపురం, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, బేతంచర్ల, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, కుప్పం, పెనుగొండ మునిసిపాలిటీలు 2020 జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటయ్యాయి. చింతలపూడి, అల్లూరు, పొదిలి, వైఎస్సార్ తాడిగడప, బి.కొత్తకోట మునిసిపాలిటీలను 2021లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్లో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా, 2021లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో 23 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో సమీపంలోని గ్రామాలను విలీనం చేసి ఆయా పంచాయతీల స్థాయి పెంచింది. శ్రీకాకుళం మునిసిపాలిటీలో ఏడు పంచాయతీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పది పంచాయతీలు, భీమిలి మునిసిపాలిటీలో ఐదు పంచాయతీలు, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. అదేవిధంగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఐదు పంచాయతీల చొప్పున, తణుకు, భీమవరం మునిసిపాలిటీల్లో మూడు పంచాయతీల చొప్పున కలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలు, జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీలు, నాయుడుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాలు, మరో పంచాయతీని కలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో అత్యధికంగా 21 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బాపట్ల మునిసిపాలిటీ సమీపంలో వెలసిన కొన్ని కొత్త ప్రాంతాలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి దాని స్థాయిని పెంచారు. అదేవిధంగా పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లోనూ పదుల సంఖ్యలో గ్రామాలను, సమీప కాలనీలను విలీనం చేశారు. కర్నూలు కార్పొరేషన్లో సైతం మూడు సమీప పంచాయతీలను కలిపారు. నంద్యాల మునిసిపాలిటీలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కొంత భాగాన్ని విలీనం చేశారు. ఇక పుంగనూరు మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాన్ని, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలను కలిపారు. -
పర్యావరణాన్ని పణంగా పెట్టకుండా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాబోయే 50 ఏళ్లలో మానవాళి చరిత్రలోనే ముందెన్నడూ లేనంత అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడంపై, పరిష్కార మార్గాలపై ప్రభుత్వాలు ఇ ప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఇన్నోవేషన్స్ అండ్ న్యూ నాలెడ్జ్ ఇన్ వాటర్, శానిటేషన్, హైజీన్‌పై మూడో వార్షిక సదస్సు (ఇంక్ వాష్ 3.0) శుక్రవారం ముగిసింది. కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మెరుగైన అవకాశాల కోసం వలసలు ‘జాతిపిత గాంధీ చెప్పినట్లు గ్రామాల్లోనే భారతదేశం ఉంది. కానీ భారత్‌ను ఆర్థికంగా ముందుకు నడుపుతోంది నగరాలు, పట్టణాలు మాత్రమే. తెలంగాణను ఉదాహరణగా తీసుకుంటే 46 శాతం జనాభా పట్టణాల్లో, 54 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. నాలుగో వంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉండగా, జీఎస్డీపీలో 45 నుంచి 50 శాతం వాటా ఇక్కడి నుంచే వస్తోంది. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నగరాలే ఆయా దేశాలకు అభివృద్ధి ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. మెరుగైన ఉపాధి, ఆర్థిక, విద్య, ఆరోగ్య అవకాశా లు, నాణ్యమైన జీవితం కోసం పట్టణాలకు వలస లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పట్టణీకరణతో పెరిగే పర్యావరణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణాన్ని çపణంగా పెట్టకుండా అభివృద్ధి సాధించాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వాష్’తో ఎంతోమందికి ఉపాధి ‘మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం దేశంలో లక్షలాది మందికి ఉపా ధి అవకాశాలు కల్పించిన రీతిలోనే భవిష్యత్తులో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (వాష్) రంగాల్లో అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఈ రంగాల్లో యువ ఆవిష్కర్తలు చేసే కృషితో ఉపాధి అవకాశా లు, సంపద సృష్టికి మార్గం దొరుకుతుంది. మానవ మలం నుంచి ఎరువుల తయారీ మొదలుకుని, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం వరకు ఆవిష్క ర్తలు కనిపెట్టే కొత్త ఉత్పత్తులకు తెలంగాణ ప్రభుత్వం మొదటి వినియోగదారుగా ఉంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. పరిశుభ్రత, పారిశుధ్యంపై పిల్లలకు ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని, ఇది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా, రాష్ట్ర పురపాలక శాఖ భాగస్వామ్యంతో జరిగిన ఈ ‘ఇంక్ వాష్ 3.0’సదస్సులో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాల్లో పనిచేస్తున్న ఆవిష్కర్తలతో పాటు విద్యా సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 120కి పైగా ఆవిష్కరణలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ముగింపు సదస్సులో ఆస్కి చైర్మన్ కె.పద్మనాభయ్య, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర, రాష్ట్రేతర నగరపాలక సంస్థల మేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
పల్లె జనం పట్టణ బాట
సాక్షి, అమరావతి: పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు. చదువుకొని, నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగాలు చేసుకొంటూ పట్టణాల పరిధిలో నివాసం ఉంటుంటే.. సాంకేతిక నైపుణ్యాలు లేని వారు ఏదో ఒక పని చేసుకొంటూ పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా స్థానిక సంస్థలకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పట్టణీకరణను సంతరించుకుంటున్నాయని, దీనివల్ల పట్టణీకరణ మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలు విస్తరిస్తాయని తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ఎజెండా అయిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్–2030 (ఎస్డీజీ) కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నట్టు పేర్కొంది. జీడీపీలో 60 శాతం పట్టణాలదే దేశంలో 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 53కు చేరుకుంటాయని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా. అంతేగాక పట్టణాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగిందని, 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుందని పేర్కొంది. కాగా భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది. పట్టణాల ముందు సవాళ్లూ ఉన్నాయ్.. వేగవంతమైన పట్టణీకరణ తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది. పాక్షిక పట్టణీకరణ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి సరఫరా, మురుగునీరు, డ్రైనేజీ నెట్వర్క్, ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు, రహదారులు, ప్రజా రవాణా, వీధి దీపాలు, పాదచారుల మార్గాలు వంటి ప్రజా భద్రతా వ్యవస్థలు వంటి ప్రాథమిక సేవలు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి, నివాస సౌకర్యాలు కల్పించడం సాధ్యపడటంలేదని తేల్చింది. -
ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..?
సీతంపేట (విశాఖ ఉత్తర): ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లో చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచ కిచలు నేడు కరువయ్యాయి. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. చదవండి: అద్భుతాలు సృష్టించి.. వాటికే బలై.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా? పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంట్లో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహా్మ్రస్తాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‌తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కలి్పస్తున్నారు, ఏ ఏడాది ‘ఐ లవ్ స్పారో’ థీమ్‌తో వరల్డ్ స్పారో డే నిర్వహిస్తున్నారు. వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు ,కళాశాలల్లో అవేర్నెస్ క్యాంపైన్స్, , వ్యాసరచన, సమావేశలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 23 ఏళ్లుగా కృషి చేస్తున్నాం పట్టణీకరణ, కాలుష్యం, రేడియేషన్ కారణంగా సున్నితమైన పిచ్చుక సంతంతి నానాటికీ తగ్గిపోతోంది. పిచ్చుకలు మానవాళికి ఎంతో ప్రయోజకరమైనవి. పిచ్చుకల పరిరక్షణకు 2000 సంవత్సరంలో గ్రీన్ క్లైమేట్ సంస్థను స్థాపించి 23 ఏళ్లుగా వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాం. సభలు, సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పిచ్చుకల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణకు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని వివరిస్తున్నాం. ఈ విధంగా గ్రీన్ క్లైమేట్ టీం వేలాది మంది విద్యార్థులకు , యువతకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు అవగాహన కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు వెళ్లి పిచ్చుకల పరిరక్షణకు ఏం చెయ్యాలో అవగాహన కల్పించి విద్యార్థులను భాగస్వామ్యం చేశాం. పిచ్చుకలు కనిపించే ప్రాంతాలకు వెళ్లి వాటిని కాపాడటానికి గూళ్లు, ఆహారం, నీరు ఏర్పాటు చెయ్యమని చైతన్య పరిచాం. 2002లో చెక్కతో తయారు చేసిన పిచ్చుకల గూళ్లు నగర ప్రజలకు పరిచయం చేసి విరివిగా ఏర్పాటు చెయ్యాలని ప్రచారం చేశాం. అలాగే 2005లో మట్టితో చేసిన గూళ్లు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చి ఇంటి పరిసరాలలో ఉంచాలని అవగాహన కల్పించాం. టీమ్ సభ్యుల సుదీర్ఘ కృషితో విశాఖనగరంలో ప్రస్తుతం 280 ప్రాంతాలలో పిచ్చుకలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు తమ ఇళ్ల బాల్కనీలు, మెట్ల కింద మట్టితో చేసిన గూళ్లు, ఆహారం, నీళ్లు ఏర్పాటు చెయ్యాలి. –జేవీ రత్నం, వ్యవస్థాపకుడు, గ్రీన్ క్లైమేట్ సంస్థ పిచ్చుకల అవసరం ఎంతో ఉంది పెదవాల్తేరు (విశాఖ తూర్పు): పిచ్చుకలను పరరిక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకుడు జేవీ రత్నం, పేర్కొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని శనివారం చినవాల్తేరులో గల –జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది పిచ్చుకల దినోత్సవం ఇతివృత్తం ‘నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను’ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో దినోత్సవాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీ.కృష్ణవేణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారు పిచ్చుకలను పరిరక్షిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చుకల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. వాటికి నివాసయోగ్యంగా ప్రజలు సౌకర్యాలు కల్పించాలి. డోడో పక్షి అంతరిస్తే జరిగిన నష్టం మనం తెలుసుకున్నాం. అందుకే మన ఇంటి చుట్టు ఉన్న పిచ్చుకలను కాపాడుకోవాలి. పిచ్చుకలవల్ల మన ఇంటికి, వ్యవసాయానికి మేలుజరుగుతుంది. –ఈయూబీ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, పర్యావరణ విభాగం ఆహారం..నీరు అందించాలి పిచ్చుకలు అంతరించిపోతే పంటలకు హానికలుగుతుందని గ్రహించాలి. మనకు, పంటలకు హానికలిగించే క్రిమి కీటకాలను నివారించే సున్నితమైన పక్షి. మనం పిచ్చుక జాతిని పరిరక్షించుకోవాలి, పిచ్చుకల ఆవశ్యకతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వాటి మనుగడకు అవసరమైన గూళ్లు, ఆహారం, నీరు ఇంటి పరిసరాలలో అందుబాటులో ఉంచాలి. ఇతర జీవుల వల్ల వాటి సంతతికి నష్టం కలగకుండా చూడాలి. – హేమలత, జువాలజీ లెక్చరర్ సంతతి తగ్గుముఖం పిచ్చుకల సంఖ్య ఘనణీయంగా తగ్గిపోయింది. పిచ్చుకల సంతతి పెరిగేలా చేపట్టాల్సిన చర్యలపై భావితరాలకు అవగాహన కలి్పంచాలి. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల ఆవశ్యకతపై అవగాహన కలి్పంచి వాటి పరిరక్షణలో భాగస్వామ్యం చెయ్యాలి. పిచ్చుకల రక్షణ బాధ్యత పూర్తిగా మనదే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. – సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత కులపతి, కృష్ణా యూనివర్సిటీ -
ఏడాదికో కొత్త షికాగో నిర్మిస్తేనే!
న్యూయార్క్: పట్టణీకరణ విషయంలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు 2030 వరకు ఏడాదికో కొత్త షికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. 2030 కల్లా భారత జనాభాలో 40%మంది పట్టణాల్లో నివసిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సమ్మిళిత అభివృద్ధిపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హర్దీప్ మాట్లాడారు. భారత పట్టణీకరణ లక్ష్యాలను చేరుకునేందుకు నేటినుంచి 2030 వరకు ప్రతి ఏటా 70 నుంచి 90 కోట్ల చదరపు మీటర్ల పట్టణాభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. మిషన్ 2030లో భాగంగా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే పట్టణీకరణ కోసం 70% కొత్త మౌలికవసతులను భారత్ ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని పురీ తెలిపారు. 1947లో భారత జనాభాలో 17% పట్టణాల్లో నివసిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30% ఉంది. 2030 కల్లా ఇది 40%కు చేరవచ్చని అంచనా. -
పల్లె నుంచి పట్నానికి
మారుతున్న సామాజిక పరిస్థితులు గ్రామాలపై ప్రభావం చూపుతున్నాయి. ఉపాధి, అభివృద్ధి కారణాలతో గ్రామీణ జనాభాలో ఎక్కువ మంది పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఉపాధి, చదువుల కోసం జనం తరలి వస్తున్నారు. పాత జిల్లా కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. మొత్తంగా దశాబ్దకాలంలోనే పట్టణ జనాభా 36 శాతం పెరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని అర్థగణాంక శాఖ రూపొందించింది. 2001లో రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 98.53 లక్షలు ఉండగా.. 2011లో 1.36 కోట్లకు పెరిగింది. 100 శాతం పట్టణ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నివసిస్తున్నారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ పట్టణీకరణ జరుగుతున్నా గ్రామాల్లోనే.. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా ఇప్పటికీ గ్రామాల్లోనే జనాభా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా 31.51 లక్షల మంది వ్యవసాయంలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో కూలీ చేస్తూ ఉపాధి పొందుతున్నవారు 59.15 లక్షల మంది. 2015–16లో 21.80 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల పంటలు సాగవగా.. 51.45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాలు 62 శాతం ఉండగా.. 1–2 హెక్టార్ల వరకు సాగు భూమి ఉన్నవి 23.9 శాతం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కమతాల సగటు విస్తీర్ణం 1.12 హెక్టార్లుగానే ఉంది. 1.86 కోట్లు.. ఏ పనీ చేయనివారు రాష్ట్రంలో 1.63 కోట్ల మంది ప్రధాన వృత్తులతో ఉపాధి పొందుతున్నారు. ఏడాదిలో 183.. అంత కంటే ఎక్కువ రోజులు పని చేసేవారు 1.37 లక్షలు. వీరిలో 22.42 లక్షల మంది ఎస్సీలు, 14.58 లక్షల మంది ఎస్టీలు. ఇక ఓ మోస్తరు పనులతో 26.22 లక్షల మంది.. కుటీర పరిశ్రమలతో 7.77 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం, వృత్తి పనులు, మోస్తరు పనులతో కాకుండా మిగిలిన రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారు 64.99 లక్షలు. ఏ పనీ చేయని వారు 1.86 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మహిళలే ఎక్కువగా.. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు అదుపులో ఉంది. జాతీయ స్థాయిలో వృద్ధి 17.70 శాతం ఉండగా.. తెలంగాణలో 13.58 శాతమే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో స్త్రీ, పురుష జనాభాలో అంతరం బాగా తగ్గుతోంది. ప్రతి 1,000 మంది పురుషులకు 988 మంది మహిళలుండగా.. 11 జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. నిర్మల్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,046 మంది మహిళలున్నారు. 1,044 మందితో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. రంగారెడ్డిలో 1,000 మంది పురుషులకు 950 మంది మాత్రమే మహిళలున్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38.99 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 11.14 శాతం. ఎస్సీలు 15.45, ఎస్టీలు 9.08 శాతం రాష్ట్రంలో సామాజిక పరిస్థితుల పరంగానూ మార్పులు కనిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54.08 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 15.45 శాతం. ఎస్సీ జనాభాలో స్త్రీ, పురుష నిష్పత్తి మెరుగ్గా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,008 మంది మహిళలున్నారు. ఇక రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31.77 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. ఎస్టీల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 977 మంది స్త్రీలు ఉన్నారు. మానవాభివృద్ధిలో మెదక్ లాస్ట్.. ప్రజల్లో జీవన స్థితిగతులు తెలిపే మానవాభివృద్ధి సూచిక అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2015–16 అంచనాలను నివేదికలో పేర్కొన్నారు. మానవాభివృద్ధి సూచిక రాష్ట్ర సగటు 0.595గా ఉంది. సూచికలో హైదరాబాద్ (0.82 శాతం)తో తొలిస్థానంలో నిలవగా.. రంగారెడ్డి (0.71 శాతం), ఖమ్మం (0.62 శాతం) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. -
పట్టణీకరణతోనే పేదరిక నిర్మూలన
స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పుణెలో 14 ప్రాజెక్టులకు శ్రీకారం నగరాల్ని వేగంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత నగరాభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం పెరగాలి: మోదీ పుణే: పేదరిక నిర్మూలనకు పట్టణీకరణ ఒక అవకాశమని, అది సమస్య కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా పుణేలో శనివారం ఆయన 14 ప్రాజెక్టులనుప్రారంభించారు. ఇతర స్మార్ట్ నగరాలకు సంబంధించి 69 పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒకప్పుడు పట్టణీకరణను సమస్యగా భావించేవారని, తాను అలా అనుకోవడం లేదన్నారు. ‘ఆర్థిక రంగానికి చెందిన వారు నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా భావిస్తారు. పేదరికాన్ని రూపుమాపే సామర్థ్యం వేటికైనా ఉన్నాయంటే అవి నగరాలు మాత్రమే. అందుకే ప్రజలు వెనుకబడ్డ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్తూ అవకాశాలు అందుకుంటున్నారు. వీలైనంతమేర పేదరికాన్ని రూపుమాపడానికి నగరాల్ని బలోపేతం చేయడం ఇప్పుడు మన బాధ్యత.. ఇది తక్కువ సమయంలో జరగాలి. అభివృద్ధి కోసం కొత్త మార్గాల్ని జతచేయాలి. అదేమీ కష్టమైన పని కాదు, సాధ్యమే’ అని మోదీ చెప్పారు. అభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం కీలకం నగరాల అభివృద్ధి కోసం సమగ్ర, ఒకదాని కొకటి అనుసంధానమైన, లక్ష్య శుద్ధితో కూడిన విధానాన్ని అవలంబించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం కీలకమని... నగరాల్లో నివసించే ప్రజలే వారి ప్రాంతాల్ని ఎలా అభివృద్ధి చేయాలో నిర్ణయించాలన్నారు. వాటిని ఢిల్లీలోని నేతలు తీసుకోకూడదని చెప్పారు. స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రణాళిక నిర్ణయాల్లో ప్రజా భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. నగరాల్ని అభివృద్ధికి ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తీవ్ర పోటీ అవసరమని గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని తిరోగమనంలో నడిపించాయని, తమ ప్రభుత్వం ప్రగతి కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ‘స్మార్ట్ సిటీస్‌ను అలంకారంగా కాకుండా పేద ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే మిషన్‌గా చూడాలి. సమగ్ర పద్దతిలో నగర ప్రాంత పేదలకు ఇళ్లు కల్పించడం మొదలైనవి ఇందులో భాగం. స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా నాణ్యమైన పాలన, ప్రజా సేవల కోసం డిజిటల్ సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలి. స్మార్ట్ సిటీస్ పై 25 లక్షలకు పైగా ప్రజలు అంకితభావంతో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగరాభివృద్ధికి గత ప్రభుత్వాల హయాంలో ఖర్చుపెట్టలేదు. భారత్ కన్నా వెనకాల స్వాతంత్య్రం సంపాదించుకున్న దేశాలు తక్కువ సమయంలో మనల్ని దాటి వెళ్లిపోయాయి. 125 కోట్ల మంది ప్రజల బలాల్ని మంచి పని కోసం వాడితే... వాళ్ల నైపుణ్యాల్ని ఉపయోగిస్తే... అద్భుతాలు చేయగలరు. అప్పుడు ప్రభుత్వాల అవసరం ఉండదు... ప్రపంచం తనంతట తాను ముందుకు దూసుకుపోతుంది’ అని మోదీ చెప్పారు. ప్రధానిని కలసిన బాలిక.. ప్రధాని కార్యాలయం సాయంతో గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆరేళ్ల బాలిక వైశాలి.. ప్రధాని మోదీని పుణేలో కలుసుకుంది. వైశాలిని కలుసుకున్న ఫొటోల్ని మోదీ ట్వీటర్లో పోస్టు చేశారు. దేశ చరిత్రలోనే ఇదొక మలుపు: వెంకయ్య నాయుడు శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... గతంలో కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎదురుచూసేదని, ఇప్పుడు ఆలోచనల్ని అందించే వారి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. శుభ్రత పాటించాలంటూ ప్రజల్ని కోరడం అనే ఆలోచన వల్లే స్వచ్ఛ్ భారత్ విజయవంతమైందన్నారు. పట్టణ ప్రాంతాల్లో వ ర్థ్యాల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మేక్ యువర్ సిటీ స్మార్ట్ పోటీని ప్రారంభించారు. నగరాల్లో రోడ్లు, కూడళ్లు, బహిరంగ స్థలాల నమూనాల్ని ప్రజలు ఈ పోటీ ద్వారా పంచుకోవచ్చు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశ చరిత్రలో ఇదొక మలుపు అని, ప్రధాని ప్రారంభించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నగర పునరుజ్జీవనంలో తొలి అడుగు అని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీస్ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్ సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు బాబు సుప్రియో, ప్రకాశ్ జవదేకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భూతాపం కాదు.. కోరుకున్న శాపం
విశ్లేషణ నగరానికి పచ్చని ఊపిరితిత్తులుగా పిలిచే హరిత ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న పట్టణీకరణ వేగం రేటుకు భారీగా తుడిచిపెట్టుకుపోతోంది. నగరాల ఉష్ణోగ్రతలు పెరగడం దాని సహజ పర్యవసానమే. పట్టణీకరణ ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగిపోవడానికి దారి తీస్తోంది. జీడీపీ వృద్ధిని పెంపొందింపజేయడానికి పట్టణీకరణ మాత్రమే సులువైన మార్గమని భావిస్తున్న పౌరులే ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఫిర్యాదు చేయడంలోని సహేతుకత ఏమిటో నాకైతే బోధపడటం లేదు. దాన్ని కోరుకున్నది మీరే కదా! రాజస్థాన్‌లోని చిన్న పట్టణం పాలోడిలో ఎండలు 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరి దేశంలో ఎన్నడూ ఎరుగని అత్యధిక ఉష్ణోగ్రతగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఏది ఏమైనా ఈ ఏప్రిల్ నెల ఎన్నడూ ఎరుగనంతటి అత్యధిక ఉష్ణోగ్రతల మాసంగా నిలిచింది. వరుసగా ఏడు నెలలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇవి మనం గర్వించదగ్గ రికార్డులేమీ కావు. పైగా, ఆర్థిక వృద్ధి పచ్చటి చెట్లను కొట్టేస్తుంటే ఎవరూ ఏ మాత్రం పట్టింపు చూపని వాతావారణాన్ని ఎలా సృష్టించిందనే విషయాన్ని ఇవి సూచనప్రాయంగా వెల్లడి చేస్తున్నాయి. పచ్చదనం ఉన్న ప్రాంతం లేదా హరిత కవచం క్షీణతకు పరోక్షాను పాతంలో ఉష్ణోగ్రతలలో పెరుగుదల సంభవిస్తోంది. ఎంత ఎక్కువగా చెట్లను నరికేస్తే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉంటోంది. 51 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ తరచూ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటుతుండే వాయవ్య ప్రాంతాలలో నివసించాను. అంతటి తీవ్ర ఉష్ణోగ్రతలలో సైతం దట్టమైన చెట్ల నడుమ నుంచి పోతున్నప్పుడు సాపేక్షికంగా చల్లటి గాలి తగులుతూ ఎంతో హాయిని గొలిపేది. ఉష్ణోగ్రతలోని ఆ తేడా కొట్టవచ్చిన ట్టు కనిపించేది. దట్టమైన చెట్ల నీడన ఉండే వేడి, బయటి రహదారిపై ఉండే వేడితో పోలిస్తే కనీసం 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండేది. 47 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లే ఢిల్లీ లాంటి కాంక్రీటు కీకారణ్యంలో సైతం పచ్చని ప్రాంతాన్ని పెంపొందింపజేయడం ద్వారా ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 4 డిగ్రీలు తగ్గితే కలిగే ఉపశమన ప్రభావాన్ని ఒక్కసారి ఊహించుకోండి. పెరిగి పోతున్న ఈ అధిక ఉష్ణోగ్రతలకు కారణంగా తప్పుపట్టాల్సింది భూతా పాన్ని కాదు, మిమ్మల్ని మీరే తప్పుపట్టుకోండి. నిర్దాక్షిణ్యంగా చెట్లను కొట్టిపారేస్తుంటే మీరు నోరు మెదపకుండా ఊరుకున్నారు. చెట్టుపై గొడ్డలి పెట్టు పెడితే... ఎలాగైనా అధిక వృద్ధి రేటును సాధించాలనే పోటీలో చెట్లను కొట్టేస్తుంటే మీలో ఎలాంటి ప్రతిస్పందనా కలగదు. దాన్ని మీరు అభివృద్ధి కోసం అనివార్యంగా చెల్లించాల్సిన మూల్యంగా పరిగణిస్తారు. మెట్రో నగరా లలో, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధాన రహదారులను రెండు లైన్ల నుంచి నాలుగు లెన్లకు, నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరింప జేయడం కోసం ఎక్కడబడితే అక్కడా నిర్దాక్షిణ్యంగా చెట్లను నరికేస్తు న్నారు. నివాస గృహ సముదాయాల కోసం నీటి వనరులను మటు మాయం చేసేస్తున్నారు, చెట్లను కొట్టేస్తున్నారు. ఇదంతా కలసి పట్టణ ‘ఉష్ణ ద్వీప’ ప్రభావంగా పిలిచే దానికి కారణమౌతోంది. నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత ఎక్కువగా ‘ఉష్ణ ద్వీపాలు’గా మారిపోతు న్నాయి. కాంక్రీటు భవనాలు/నిర్మాణాల కేంద్రీకరణ అధికమయ్యే కొద్దీ సౌర ఉష్ణ వికిరణమూ అధికమౌతుంది. జకీర్పూర్, భటిండాల మధ్య 200 కిలో మీటర్ల రహదారిని విస్తరింప జేయడంకోసం 96,000 చెట్లను నరికేసినందుకుగానూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల పంజాబ్ ప్రభుత్వానికి తాఖీదును పంపింది. అంతేగానీ ఇంత భారీ ఎత్తున చెట్లను కొట్టేస్తుంటే ప్రజల నుంచి లేదా పౌరుల నుంచి ఎలాంటి ఆందోళన కానరాకపోవడాన్ని చూస్తే నాకు గుబులు కలుగుతోంది. అభివృద్ధి కోసం చెట్లను కొట్టివేయడాన్ని మనం మౌనంగా అంగీకరిస్తున్నాం. ఒక చెట్టు నిలిచి ఉండటం వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏమీ పెరగదు. కానీ, దాన్ని కొట్టేస్తే మాత్రం జీడీపీ పెరుగుతుంది. చెట్లను కొట్టేసి సాధించే అధిక జీడీపీ కావాలా? లేక చెట్లు సుస్థిర జీవనంలో భాగంగా ఉండే విధమైన అభివృద్ధి కావాలా? అనేది ఇప్పుడు మీరే ఎంచుకోవాల్సి ఉంది. కాంక్రీటు కీకారణ్యాలు మండే కొలుములు పూర్తిగా పెరిగిన ఒక వేప చెట్టు కింద ఉష్ణోగ్రత తరచూ 10 డిగ్రీలు తక్కువగా ఉంటుందని నేషనల్ నీమ్ ఫౌండేషన్ చెబుతోంది. ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ (ఏప్రిల్ 24, 2016)లో ప్రచురితమైన ఒక ఆసక్తిక రమైన వ్యాసాన్ని చదివాను. అందులో రచయిత వివిధ నగరాలలోని హరిత ప్రాంతాలకు, నగర కేంద్రానికి మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలను గురించి తెలిపారు. ఉదాహరణకు, బెంగళూరులో జీకేవీకే వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపలా, ఆ క్యాంపస్‌కు సరిగ్గా వెలుపల ఉష్ణోగ్రతల మధ్య తేడా నాలుగు డిగ్రీలని పేర్కొన్నారు. మెజిస్టిక్ బస్ స్టాండ్‌లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సైతం ఆ సమీపంలోని పార్కులో అది 32 డిగ్రీలే ఉన్నది. బెంగళూరు నగరంలో పట్టణాభివృద్ధి అత్యంత వేగంగా సాగిందని ఎనర్జీ అండ్ వెట్లాండ్ రిసెర్చ్ గ్రూప్ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ)లకు చెందిన ప్రొఫెసర్ టీవీ రామచంద్ర బృందం జరిపిన అధ్యయనం తెలిపింది. ఆ నగరంలోని నిర్మిత ప్రాంతం నాలుగు దశాబ్దాలలో 584 శాతం పెరిగిందని ఆ పరిశో ధకులు 2012లో అంచనా కట్టారు. భారీ మూల్యం చెల్లించడం ద్వారానే ఇది సాధ్యమైందనేది సుస్పష్టమే. పచ్చని ప్రాంతం 66 శాతం మేరకు, ఉపరితల నీటి వనరులు 74 శాతం మేరకు తగ్గిపోయాయి. బెంగళూరు ఒకప్పటి ఆకర్షణను ఇప్పుడు పోగొట్టు కుంది. అస్తవ్యస్తమైన ఈ వృద్ధి గురించి చాలా మంది పౌరులు ఫిర్యాదులు చేశారని తెలిసింది. కానీ వాటిని పట్టించు కునేదెవరు? ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, ప్రణాళికావేత్తలంతా ఎప్పుడూ కోరుతున్న పట్టణీకరణ అదే. అభివృద్ధి చెందాలంటే కాంక్రీటు నగరాలే భవిష్యత్తని వారు ప్రజలను నమ్మించారు. కనుమరుగౌతున్న పచ్చదనం ఐఐఎస్సీ జరిపిన అధ్యయనాన్ని అత్యంత సులువుగా అర్థమయ్యే రీతిలో దత్తాంశాలపై ఆధారపడిన, ప్రజా ప్రయోజన పాత్రికేయ బృందం ‘ఇండియాస్పెండ్’ విశ్లేషించింది. భోపాల్‌లోని పచ్చటి చెట్ల ప్రాంతం గత 22 ఏళ్లలో 66 శాతం నుంచి 22 శాతానికి పడిపోయింది. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం. అందుకు బదులుగా, 2018 నాటికి అంటే మరో మూడేళ్ల కల్లా భోపాల్‌లోని హరిత ప్రాంతం 11 శాతానికి పడిపోనుంది. దీన్ని మీరు అభివృద్ధి అంటారనడం ఖాయం. అయితే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలకు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేయడానికి లేదు. గత రెండు దశాబ్దాలలో అహ్మదాబాద్‌లోని పచ్చని ప్రాంతం 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయింది. ఊపిరి బిగబట్టుకుని వినండి. మీరు ఇప్పటికే ఆహ్మదాబాద్‌లో నివసిస్తున్నా లేక అక్కడికి వెళ్లి స్థిరపడాలని భావిస్తున్నా ఒక్కసారి పునరాలోచించండి. 2030 నాటికి అహ్మదాబాద్‌లో మిగిలేది కేవలం 3 శాతం హరిత ప్రాంతమే. 2030 నాటికి కోల్‌కతాలో సైతం మిగిలే హరిత ప్రాంతం 3.7 శాతమే. ఇక హైదరాబాద్‌లో 2024 నాటికి కేవలం 1.84 శాతం ప్రాంతంలోనే పచ్చదనం మిగిలి ఉంటుంది. అది ఎంతో దూరంలో లేదు. నగరపు పచ్చని ఊపిరితిత్తులుగా పిలిచే హరిత ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న పట్టణీకరణ వేగం రేటును బట్టి చూస్తే స్పష్టంగానే భారీ ఎత్తున తుడిచి పెట్టుకుపోతుంది. నగర ఉష్ణోగ్రతలు పెరగడం దాని సహజ పర్య వసానమే. పట్టణీకరణ మొత్తం అంతటి ప్రభావం ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగిపోవడానికి దారితీస్తోంది. జీడీపీ వృద్ధిని పెంపొందింప జేయడానికి పట్టణీకరణ మాత్రమే సులువైన మార్గమని భావిస్తున్న పౌరులే ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఫిర్యాదు చేయడంలోని సహేతుకత ఏమిటో నాకైతే బోధపడటం లేదు. దాన్ని కోరుకున్నది మీరే కదా! వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com దేవిందర్‌శర్మ -
మృత్యురేఖలవుతున్న పట్టాలు
గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ముంబైకి సంబంధించిన పలు విషయాలు సాధార ణంగా భారీ సంఖ్యలతో కూడి ఉంటాయి. నగర జనాభా 1.24 కోట్లు. దాదాపు సగం జనాభా మురికివాడల్లో ఉంటూ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుంటుంది. నగరపాలక సంస్థకు చెందిన రవాణా శాఖ దాదాపు 4 వేల బస్సులను నడుపుతుంటుంది. దాని ప్రతిష్టాత్మకమైన స్థానిక రైళ్లు ప్రతిరోజూ 70 లక్షలమంది ప్రయాణికులను తీసుకుపోతుంటాయి. వీటిలో దాదాపు 2,913 రైళ్లు తమ తమ ట్రాక్‌లపై రోజుకు 20 గంటలపాటు సాగిపోతుంటాయి. నగరం లోపలినుంచే కాకుండా శివార్ల నుంచి ప్రయాణించి వచ్చే వారిని కూడా రెండు గంటలపాటు అటూ ఇటూ రవాణా చేస్తున్న రైల్వేలను ఈ అంశమే నగర ఆర్థిక కార్యాచరణలో కీలకంగా చేస్తోంది. ప్రయాణం మాత్రం అమానుషమైన పరిస్థితుల్లో సాగుతుంటుంది. పరిమితికి మించిన జనం రైళ్లలో ఏ స్థాయిలో కిక్కిరిసి ఉంటారంటే, రైల్వేలు దానికి కొత్త వ్యక్తీకరణను కూడా కనుగొనవలసి వచ్చింది. ఈ పరిస్థితిని ‘రద్దీవేళల్లో కిక్కిరిసిన జనం సూపర్ రాపిడి’ అంటూ రైల్వేలు పిలుస్తున్నాయి. కోచ్‌లలోకి ప్రవేశించే చోట, లోపలకి దూరడమో లేదా పడిపోవడమో తప్పదనిపించే స్థితిలో, కిందినుంచి రైల్లోకి ఎవరో ఒకరు తోసుకుని ప్రవేశించి మిమ్మల్ని అడ్డుకోకముందే మీరు రైల్లోంచి దిగాల్సి ఉంటుంది. రైలులోపల జనం పరస్పరం ఎంత దగ్గరగా కరుచుకుని ఉంటారంటే అది రోజువారీగా జరిగే నిర్బంధ ఉపద్రవాన్ని, పీడనను తలపిస్తుంది. రైల్లో సీటు దక్కించుకోవడం అంటే అది వరమే మరి. సీటు అంచులో కూర్చోవడానికి మీకు అవకాశం ఇస్తే మీ సహ ప్రయాణీకులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. రైలు లోపల మీరు పొందగలిగేది అదే. కాని అది ఇతరుల దయ మాత్రమే. సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ముంబై లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. కాలానుగుణంగా వాటి పొడవు కూడా పెరుగుతూ వస్తోంది. మొదట్లో ఇవి 9 కోచ్‌లతో ఉండగా తరవాత వీటి సంఖ్య 12 కోచ్‌లకు పెరిగింది. ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడం కోసం కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం కోచ్‌ల సంఖ్య 15కు పెరిగింది. కానీ నేటికీ ప్రయాణికులకు ఉపశమనం లేదు. రైలు ప్రయాణం ఇప్పటికీ అభద్రతతోనే సాగుతోంది. కిక్కిరిసి ఉండటం చేత ప్రయాణికులు రైళ్ల నుంచి పడిపోతుంటారు. అంటే కొంతమంది తలుపు అంచుల వద్ద కడ్డీని పట్టుకుని మునిగాళ్లపై వేలాడుతూ ప్రయాణిస్తుంటారని దీనర్థం. గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ఇక్కడ కేవలం రైల్వేనే నిందించడానికి లేదు. పాదచారులకోసం నిర్మించిన వంతెనలు చాలినంతగా లేవు. వీటిని సైతం రైల్వేలనే అంటిపెట్టుకుని ఉండే హ్యాకర్లు అడ్డుకుంటుంటారు. నిస్సందేహంగా అవసరం లేని సమయంలో పట్టాలు దాటేవారు తప్పు దారి పట్టినవారే అయి ఉంటారు. కొంతమంది తప్పుదారి పట్టిన కుర్రాళ్లు తమ సాహస ప్రవృత్తిని చాటుకునేందుకోసం రైలు తలుపుల వద్ద ఉన్న కడ్డీని పట్టుకుని వేలాడుతూ ఒకకాలిని ప్లాట్‌ఫాం మీద మోపి ప్రదర్శన చేస్తుంటారు. అయితే మృతుల జాబితాలో వీరి సంఖ్య పెద్దగా లేదు కాబట్టి రైలు ప్రమాద మృతుల సంఖ్య పెరగటానికి సంబంధించి ఇలాంటివారిపై నింద మోపలేము. పని స్థలానికి వెళ్లడానికి లేదా ఇళ్లకు వెళ్లడానికి ఆత్రుతగా ఉండే ప్రయాణికులు రైలు కదులుతున్నప్పుడు కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తర్వాతి రైలు కూడా తక్కువ రద్దీతో వస్తుందనడానికి లేదు. కాబట్టి రైల్వేలు తగిన నిర్వహణ వనరుల్లేక సతమతమవుతూ, ఆదివారం మరమ్మతుల కోసం కొన్ని సర్వీసులను మూసివేస్తున్నప్పటికీ, మెట్రోపాలిటన్ ప్రాంత జీవనరేఖగా పిలుస్తున్న స్థానిక రైళ్లలో భద్రత అనేది అత్యంత ఆవశ్యకమైనదిగా మారింది. కొత్తగా రూపొందించిన రైలుపెట్టెలు ఉండవలసిన దానికంటే ఎత్తుగా ఉండటంతో రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంలకు మధ్య ఖాళీలు ఉంటూ కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్పుడు కీలకమైన వివరణలు ఎలా పక్కకు పోతున్నా యన్న దాన్ని ఇంకా స్పష్టం చేయడం లేదు. ఇలా రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంకు మధ్య ఖాళీలవల్ల ప్రయాణికులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు జారిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు అడపాదడపా కాకుండా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగవు, వాటిని మనుషులే చేస్తారు అనే వాదనకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. అలాగే ఫుట్‌బోర్డు మీద నిలిచి ప్రయాణించేవారు కదులుతున్న రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. కానీ పశ్చిమ లేదా మధ్య రైల్వే ఇలాంటి వాటిని తమ తప్పిదంగా అంగీకరిస్తున్నట్లు లేదు. రైల్వే తన నిర్వహణా తీరును మెరుగుపర్చుకో వాలని ముంబై హైకోర్టు పదే పదే సూచిస్తోంది. తాజాగా ఒక ఘటనపై కోర్టు వ్యాఖ్యానిస్తూ, రైల్వే వ్యవస్థలో ఒక్క ప్రాణ నష్టం జరిగినా అది ఆమోదనీయ గణాంకం కాదని తేల్చి చెప్పింది. ఫ్లాట్‌ఫాంల ఎత్తును పెంచాలని, రైల్వే కారణంగా గాయపడిన వారికి రైల్వే స్టేషన్లలో వైద్య సౌకర్యం అందించాలని, రవాణా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తీసుకె ళ్లడానికి అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ముంబై కోర్టే తరచుగా రైల్వే శాఖకు చెపాల్సివస్తోంది. మొత్తంమీద చూస్తే, రైలు ప్రయాణికులకు రైల్వేలే ప్రయోజనం చేకూర్చాలని న్యాయస్థానాలు చెప్పాల్సి రావడమే ఒక విషాద గాథ. - మహేశ్ విజాపూర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
వలసలతో నెలకో లండన్‌ను నిర్మించొచ్చు
సిస్కో గ్లోబలైజేషన్ సంస్థ అధిపతి అనిల్ మీనన్ హైదరాబాద్: శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి గంటకు 1,000 మంది పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారని, ఈ జనాభాను ఒకదగ్గరికి చేర్చితే నెలరోజులకో లండన్ స్థాయి నగరాన్ని నిర్మించవచ్చని సిస్కో గ్లోబలైజేషన్ సంస్థ అధిపతి డాక్టర్ అనిల్ మీనన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల నగరాల్లో జననాల రేటు తక్కువగా, ఉన్నత జీవన ప్రమాణాల ఆశలు అధికం గా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ జనాభావృద్ధి రేటు ఎక్కువ ఉందని అన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అతి పెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సులో ‘‘భారత దేశం-100 స్మార్టు నగరాలు’’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన చర్చాగోష్టిలో అనిల్ మీనన్ మాట్లాడుతూ.. పౌరుల ప్రేరణ శక్తి, బలమైన రాజకీయ సంకల్పమే స్మార్టు నగరాల విజయానికి కీలకమని అన్నారు. నగర ప్రాంతాల్లో సుందర ఉద్యాన వనాలు, ఖాళీ స్థలాలకు ఏ లోటు ఉండకూడదని స్పెయిన్‌లోని బార్సిలోనా నగర ఉప మేయర్ ఆంటోని వైవ్స్ పేర్కొన్నారు. బార్సిలోనాలో ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల ఆకృతి మార్చి భారీ పరిమాణం గల ఉద్యానవనాలుగా తీర్చిదిద్దామని ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో అనుసంధానమై ఇరుగుపొరుగువారు పరస్పర సహాయ సహకారాలను అందించుకునే విధంగా బార్సిలోనాలో ఓ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి టోనీ న్యూవ్లింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.