సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ గృహాల కొరతను తీవ్రం చేస్తోంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో 1.9 కోట్ల గృహాల కొరత ఉంటే.. 2030 నాటికి ఇది 3.8 కోట్లుగా ఉండనుందని పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర గృహ, పట్టణ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా దాదాపు నాలుగు కోట్ల గృహాల కొరత ఏర్పడుతుందని పేర్కొంటోంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో దాదాపు 36 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తుండగా, నిపుణులు సైతం ఇదే అంచనా వేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తుండడమే పట్టణీకరణకు ప్రధాన కారణమని, గ్రామీణ ప్రాంతాల నుంచి సామాన్య జనం నగరాల బాట పడుతున్నారని చెబుతున్నారు.
భూముల ధరలు,నిర్మాణ వ్యయం పెరగడంతో..
పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు అమాంతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సొంతంగా ఓ గూడు దొరకడం గగనమవుతోంది. పట్టణాలు, నగరాల్లో వివాద రహిత భూములు లేకపోవడం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ఆచరణ సాధ్యమైన రెంటల్ మార్కెట్ లేకపోవడం తదితర అంశాలు గృహాల కొరతకు కారణమవుతున్నాయి, అందరికీ అందుబాటు ధరలో గృహాలు ఉండేందుకు వీలుగా భూముల ధరలు, నిర్మాణ వ్యయం తగ్గేలా చర్యలు తీసుకోవడమేగాక, ఆర్థిక సహకారం కూడా అందిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పట్టణాల్లో ఒకప్పుడు భారీగా స్థలాలు సేకరించిన పలు కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకుని రాలేకపోయాయి. అలాంటి స్థలాలను గృహ నిర్మాణ రంగానికి కేటాయిస్తే పరిస్థితులు మెరుగు అవుతాయని అంటున్నారు.
సింగిల్ విండో పద్ధతి బెటర్..
రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు త్వరగా అనుమతులు రావడానికి వీలుగా సింగిల్ విండో పద్ధతిని కూడా అమలు చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ‘రెరా’(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) అనుమతుల పేరిట కొంతవరకు అలాంటి వెసులుబాటు వచ్చినా.. అది భారీ ప్రాజెక్టులకు మాత్రమే ఉపయోగపడుతోంది. మధ్య, దిగువ తరగతులకు అనుకూలంగా గృహాల నిర్మాణానికి అవసరమైన లే అవుట్‌లు, ఇళ్ల నిర్మాణానికి సులువుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
అనుమతుల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, సకాలంలో అనుమతులు రాక నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడం వల్ల కూడా పేదలకు గృహాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం, క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం కేవలం ఆర్థికంగా వెనుకబడిన, దిగువ ఆదాయ వర్గాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని, వీటిని మధ్యాదాయ వర్గాలకు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మౌలిక సదుపాయాలూ సమస్యే..
గ్రామీణ ప్రాంతాల నుంచి 2030 నాటికి అదనంగా 8.33 కోట్ల మంది ప్రజలు నగరాలకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క గృహవసతే కాకుండా పరిశుభ్రమైన నీరు, ముగురునీటి పారుదల, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధాన సమస్యగా మారుతోంది.
పట్టణాలు, నగర జనాభాలో 17% మంది (అల్పాదాయ వర్గాలు) మురికివాడల్లోనే నివసిస్తున్నట్లు అంచనా. 71 శాతం ప్రజలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. 60 శాతం ప్రజలకు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ ఉంటే.. మరుగుదొడ్ల సౌకర్యం లేని మురికివాడలు సైతం ఉన్నాయి. గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలకు వస్తున్న వారి ఆదాయాల్లో మార్పుల కారణంగా నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
భూ సేకరణ వ్యయానికీప్రోత్సాహకాలు ఇవ్వాలి
అందుబాటులో ఉండే గృహాలకు సంబంధించి నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ఆకర్షించేందుకు కేంద్రం పలు రాయితీలను ప్రకటించింది. పన్ను ప్రోత్సాహకాలతో డెవలపర్లను, వడ్డీ రాయితీలతో కొనుగోలుదారులను సంతృప్తి పరుస్తోంది. అయితే ప్రధాన నగరాల్లో ఈ ప్రాజెక్టులకు భూమి సేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. అందువల్ల కేంద్రం ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ వ్యయాలపై కూడా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. – అన్షుల్ జైన్, ఎండీ, కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ ఇండియా
మౌలిక వసతులు కల్పించాలి
నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా గృహాలను నిర్మించాలంటే స్థలం కొరత ప్రధాన సమస్య. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అలా వెళ్లాలంటే శివారుల్లో ముందుగా రహదారులు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలి.
అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. హైదరాబాద్ డెవలపర్ల విషయానికొస్తే.. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు గ్రిడ్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయాలి. అప్పుడే ఓఆర్‌ఆర్ పరిధిలో ఈ తరహా గృహాల నిర్మాణం ఊపందుకుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి. స్థానిక సంస్థల ఫీజులను తగ్గించాలి. – శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్
నెరవేరని పీఎంఏవై లక్ష్యం
పీఎంఏవై పథకం కింద 2015 నుంచి 2022 మధ్య మొత్తంగా 1.23 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు లబ్ది దారులకు అప్పగించింది అందులో సగమే. 61 లక్షల గృహాలను మాత్రమే అందించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్షలో బయటపడింది.
వాస్తవానికి 1.07 కోట్ల గృహాల పనులు ప్రారంభించినా.. అన్నీ పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు లేని కారణంగా 5.61 గృహాలను లబ్ది దారులకు అందించలేకపోవడం గమనార్హం. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల వాటాతో పాటు లబ్ధిదారుల వాటా కూడా ఉంటుంది. అయితే పలు రాష్ట్రాలు తమ వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీగుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment