భూతాపం కాదు.. కోరుకున్న శాపం | GDP growth leads Urbanization, it causes tempatures hike | Sakshi
Sakshi News home page

భూతాపం కాదు.. కోరుకున్న శాపం

Published Wed, Jun 1 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

భూతాపం కాదు.. కోరుకున్న శాపం

భూతాపం కాదు.. కోరుకున్న శాపం

విశ్లేషణ
నగరానికి పచ్చని ఊపిరితిత్తులుగా పిలిచే హరిత ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న పట్టణీకరణ వేగం రేటుకు భారీగా తుడిచిపెట్టుకుపోతోంది. నగరాల ఉష్ణోగ్రతలు పెరగడం దాని సహజ పర్యవసానమే. పట్టణీకరణ ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగిపోవడానికి దారి తీస్తోంది. జీడీపీ వృద్ధిని పెంపొందింపజేయడానికి పట్టణీకరణ మాత్రమే సులువైన మార్గమని భావిస్తున్న పౌరులే ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఫిర్యాదు చేయడంలోని సహేతుకత ఏమిటో నాకైతే బోధపడటం లేదు. దాన్ని కోరుకున్నది మీరే కదా!

రాజస్థాన్‌లోని చిన్న పట్టణం పాలోడిలో ఎండలు 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరి దేశంలో ఎన్నడూ ఎరుగని అత్యధిక ఉష్ణోగ్రతగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఏది ఏమైనా ఈ ఏప్రిల్‌ నెల ఎన్నడూ ఎరుగనంతటి అత్యధిక ఉష్ణోగ్రతల మాసంగా నిలిచింది. వరుసగా ఏడు నెలలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇవి మనం గర్వించదగ్గ రికార్డులేమీ కావు. పైగా, ఆర్థిక వృద్ధి పచ్చటి చెట్లను కొట్టేస్తుంటే ఎవరూ ఏ మాత్రం పట్టింపు చూపని వాతావారణాన్ని ఎలా సృష్టించిందనే విషయాన్ని ఇవి సూచనప్రాయంగా వెల్లడి చేస్తున్నాయి.

పచ్చదనం ఉన్న ప్రాంతం లేదా హరిత కవచం క్షీణతకు పరోక్షాను పాతంలో ఉష్ణోగ్రతలలో పెరుగుదల సంభవిస్తోంది. ఎంత ఎక్కువగా చెట్లను నరికేస్తే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉంటోంది. 51 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ తరచూ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటుతుండే వాయవ్య ప్రాంతాలలో నివసించాను. అంతటి తీవ్ర ఉష్ణోగ్రతలలో సైతం దట్టమైన చెట్ల నడుమ నుంచి పోతున్నప్పుడు సాపేక్షికంగా చల్లటి గాలి తగులుతూ ఎంతో హాయిని గొలిపేది.

ఉష్ణోగ్రతలోని ఆ తేడా కొట్టవచ్చిన ట్టు కనిపించేది. దట్టమైన చెట్ల నీడన ఉండే వేడి, బయటి రహదారిపై ఉండే వేడితో పోలిస్తే కనీసం 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండేది. 47 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లే ఢిల్లీ లాంటి కాంక్రీటు కీకారణ్యంలో సైతం పచ్చని ప్రాంతాన్ని పెంపొందింపజేయడం ద్వారా ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 4 డిగ్రీలు తగ్గితే కలిగే ఉపశమన ప్రభావాన్ని ఒక్కసారి ఊహించుకోండి. పెరిగి పోతున్న ఈ అధిక ఉష్ణోగ్రతలకు కారణంగా తప్పుపట్టాల్సింది భూతా పాన్ని కాదు, మిమ్మల్ని మీరే తప్పుపట్టుకోండి. నిర్దాక్షిణ్యంగా చెట్లను కొట్టిపారేస్తుంటే మీరు నోరు మెదపకుండా ఊరుకున్నారు.

చెట్టుపై గొడ్డలి పెట్టు పెడితే...
ఎలాగైనా అధిక వృద్ధి రేటును సాధించాలనే పోటీలో చెట్లను కొట్టేస్తుంటే మీలో ఎలాంటి ప్రతిస్పందనా కలగదు. దాన్ని మీరు అభివృద్ధి కోసం అనివార్యంగా చెల్లించాల్సిన మూల్యంగా పరిగణిస్తారు. మెట్రో నగరా లలో, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధాన రహదారులను రెండు లైన్ల నుంచి నాలుగు లెన్లకు, నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరింప జేయడం కోసం ఎక్కడబడితే అక్కడా నిర్దాక్షిణ్యంగా చెట్లను నరికేస్తు న్నారు. నివాస గృహ సముదాయాల కోసం నీటి వనరులను మటు మాయం చేసేస్తున్నారు, చెట్లను కొట్టేస్తున్నారు. ఇదంతా కలసి పట్టణ  ‘ఉష్ణ ద్వీప’ ప్రభావంగా పిలిచే దానికి కారణమౌతోంది.  నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత ఎక్కువగా ‘ఉష్ణ ద్వీపాలు’గా మారిపోతు న్నాయి. కాంక్రీటు భవనాలు/నిర్మాణాల కేంద్రీకరణ అధికమయ్యే కొద్దీ సౌర ఉష్ణ వికిరణమూ అధికమౌతుంది.

 
జకీర్‌పూర్, భటిండాల మధ్య 200 కిలో మీటర్ల రహదారిని విస్తరింప జేయడంకోసం 96,000 చెట్లను నరికేసినందుకుగానూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వానికి తాఖీదును పంపింది. అంతేగానీ ఇంత భారీ ఎత్తున చెట్లను కొట్టేస్తుంటే ప్రజల నుంచి లేదా పౌరుల నుంచి ఎలాంటి ఆందోళన కానరాకపోవడాన్ని చూస్తే నాకు గుబులు కలుగుతోంది. అభివృద్ధి కోసం చెట్లను కొట్టివేయడాన్ని మనం మౌనంగా అంగీకరిస్తున్నాం. ఒక చెట్టు నిలిచి ఉండటం వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏమీ పెరగదు. కానీ, దాన్ని కొట్టేస్తే మాత్రం జీడీపీ పెరుగుతుంది. చెట్లను కొట్టేసి సాధించే అధిక జీడీపీ కావాలా? లేక చెట్లు సుస్థిర జీవనంలో భాగంగా ఉండే విధమైన అభివృద్ధి కావాలా? అనేది ఇప్పుడు మీరే ఎంచుకోవాల్సి ఉంది.

కాంక్రీటు కీకారణ్యాలు మండే కొలుములు
పూర్తిగా పెరిగిన ఒక వేప చెట్టు కింద ఉష్ణోగ్రత తరచూ 10 డిగ్రీలు తక్కువగా ఉంటుందని నేషనల్‌ నీమ్‌ ఫౌండేషన్‌ చెబుతోంది. ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (ఏప్రిల్‌ 24, 2016)లో ప్రచురితమైన ఒక ఆసక్తిక రమైన వ్యాసాన్ని చదివాను. అందులో రచయిత వివిధ నగరాలలోని హరిత ప్రాంతాలకు, నగర కేంద్రానికి మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలను గురించి తెలిపారు. ఉదాహరణకు, బెంగళూరులో జీకేవీకే వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపలా, ఆ క్యాంపస్‌కు సరిగ్గా వెలుపల ఉష్ణోగ్రతల మధ్య తేడా నాలుగు డిగ్రీలని పేర్కొన్నారు. మెజిస్టిక్‌ బస్‌ స్టాండ్‌లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సైతం ఆ సమీపంలోని పార్కులో అది 32 డిగ్రీలే ఉన్నది.

బెంగళూరు నగరంలో పట్టణాభివృద్ధి అత్యంత వేగంగా సాగిందని ఎనర్జీ అండ్‌ వెట్‌లాండ్‌ రిసెర్చ్‌ గ్రూప్‌ సెంటర్‌ ఫర్‌ ఎకలాజికల్‌ సైన్సెస్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ)లకు చెందిన ప్రొఫెసర్‌ టీవీ రామచంద్ర బృందం జరిపిన అధ్యయనం తెలిపింది. ఆ నగరంలోని నిర్మిత ప్రాంతం నాలుగు దశాబ్దాలలో 584 శాతం పెరిగిందని ఆ పరిశో ధకులు 2012లో అంచనా కట్టారు. భారీ మూల్యం చెల్లించడం ద్వారానే ఇది సాధ్యమైందనేది సుస్పష్టమే. పచ్చని ప్రాంతం 66 శాతం మేరకు, ఉపరితల నీటి వనరులు 74 శాతం మేరకు తగ్గిపోయాయి. బెంగళూరు ఒకప్పటి ఆకర్షణను ఇప్పుడు పోగొట్టు కుంది. అస్తవ్యస్తమైన ఈ వృద్ధి గురించి చాలా మంది పౌరులు ఫిర్యాదులు చేశారని తెలిసింది. కానీ వాటిని పట్టించు కునేదెవరు? ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, ప్రణాళికావేత్తలంతా ఎప్పుడూ కోరుతున్న పట్టణీకరణ అదే. అభివృద్ధి చెందాలంటే కాంక్రీటు నగరాలే భవిష్యత్తని వారు ప్రజలను నమ్మించారు.

కనుమరుగౌతున్న పచ్చదనం
ఐఐఎస్‌సీ జరిపిన అధ్యయనాన్ని అత్యంత సులువుగా అర్థమయ్యే రీతిలో దత్తాంశాలపై ఆధారపడిన, ప్రజా ప్రయోజన పాత్రికేయ బృందం ‘ఇండియాస్పెండ్‌’ విశ్లేషించింది. భోపాల్‌లోని పచ్చటి చెట్ల ప్రాంతం గత 22 ఏళ్లలో 66 శాతం నుంచి 22 శాతానికి పడిపోయింది. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం. అందుకు బదులుగా, 2018 నాటికి అంటే మరో మూడేళ్ల కల్లా భోపాల్‌లోని హరిత ప్రాంతం 11 శాతానికి పడిపోనుంది. దీన్ని మీరు అభివృద్ధి అంటారనడం ఖాయం. అయితే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలకు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేయడానికి లేదు.

గత రెండు దశాబ్దాలలో అహ్మదాబాద్‌లోని పచ్చని ప్రాంతం 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయింది. ఊపిరి బిగబట్టుకుని వినండి. మీరు ఇప్పటికే ఆహ్మదాబాద్‌లో నివసిస్తున్నా లేక అక్కడికి వెళ్లి స్థిరపడాలని భావిస్తున్నా ఒక్కసారి పునరాలోచించండి. 2030 నాటికి అహ్మదాబాద్‌లో మిగిలేది కేవలం 3 శాతం హరిత ప్రాంతమే. 2030 నాటికి కోల్‌కతాలో సైతం మిగిలే హరిత ప్రాంతం 3.7 శాతమే. ఇక హైదరాబాద్‌లో 2024 నాటికి కేవలం 1.84 శాతం ప్రాంతంలోనే పచ్చదనం మిగిలి ఉంటుంది. అది ఎంతో దూరంలో లేదు. నగరపు పచ్చని ఊపిరితిత్తులుగా పిలిచే హరిత ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న పట్టణీకరణ వేగం రేటును బట్టి చూస్తే స్పష్టంగానే భారీ ఎత్తున తుడిచి పెట్టుకుపోతుంది. నగర ఉష్ణోగ్రతలు పెరగడం దాని సహజ పర్య వసానమే.

పట్టణీకరణ మొత్తం అంతటి ప్రభావం ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగిపోవడానికి దారితీస్తోంది. జీడీపీ వృద్ధిని పెంపొందింప జేయడానికి పట్టణీకరణ మాత్రమే సులువైన మార్గమని భావిస్తున్న పౌరులే ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఫిర్యాదు చేయడంలోని సహేతుకత ఏమిటో నాకైతే బోధపడటం లేదు. దాన్ని కోరుకున్నది మీరే కదా!

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈమెయిల్‌ : hunger55@gmail.com
దేవిందర్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement