పట్టణీకరణ ప్రభావంతో పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
భారత నగరాల్లో 60 శాతం వేడి రాత్రులే
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చల్లని రాత్రులు కరువవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని 140కి పైగా భారత నగరాల్లో 60 శాతానికి పైగా రాత్రులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బృందం జరిపిన తాజా అధ్యయనంలో తేలింది.
నేచర్ సిటీస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిళ్లు పెరుగుతున్న వేడిమి వర్షపాతం, కాలుష్యంతో సహా వాతావరణంలోని ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్‌కోట్ నగరాలు తీవ్ర పట్టణ ప్రభావ రాత్రులను అనుభవిస్తున్నాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్, పూణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వేడి రాత్రుల తాకిడి బాగానే ఉంది.
అర్బన్ హీట్ ఐలాండ్‌కు పట్టణీకరణే కారణం
అర్బన్ హీట్ ఐలాండ్‌కు విపరీతమైన పట్టణీకరణే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించారు. పట్టణీకరణలో భాగంగా కాంక్రీటు, తారు (రోడ్లు, పేవ్‌మెంట్‌లను నిర్మాణాలతో) ఉపరితలాలు పగటిపూట వేడిని గ్రహించి నిల్వ చేసి, సాయంత్రం ఆ వేడిమిని తిరిగి బయటకు విడుదల చేస్తాయి.
తద్వారా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. గత రెండు దశాబ్దాలుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి పట్టణీకరణ, స్థానిక వాతావరణ మార్పు ఎంతవరకు దోహదపడిందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిచారు. 37.73 శాతం పట్టణీకరణ జరిగితే దశాబ్దానికి సగటున 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
వాయువ్య, ఈశాన్య భారతంలోనే..
దేశంలోని వాయువ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువ పెరుగుదల కనిపించింది. వేగవంతమైన అభివృద్ధి, పట్టణాల విస్తరణ వేగంగా జరుగుతున్న తూర్పు, మధ్య భారతీయ నగరాల్లో కూడా రాత్రిపూట వేడి పెరుగుతోందని తేల్చారు.
రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి సగటున 0.53 డిగ్రీలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల నగరాలకే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా ప్రతి దశాబ్దానికి సగటున 0.26 డిగ్రీలు పెరుగుతున్నట్లు గుర్తించారు. అంటే దేశం మొత్తం వేడెక్కుతున్న రేటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయని నివేదిక సూచిస్తోంది.
2050 నాటికి పట్టణాల్లో 80 కోట్ల మంది
పెరిగిన మానవ కార్యకలాపాలు, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక ఉత్పత్తి అధిక స్థాయిలో గ్రీన్‌హౌస్ వాయువులకు దోహదం చేస్తున్నాయి. ఇవి పట్టణాల్లో పగటితో పాటు రాత్రిళ్లు వేడిమిని మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 2050 నాటికి దేశ జనాభాలో పట్టణ జనాభా 68 శాతానికి చేరుతుందని అధ్యయనం పేర్కొనడం మరింత ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) ఇండియా రాస్ సెంటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా.
ప్రస్తుతం దేశ జనాభాలో 36 శాతం అంటే దాదాపు 40 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటే.. ఇది 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇది రాత్రి వేడిమి మరింత పెరగడానికి దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లోనూ పచ్చదనం పెంపు ద్వారా పగటి వేడిని నిరోధించవచ్చని, రాత్రిపూట వేడిని నిరోధించడానికి ఈ విధానం పనికిరాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పట్టణాల్లో ఎక్కడ చూసినా భారీ భవంతులు, తారు, సిమెంట్ రోడ్లతో కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడం, చెరువులు కనుమరుగు కావడంతో రాత్రిపూట నగరాలు అస్సలు చల్లబడట్లేదని న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక సైతం వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment