2019లో సగటున ఒకరోజే అత్యంత చలి.. 2020లో ఆరు రోజులు..
అదే అత్యధిక ఉష్ణోగ్రతలు సగటున 16 రోజులపాటు 2014లో నమోదు..
ఆ తరువాత 2023లో 15 రోజులు.. 2020లో కేవలం మూడ్రోజులు..
2021లో 4 రోజులు.. 2022లో ఐదు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు
కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక–2024 వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అత్యంత చలి రోజులు నమోదు కాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా గత ఐదేళ్లతో పోలిస్తే 2023లోనే నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, అత్యధిక చలి నమోదైన రోజుల వివరాలను కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక–2024 వెల్లడించింది.
2014లో సగటున మూడ్రోజులు మాత్రమే అత్యంత చలి నమోదైందని, 2018లో సగటున ఏనిమిది రోజులు అత్యంత చలి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2019లో కేవలం ఒకరోజు మాత్రమే అత్యంత చలి నమోదైతే.. 2020లో ఆరు రోజులపాటు అత్యంత చలి నమోదైంది. అదే 2021 నుంచి 2023 వరకు ఒక్కరోజు కూడా అత్యంత చలి నమోదు కాలేదు
ఇక 2023లో దేశంలో ఢిల్లీ, హరియాణ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధిక చలి రోజులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. 2023లో ఢిల్లీలో అత్యధికంగా సగటున ఐదు రోజులు అత్యంత చలి రోజులు నమోదైంది.
వరుసగా రెండ్రోజులు 45 డిగ్రీలుంటే హీట్ వేవ్..
ఎక్కడైనా రెండ్రోజులపాటు గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే హీట్‌వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2న ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 2017 మే 17న ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31 2018లో నెల్లూరు జిల్లా మర్రిపాడు, డిచ్చిపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
2019 మే 26న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మేలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021 మేలో ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 45.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 2022లో అత్యధికంగా తిరుపతిలో 45.9 డిగ్రీలు, 2023లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామీణ ప్రాంతంలో 2023 మే 16న అత్యథికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అత్యధిక ఉష్ణోగ్రతల తీరూతెన్ను ఇలా..
ఇక రాష్ట్రంలో 2014లో సగటున 16 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆ తరువాత 2023లోనే సగటున 15 రోజుల పాటు ఇవి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలోకెల్లా బిహార్‌లో 18 రోజులపాటు అత్యధిక వేడి రోజులు నమోదయ్యాయి. ఆ తరువాత ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛతీస్‌గఢ్ తమిళనాడు రాష్ట్రాలున్నాయని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment