పల్లె నుంచి పట్నానికి | Telangana first in urbanization | Sakshi
Sakshi News home page

పల్లె నుంచి పట్నానికి

Published Fri, Dec 1 2017 2:24 AM | Last Updated on Fri, Dec 1 2017 2:24 AM

Telangana first in urbanization - Sakshi

మారుతున్న సామాజిక పరిస్థితులు గ్రామాలపై ప్రభావం చూపుతున్నాయి. ఉపాధి, అభివృద్ధి కారణాలతో గ్రామీణ జనాభాలో ఎక్కువ మంది పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఉపాధి, చదువుల కోసం జనం తరలి వస్తున్నారు. పాత జిల్లా కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది.

మొత్తంగా దశాబ్దకాలంలోనే పట్టణ జనాభా 36 శాతం పెరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని అర్థగణాంక శాఖ రూపొందించింది. 2001లో రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 98.53 లక్షలు ఉండగా.. 2011లో 1.36 కోట్లకు పెరిగింది. 100 శాతం పట్టణ జనాభా ఉన్న హైదరాబాద్‌ జిల్లాలో రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నివసిస్తున్నారు. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది.    – సాక్షి, హైదరాబాద్‌


పట్టణీకరణ జరుగుతున్నా గ్రామాల్లోనే..
రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా ఇప్పటికీ గ్రామాల్లోనే జనాభా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా 31.51 లక్షల మంది వ్యవసాయంలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో కూలీ చేస్తూ ఉపాధి పొందుతున్నవారు 59.15 లక్షల మంది. 2015–16లో 21.80 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల పంటలు సాగవగా.. 51.45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాలు 62 శాతం ఉండగా.. 1–2 హెక్టార్ల వరకు సాగు భూమి ఉన్నవి 23.9 శాతం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కమతాల సగటు విస్తీర్ణం 1.12 హెక్టార్లుగానే ఉంది.

1.86 కోట్లు.. ఏ పనీ చేయనివారు
రాష్ట్రంలో 1.63 కోట్ల మంది ప్రధాన వృత్తులతో ఉపాధి పొందుతున్నారు. ఏడాదిలో 183.. అంత కంటే ఎక్కువ రోజులు పని చేసేవారు 1.37 లక్షలు. వీరిలో 22.42 లక్షల మంది ఎస్సీలు, 14.58 లక్షల మంది ఎస్టీలు. ఇక ఓ మోస్తరు పనులతో 26.22 లక్షల మంది.. కుటీర పరిశ్రమలతో 7.77 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం, వృత్తి పనులు, మోస్తరు పనులతో కాకుండా మిగిలిన రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారు 64.99 లక్షలు. ఏ పనీ చేయని వారు 1.86 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

మహిళలే ఎక్కువగా..
రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు అదుపులో ఉంది. జాతీయ స్థాయిలో వృద్ధి 17.70 శాతం ఉండగా.. తెలంగాణలో 13.58 శాతమే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో స్త్రీ, పురుష జనాభాలో అంతరం బాగా తగ్గుతోంది.

ప్రతి 1,000 మంది పురుషులకు 988 మంది మహిళలుండగా.. 11 జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. నిర్మల్‌ జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,046 మంది మహిళలున్నారు. 1,044 మందితో నిజామాబాద్‌ రెండో స్థానంలో ఉంది. రంగారెడ్డిలో 1,000 మంది పురుషులకు 950 మంది మాత్రమే మహిళలున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 1,000 మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38.99 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 11.14 శాతం.


ఎస్సీలు 15.45, ఎస్టీలు 9.08 శాతం
రాష్ట్రంలో సామాజిక పరిస్థితుల పరంగానూ మార్పులు కనిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54.08 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 15.45 శాతం. ఎస్సీ జనాభాలో స్త్రీ, పురుష నిష్పత్తి మెరుగ్గా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,008 మంది మహిళలున్నారు. ఇక రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31.77 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. ఎస్టీల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 977 మంది స్త్రీలు ఉన్నారు.

మానవాభివృద్ధిలో మెదక్‌ లాస్ట్‌..
ప్రజల్లో జీవన స్థితిగతులు తెలిపే మానవాభివృద్ధి సూచిక అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2015–16 అంచనాలను నివేదికలో పేర్కొన్నారు. మానవాభివృద్ధి సూచిక రాష్ట్ర సగటు 0.595గా ఉంది. సూచికలో హైదరాబాద్‌ (0.82 శాతం)తో తొలిస్థానంలో నిలవగా.. రంగారెడ్డి (0.71 శాతం), ఖమ్మం (0.62 శాతం) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement