
సారంగాపూర్: జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలం కండ్లపల్లి నాయికపుగూడెంలో గ్రామస్తులందరికీ పూరిళ్లే ఉన్నా, ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఈ గిరిజన గూడెంలో 60 కుటుంబాలున్నాయి. అందరివీ పూరి గుడిసెలే. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ గూడెంవాసులంతా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు ఇటీవల గ్రామంలో సర్వే కూడా చేశారు.
కానీ తాజాగా నిర్వహించిన గ్రామసభలో ప్రదర్శించిన జాబితాలో ఆ గూడేనికి చెందిన ఏ ఒక్కరి పేరు లేదు. దీనిపై రెవెన్యూ పరిశీలకుడు శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. నాయికపుగూడెంలోని గుడిసెలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ కిందకు వస్తున్నందున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని తెలిపారు. తమ ఇళ్లు రిజర్వ్ ఫారెస్ట్ కిందకు వచ్చినప్పుడు అధికారులు సర్వే ఎందుకు చేశారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.