Tribal village
-
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి
ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కిదిగితే గానీ ఆ గ్రామానికి చేరుకోలేం. గుక్కెడు నీటికోసం పిల్లాజెల్లా అంతా కలిసి బిందెలు ఎత్తుకుని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఊరు విడిచిపోతేగానీ పెద్ద చదువులకు అవకాశం లేదు. అటవీ ప్రాంతంలో కష్టాలతో సహవాసం చేస్తున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భీమనగొంది గ్రామస్తుల వ్యథ ఇది. సిర్పూర్(యూ): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భీమనగొంది ఉంది. ఇక్కడ 31 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 150 మందికిపైగా జీవిస్తున్నారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే చోర్పల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో కొండల మధ్య ప్రయాణించాల్సిందే. అదీ ఎగుడు దిగుడుగా ఉండే అధ్వానపు రహదారి మీద స్థానికంగా రేషన్ దుకాణం లేకపోవడంతో చోర్‌పల్లికి కాలినడకన వెళ్లి.. 20, 30 కిలోల బియ్యం మూటలు నెత్తిన మోసుకుంటూ తెచ్చుకోవాల్సిందే. గ్రామస్తులు వినియోగిస్తున్న బావి ఇక వానాకాలం వచ్చిందంటే మట్టిరోడ్డు బురదతో నిండి.. కాలు తీసి కాలువేయలేని పరిస్థితి ఉంటుంది. ఎంత అత్యవసరమైనా 108 వాహనం రాదు. ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఎడ్లబండిపై చోర్పల్లి వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో జైనూర్, సిర్పూర్(యూ) మండల కేంద్రాలకు చేరుకుంటారు. నీళ్లకు నిండా గోస.. గ్రామంలో రెండేళ్ల క్రితం భగీరథ ట్యాంకు నిర్మించారు. కానీ ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకును సైతం 20 రోజులకోసారి నింపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊరి చివరన నిర్మించుకున్న బావి నుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. బావి ప్రహరీ సగం వరకు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. భీమనగొంది గ్రామ రహదారి అదికూడా ఈ బావి వాగులో ఉండటంతో వానాకాలంలో చెత్తాచెదారంతో నిండిపోతుంది. గ్రామానికి చెందిన వృద్ధులు వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పింఛన్ వస్తలేదు నాకు అరవై ఏళ్లు దాటినా ఇప్పటివరకు పింఛన్ వస్తలేదు. నాకు ఏ పని చేతకాదు. సర్కారు పింఛన్ అందిస్తే బతుకుతా. – ఆత్రం బాగుబాయి, గ్రామస్తురాలు రోడ్డు, నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామానికి రోడ్డు పెద్ద సమ స్య. ఊరి నుంచి పంచాయతీకి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందే. రోడ్డు, నీటి సమ స్య పరిష్కరిస్తే గ్రామం బాగు పడుతుంది. – మర్సుకోల సోనేరావు, గ్రామస్తుడు -
ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు.. జీతం లక్ష.. కానీ తనకు బదులుగా..
చింతూరు (తూర్పుగోదావరి): ఆ అయ్యవారి జీతం అక్షరాలా లక్ష రూపాయలు పైగా ఉంది. నెల తిరిగేసరికి ఆ డబ్బులు లక్షణంగా తీసుకుంటున్నాడు. జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. కానీ తన కనీస కర్తవ్యమైన బోధనను మాత్రం విస్మరించాడు. చిన్నారులకు పాఠాలు చెప్పడానికి విముఖత చూపుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామం కదా! తనను ఎవరేం చేస్తారని అనుకున్నాడేమో! అస లు పాఠశాలకే వెళ్లడం లేదు. ఇందుకు ఎటువంటి అనుమతీ కూడా తీసుకోలేదు. పైగా తనకు బదులుగా పాఠాలు చెప్పడానికి ఓ యువకుడిని తానే దర్జాగా నియమించేశాడు. రోజూ కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ అయ్యవారి బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? చింతూరు మండలంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట. ఇక్కడి గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న అతడు పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు చిచ్చడి మురళి, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలసి శనివారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు గైర్హాజరవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడు తన బదులు అదే గ్రామానికి చెందిన యువకుడు ముచ్చిక రవికుమార్‌ను అనధికారికంగా నియమించుకున్నాడని, అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తూ, విద్యార్థులకు పాఠా లు చెప్పిస్తున్నాడని తెలిపారు. రవికుమార్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని చెప్పారు. ఉపాధ్యాయుడు గైర్హాజరవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయుల వైఖరి ఇలాగే ఉంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ యడమ అర్జున్, ఎంపీటీసీ సభ్యుడు సున్నం నాగరాజు, సర్పంచ్‌లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి పాల్గొన్నారు. -
వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా
ముంబై: మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్‌లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెదురుతో ఒక వంతెనను నిర్మించుకున్నారు. దీనిపై నుంచే తాగునీటి కోసం.. ఇతర పనుల కోసం రాకపోకలు చేసేవారు. ఈ క్రమంలో ఎందరో ఆ లోయలో పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల విన్నపం మేరకు, మహా సర్కారు తక్కువ సమయంలోనే వంతెనను నిర్మించి, శుక్రవారం ప్రారంభించింది. కాగా, వంతెన అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గిరిజనులు నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Maharashtra Minister Aaditya Thackeray inaugurated a bridge and interacted with locals in Shendripada, a remote tribal village in Nashik earlier today pic.twitter.com/aPdI2iYOkN — ANI (@ANI) January 28, 2022 చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
కొండకు రామదండు.. పోటెత్తిన భక్తులు
ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలోని శ్రీరామకొండకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కొండపైన ఉన్న రాముడి పాదాల దర్శనంకోసం బారులు తీరారు. దాదాపు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. – కోయిల్‌కొండ (మహబూబ్‌నగర్ జిల్లా) ఎరువుల కోసం ఎదురుచూపులు నిర్మల్ జిల్లా లోకేశ్వరం పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆదివారం యూరియా కోసం క్యూలో రైతన్నల చెప్పులు. పచ్చని ‘గిరి’పల్లెలు ఇటీవల కురిసిన వర్షాలకు భూమాత పచ్చరంగు పులుముకుంది. చెట్లు చిగురించి కొండలు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరినట్లు.. కొండల నడుమ గిరి పల్లెలు ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్‌ధరి, మామిడిగూడ, లోహర గ్రామాలు ప్రకృతి ఒడిలో ఇలా దర్శనమిస్తున్నాయి. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నరికినా నీడనిస్తా.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోచాలు అనే రైతు పొలంలో వేపచెట్టు.. పెద్దపెద్ద కొమ్మలతో భారీగా విస్తరించింది. పంటపై నీడ పడుతుండడంతో పోచాలు ఆ చెట్టుకొమ్మలను తొలగించాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు మళ్లీ చిగురించింది. ఒకప్పుడు ఆ చెట్టు నీడ పంటపై పడుతుందని నరికేసిన రైతు.. ఇప్పుడు వ్యవసాయ పనులు ముగించుకొన్నాక అదే చెట్టునీడన విశ్రమిస్తున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ గూడు కోసం ఆరాటం ఏదో పుస్తకంలో చదివి నేర్చుకున్నట్టు.. ఎవరో గురువు దగ్గర శిక్షణ పొందినంత నేర్పుతోనూ పక్షులు అందమైన గూళ్లను అల్లుకుంటాయి. సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం, ఇతరత్రా కారణాలతో పక్షి గూళ్లు ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ చెరువు వద్ద తుమ్మ చెట్టుపై పక్షులు అల్లుకున్న గూడులివి. – సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
కరోనా దరిచేరని ఊరు; అక్కడ ఒక్క కేసూ లేదు..
సాక్షి, అశ్వాపురం: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోట కోవిడ్–19 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకినవారిలో చాలామంది ప్రజలు కోలుకుంటున్నారు. ఇతరత్రా సమస్యలు ఉన్న కొద్ది మంది చనిపోతున్నారు. అయితే, కనీస రహదారి సౌకర్యం లేని ఓ మారుమూల గిరిజన గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా అంటే ఆ గిరిజనులకు ఎలాంటి భయాందోళనలు లేవు. అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా కనీస రహదారి సౌకర్యం లేని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో గతేడాది కాలంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో నాలుగు వలస గొత్తి కోయ గ్రామాలున్నా కరోనా కేసులు నమోదు కాలేదు. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో ఐతయ్య గుంపులో 41, మడకం మల్లయ్య గుంపులో 11, మనుబోతులగూడెం గ్రామంలో 20 కుటుంబాలు, సంతోష్‌గుంపులో 28, పొడియం నాగేశ్వరరావు గుంపులో 20, వేములూరు గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. మనుబోతులగూడెం గ్రామపంచాయతీ ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లకపోవడం, శుభకార్యాలకు వెళ్లకపోవడం, జనావాసాల ప్రాంతాలకు వెళ్లకపోవడం వారికి కరోనా సోకకపోవడానికి కారణాలు. ఎక్కువ శాతం ఆ గ్రామానికే పరిమితమయ్యారు. ఆ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు లేకపోవడంతో కొత్త వ్యక్తులు సంచరించే అవకాశం లేదు. గిరిజనులు, ఆదివాసీలు, గొత్తి కోయలు అటవీ ఉత్పత్తులు సేకరించి అడవిలో సహజంగా లభించిన ఆహార పదార్థాలు తినడం వారిలో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉండటానికి కారణమవుతోంది. వాగులు, చెలిమల నీరే వారికి తాగునీరు. చదవండి:పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు -
చేతబడి పేరుతో గిరిజనుడి హత్య
కొత్తూరు: చేతబడి చేస్తున్నా డన్న నెపంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గిరిజన గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లగూడకు చెందిన ఊలక రమేష్ అనే వ్యక్తి పది రోజుల కిందట మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఊలక నాయకమ్మ (44) చేతబడి చేయడం వల్లే మృతి చెందాడని అనుమానించిన రమేష్ బంధువులు మరికొందరితో కలిసి నాయకమ్మను తీవ్రంగా కొట్టారు. తర్వాత ఒడిశాలోని ఓ భూతవైద్యుడిని సంప్రదించి నాయకమ్మ చేతబడి చేశాడని నిర్ధారణకు వచ్చారు. అనంతరం గ్రామానికి తిరిగివచ్చి నాయకమ్మను చంపేయాల్సిందిగా అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో శనివారం అర్ధరాత్రి నాయకమ్మను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లకు వైరు కట్టి, శ్మశానానికి తీసుకెళ్లి కొట్టి చంపారు. ఆనవాలు దొరక్కూడదని వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న పాలకొండ ట్రైనీ డీఎస్పీ ఎం.శ్రీలత, సీఐ చంద్రశేఖర్‌లు ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శివకృష్ణ, గంధర్వులు, దుర్గారావు, కరువయ్య, మో హనరావు, కామకృష్ణ, చిన్నారావు, ముఖ లింగం లతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
అడవి బిడ్డలతో హరిచందన్
గవర్నర్ రాకతో మన్యం మురిసింది. గిరిజనం సంతసించింది. అడవిబిడ్డల కోసం ప్రత్యేకంగా వచ్చిన అతిథిని చూసి ఉప్పొంగిపోయింది. తమ సమస్యల గురించి ఆరా తీసినపుడు... బాగోగుల గురించి ప్రస్తావించినపుడు... తాము పండించిన పంటలను చూసి ప్రశంసించినపుడు... తమకు అందుతున్న సౌకర్యాల గురించి ప్రశ్నించినపుడు తమపై వారెంత బాధ్యతగా ఉన్నారో స్పష్టమైంది. సుమారు నాలుగైదు గంటలపాటు తమతో గడిపిన ఆ అతిథిని గర్వంగా సాగనంపింది. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ జిల్లా పర్యటన విజయవంతమైంది. గిరిజనులకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు గవర్నర్ తన పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగ్గా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన పర్యటనలో గర్భిణులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడగా అందరూ గిరిజనులు కావడం పర్యటన ప్రాధాన్యత తెలియజేసింది. ఈ సందర్భంగా హరిత విజయనగరం సంకల్పంలో గవర్నర్ సైతం పాలుపంచుకున్నారు. మొక్కలు నాటి తన పర్యటనకు మొదలుపెట్టారు. అందరూ విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. గిరిజన బాలికలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ముగించారు. నాలుగు గంటలు బిజీబిజీగా... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం సాలూరు డీగ్రీ కాలేజీ మైదానానికి ఉదయం 11.32 నిమిషాలకు హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సాలూరు పట్టణంలో ఉన్న గుమడాం వద్ద గల యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకుని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్‌కు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్.పి.సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్వతీపురం ఐటీడీఏ ఏర్పాటు గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ గవర్నర్‌కు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, జిల్లాలో అమలు చేస్తున్న కంటివెలుగు, రైతుభరోసా, వాహనమిత్ర, తదితర పథకాలు గురించి సమగ్రంగా వివరించారు. అమ్మవలస సభకు హాజరైన గిరిజనులు గర్భిణుల ఆరోగ్యంపై ఆరా... వైటీసీలోని గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని గవర్నర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న గర్భిణులతో మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలావుంది? మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మీ ఊరు నుంచి ఎలా వచ్చారు? మీ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం ఉన్నాయా? వసతిగృహంలో ఎటువంటి వైద్య సేవలు ఆందుతున్నాయని ప్రశ్నించారు. వసతిగృహంలో మౌలిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు వున్నాయని, ప్రసవ సమయంలో గిరిశిఖర ప్రాంతాలనుంచి వైద్యం నిమిత్తం రావడం చాలా కష్టంగా వుండేదని పలువురు గర్భిణులు తెలిపారు. ఈ వసతిగృహం వల్ల గిరిజనులకు మంచి జరుగుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేయడంతో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి సేద్యానికి ప్రశంస అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ పాచిపెంట మండలం అమ్మవలస చేరుకున్నారు. అక్కడ గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, కంద, మామిడి, జీడిమామిడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర వ్యవసాయ పద్ధతుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా రైతులు వాటి గురించి గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఆయన గ్రామసభలో పాల్గొన్నారు. సభలో రైతులతో మాట్లాడారు. రైతులకందుతున్న ప్రభుత్వ పథకాల గురించి రైతులను అడుగ్గా కె.విజయ్ అనే రైతు మాట్లాడుతూ రైతుభరోసా పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రూ.7500లు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రూ.2000 ఇచ్చారని, పంట సాగుకు పెట్టుబడికి సాయం అందించినట్టయిందని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు తనిఖీలు, పౌష్టికాహారం పంపిణీ, మందులు సరఫరా గురించి గవర్నర్ అడుగ్గా క్రమ పద్ధతిలో తనిఖీ చేసి, పౌష్టికాహారం, మందులు సరఫరా చేస్తున్నారని గిరిజన మహిళ లక్ష్మి తెలిపారు. అనంతరం ఆయన పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్య, కాలేజీ, వసతిగృహంలో సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొని, గిరిజన బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైద్యసదుపాయాలు మెరుగు: డిప్యూటీ సీఎం అమ్మవలస సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఏజెన్సీలో వైద్యసదుపాయా ల మెరుగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోం దని తెలిపారు. గిరిజనులు తక్కువగా ఉన్న కొత్తవలస ప్రాంతంలో పెట్టిన గిరిజన యూనివర్శిటీని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారనీ, ఏడు ఐటీడీఏల పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలు ముఖ్యమంత్రి రద్దు చేసిన విషయాన్ని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రాజన్నదొర అమ్మవలసలో నిర్వహించిన సభలో సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సందర్శనకు గవర్నర్ రావడం సంతోషంగా ఉందనీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారనీ తెలిపారు. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాలూరు ప్రాంతంలో ధీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య 21 కొఠియా గ్రామాల సమస్య నలుగుతోందనీ, వీరి సమస్య పరిష్కరించాలని కోరారు. గిరిజనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. స్పందించిన గవర్నర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చురుకున్న గవర్నర్ పర్యటన విజయవంతంపై జిల్లా అధికారులను అభినందించి, వారితో గ్రూఫ్ఫొటో దిగారు. అనంతరం గవర్నర్ విశాఖ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, బొబ్బిలి, పాడేరు ఎమ్మెల్యేలు శంబంగి చిన్న అప్పలనాయుడు, కె.భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, జిల్లా ఎస్.పి.రాజకుమారి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నిత్యం భయం.. జీవనం దుర్భరం
సాక్షి, గూడెంకొత్తవీధి(పాడేరు): అదో గిరిజన కుగ్రామం. ఆ గ్రామం పేరు మండపల్లి. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులో ఉంది. జిల్లా సరిహద్దుతో పాటు గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు కూడా ఇదే సరి హద్దు గ్రామం. సరిహద్దు ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రాంతంలో ఉండడంతో మండపల్లి రెండింటికీ చెడ్డ రేవడిలా ఉంది. దశాబ్దాలుగా కనీస అభివృద్ధి నోచుకోకుండా తల్లడిల్లుతోంది ఈ గ్రామం. ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈనెల 19న ఈగ్రామం వద్దే పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి, గతంలో ఈ గ్రామానికి సమీపంలో మావోయి స్టులు శిక్షణ ఇవ్వడంతో అప్పుడో సారి గ్రామం పేరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. తరచూ మావోయిస్టులు, పోలీసులు గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు బితుకు బితుకు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామాన్ని మావోయిస్టులు, పోలీసులు తప్ప అధికారులు సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక దుర్భర పరిస్థితుల్లో మండపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు బతుకులు వెళ్లదీస్తున్నారు. దారుణంగా రోడ్డు.. మండపల్లి గ్రామం దట్టమైన కొండల మధ్య సుదూర ప్రాంతంలో ఉంది. భౌగోళికంగా ఈ గ్రామాన్ని కొయ్యూరు మండలంలో విలీనం చేశారు. మండపల్లి గ్రామస్తులు కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే కాలిబాటే శరణ్యం. కొండలు ఎక్కి, వాగులు దాటి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే జీకే వీధి మండలానికి రావాలంటే దారుణంగా ఉన్న మార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. గతంలో ఈ గ్రామానికి చెందిన గిరిజనులు శ్రమదానంతో రహదారి బాగు చేసుకున్నారు. అయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా కొట్టుకుపోయింది. కొండల పైనుంచి వర్షపు నీరు ప్రవాహానికి రహదారి కోతకు గురై రాళ్లమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్, తాగునీరు గగనమే.. మారుమూల గ్రామం కావడంతో పాటు రహదారి సౌకర్యం లేక ఈ గ్రామానికి విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలేవీ దరిచేయడం లేదు. విద్యుత్ సదుపాయం లేనికారణంగా ప్రత్యామ్నాయంగా గతంలో ప్రభుత్వం సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశారు. కానీ ఇది సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక చీకటిలోనే మగ్గుతున్నారు. తాగునీటికి కూడా దయనీయ పరిస్థితి. పొలం గట్ల వద్ద వచ్చే నీరు, వాగుల నుంచి వచ్చే నీటిని తాగునీటికి వినియోగించడంతో రోగాల బారినపడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. పింఛన్లు రద్దు.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి చెందిన 15 మంది వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రావాల్సిన ఫించన్ పూర్తిగా రద్దయింది. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. గత ఐదేళ్లలో గ్రామంలో ఏఒక్క ఉపాధి పనికూడా నిర్వహిం చకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రహదారి లేకపోవడం వల్లే ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి రావడం లేదని, కొయ్యూరు మండలానికి వెళ్లి అధికారులకు తమసమస్య చెప్పుకున్నా కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఈ సారైనా తమ గ్రామాలు బాగుపడతాయన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపాలెం, కొమ్ము సంపంగి, కోతిగొంది, వెదురులంక, పుత్తకోట తదితర గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. -
అభ్యర్థి తెలియదు.. అయినా ఓటేస్తాం!
తమిళనాడు, టీ.నగర్: అభ్యర్థి ఎవరనేది తెలియకుండా ఇంతవరకు ఓటేసి వస్తున్నట్లు సేలం జిల్లాలోని గిరిజన గ్రామస్తులు అంటున్నారు. సేలం జిల్లా, మేట్టూరు సమీపంలోని కొళత్తూరు పంచాయితీ యూనియన్‌లో పాలమలై గిరిజన ప్రాంతం ఉంది. సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పాలమలైలో రామన్‌పట్టి, గెమ్మంపట్టి, తలక్కాడు, కడుక్కామరత్తుకాడు, తిమ్మంపది, నాగంపది వంటి 33 కుగ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 2 వేల కుటుంబాలు నివశిస్తున్నాయి. ఈ గిరిజన గ్రామాలన్నీ ధర్మపురి పార్లమెంటు నియోజకవర్గం, మేట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఇందులో ధర్మపరి పార్లమెంటు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి డాక్టర్ సెంథిల్‌కుమార్, అన్నాడీఎంకే కూటమి తరఫున పీఎంకే అన్బుమణి, అమముక అభ్యర్థిగా మాజీ మంత్రి పళనియప్పన్ సహా 15 మంది పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఈ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను కలిసి ఏ అభ్యర్థి ఓట్లు అడగలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. ఓట్లు అభ్యర్థించలేదు. దీంతో అక్కడి ప్రజలు అభ్యర్థులు ఎవరో తెలియకున్నా.. ఓట్లు మాత్రం వేస్తుంటామని వెల్లడించారు. గతంలో కాలినడకన అభ్యర్థులు రావాల్సిన పరిస్థితి ఉన్నందున రాలేదని, ప్రస్తుతం వాహన వసతులున్నా రాలేకున్నట్లు తెలిపారు. ఇక్కడికి వస్తే వారికి తమ సమస్యలు తెలుస్తాయని, తారు రోడ్డు వేసేందుకు వీలుంటుందన్నారు. -
డోలీయే శరణ్యం
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం): డొంకాడ గిరిజన గ్రామం. ఇది నర్సీపట్నానికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గొలుగొండ మండలంలో డొంకాడ ఓ గ్రామం. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీయే వారికి రవాణాసాధనం. ఆ గ్రామానికి చెందిన కొర్రా మల్లేశ్వరి అనే మహిళకు సోమవారం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ప్రధాన రోడ్డుకి రావాలింటే నాలుగు కిలోమీటర్లు అడవి మార్గం దాటాలి.దీంతో గ్రామస్తులు డోలి కట్టారు. అడవిని దాటించి, అక్కడ 108 వాహనం ఎక్కించారు.నర్సీపట్నం తీసుకువెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని విశాఖపట్నం తరలించారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కవగా ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో ఉన్న గొలుగొండ మండలం డొంకాడ గ్రామానికి కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంత్రి నియోజకవర్గంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని గిరిజనులు వాపోతున్నారు. గత ఏడాది గర్భిణికి సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
70ఏళ్ల తర్వాత ఆ ఊళ్లో వెలుగులు..
అమ్రావతి, మహారాష్ట్ర : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మన దేశంలో విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి గ్రామానికి విద్యుత్ అందించే లక్ష్యంతో ‘ప్రధాన మంత్రి సహజ్ బిజ్లి హర్ ఘర్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం ద్వారా మహారాష్ట్రలోని అమ్రావతి సమీపంలో ఉన్న బులుమ్‌గవ్‌హన్ అనే గిరిజన గ్రామంలో విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఆ గిరిజన గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. బులుమ్‌గవ్‌హన్ గ్రామంలో 589 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరికి రోడ్లు, విద్యుత్తు, వైద్యం వంటి కనీస సదుపాయాలూ అందుబాటులో లేవు. తాజాగా ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్థులు కలసి సమష్టిగా కృషి చేసి, విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తేగలిగారు. దీంతో గ్రామస్తులంతా సంబరాలు చేసుకుంటున్నారు. కరెంటు లేక తమ పిల్లలు ఇన్ని రోజులు చదువుకోలేదని ఇక ఆ బాధ లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. -
సమస్యలే వారి సిరి
సిరికొండ.. పేరులోనే కొండను చేర్చుకున్న ఈ గిరిజన గ్రామం అక్కడి ప్రజల పాలిట సమస్యల గుదిబండగా మారింది. వెలగవాడ పంచాయతీ పరిధిలో, డివిజన్ కేంద్రమైన పాలకొండకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. ఇక్కడ అన్నీ సమస్యలే. తాగునీటికి నిత్యం తిప్పలే.. వీధి కాలువలు లేవు.. ఇళ్లు మంజూరు కావు.. పింఛన్లు అందవు... రేషన్ సరుకులు అందనే అందవు. అన్నింటికీ మించి గిరిజన గ్రామంగా అధికారిక గుర్తింపు లేదు. గ్రామంలో ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాథ.. సమస్యలు పరిష్కరించేవారు కాదు కదా.. కనీసం తెలుసుకొని ఓదార్చేవారే కరువైన ఆ గ్రామాన్ని ఒక ప్రజాప్రతినిధి సందర్శించారు. ప్రతి ఇంటి తలుపు తట్టారు. సమస్యలు పరిశీలించారు. గిరిజనంతో మమేకమై వారు చెప్పినవన్నీ ఓపికగా విన్నారు. వారి తరఫున పోరాడతానని భరోసా ఇచ్చారు. ఆమె మరెవరో కాదు.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి.. అందులోనూ ఎమ్మెల్యే హోదాలో కాకుండా ప్రజాసమస్యల పరిష్కార వేదికగా నిలిచిన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా గ్రామమంతా కలియదిరిగారు. ఆ వివరాలు నేటి వీఐపీ రిపోర్టర్‌లో.. కళావతి : ఏం బాబు నీరు పేరేంటి.. ఎలా ఉన్నారు?... రామారావు : ఏం చెప్పమంటారు. నా పేరు ఆరిక రామారావు. వార్డు సభ్యునిగా ఉన్నాను. మా గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలో చేర్చకపోవడంతో గిరిజనులకు అందాల్సిన సౌకర్యాలు పొందలేకపోతున్నాం. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నోటిఫైడ్ ఏరియాలో ఈ గ్రామాన్ని కలపాలని ఇప్పుడూ కోరుతున్నాం. కళావతి : ఏయే సౌకర్యాలు అందడం లేదు... రామారావు : ఏ అభివృద్ధి జరగడం లేదు. కాలువల నిర్మాణం, సీసీ రహదారుల నిర్మాణం లేదు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. కనీసం పాఠశాల భవనం కూడా మంజూరు చేయలేదు. పిల్లలు చదువులు మానేసి ఇంటిలోనే ఉంటున్నారు. వృద్ధుడి పింఛను కష్టాలు కళావతి(వృద్ధుడితో) : ఏం తాత ఇంకేటి సంగతులు?... పట్టయ్య : ఏం సెప్పనమ్మ.. రోడ్డు పుట్టనప్పుడు పుట్టినాను.. నాకు 45 సంవచ్చరాలంటూ పింఛను నిలిపేనారమ్మా... కళావతి : నీ వయసు ఎంత అంటావ్...? పట్టయ్య : నాను రాసుకోనేదమ్మా...కాకపోతే ఈ ఊరు వెలవకముందే పుట్టినాను. 95 సంవచ్చరాలు దాటి ఉంటాయని తెలుసు. కళావతి: పింఛను ఎందుకు తొలగించారో అడగలేదా...? పట్టయ్య : అడిగినానమ్మా...నాకు 45 సంవచ్చరాలేనని, కార్డులో రాసుకున్నారటమ్మా.. అందుకని పింఛను మరి ఇవ్వమని పెసిరెంటు బాబూ సెప్పినారు. సమస్యలపై ఆరా కళావతి : రేషన్‌కార్డులు అందరికీ ఉన్నాయా...? ఊయక చిన్నమ్మి: ముందు కార్డులు ఉండేవి. మా ఇంట్లో పిల్లలతో కలిసి నలుగురున్నాం. పోయిన నెలలో రేషన్ సరుకులు ఇవ్వనేదు. అడిగితే కార్డు పోయిందని చెప్పి నాలుగు కేజీలు ఈ నెలలో ఇచ్చినారు. కళావతి : కార్డు విషయమై ఎవరిని అడిగారు... చిన్నమ్మి: నాయుడు బాబు వద్దకు మూడుసార్లు ఎల్లినాను. మీ కార్డు పోయిందన్నారు. కొత్త కార్డు వచ్చేవరకు మేమేమీ సేయలేమన్నారు. కళావతి : గ్రామంలో తాగునీరు ఉందా?...కూలి పనులు దొరుకుతున్నాయా??.. చిన్నమ్మి: బోరు ఉన్నాది. అయితే నీరు సేదుగా ఉంటాది. కొండపై నుంచి వచ్చిన ఊట నీరు పట్టుకుని తాగుతున్నాం. జబ్బులు, జొరాలు తప్పడం లేదు. గ్రామానికి ఉపాధి పనులు తీసేసినారు. కళావతి : ఉపాధి పనులు లేవని ఎవరన్నారు?.. చిన్నమ్మి: కిందటి సంవచ్చరం పనులకు ఎల్లాం. వారానికి 500 నుంచి 600 రూపాయలు వచ్చేది. ఈ ఏడాది పనులు ఇయ్యాలని ఫీల్డ్ ఆపీసర్‌ను అడిగాం. గ్రామానికి ఉపాధి పనులు తీసేసినారని సెప్పారు. కళావతి : మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు...? చిన్నమ్మి: కొండపెకైల్లి కట్టెలు తీసుకొచ్చి పాలకొండలో అమ్ముతున్నాం. రోజుకు 40 నుంచి 50 రూపాయలు వస్తే సంతలో సరుకులు, బియ్యం కనుక్కొని జీవిస్తున్నాం. పొదుపు సొమ్ము లాక్కున్నారు కళావతి : డ్వాక్రా సంఘాలు ఎలా నడుస్తున్నాయి? గౌరి : గ్రామంలో రెండు సంఘాలున్నాయి. రుణమాఫీ చేస్తామనడంతో అప్పు తీరుతాదని కట్టడం మానేసినాం. దీంతో బ్యాంకోళ్లు ఇంతవరకు మేం పొదుపు డబ్బు తీసుకున్నారు. కళావతి : డబ్బులు ఎందుకు తీసుకున్నారని అడగలేదా? గౌరి :బ్యాంకు పుస్తకంలో డబ్బులు లేకపోవడంతో బ్యాంకు వారిని అడిగాం. అప్పు కింద జమ సేసుకున్నామన్నారు. రుణ మాఫీ అయితే మా పరిస్థితి ఏమిటని అడిగితే ఇప్పట్లో మాఫీ రాదు, మీరు తీసుకున్న అప్పు చెల్లించకపోతే పోలీసు చర్యలు చేపడతామని బెదిరించినారు. కళావతి : గ్రామంలో పాఠశాల ఉందా. ఎంతమంది చదువుతున్నారు? బంగారమ్మ: ఊరిలో బడి ఉండేదమ్మా. పూర్తిగా పడిపోనాది. అప్పట్లో 20 మంది పిల్లలు సదివేవారు. ఇప్పుడు భవనం లేకపోవడంతో అటవీశాఖ భవనంలో చదువు సెబుతున్నారు. బడి లేకపోవడంతో పిల్లలు మాతో పాటు కొండ పనులకు వస్తున్నారు. పార్టీ మారితేనే సౌకర్యాలంట! కళావతి : ఈ సమస్యలపై ఎవరిని ఇంతవరకు అడగలేదా? కాంతారావు:ఇంతవరకు అధికారులు గానీ, నాయకులు గానీ రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. అందుకే తాగునీరు, కరెంట్, బడి, కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కళావతి : మీరెళ్లి ఎవరినీ కలవలేదా?... కాంతారావు:పాలకొండ ఎల్లాం. పింఛన్లు ఆపేశారని నాయకులను అడిగాం. పార్టీ మారితేనే పింఛన్లు వత్తాయని సెప్పారు. కళావతి : మీరు ఏ పార్టీలో ఉన్నారు...ఏ పార్టీలోకి మారమన్నారు? కాంతారావు: మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తెలుగుదేశంలోకి వస్తేనే రేషన్‌కార్డులు, పింఛన్లు వత్తాయని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. కళావతి : ఇళ్లు సగం గోడలతో ఎందుకు కనిపిస్తున్నాయి? కొండగొర్రె లక్ష్మణరావు: ఇందిరమ్మ గృహాలు ఇచ్చారు. కిందటేడు ఇళ్లు కట్టాం. 27 వేల రూపాయల బిల్లు ఇచ్చారు. మేము కూలి పనులు చేసుకుంటూ మరికొంత డబ్బు వేసి శ్లాబు వరకు కట్టాం. ఇప్పుడు బిల్లులు ఆపేశారు. కళావతి : ఫోటోలు తీయడానికి ఎవరైనా వచ్చారా? లక్ష్మణరావు: ఎవరూ రాలేదు. బిల్లులు అడిగితే తర్వాత ఇస్తామన్నారు. నెలలు దాటిపోతున్నా డబ్బులు అందకపోవడంతో పూరిపాకలోనే ఉంటున్నాం. కళావతి : ఇంకా ఎంత బిల్లు రావాలి? లక్ష్మణరావు: ఇంకా ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున బిల్లులు అందాల్సి ఉంది. ఇది చెల్లిస్తేనే శ్లాబులు వేసుకొని గుడిసెలను ఖాళీ చేయగలం.