మల్లేశ్వరిని డోలీపై తీసుకువస్తున్న గ్రామస్తులు
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం): డొంకాడ గిరిజన గ్రామం. ఇది నర్సీపట్నానికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గొలుగొండ మండలంలో డొంకాడ ఓ గ్రామం. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీయే వారికి రవాణాసాధనం. ఆ గ్రామానికి చెందిన కొర్రా మల్లేశ్వరి అనే మహిళకు సోమవారం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది.
ప్రధాన రోడ్డుకి రావాలింటే నాలుగు కిలోమీటర్లు అడవి మార్గం దాటాలి.దీంతో గ్రామస్తులు డోలి కట్టారు. అడవిని దాటించి, అక్కడ 108 వాహనం ఎక్కించారు.నర్సీపట్నం తీసుకువెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని విశాఖపట్నం తరలించారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కవగా ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో ఉన్న గొలుగొండ మండలం డొంకాడ గ్రామానికి కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంత్రి నియోజకవర్గంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని గిరిజనులు వాపోతున్నారు. గత ఏడాది గర్భిణికి సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment