తల్లీబిడ్డల ఆరోగ్యపరిస్థితి తెలుసుకుంటున్న తహసీల్దారు రామశేషు తదితరులు
సుమారు ఐదు గంటల పాటు ఆమె అనుభవించిన నరకయాతన అంతా ఇంతా కాదు... ఓ కర్రకు కట్టిన చిన్న దుప్పటి డోలీలో కూర్చొని ఐదు కిలో మీటర్ల దూరం ప్రయాణించిన ఆమె తీవ్ర వేదనకు గురైంది. ఒక వైపు విపరీతమైన పురిటి నొప్పులు, మరో వైపు బురదమయంగా ఉన్న రోడ్డుపై తీవ్రమైన కుదుపుల మధ్య ప్రయాణం...కనీసం పక్కకు ఒరిగేందుకు వీలులేని పరిస్థితి...ఇంకో వైపు కడుపులో బిడ్డకు ఏమవుతుందోనన్న భయంతో ఆ తల్లి మనసుతీవ్రంగా తల్లడిల్లిపోయింది.
విశాఖపట్నం ,మాడుగుల రూరల్: సౌకర్యాలు పెరిగాయి... అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకొంటున్నా... గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాస్తవపరిస్థితులు అలా లేవు. ముఖ్యంగా ఆదివాసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. వారి జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. గిరిజన గ్రామాల్లో మహిళలు గర్భం దాలిస్తే వారిలో ఆనందం కంటే భయమే ఎక్కువగా కనిపిస్తుంది. కడుపులో బిడ్డ నేలమీదకు వచ్చేంతవరకు ఆ పసిప్రాణంపై ఆశలు పెట్టుకునే పరిస్థితి అసలుండదు. వైద్యం అందుబాటులో లేక, ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యంలేక నెలల తరబడి ఆ తల్లులు పడిన వేదన మాటలకందనిది. ఇందంతా ఒక ఎత్తయితే ప్రసవ సమయంలో వారు మరింతగా నరకయాతన గురవుతున్నారు. రోడ్డు, రవాణా సౌకర్యం లేక కిలో మీటర్ల కొద్దీ డోలీలో మోసుకెళ్లి ఆస్పత్రులకు తరలించవలసి వస్తోంది. తాజాగా మాడుగుల మండలంలో కొత్తవలస గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ఐదు కిలో మీటర్లు ఇలా డోలీలో తరలించవలసి రావడంతో ఆమె నరకయాతనకు గురైంది.
మాడుగుల మండలంలో గిరిజన పంచాయతీ శంకరం శివారు గ్రామమైన కొత్తవలసకు చెందిన చిన్ని దేవి నిండు గర్భిణి. ఆమెకు ఈ ఆదివారం(నెల 21వ తేదీ) ప్రసవం జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. శనివారం ఆమె దగ్గరకు వెళ్లిన ఏఎన్‌ఎం...ప్రసవ సమ యం దగ్గర పడడంతో పీహెచ్‌సీలో చేరాలని సూచించింది. అయితే తాను తరువాత జాయిన్ అవుతానని గర్భిణి తెలిపింది. ఆదివారం ఉదయం 6 గంటలకు దేవికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కొత్తవలస గ్రామం నుంచి సరైన రహదారి సౌకర్యం లేదు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొత్తవలస నుంచి డి.గొటివాడ వరకు రహదారి బురదమయంగా మారి, గోతులతో నిండిపోయింది. దీనికి తోడు ఆ గ్రామం మధ్యలో ఉన్న ఉరకగెడ్డలో మోకాలు వరకు నీరు ప్రవహిస్తోంది. వాహనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న దేవిని ఆదివారం ఉదయం డోలీలో పడుకోబెట్టి ఆమె భర్త నూకరాజు, కుటుంబ సభ్యులు ఐదు కిలో మీటర్లు అవస్థలు పడుతూ బురదలో జారిపోకుండా జాగ్రత్తగా అడుగువేస్తూ.. డి.గొటివాడ గ్రామం వద్దకు తీసుకొచ్చారు. డోలీలో ఉన్నంత సేపు గర్భిణి నరకయాతన అనుభవించింది. సమాచారం అందుకున్న సిబ్బంది 108 వాహనంతో డి.గొటివాడ వద్దకు వెళ్లి గర్భిణిని ఎక్కించుకుని కేజే పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నికి తీసుకొచ్చారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది వెంటనే వైద్యసేవలందించడంతో ఉదయం 10 గంటల సమయంలో దేవి... పండింటి పాపకు జన్మనిచ్చింది. తల్డీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌లు దేవి, కుమారి, ఆయా బేబీలు సేవలు అందించారు. డోలీమీద తీసుకొచ్చిన విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో కలెక్టర్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంటనే స్పందించారు. మండల స్థాయి అధికారులకు సమాచారం అందించారు.
ఆస్పత్రిని సందర్శించిన మండల స్థాయి అధికారులు
స్థానిక ఎంపీడీవో ఎం.పోలినాయుడు, తహç సీల్దార్ ఎస్. రామశేషుతోపాటు తాటిపర్తి పం చాయతీ కార్యదర్శులు వి. శ్రీదేవి, పి.ఎల్. సతీ ష్‌కుమార్ తదితరులు పీహెచ్‌కి వెళ్లి చిన్ని దేవి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి.ఈశ్వరప్రసాదు, తాటిపర్తి మహిళా ఆరోగ్య కార్యకర్త రాణితోపాటు ఆశ కార్యకర్త చిన్ని రాజులమ్మ ఉన్నారు.
వర్షాకాలం వస్తే అంతే..
వర్షాకాలం వస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల మీద ఆశవదులుకోవలసి వస్తోంది. కొత్తవలస, గి.గొటివాడ మధ్య ఉరక గెడ్డ ఉంది. వర్షాలు కురిస్తే గెడ్డలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గెడ్డపై వంతెన లేకపోవడంతో ఆవతల ఒడ్డుకు చేరడం కష్టమవుతోంది. తప్పటం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం నుంచి కొత్తవలస నుంచి రహదారి, ఉరకగెడ్డ మీద వంతెన నిర్మిస్తామని హమీ లు ఇస్తున్నారు. ఇంతవరకు ఎవరూ హమీలు నెరవేర్చలేదు. వ ర్షం పడితే ఈ మార్గంలో ప్రయాణాలు సాగించలేం. గతంలో కూడా ఈ విధంగా డోలీ కట్టీ ఐదు కిలోమీటర్లు నడిచి తీసుకొచ్చాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల ఈ రహదారి పూర్తి కాలేదు. టీడీపీ ప్రభుత్వంకూడా ఉరకగెడ్డ మీద వంతెన నిర్మిస్తామ ని హామీ ఇచ్చీ నెరవేర్చలేదు. అధికారులు, గత పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికైనా స్పందించి, రోడ్డు, వంతెన నిర్మించాలి. –జనపరెడ్డి సన్యాసిరావు, గిరిజన సంఘం నాయకుడు, కొత్తవలస
రహదారి, వంతెన నిర్మించాలి
శంకరం పంచాయతీ శివారు కొత్తవలస గ్రామంలో 89 కుటుంబాలకు 350 మంది మంది నివసిస్తున్నారు. రహదారి సౌకర్యం లేదు. వర్షాకాలంలో ఉరకగెడ్డ పొంగి ప్రవహిస్తే గ్రామానికి రాకపోకలు స్తంభించి పోతాయి. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడ్డారు. తక్షణమే వంతెన, రహదారి నిర్మించాలి. – జనపరెడ్డి నూకరాజు, కొత్తవలస గ్రామం
Comments
Please login to add a commentAdd a comment