Doli
-
షాకింగ్ ఘటన: రోడ్డులేక డోలీలో ఆస్పత్రికి.. కవలలు మృతి!
ముంబై: దేశంలో ఇంకా చాలా గ్రామాలకు కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోడ్డు వసతి సరిగా లేకపోవటం వల్ల నెలలు నిండకముందే పుట్టిన కవల శిశువులు తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయారు. తన బిడ్డలను చూసుకుని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయిన ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది. సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో బాలింతను డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాల్ఘర్ జిల్లా మోఖడా తహసీల్‌కు చెందిన వందన బుధర్ అనే మహిళ ఏడు నెలల గర్భవతి. అయితే, నెలలు నిండకముందే తన ఇంటిలోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువులు బలహీనంగా ఉన్నారు. ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల వారికి సమయానికి సరైన వైద్య సహాయం అందలేదు. దీంతో తల్లి కళ్లెదుటే ఇద్దరు శిశువులు కన్నుమూశారు. మరోవైపు.. తీవ్ర రక్తస్రావంతో మహిళ పరిస్థితి సైతం విషమంగా మారింది. దీంతో బెడ్‌షీట్‌తో డోలీ తయారు చేసుకుని బాలింతను సుమారు 3 కిలోమీటర్లు దూరం మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మహిళ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్ర కిశోర్ వాగ్ ట్వీట్ చేశారు. సరైన సమయంలో వైద్యం అందకపోవటంతోనే కవల శిశువులు మరణించారని, అది దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు..! -
తప్పని డోలీ మోత.. దుప్పట్లు అడ్డంగా పెట్టి రోడ్డుపైనే ప్రసవం
సాక్షి, చింతపల్లి: తరతరాల నిర్లక్ష్యం ఇప్పటికీ మన్యవాసులకు శాపంగా మిగిలింది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాటిబందకు చెందిన నిండు గర్భిణి కొర్రా చిన్నిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం మార్గంమధ్యలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న చిన్నిని డోలిలో డౌనూరు ఆస్పత్రికి సమీపంలో ఉన్న రాసపనుకు తీసుకువెళ్లి అక్కడ నుంచి 108 వాహనంలో డౌనూరు తరలించే ప్రయత్నం చేశారు. దారిలో పురిటినొప్పులు అధికం కావడంతో రహదారి మధ్యలోనే దుప్పట్లు అడ్డంగా పెట్టి ఆమె వెంట వచ్చిన మహిళలు ప్రసవం జరిపారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లీ బిడ్డలిద్దరినీ డౌనూరు ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు కల్పించారు. -
తీరని కష్టాలెన్నో..!
ఒడిశా, మల్కన్‌గిరి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 7 దశాబ్దాలు దాటినా చాలా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. దీంతో అక్కడి గిరిజనులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య సదుపాయాల కోసం కొన్ని మైళ్ల దూరం కొండలు, గుట్టలు, వాగులు, నదులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే విషయాలు నేతలు, అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. వారిని ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలుగా స్వీకరించి, వారి అభివృద్ధి చర్యలను ఎవ్వరూ కాంక్షించడం లేదు. జిల్లాలోని చిత్రకొండ సమితిలో కటాఫ్ ఏరియాలోని నువాగుడ పంచాయతీలో ఉన్న పల్లీగుడ గ్రామానికి చెందిన డొంబునీ హంతాల్ అనే గర్భిణికి పురిటినొప్పులు సోమవారం ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె పడుతున్న బాధను తాళలేని కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో తాము రాలేమని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పింది. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కా రహదారికి తీసుకురావాలని సూచించారు. దీంతో చేసేదీ ఏమీ లేకపోవడంతో బాధితురాలి భర్త విష్ణు గ్రామస్తులతో కలిసి, భార్యను మంచంపై ఉంచి పక్కా రహదారి ఉన్న చిత్రకొండకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్‌లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గురుప్రియ వంతెన పూర్తయితే తమ ప్రాంతాలకు రహదారుల నిర్మాణాలు జరుగుతాయని అంతా అన్నారని, అయితే ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాలకు అంబులెన్స్‌లు వచ్చేలా పక్కా రహదారుల నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కొండ దిగొచ్చినా... దక్కని ఫలితం..!
ఆ యువకుడు సంక్రాంతి పండగకని ఊరొచ్చాడు. అంతలోనే మలేరియా, పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డాడు. గిరిజన గ్రామం కావడం, సకాలంలో వైద్యం అందక పరిస్థితి విషమించింది. ఇక చనిపోతాడని భావించిన తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా డోలీలో పట్టణానికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. ప్రాణం పోయింది. ఆ యువకుడు పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన నాగరాజు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం,శృంగవరపుకోట రూరల్: మండలంలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జరత నాగరాజు(22) మలేరియా, పచ్చకామెర్ల వ్యాధితో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బంధువులు, గిరిజనులు తెలిపిన వివరాలు.. పచ్చకామెర్లు, మలేరియాతో బాధపడుతున్న నాగరాజు ఇక బతకడని భావించిన తల్లిదండ్రులు వారి బంధువులకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫోన్లలో సమాచారం ఇచ్చారు. నాగరాజు పరిస్థితి తెలుసుకున్న పెదనాన్న కుమారుడు, గిరిజన సంఘం నేత జె.గౌరీష్ వెంటనే డోలీ కట్టి తీసుకువస్తే ఆస్పత్రిలో చేర్పించి చివరి ప్రయత్నం చేద్దామని గట్టిగా చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు బీమయ్య, పెంటయ్యతో పాటు ఇతర బంధువులు డోలీ సాయంతో నాగరాజును మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు(సుమారు పది కిలోమీటర్లు నడిచి) ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన దబ్బగుంట వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ఎస్.కోటలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి కోమాలో ఉన్న నాగరాజును తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి విజయనగరం మహరాజా ఆస్పత్రికి రిఫర్ చేశారు. విజయనగరంలో మూడు గంటల పాటు చికిత్స పొందిన నాగరాజు అంతలోనే మృతి చెందాడని అన్నయ్య గౌరీష్ రోదిస్తూ చెప్పాడు. నాగరాజు రాజమండ్రిలో ప్రైవేటుగా పని చేసే వాడని, సంక్రాంతి పండగకొచ్చిన కొద్ది రోజులకే రోగంతో మంచం పట్టాడని తెలిపాడు. రోడ్డు లేకనే ఇలా.. దారపర్తి గిరిశిఖర పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకనే రోగాల బారిన పడిన గిరిజనులు మృత్యువాత పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని గిరిజన సంఘం నాయకులు జె.గౌరీష్, ఆర్.శివ, మద్దిల రమణ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కొండపైన గల గిరిజన గ్రామాలకు కనీస రహదారులు ఏర్పాటు చేసే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైనా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. -
ఆగని డోలీ కష్టాలు
విజయనగరం, శృంగవరపుకోట రూరల్ : గిరిజన పల్లెలను రహదారి సమస్య వేధిస్తోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి తరలించడానికి డోలీ అనివార్యమవుతోంది. శృంగవరపుకోట మండలంలో నెలలు నిండిన ఓ గర్భిణిని డోలీ సాయంతో ఆదివారం మైదాన ప్రాంతానికి తీసుకువచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కొట్టాం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ముమ్ములూరి ఫణీంద్ర ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్ తాతారావు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఫీడరు అంబులెన్స్ సాయంతో శృంగవరపుకోట పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శృంగవరపుకోట మండలం, దారపర్తి గిరిశిఖర పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుమిత్ర అనే గర్భిణికి ఉదయం 6గంటల సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. బాధతో విలవిలలాడుతున్న ఆమెను భర్త సన్యాసిరావు, తోటి గిరిజనులు అప్పటికప్పుడు డోలీ కట్టిసుమారు 9 కిలోమీటర్లు రాళ్లు, గుట్టల రహదారిలో బొడ్డవర పంచాయతీకి చెందిన దబ్బగుంట మైదాన గ్రామం వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ఫీడరు అంబులెన్స్‌లో ఎస్.కోటలోని సీహెచ్‌సీలో చేర్చగా సూపరింటెండెంట్ డాక్టర్ రంధి త్రినాథరావు ఆమెకు చికిత్స అందించా రు. మరో 24 గంటల్లో ఆమె ప్రసవించే అవకా శం ఉన్నందున జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రహదారి లేకనే ఇలాంటి కష్టాలు గిరిశిఖర గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకనే గర్భిణులు, రోగులను మైదాన ప్రాంతం వరకు డోలీలో దిగువకు మోసుకుని రావాల్సి వస్తోందని, ఇలాంటి సమయాల్లో ఒక్కోసారి మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతు న్న సందర్భాలు కూడా ఉన్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్.కోట మండలంలో పర్యటించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి రోడ్డు సమస్య తీసుకెళ్లినట్టు చెప్పారు. గడచిన వారం రోజుల్లోనే గిరిజన గ్రామం నుంచి నిండు గర్భిణిని డోలీలో మైదాన ప్రాంతానికి తీసుకు రావడం ఇది రెండోది. -
ప్రసవం కోసం 10 కి.మీ నడక
తమిళనాడు, సేలం: పురిటి నొప్పులతో అల్లాడుతున్న మహిళను గ్రామస్తులు డోలిలో ఆరు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత లారీలో ఆస్పత్రికి తరలిస్తుండగా అందులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మంగళవారం ఉదయం అందియూర్ కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ రోడ్ జిల్లా అందియూర్‌లో బర్గూర్ వద్ద కొండ ప్రాంతం ఉంది. ఈ కొండపై సుండాపూర్ గ్రామ ఉంది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బస్సు కూడా లేదు. ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం కాలినడకన తామరైకరై వరకు నడిచి వచ్చి, తర్వాత అక్కడి నుంచి వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో సుండాపూర్ గ్రామానికి చెందిన మాదేశ్, అతని భార్య కుమారి (23) ఇద్దరు కూలీ కార్మికులు. వీరికి ఇది వరకే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మళ్లీ గర్భవతి అయిన కుమారికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు ఏర్పడ్డాయి. బస్సు సౌకర్యం లేకపోవడంతో నొప్పులతో అల్లాడుతున్న ఆమెను డోలి కట్టి అందులో ఆస్పత్రికి తరలించడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో మట్టి రోడ్డు అతలాకుతలంగా ఉంది. అయినా అధిక శ్రమకోర్చి తీసుకువచ్చారు. ఆరు కిలో మీటర్లు దూరం నడచి రాగా, అప్పుడు అక్కడికి వచ్చిన ఒక మినీ లారీలో కుమారిని ఎక్కించారు. నొప్పులు ఎక్కువ కావడంతో మాదేశ్తల్లి కన్నియమ్మాల్ తన కోడలు కుమారికి ప్రసవం చేసింది. కుమారికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. తర్వాత అదే లారీలోనే తామరైకరై ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇకనైనా అధికారులు తాము మనుషులమేనని, తమ అవసరాలను గుర్తించి గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
ఎన్నాళ్లీ వేదన!
సాక్షి, అనంతగిరి(అరకులోయ): ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందడానికి గిరిజనులు కాలినడకన, లేదా డోలీల్లో ఆస్పత్రులకు చేరుకోవలసి వస్తోంది. ఆస్పత్రులకు చేరే వరకు వారి ప్రాణాలు నిలు స్తాయన్న నమ్మకం ఉండడం లేదు. ఇలా తరలించే సమయంలో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పాడేరు, అరకులోయ మండలాల్లో ఈ పరిస్థితి నిత్యం ఎదురవుతోంది. ఒకే కుటుంబా నికి చెందిన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు యువకులను కుటుంబ సభ్యులు ఏడు కిలోమీటర్లు డోలీలో తరలించవలసి వచ్చింది. అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ డెక్కపురం, హుకుంపేట మండలం పట్కదవడ గ్రామాలు సమీపంలో పక్కపక్కన ఉన్నాయి. వీటికి రహదారి సౌకర్యం లేదు. డెక్కపురానికి చెందిన గెమ్మలి విజయ్ అనే యువకుడు కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక బాధపడుతున్నాడు. పట్కదవడ గ్రామానికి చెందిన గెమ్మెలి చంటి అనే యువకుడికి గుండెనొప్పి వచ్చింది. వీరి ఆరోగ్య పరిస్థితి సోమవారం క్షీణించింది. దీంతో ఆ గ్రామాల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం వరకు వారిని రెండు డోలీల్లో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో అనంతగిరి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం చంటిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి, విజయ్ను కేజీహెచ్‌కు తరలించారు. తాము ఈ బాధలు భరించలేకపోతున్నామని, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
డోలీపై నిండు గర్భిణి తరలింపు
విశాఖపట్నం, పాడేరు రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విశాఖ ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలు మృగ్యంగా మారాయి. దీంతో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గర్భిణులు ప్రసవం కోసం, రోగులు చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా పాడేరు మండలం మారుమూల బడిమెల పంచాయతీ వల్లాయి గ్రామంలో ఓ గర్భిణిని కాన్పు కోసం ఆస్పత్రికి డోలీపై తరలించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వల్లాయి గ్రామానికి చెందిన సోమెలి సూర్యకుమారి అనే గిరిజన మహిళ తొమ్మిది నెలల గర్భిణి. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించడం అనివార్యమైంది. గ్రామానికి అంబులెన్స్ వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. చేసేది లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం పద్మ సహకారంతో డోలీపై మోస్తూ అడవి మార్గం గుండా సుమారు 7 కిలోమీటర్ల మేర ఉన్న బడిమెల వరకు తీసుకొ చ్చారు. అక్కడి నుంచి మినుములూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, అంబులెన్స్ పైలెట్ బి.కొండబాబు సూర్యకుమారిని అంబులెన్స్‌లో మినుములూరు పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. దీంతో ఆమెకు ప్రాణపాయం తప్పింది. బుధవారం సాయంత్రం ఆమె మినుములూరు పీహెచ్సీలో పండంటి ఆడ శిశువును ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. -
ఆ ఐదు గంటలు... క్షణమొక యుగంలా..
సుమారు ఐదు గంటల పాటు ఆమె అనుభవించిన నరకయాతన అంతా ఇంతా కాదు... ఓ కర్రకు కట్టిన చిన్న దుప్పటి డోలీలో కూర్చొని ఐదు కిలో మీటర్ల దూరం ప్రయాణించిన ఆమె తీవ్ర వేదనకు గురైంది. ఒక వైపు విపరీతమైన పురిటి నొప్పులు, మరో వైపు బురదమయంగా ఉన్న రోడ్డుపై తీవ్రమైన కుదుపుల మధ్య ప్రయాణం...కనీసం పక్కకు ఒరిగేందుకు వీలులేని పరిస్థితి...ఇంకో వైపు కడుపులో బిడ్డకు ఏమవుతుందోనన్న భయంతో ఆ తల్లి మనసుతీవ్రంగా తల్లడిల్లిపోయింది. విశాఖపట్నం ,మాడుగుల రూరల్: సౌకర్యాలు పెరిగాయి... అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకొంటున్నా... గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాస్తవపరిస్థితులు అలా లేవు. ముఖ్యంగా ఆదివాసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. వారి జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. గిరిజన గ్రామాల్లో మహిళలు గర్భం దాలిస్తే వారిలో ఆనందం కంటే భయమే ఎక్కువగా కనిపిస్తుంది. కడుపులో బిడ్డ నేలమీదకు వచ్చేంతవరకు ఆ పసిప్రాణంపై ఆశలు పెట్టుకునే పరిస్థితి అసలుండదు. వైద్యం అందుబాటులో లేక, ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యంలేక నెలల తరబడి ఆ తల్లులు పడిన వేదన మాటలకందనిది. ఇందంతా ఒక ఎత్తయితే ప్రసవ సమయంలో వారు మరింతగా నరకయాతన గురవుతున్నారు. రోడ్డు, రవాణా సౌకర్యం లేక కిలో మీటర్ల కొద్దీ డోలీలో మోసుకెళ్లి ఆస్పత్రులకు తరలించవలసి వస్తోంది. తాజాగా మాడుగుల మండలంలో కొత్తవలస గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ఐదు కిలో మీటర్లు ఇలా డోలీలో తరలించవలసి రావడంతో ఆమె నరకయాతనకు గురైంది. మాడుగుల మండలంలో గిరిజన పంచాయతీ శంకరం శివారు గ్రామమైన కొత్తవలసకు చెందిన చిన్ని దేవి నిండు గర్భిణి. ఆమెకు ఈ ఆదివారం(నెల 21వ తేదీ) ప్రసవం జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. శనివారం ఆమె దగ్గరకు వెళ్లిన ఏఎన్ఎం...ప్రసవ సమ యం దగ్గర పడడంతో పీహెచ్సీలో చేరాలని సూచించింది. అయితే తాను తరువాత జాయిన్ అవుతానని గర్భిణి తెలిపింది. ఆదివారం ఉదయం 6 గంటలకు దేవికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కొత్తవలస గ్రామం నుంచి సరైన రహదారి సౌకర్యం లేదు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొత్తవలస నుంచి డి.గొటివాడ వరకు రహదారి బురదమయంగా మారి, గోతులతో నిండిపోయింది. దీనికి తోడు ఆ గ్రామం మధ్యలో ఉన్న ఉరకగెడ్డలో మోకాలు వరకు నీరు ప్రవహిస్తోంది. వాహనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న దేవిని ఆదివారం ఉదయం డోలీలో పడుకోబెట్టి ఆమె భర్త నూకరాజు, కుటుంబ సభ్యులు ఐదు కిలో మీటర్లు అవస్థలు పడుతూ బురదలో జారిపోకుండా జాగ్రత్తగా అడుగువేస్తూ.. డి.గొటివాడ గ్రామం వద్దకు తీసుకొచ్చారు. డోలీలో ఉన్నంత సేపు గర్భిణి నరకయాతన అనుభవించింది. సమాచారం అందుకున్న సిబ్బంది 108 వాహనంతో డి.గొటివాడ వద్దకు వెళ్లి గర్భిణిని ఎక్కించుకుని కేజే పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నికి తీసుకొచ్చారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది వెంటనే వైద్యసేవలందించడంతో ఉదయం 10 గంటల సమయంలో దేవి... పండింటి పాపకు జన్మనిచ్చింది. తల్డీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌లు దేవి, కుమారి, ఆయా బేబీలు సేవలు అందించారు. డోలీమీద తీసుకొచ్చిన విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో కలెక్టర్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంటనే స్పందించారు. మండల స్థాయి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రిని సందర్శించిన మండల స్థాయి అధికారులు స్థానిక ఎంపీడీవో ఎం.పోలినాయుడు, తహç సీల్దార్ ఎస్. రామశేషుతోపాటు తాటిపర్తి పం చాయతీ కార్యదర్శులు వి. శ్రీదేవి, పి.ఎల్. సతీ ష్‌కుమార్ తదితరులు పీహెచ్‌కి వెళ్లి చిన్ని దేవి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి.ఈశ్వరప్రసాదు, తాటిపర్తి మహిళా ఆరోగ్య కార్యకర్త రాణితోపాటు ఆశ కార్యకర్త చిన్ని రాజులమ్మ ఉన్నారు. వర్షాకాలం వస్తే అంతే.. వర్షాకాలం వస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల మీద ఆశవదులుకోవలసి వస్తోంది. కొత్తవలస, గి.గొటివాడ మధ్య ఉరక గెడ్డ ఉంది. వర్షాలు కురిస్తే గెడ్డలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గెడ్డపై వంతెన లేకపోవడంతో ఆవతల ఒడ్డుకు చేరడం కష్టమవుతోంది. తప్పటం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం నుంచి కొత్తవలస నుంచి రహదారి, ఉరకగెడ్డ మీద వంతెన నిర్మిస్తామని హమీ లు ఇస్తున్నారు. ఇంతవరకు ఎవరూ హమీలు నెరవేర్చలేదు. వ ర్షం పడితే ఈ మార్గంలో ప్రయాణాలు సాగించలేం. గతంలో కూడా ఈ విధంగా డోలీ కట్టీ ఐదు కిలోమీటర్లు నడిచి తీసుకొచ్చాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల ఈ రహదారి పూర్తి కాలేదు. టీడీపీ ప్రభుత్వంకూడా ఉరకగెడ్డ మీద వంతెన నిర్మిస్తామ ని హామీ ఇచ్చీ నెరవేర్చలేదు. అధికారులు, గత పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికైనా స్పందించి, రోడ్డు, వంతెన నిర్మించాలి. –జనపరెడ్డి సన్యాసిరావు, గిరిజన సంఘం నాయకుడు, కొత్తవలస రహదారి, వంతెన నిర్మించాలి శంకరం పంచాయతీ శివారు కొత్తవలస గ్రామంలో 89 కుటుంబాలకు 350 మంది మంది నివసిస్తున్నారు. రహదారి సౌకర్యం లేదు. వర్షాకాలంలో ఉరకగెడ్డ పొంగి ప్రవహిస్తే గ్రామానికి రాకపోకలు స్తంభించి పోతాయి. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడ్డారు. తక్షణమే వంతెన, రహదారి నిర్మించాలి. – జనపరెడ్డి నూకరాజు, కొత్తవలస గ్రామం -
నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!
సాక్షి, విజయనగరం: గర్బిణికి పురిటినొప్పులు రావడంతో ఆమెను డోలీపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ దయనీయ సంఘటన వీ.మాడుగుల మండలం శంకరం పంచాయతీ కొత్తవలసలో ఆదివారం చోటుచేసుకుంది. కొత్తవలస గ్రామానికి చెందిన గర్బిణీ జనపరెడ్డి దేవీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ ఆ గ్రామంలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో బంధువులు 15 కిలోమీటర్లు డోలీలో తీసుకెళ్లి కేజేపురం ఆసుపత్రికి చేర్పించారు. అక్కడ ఆమె ఆడపిల్లను ప్రసవించింది. కాగా సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదం తప్పింది. కొత్తవలస నుంచి శంకరం వరకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో గిరిజనులు అత్యవసర సమయాల్లో డోలీని ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎవరికైన ఆపద వస్తే వారి బంధువులే డోలీ కట్టి, అందులో వారిని కూర్చుండబెట్టి కిలోమీటర్లు నడక సాగించి ఆసుపత్రికి చేరుస్తున్నారు. కొన్నిసార్లు అత్యవసర వైద్యం అందక దారి మధ్యలోనే మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. కాగా అక్కడి గిరిజనులు రోడ్డు సదుపాయం కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. -
డోలీయే శరణ్యం
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం): డొంకాడ గిరిజన గ్రామం. ఇది నర్సీపట్నానికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గొలుగొండ మండలంలో డొంకాడ ఓ గ్రామం. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీయే వారికి రవాణాసాధనం. ఆ గ్రామానికి చెందిన కొర్రా మల్లేశ్వరి అనే మహిళకు సోమవారం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ప్రధాన రోడ్డుకి రావాలింటే నాలుగు కిలోమీటర్లు అడవి మార్గం దాటాలి.దీంతో గ్రామస్తులు డోలి కట్టారు. అడవిని దాటించి, అక్కడ 108 వాహనం ఎక్కించారు.నర్సీపట్నం తీసుకువెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని విశాఖపట్నం తరలించారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కవగా ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో ఉన్న గొలుగొండ మండలం డొంకాడ గ్రామానికి కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంత్రి నియోజకవర్గంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని గిరిజనులు వాపోతున్నారు. గత ఏడాది గర్భిణికి సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రసవ వేదన.. నరకయాతన
విశాఖపట్నం, జీకే వీధి(పాడేరు): గిరిజనుల వైద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. మన్యంలో చాలా గ్రామాల్లో రహదారి సౌకర్యం లేనందున కనీసం 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో వ్యాధి గ్రస్తులు, గర్భిణులను డోలిమోతతో ఆస్పత్రులకు తరలించక తప్పడం లేదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆదివారం గొందిపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణినికి ఇదే పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గొందిపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. ఆ గ్రామానికి చెందిన కిల్లో దుర్గ పురిటినొప్పులతో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల దూరంలో గల జీకే వీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డోలీ మోతతో తీసుకువచ్చారు. సమయానికి తీసుకురావడంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైన పాలకులు తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జోరు వానలో.. 12 కి.మీ.లు డోలీలో..
సాలూరు రూరల్: మన్యంలో రహదారులు లేకపోవటంతో అడవి బిడ్డలు నానా అగచాట్లు పడుతున్నారు. అనారోగ్యానికి గురైతే కిలోమీటర్ల కొద్దీ డోలీల్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర కొడమ పంచాయతీ సిరివర గ్రామంలో ఓ బాలింత అనుభవించిన నరకయాతన గిరిజనుల అవస్థలకు అద్దంపట్టింది. గ్రామానికి చెందిన గిందెకు ఆదివారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. నెలలు నిండకుండానే మూడో కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు గిందెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. భర్త డుంబ్రి, స్థానికులు డోలీకట్టి అందులో గిందెను ఉంచి సోమవారం 12 కి.మీ.కు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరుకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం. -
డోలీ
సాయంత్రం... చిన్నారి పెళ్ళి కూతురు కన్నీరు పెడుతున్న వేళ. సన్నగా చినుకులు మొదలయ్యేయి. కొండమీద నుంచి పశువులతో పాటు మనుషులు కూడా వూరు చేరడంతో అలికిడి అప్పుడే మొదలయ్యింది. నులక మంచాలకింద కుంపట్లు ఒళ్ళువిరుచుకుంటున్నాయి. అప్పుడే... అంతదాకా కుక్కిమంచమ్మీద ముతక దుప్పటిలో మూలుగుతున్న సింగన్న పడాల్ భళ్ళున వాంతి చేసుకున్నాడు. అతడి వయసు పద్నాలుగేళ్ళు. చినుకులు వానగా మారాయి. ఈదురు గాలి తోడై రొజ్జకొట్టింది. బ్రేక్ రావడంతో కొందరు పడాల్ వైపు చూసేరు. మరికొందరు ఇది మామూలే అన్నట్టు ముందుకే చూస్తూ వుండిపోయేరు. మొగలిరేకులు మొదలయ్యింది. వార్తల్లో కొత్త రాజధాని మెరిసి మాయమయ్యింది. జోడీ కట్టిన జంటలు ఢీ కొట్టేయి. పడాల్‌కి వాంతులు ఎక్కువయ్యేయి. పిల్లలు ఎక్కడివాళ్లు అక్కడే నిదరపోయేరు. ‘‘ఎప్పుడు కాసి అవుతున్నాయి.?’’ పడాల్ పక్కకి చేరి అడిగేడు రామన్నదొర. అడిగేడు కానీ అతనికీ తెలుసు పడాల్ మంచమెక్కి మూడు రోజులయ్యిందని. ‘‘నిన్నటి కాసే...’’ మంచం కింద వాంతిని నీళ్ళతో కడిగి కింద కుంపటి సరి చేస్తూ చెప్పింది తల్లి. ‘‘ఏటేనే తిన్నాడా?’’ లేదన్నట్టు తలవూపింది. కానీ అతనికి తెలుసు మొన్న అతనేమి తిన్నాడో. మూడురోజుల క్రితం పందిముక్కు దుంపలు తవ్వి తెచ్చేడు అడవిలోంచి. అవి ఉడకబెట్టి తిన్నాడు. అంతవరకూ బాగుంది కానీ అవి సరిగ్గా ఉడక్కపోవడమే వచ్చింది సమస్య. ఆ రోజు రాత్రే మేక మాంసం కూడా తినేయడంతో...మళ్ళీ వాంతి చేసుకున్నాడు పడాల్. గడపలో నీచు కంపు మరింత ముదిరింది. పడాల్ ఆపసోపాలు పడిపోతున్నాడు. కుంపట్లో గుగ్గిలం గుండ వేయడంతో గడప వాసన మారింది. ‘‘నాగరాజు దగ్గిరకెల్లి మాత్రలున్నాయేటో సూడుమీ’’ పంపించేడు రామన్నదొర పక్కింటి యువకుడ్ని. వాడు వెళ్ళొచ్చేడు. ‘‘లేవట మామా! కిందిటి నెల యేయెన్నెమ్ ఇచ్చిన మాత్రలు అయిపోయినాయట’’ అని తూలుతూ రాటకి చేరబడ్డాడు. ఆ మాటతో వెంటనే సెల్ తీసి ఏదో నంబర్ డయల్ చేసేడు. ఫోన్లో రింగ్‌ని వింటూనే రాటవైపుకి చూసేడు. వాడు తాగి వున్నాడని తెలిసిపోతూనే వుంది. చదువుకున్నవాడే కానీ తాగుడుకి బానిసైపోయేడు. ‘వూర్లో మాత్ర కంటే మందే సులభంగా దొరకడం! ...ప్చ్!’‘‘హలో?’’ ‘‘చెప్పు దొరన్నా!’’ అటునుంచి ఏయెన్నెం గొంతు వినపడింది. ‘‘పడాల్‌కి వాంతులవుతున్నాయి’’ ‘‘నేనిచ్చిన మాత్రల్లో డొమెస్టాల్ అని చిన్న మాత్ర వుంటాది తీసి వెయ్యించండి’’‘‘ఏ మాత్రలూ లేవట’’ ‘‘అదేటీ అన్నీ అయిపోయ్యా?’’ ‘‘అయిపోనాయీ... లేకపోతే మాకేటి సరదాయేటి...?’’‘‘హలో?’’‘‘హలో??’’‘ఈ రోజు ఐటీ అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలి. ప్రపంచంలో ఏ మూల నుంచైనా తెలుగువాడు గర్వపడేలా రాజధాని నిర్మాణం చేస్తున్నాం. అందుకు మీరందరూ సహకరించాలి’ టీవీ ముందు ఎవ్వరూ లేకపోయినా దానంతటదే వాగుతోంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడాల్ మంచం చుట్టూ వున్నారు. ‘‘ఇప్పుడేటి సేస్తామైతే?’’ సందేహం వెలిబుచ్చాడు నడి వయసులోవున్న వ్యక్తి. వాన పెరిగింది. పడాల్ వాంతుల్లాగే.‘‘ఎజ్జోడికి పిలండి’’ వెనక నుంచి ఎవరో అన్నారు. ‘‘కాదు. ఆస్పిటల్కి తీసికెల్దుమ’’ చదువుకున్న రామన్న దొర అన్నాడు. అతని వైపు అందరూ ఆశ్చర్యంగా చూసేరంతా.ఎందుకంటే...వాన. ఆపై రాత్రి. వూరు దాటాలంటే బురద దారిలో కొండ దిగాలి. మధ్యలో గెడ్డ దాటాలి. ఒకవేళ తీసుకు వెళ్ళాన్నా తెల్లవారే సాధ్యంగానీ ఇప్పుడు సాధ్యం కాదని అందరికీ తెలుసు. ‘కిందకి దించకపోతే లాభం లేదు’ తనలో తాను అనుకున్నా అది బయటికి వినపడింది. అతను హాస్పిటల్‌కి చేరకపోతే మొన్న జరిగిన చావులాగే ఇదీ జరగొచ్చు. అంతదాకా దుఃఖాన్ని గొంతులో నొక్కిపెట్టి ఆపుకున్న తల్లి ఆ మాటతో ఒక్కసారి ఏడుపందుకుంది. అందరూ బిక్కచచ్చిపోయేరు. వూర్లో వున్న మిగతా గడపలు ఉలిక్కిపడ్డాయి. ఏదో కీడు శంకించేరు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుతున్నారు. వాన మరింత ముదిరింది. గాలి విసిరికొడుతోంది. కొడుకు పక్కనే చుట్ట కాలుస్తూ నేల చూపులు చూస్తూ వుండిపోయేడు పడాల్ తండ్రి సోమన్నపడాల్. అతడి ముఖంలో ఏ భావమూ కనిపించడం లేదు. ఏమి చెయ్యాలో తోచక ఎజ్జోడి రాక కోసం ఎదురు చూస్తూ వుండిపోయేడు. రామన్న దొర నలుగురు కుర్రాళ్ళని కూడదీసేడు. రెండు కర్రల్ని తెప్పించేడు. గట్టి దుప్పటి నాలుగు చివర్లనీ రెండు కర్రలకి ముడి వేసేడు. డోలీ కట్టిస్తున్నాడని అందరూ అక్కడి ఏర్పాట్లని చూస్తూ వుండిపోయేరు. ఇది సాధ్యమా కాదా అని అందరిలోనూ ప్రశ్న. రామన్న దొర తన పని తాను చేసుకుపోతున్నాడు. దొర వూరిలో డిగ్రీ చదివిన మొదటి కుర్రాడు. అతని తర్వాత డిగ్రీ చేస్తున్న వాళ్ళున్నా కొందరు వూర్లో వున్నారు. మరికొందరు హాష్టళ్ళలో వుంటున్నారు. సెలవులకే వూరు చేరుతారు. ‘ఏటిప్పుడు డోలీ మీద దించీగలమనే ఇదంతా సేస్తున్నావేటి?’’ అడిగేడు ఒక నడివయసాయన. ‘‘లేకపోతే ఈడినిలాగే ఒదిలేస్తమా?’’ డోలీ కడుతూనే సమాధానమిచ్చేడు రామన్నదొర.‘‘వాన సూస్తే ఇలగుంది. డోలీ అని తయారైపోతున్నారు. ఎలాగవుద్దివోయ్?’’ మరోసారి అనుమానం వ్యక్తం చేసేడు. ‘‘గొడుగులున్నాయిగదా? తియ్యండి’’ ఎలాగైనా పడాల్ని కొండదించడానికే నిర్ణయించుకున్నట్టు అన్నాడు. ‘‘గొడుగులుంతే? దారి కనపడొద్దేటి?’’ మరొక అనుమానం తెరలేపేడు. ‘‘టార్చీలైటుంది గదా అడగండి కొసాయింటి మంగన్న దగ్గర?’’‘‘ఉంది. గానీ బేటరీల్లేవు’’‘‘సెల్ఫోన్లు పట్టండి... ఏది ఏటైనా ఈడినీ రాత్రి కొండ దించాల’’ అని నిలబడ్డాడు. ‘‘ఒద్దు బాబు...!’’ అని నిలబడింది పడాల్ తల్లి ఉన్నట్టుండి. అందరూ ఆమె వైపు చూసేరు. ‘‘పోతే ఇక్కడే నా ఇంటి కాడే పోనీ గానీ..’’ అని గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆమె వయసు నలభై దాటి వుంటుంది. డెబ్బైయ్యేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎదిగిన ఏ నగరాన్నీ చూసి వుండదు... దగ్గర్లోని సంతని తప్ప. మొదటిసారి నగరానికి తన కొడుకుని ఈ స్థితిలో తీసుకు వెళ్ళడం ఆమెకు నమ్మకం కలగడం లేదు. బోరున ఏడుస్తోంది వర్షంలా.‘‘నువ్వొల్లకోయే ఏటైపోయిందని ఏడిసెత్తున్నావు’’ అని కసురుకున్నారు. రామన్నదొర ఇవేవీ పట్టించుకునేలా లేడు. తన పనేదో తాను చేసుకుపోతున్నాడు. మరికొందరు సెల్ఫోన్లో సిగ్నల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. గడపలో టీవీ మాత్రం అదే పనిగా వాగుతోంది. ఇంకా పడుకోని పిల్లలు రిమోట్ కంట్రోల్‌తో చానల్స్ మారడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఒకదాని తర్వాత మరొకటి మారుస్తూనే వున్నారు. డోలీ సిద్ధమైంది. చినుకుల ఉధృతి కాస్త తగ్గినట్లైంది. పడాల్ని మంచం మీది నుంచి డోలీకి మార్చేరు. పడాల్ తల్లి శవాన్ని ఎత్తినట్టు భావించిందేమో గొల్లున మరొక్కసారి ఏడుపందుకుంది. అందరూ ఆమెను ఓదార్చి ఇంట్లోకి తీసుకుపోయేరు. గొడుగూ, గిడుగులతో...రెండు కర్రలకూ నాలుగు వైపులా నలుగురు మోస్తూ...సెల్‌ఫోన్ వెలుతురులో... ఆకాశం ఉరుముతుండగా...డోలీ కొండ దిగుతోంది.ముందు నడుస్తున్న వాళ్ళ చేతుల్లో కర్రలున్నాయి ఆపదొస్తే ఆయుధాల్లా ఉపయోగించడానికి. డోలీ ఊరు దాటిందో లేదో కళ్ళు జిగేల్మనేలా మెరుపు మెరిసింది. అందరి కళ్ళూ బైర్లు కమ్మినట్లైంది. ఒక్కసారి ఆగి మళ్లీ కదిలింది డోలీ. అలవాటైన దారే. కానీ ఆకాశం ఇలాగున్నపుడు దారి ఎలా మారిపోతుందో ఎవ్వరికీ అంతు చిక్కదు. వానలో కొండదారి ఉనికిని మార్చుకుంటూ వుంటుంది. అక్కడక్కడా రాళ్లు జారిపోతుంటాయి. మట్టి కరిగి కొండనీటికి కొత్త దారినిస్తుంటాయి. దారి కాలువైపోతుంటుంది. పట్టు తప్పితే ప్రమాదం పొంచి వుంటుంది. అందరూ గుడ్డిగా నడుస్తున్నారు. నడుస్తున్న దారి ఇప్పటిది కాదు. తాము పుట్టి బుద్దెరిగిన నుంచీ నడుస్తున్న దారి. తామే కాదు తాతలు నడిచిన దారి కూడా. ఈ దారి మీద ఎన్ని తరాలు నడిచేయో! ఇంకెన్ని తరాలు నడవాల్సి వుంటుందో?! సెల్‌ఫోను లైటు కన్నా వెయ్యకుండా వుంటేనే కాస్త వెలుతురు వున్నట్టు గమనించేరు. అందరూ చీకట్లో నిశ్శబ్దంగా నడుస్తున్నారు. కొందరు సిగ్నల్ తగులుతుందేమోనని అక్కడక్కడా ఆగి సెల్‌ఫోన్‌ని ఆన్ చేసి చూస్తున్నారు. డోలీలో పడాల్ ఊపిరి మాత్రమే తీస్తున్నాడు. చినుకులు ఆగేయి. మబ్బులు పల్చబడ్డాయి. దారి ముందుకన్నా స్పష్టంగా కన్పిస్తోంది. రాళ్ళున్న చోట జాగ్రత్తగా దిగుతూ, నీరు పారుతున్నచోట డోలీని ఎత్తి నడుస్తూ ముందుకు సాగుతున్నారు. కొండ దిగిపోయింది డోలి. ఇప్ప చెట్ల కింద నుంచి మామిడి మాను తోటలోకి దారి దూరింది. ఎవరిదో సెల్‌ఫోన్ బ్లింక్ అయింది. సిగ్నల్ అందిందన్న ఆనందంతో అందరి ఫోన్లూ చెక్ చెసుకుంటున్నారు. కానీ....ఎదురుగా వాగు. గర్జిస్తోంది. రెండు కొండల నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాటడం కష్టం. ‘‘నీను సెప్పినానా లేదా?’’ అంటూ ముందుకొచ్చేడు మండింగి సిమ్మడు. ‘‘దాటలేమురా అంతే ఇన్నారా?.. ఇప్పుడు పడండి. ఇంటికాడుండుంతే వానకైనా తడకుండుందుము’’ అన్నాడు. డోలీ భుజాలు మారింది. మోసినోళ్ళ కాళ్ళు వణుకుతున్నాయి. ఎక్కడా దించకుండా నడవడం వల్లేమో అందరూ గట్టిగా వూపిరి తీస్తున్నారు. చినుకుల్లో చెమట. డోలీలో పడాల్ వాంతితో దుప్పటి మరింత కంపు కొడుతోంది. ‘‘ఏటి సేద్దుమంతే ఏటిసేద్దుమని వల్లకుండా ఏదో ఒకటి సెయ్యండ్రా! ఇలాంటివి మనకేటి కొత్తా యేటి?’’ అసహనాన్ని ప్రదర్శించేడొకరు. ‘‘గొల్లు సెయ్యకండ్రా! ఏయేనమ్మకి ఫోనురింగవుతుంది...హలో?’’‘‘హలో?’’‘‘మీమిప్పుడు పడాల్ని డోలీ యేసి పట్టుకొచ్చీసినాము హాస్పిటల్కని... గానీ ఇక్కడ వాగు బాగా పారుతుంది. ఏటి సెయ్యడము?’’‘‘నీనేటి సెయ్యగలను? హాస్పిటల్‌కి తెచ్చేస్తే ఎదో ఒకటి చేద్దాం.. ఈ లోగా నీను నూటెనిమిదికి ఫోను చేస్తాను’’ అంటూ పెట్టేసింది. వాగు...ఇక్కడ ఒక కాజ్వే కట్టండని ఎన్నిసార్లు కాగితాలు పెట్టేమో గుర్తొచ్చింది రామన్న దొరకి. ఈ దారి గుండా నాలుగూర్లు నడకదారి సాగుతుంటుంది. ఎన్నిసార్లు దీని పేరు పెట్టుకుని... ఇక్కడ ఇది కట్టిస్తానని ప్రెసిడెంట్లు ఎంతమంది మారేరో గుర్తుకొచ్చింది. ఎంతమందికి అధికారులకీ, ఎమ్మెల్యేలకి దండాలు పెట్టేమో గుర్తొచ్చింది. వాన పడితే వాగు పొంగుతుంది. వాగు పొంగితే దారి ఆగిపోతుంది. ఈ దారి దాటుతూ ఎంతమంది ప్రాణాలొదిరేరో!? ఎన్ని పశువులు ఇక్కడ జారిపడి కొట్టుకుపోయాయో?!ఈ రాత్రివేళ డోలీ దాటించడమెలాగో ఆలోచిస్తున్నాడు రామన్న దొర. అదే సమయంలో అతన్ని ఆడిపోసుకుంటున్నారు.. ఈ వానకి గెడ్డ పొంగుతాదని తెలీదా అని. అందరికీ ఒక్క గసురు గసిరి తిరిగి తిట్టేడు. దారి ఎలాగైనా దాటించి వీడిని డాక్టరు దగ్గరకి చేర్చకపోతే వీడు చచ్చిపోతాడని మందలించేడు. ఊర్లో జరిగిన చావుల్ని గుర్తు చేసేడు. వాటికి కారణాల్ని విశ్లేషించేడు. కారణం ఆలస్యమని చెప్పేడు. ‘‘బాగుందిరా దొర! ఈ గెడ్డెలగ దాటిస్తావో అది ముందు సెప్పు’’ అందరూ ప్రశ్నించేరు. ‘‘ఒరే నాగన్నా! గొడ్డలి తెచ్చేవుగలా?’’ అంటూ నాగడి వైపు చూసేడు. ‘‘అర్దమైందిలే! గానీ ఈ యేలప్పుడు ఏ సెట్టు కొట్టెస్తావూ? ఎలగ కొట్టెస్తావు?’’ అతని వ్యూహం అర్థమైనా సాధ్యాసాధ్యాల గురించి అడిగేడు భుజమ్మీది గొడ్డలి చేతిలోకి తీసుకుంటూ నాగడు. వాగు దూరం ఇరవై నుంచి ముప్పై అడుగుల పొడవుంటుంది. నీటి ప్రవాహం ఉదృతంగా వున్నా మధ్యలో నాలుగడుగుల వెడల్పున్న రాయి కనిపిస్తోంది. అక్కడికి ఒక చెట్టు నరికి అడ్డంగా వేస్తే అక్కడి నుండి అదే చెట్టు అవతలకి వేసి దాన్ని పట్టుకుని దాటొచ్చనేది దొర వ్యూహం. చాలాసార్లు అలాగే గెడ్డ దాటింది వూరు. కానీ అంత పొడవున్న చెట్టు నరకాలంటే ఎంత సమయం పడుతుంది? నాగడు అప్పటికే ఒడ్డుకి పదడుగుల దూరంలోనున్న గుగ్గిలం మాను కొట్టడం మొదలెట్టేడు. ఆ గొడ్డలి అలికిడికి దగ్గర్లోని పక్షులు, జంతువులు అలికిడి చేస్తూ పరిపోయేయి. కొంతమంది అటు వైపు నడిచేరు సాయంగా. మరికొందరు సెల్‌ఫోన్‌తో తెలిసిన వాళ్ళకి మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నారు. డోలీ కిందికి దించేరు. మరికొందరు పారుతున్న వాగు వంక పరిశీలనగా చూస్తున్నారు... వేగం తగ్గితే దాటడానికి వీలు పడుతుందేమోనని. మరికొంతమంది దొరని తిట్టుకుంటున్నారు... చెప్తే విన్నాడు కాడని. అందరికీ తెలుసు, ఆ గెడ్డ ఎంతో సేపు అలా పారదని. ఒక గంటో గంటన్నరలోపే తగ్గిపోతుంది. కానీ వాన తగ్గాల. చీకట్లో...అంతా ఎవరికి అనువైన ప్రదేశాల్లో వాళ్ళు...కూర్చుని ఎదురు చూస్తున్నారు. చెట్టు కూలిన శబ్దం. కొండ ప్రతిధ్వనించింది. చెట్టు మీద నిద్రిస్తున్న పక్షుల గుంపులు గోల చేసుకుంటూ ఎగిరిపోయేయి. చుట్టు ప్రక్కల జంతువులేవో అక్కడి నుండి పారిపోయిన అలికిడి. మొత్తంగా అక్కడ ఒక చెట్టు కూలిన సవ్వడి కొండకి దడ పుట్టించింది. ఇంత చేసినా ఆ చీకట్లో చెట్టు ఇక్కడికి మొయ్యగలమా? మోసినా అది సరిగ్గా గెడ్డ మద్య రాయి మీదకి సరిగా వేయగలమా? సందేహాలతో తర్జనభర్జన పడుతుంటే పడాల్ మరోసారి వాంతి చేసుకున్నాడు. ఆకాశం మరొక్కసారి ఉరిమింది. ఆ వెలుగులో గెడ్డ మధ్య రాయి ముందుకంటే స్పష్టంగా కనపడింది. అంటే వరద తగ్గినట్టే. కొట్టిన చెట్టునలాగే ఒదిలేసి వాగు దాటింది డోలీ. రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల నడక దారి. నూటెనిమిది ఇంత లోపలికి రాదు. రోడ్డు మీదికొచ్చేయండి మీ ప్రాణాలకి మేము అడ్డుంటామని అంటారు. గానీ రోడ్డుకి రావడమంత తేలిక కాదన్న సంగతి నూటెనిమిదోలకి తెలీనిదా?డోలీ దుప్పటిని మరోసారి కర్రలకి బిగించి కట్టి పడాల్ని మోసుకుపోతున్నారు. చీకటి... ఆపై బురద. దారి స్పష్టమవదు. నడక తరిగిపోదు. ఈ నడక ఎన్నాళ్ళు నడిచేరో ఆ వూరి వాళ్ళు! ఈ దారి ఎన్నేళ్ళుగా ఆ వూరి దరఖాస్తులమీద నడిచెళ్ళిందో! ఎంత మంది నాయకులకు ఓట్ల కోసం ఉపయోగపడిందో! రోడ్డు చేరేసరికి నూటెనిమిది వాహనం ఎదురు చూస్తోంది. ఏయెన్నెం ఫోన్ చేసిందన్నమాట. మండల కేంద్రంలోని ఆసుపత్రికి చేరేసరికి రాత్రి అర్ధరాత్రిగా మారింది. బద్దకంగా లేచిన డాక్టరు ఎగాదిగా వూరి వాళ్ళందరి వైపూ చూసాక పేషెంట్ నాడి పట్టుకోకుండానే ‘ఏమైందని’ అడిగేడు. చెప్పేరు. ‘ఏమి తిన్నాడు’ అడిగాడు. చెప్పలేదు. ఎందుకంటే తిడతారని. అయినా రామన్నదొర ముందుకొచ్చి నిజం చెప్పేడు. డాక్టరు కష్టమని అన్నాడు. గతుక్కుమన్నారు అంతా. ఏమని అడిగితే ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని అన్నాడు. గంట ముందు తీసుకొస్తే బాగుణ్ణని అన్నాడు. బతిమాలితే ఇక్కడ లాభం లేదు, జిల్లా హాస్పిటల్‌కి తీసికెళ్ళండని సలహా ఇచ్చేడు. ఇక్కడికి రావడమే గగనం. అంతకు మించి ఏమీ ఆలోచించలేకపోతున్నారు. ‘‘ఇప్పటికే బాడీలో నీటి శాయం బాగా తగ్గిపోయింది...స్లైన్ ఎక్కడం కూడా కష్టమవుతోంది... మీరు లేట్ చేస్తే మీకే ఇబ్బంద’’ని అన్నాడు. ‘ఎలా?’ అని ఆలోచించేలోగానే మరో డాక్టరు గారొచ్చేరు. ‘ఏమైంద?’ని మళ్ళీ అడిగేరు.అందరూ మౌనం వహించేరు. డాక్టర్లిద్దరూ పక్కకెళ్ళి మాట్లాడుకున్నారు. ఏమి చెయ్యాలో తెలీక ఏయెన్నెవ్ు వైపు చూసేరు జనం. ఆమె తిరిగి డాక్టరు గారి వైపు చూసింది... ఏదో ఒక దారి మీరే చూపించండని అన్నట్టు. మళ్ళీ నూట ఎనిమిదిని పిలిచేరు. ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది. నగరం వైపు పరుగులు తీస్తూ... పడాల్ అపస్మారక స్థితిలో.చేరేసరికి వాన నెమ్మదించింది. హాస్పిటల్‌కి చేర్చి నూటెనిమిది వాహనం వచ్చిన దారినే వెళ్ళిపోయింది. డ్యూటీ డాక్టరు పేషెంటుని చూడడం కంటే అక్కడున్న మిగతా వారినే గమనించడం తెలుస్తూనే వుంది వాళ్ళకి. గదిలోకి స్టెచ్రర్మీద తీసుకెళ్ళేరు. పడాల్ని పరీక్షించేడు. ఆశ్చర్యంగా చేతులు దులుపుకుంటూ బయటికొచ్చేడు. ‘‘ఇతను ఎప్పుడో చనిపోయాడు’’ అన్నాడు. గతుక్కుమన్నారు అంతా. అందరి గుండెల్లో రాయి పడింది. ఆడోళ్ళు ఏడుపు అందుకున్నారు. పడాల్ తల్లినయితే ఎవరూ ఆపలేకపోతున్నారు. ‘‘నీనప్పుడే సెప్పినానా? నా కొడుకు ఇంటి కాడైనా...’’ అనిరాగమందుకుంది. మగాళ్ళు మాత్రం మౌనంగా గుండెల్లొ బాధని దాచుకుని అనుకున్నారు... ‘‘వూరి చావు మరొకటి, అయితే అది వూరి బయట’’ అని. రామన్నదొరకి ఏమీ పాలు పోలేదు. ఇప్పుడేమి చెయ్యాలో అర్ధంకాలేదతనికి. వెంటనే డాక్టరు గదిలోకి వెళ్లాడు. ‘‘సార్! ఇప్పుడెలా తీసుకెల్లాలి?’’ ఆడిగాడు. ‘‘నేనెలాగా చెప్తానయ్యా?’’ అతని ముఖంలో విసుగు కనిపిస్తోంది. అతని డ్యూటీ దిగిపోయే సమయమని చూసేవాళ్ళకి తెలిసిపోతుంది. ‘‘అంబులెన్సుంటాది గలా చూడండి సార్!’’ బతిమాలేడు. ‘‘హాస్పిటల్లో ఏంబులెన్సులుంటే ఎప్పుడో బాగుపడిపోనువోయ్... అదిగో అటు చూసేవా? అదే మా అంబులెన్సు. దాన్ని పట్టికెల్తావా?’’ అంటూ బయట చుట్టూ గడ్డిమొలిచి తుప్పు పట్టిన వాహనాన్ని చూపించేరు. సరిగ్గా అప్పుడే తుప్పు పట్టిన వాహనం పక్కకొచ్చి నిలబడింది ఒక కొత్త వాహనం. అది చూసిన దొర ‘‘సార్...!’’ అంటూ డాక్టరు దగ్గరికి పరిగెత్తాడు. ‘‘ఆ బండేదో ఒచ్చినట్టుంది సార్!’’ అని అడిగాడు. దానివైపు డాక్టరు గారు చూస్తూ ‘‘అదా! అందులో పేషెంటున్నారయ్యా!’’ అని డాక్టరు చిరాగ్గా లోపలికి వెళ్ళిపోబోయేరు. అందరూ అటువేపు చూసేరు. నిజమే ఆ ఏంబులెన్స్‌లో పేషెంటున్నాడు. అతడు ఖరీదైన మనిషని తెలిసిపోతూనే వుంది. ఎవరికీ నోట మాట రాలేదు. ఏమి చెయ్యాలో తోచలేదు. డాక్టరు కాళ్ళమీద పడిపోయేడు రామన్నదొర. హటాత్పరిణామానికి డాక్టరుకి కోపమొచ్చింది. అతను కాళ్లు విదిలించేడు. దొర కింద పడిపోయేడు. అప్పుడే ఎవరో కొత్త వ్యక్తి లోపలికొచ్చేరు. అతని కాళ్ళకడ్డం పడ్డాడు దొర. ‘‘అరరె...!’’ అంటూ దొరని పైకి లేపేడు. ‘ఏమైంద’ని అడిగాడు. దొర ఒంటికంటిన దుమ్ముని దులుపుకుంటూ జరిగింది చెప్పాడు. అతను డాక్టరు వైపు అడుగులేసేడు. ‘‘డాక్టరు గారూ! చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళంతా అమాయకులని. పైగా చావు. మీరే ఎలాగో ఒకలాగ వెహికల్ అరేంజ్ చెయ్యొచ్చు కదండీ’’ బతిమాలేడు. దానికి అతనికి కోపమొచ్చింది. ‘‘వీళ్ళు అమాయకులా? నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళు అమాయకులా?’’ అంటూ స్వరం హెచ్చించి మాట్లాడేరు. ‘‘నో సార్! వాళ్ళ ఉద్దేశం అది కాకపోవచ్చు... అర్ధం చేసుకోండి సార్’’ ముందుకు నడిచిపోతున్న డాక్టరు వెనక పడ్డాడతను. ఆ మాటకీ ఆగలేదు డాక్టరుగారు. ‘‘గిరిజనులంటే అంత చులకనా మీకు డాక్టరు గారూ!’’ స్వరం పెంచి గట్టిగా అరిచాడు. అంతా అతని వైపు చూసేరు.‘‘అతనేమీ ప్రాణాపాయ స్థితిలో లేడు. వీళ్ళా శవంతో వున్నారు. చేతిలో డబ్బులూ లేవు. ఏంబులెన్సు ఏర్పాటు చెయ్యలేరా?’’ అని డాక్టరు గారిమీదికి ఉరికేడు. అతనెవరో వీళ్ళకి తెలీదు. ‘‘పోనీ... ఇందాక నూటెనిమిదికి పిలిపించండి సార్!’’ దొర బతిమాలేడు. ‘‘అది పేషెంట్లకే గానీ శవాలకి కాదయ్యా’’ అని డాక్టరు గారు స్టెత్ వూపుకుంటూ ముందుకు కదిలిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘మీరు త్వరగా శవాన్ని ఖాళీ చెయ్యాలయ్యా’లని చెప్పి వెళ్లిపోయేడు. ఆ ప్రక్కనే వున్న నర్సులు దగ్గరికొచ్చేరు. ‘‘మీరు ఇక్కడ ఎంత బతిమాలినా ఏమీ ఫలితముండదువోయ్. బయటకెల్లి ప్రైవేటు అంబులెన్సులుంటాయి తీసికెల్లండ’ని ఉచిత సలహా ఇచ్చేరు. అక్కడ అడిగి చూసేరు. ఆ డబ్బు చెల్లించాలంటే వూరోలందరి చింత చెట్లు సంవత్సరం పాటు షావుకారికిచ్చేయాలి. వచ్చిన కొత్త మనిషి ‘‘డాక్టర్ల నిర్లక్ష్యం... నశించాలి... నశించాలి’’ అని నినాదాలు చేస్తున్నాడు. అతని వెనక్కి మరికొంత మంది వచ్చి చేరేరు. దొర కూడ అక్కడే వుండి నినాదమై అరుస్తున్నాడు. పరిస్థితి అర్ధమైపోయింది... వూరి జనానికి. శవాన్ని చాపలో చుట్టి కట్లు ఇర్రించి కట్టేరు. ఎప్పటిలాగే రెండు కర్రలకి డోలీని సరిచేసేరు. శవాన్ని డోలీలోకెక్కించి హాస్పిటల్ దాటి రోడ్డుమీదికొచ్చేరు. ఎవరో మీడియాకు కూడ సమాచారమిచ్చినట్టుంది. సెల్ఫోనుల్తో కొంతమంది వెనకా ముందు నుంచి బంధిస్తున్నారు. వెనుక నుంచి అరుపులు నినాదాలూ వినపడుతున్నాయి.మలుపు తిరిగింది డోలీ.నాలుగు రోడ్ల కూడలి... ట్రాఫిక్ స్థంబించి పోయుంది. అన్ని వాహనాలతోపాటూ నడుస్తున్న డోలీ కూడా ఆగిపోయింది. కారణాలు వాళ్ళకి తెలీలేదు. ముందుకు తలెత్తి చూసేరు. రోడ్డు మధ్యలో టెంట్లు వేసి వున్నాయి. చాలామంది... టెంటు నీడలో కుర్చీల ముందు నిలబడి.... కుడి చెయ్యిని ముందుకు చాపి నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారు. ప్రతిజ్ఞ మైకుల్లో ప్రతిధ్వనిస్తూండగా.... డోలీ దారి చేసుకుంటూ ముందుకు కదిలిపోయింది. జగదీశ్ మల్లిపురం -
ప్రసవం కోసం డోలీలో 13 కి.మీ.లు
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో నిండు గర్భిణిని ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డోలీలో 13 కి.మీ. మోశారు. చిత్రకొండ కటాఫ్ ప్రాంతంలోని తెంతగుడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ జానహంతాళ్కు నెలలు నిండాయి. ఆమె గర్భంలో కవల పిల్లలు పెరుగుతుండగా ఆదివారం ఉదయం ఇంటివద్దనే ఒక ఆడ శిశువుకు జాన జన్మనిచ్చింది. మరో శిశువు కడుపులో అడ్డం తిరగ డంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. రవాణా సదుపాయం లేకపోవడంతో ఆమె భర్త, సోదరుడు కలిసి ఆమెను డోలీలో 13 కి.మీ. మోసుకెళ్లారు. అనంతరం గురుప్రియ నది దాటి 108కి ఫోన్ చే శారు. అంబులెన్సు రాకపోవడంతో జానను ప్రైవేటు వాహనంలో చిత్రకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కూడా ప్రసవం చేయలేమనడంతో మల్కన్‌గిరి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు ప్రసవం చేయగా జాన మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.