![Twins Died In Front Of Mother As No Road To Rush To Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/17/woman.jpg.webp?itok=6lJvqCzQ)
ముంబై: దేశంలో ఇంకా చాలా గ్రామాలకు కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోడ్డు వసతి సరిగా లేకపోవటం వల్ల నెలలు నిండకముందే పుట్టిన కవల శిశువులు తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయారు. తన బిడ్డలను చూసుకుని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయిన ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది. సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో బాలింతను డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
పాల్ఘర్ జిల్లా మోఖడా తహసీల్‌కు చెందిన వందన బుధర్ అనే మహిళ ఏడు నెలల గర్భవతి. అయితే, నెలలు నిండకముందే తన ఇంటిలోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువులు బలహీనంగా ఉన్నారు. ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల వారికి సమయానికి సరైన వైద్య సహాయం అందలేదు. దీంతో తల్లి కళ్లెదుటే ఇద్దరు శిశువులు కన్నుమూశారు. మరోవైపు.. తీవ్ర రక్తస్రావంతో మహిళ పరిస్థితి సైతం విషమంగా మారింది. దీంతో బెడ్‌షీట్‌తో డోలీ తయారు చేసుకుని బాలింతను సుమారు 3 కిలోమీటర్లు దూరం మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
మహిళ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్ర కిశోర్ వాగ్ ట్వీట్ చేశారు. సరైన సమయంలో వైద్యం అందకపోవటంతోనే కవల శిశువులు మరణించారని, అది దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు..!
Comments
Please login to add a commentAdd a comment