సాలూరు రూరల్: మన్యంలో రహదారులు లేకపోవటంతో అడవి బిడ్డలు నానా అగచాట్లు పడుతున్నారు. అనారోగ్యానికి గురైతే కిలోమీటర్ల కొద్దీ డోలీల్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర కొడమ పంచాయతీ సిరివర గ్రామంలో ఓ బాలింత అనుభవించిన నరకయాతన గిరిజనుల అవస్థలకు అద్దంపట్టింది. గ్రామానికి చెందిన గిందెకు ఆదివారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
నెలలు నిండకుండానే మూడో కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు గిందెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. భర్త డుంబ్రి, స్థానికులు డోలీకట్టి అందులో గిందెను ఉంచి సోమవారం 12 కి.మీ.కు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరుకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment