ప్రసవం కోసం డోలీలో 13 కి.మీ.లు
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో నిండు గర్భిణిని ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డోలీలో 13 కి.మీ. మోశారు. చిత్రకొండ కటాఫ్ ప్రాంతంలోని తెంతగుడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ జానహంతాళ్‌కు నెలలు నిండాయి. ఆమె గర్భంలో కవల పిల్లలు పెరుగుతుండగా ఆదివారం ఉదయం ఇంటివద్దనే ఒక ఆడ శిశువుకు జాన జన్మనిచ్చింది. మరో శిశువు కడుపులో అడ్డం తిరగ డంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. రవాణా సదుపాయం లేకపోవడంతో ఆమె భర్త, సోదరుడు కలిసి ఆమెను డోలీలో 13 కి.మీ. మోసుకెళ్లారు. అనంతరం గురుప్రియ నది దాటి 108కి ఫోన్ చే శారు.
అంబులెన్సు రాకపోవడంతో జానను ప్రైవేటు వాహనంలో చిత్రకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కూడా ప్రసవం చేయలేమనడంతో మల్కన్‌గిరి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు ప్రసవం చేయగా జాన మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.