డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలందిస్తున్న తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీరానీయడం లేదని టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి ఆరోపించారు.
అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి(టీడీపీ రెబల్)గా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, ఆర్‌టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలో అయ్యన్నపాత్రుడు అడ్డుతగిలాడని చెప్పారు.
చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు. చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించారని, అప్పుడు కూడా తాను బాధపడలేదని, కానీ తాజాగా ఆమెను కూడా తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదనకు గురై.. తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని శ్రీరామమూర్తి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment