మెట్టూర్ సమీపంలోని పాలమలై గిరిజన ప్రాంతం
తమిళనాడు, టీ.నగర్: అభ్యర్థి ఎవరనేది తెలియకుండా ఇంతవరకు ఓటేసి వస్తున్నట్లు సేలం జిల్లాలోని గిరిజన గ్రామస్తులు అంటున్నారు. సేలం జిల్లా, మేట్టూరు సమీపంలోని కొళత్తూరు పంచాయితీ యూనియన్‌లో పాలమలై గిరిజన ప్రాంతం ఉంది. సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పాలమలైలో రామన్‌పట్టి, గెమ్మంపట్టి, తలక్కాడు, కడుక్కామరత్తుకాడు, తిమ్మంపది, నాగంపది వంటి 33 కుగ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 2 వేల కుటుంబాలు నివశిస్తున్నాయి.
ఈ గిరిజన గ్రామాలన్నీ ధర్మపురి పార్లమెంటు నియోజకవర్గం, మేట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఇందులో ధర్మపరి పార్లమెంటు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి డాక్టర్ సెంథిల్‌కుమార్, అన్నాడీఎంకే కూటమి తరఫున పీఎంకే అన్బుమణి, అమముక అభ్యర్థిగా మాజీ మంత్రి పళనియప్పన్ సహా 15 మంది పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఈ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను కలిసి ఏ అభ్యర్థి ఓట్లు అడగలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. ఓట్లు అభ్యర్థించలేదు.
దీంతో అక్కడి ప్రజలు అభ్యర్థులు ఎవరో తెలియకున్నా.. ఓట్లు మాత్రం వేస్తుంటామని వెల్లడించారు. గతంలో కాలినడకన అభ్యర్థులు రావాల్సిన పరిస్థితి ఉన్నందున రాలేదని, ప్రస్తుతం వాహన వసతులున్నా రాలేకున్నట్లు తెలిపారు. ఇక్కడికి వస్తే వారికి తమ సమస్యలు తెలుస్తాయని, తారు రోడ్డు వేసేందుకు వీలుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment