అవకాశాల కల్పన,హక్కుల పరిరక్షణ,సుస్థిర భవిష్యత్..ఈ మూడు అంశాలే ప్రధానఎజెండాగా ముందుకు వెళ్లాలని ప్రపంచ జనాభా దినోత్సవంసందర్భంగా ఐక్యరాజ్యసమితి (2023, జూలై 11) ప్రపంచానికి పిలుపునిచ్చింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన, సౌకర్యాల కల్పన వంటివి జనాభా పెరుగుదల సగటుకంటే వేగంగా జరగాలని కూడా నిర్ధేశించింది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి ఏదైనా జనం పట్టణాలు, నగరాల వైపే చూస్తున్నారు. క్రమంగా వలస బాట పడుతున్నారు. దీనితో తెలంగాణలో పట్టణ జనాభా శాతం ఏడాదికేడాది పెరిగిపోతూ వస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ జనాభాలో సగానికి పైగా పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని ‘నేషనల్ పాపులేషన్ రిపోర్ట్–2023’ అంచనా వేసింది.
అర్బన్ జనాభా శాతం జాతీయ సగటు కంటే.. తెలంగాణలో 12 శాతం అధికంగా ఉంది. గత తొమ్మిదేళ్లలోనే ఏకంగా 8.61శాతం జనం పల్లెలను విడిచి పట్టణాలకు చేరారు. ఇది వచ్చే రెండేళ్లలో మరింత పెరుగుతుందని.. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో పెరుగుదల రేటు భారీగా ఉండొచ్చని అంచనా వేశారు.
హైదరాబాద్ మహానగర జనాభా వచ్చే రెండేళ్లలో కోటికి మించిపోతుందని, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్–35 మహా నగరాల జాబితాలో చేరుతుందని పేర్కొంటున్నారు. వరంగల్ నగరం పది లక్షలు, ఆపై జనాభా ఉన్న నగరాల జాబితాలో చేరుతుందని అంటున్నారు.
అవకాశాలు, భవిష్యత్తే అసలు సమస్య
తెలంగాణ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలు, బిహార్, యూపీ వంటి ఉత్తర భారత రాష్ట్రాలు, పలు ఈశాన్య రాష్ట్రాల వారు కూడా ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో మౌలిక సదుపాయాల సమస్య తలెత్తుతోంది. భారీగా పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా సదుపాయాల కల్పన వేగం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజారవాణాలో వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం ట్రాఫిక్ ఇబ్బందులకు దారి తీస్తోంది. విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూగర్భ, వరద నీటి ప్రవాహ డ్రైనేజీలు లేక, ఉన్నవాటిని ఆధునీకరించక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా నగరం స్తంభించిపోయే పరిస్థితి నెలకొంటోంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని 1,476 మురికివాడల్లో ఉన్న పది లక్షల మందికిపైగా ప్రజలు గౌరవ ప్రద నివాసాలకు నోచుకోలేదని.. ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను సిద్ధం చేసినా దరఖాస్తుదారులు పదిలక్షలకు పైగానే ఉన్నారని ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల కింద చేపట్టిన పనులు ఐదేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి.
నగరాల స్పీడ్,వసతులు ఇలా..
ప్రస్తుతం దేశ జనాభాలో 35.1 శాతం అర్బన్ జనాభా ఉంటే.. తెలంగాణలో ఇది 47.6 శాతం. 2036 నాటికి అర్బన్ జనాభా జాతీయ స్థాయి లో 39.1 శాతానికి చేరితే.. తెలంగాణలో 57.3 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో అర్బన్ జనాభా దేశంలోనే అత్యధికంగా 18శాతం పెరుగుతుందని పాపులేషన్ రిపోర్టులో పేర్కొన్నారు.
తెలంగాణలో 2014లో అర్బన్ పాపులేషన్39శాతం కాగా.. 2023 చివరి నాటికి 47.61శాతానికి,2025 నాటికి 50శాతానికి చేరుతుందని అంచనా.
రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం గత తొమ్మిదేళ్లలో 1.21 లక్షల కోట్లను ఖర్చుచేశారు. ఈ నిధులతో భద్రమైన రహదారులు, ప్రజారవాణా, మంచినీరు, మురుగు నీటి శుద్ధి వంటి పనులు చేశారు.
సదుపాయాల కల్పనలో వేగం లేదు
తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా జనాభా పెరుగుతున్నంత వేగంగా శిక్షణ, ఉపాధి, కనీస అవసరాల కల్పన లేదు. పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి బాగాలేదు. మహిళల అభ్యున్నతికి అవసరమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు లభించటం లేదు. మహానగరం అంటే ఫ్లైఓవర్లు, సుందరీకరణ పనులు కాదు. అన్ని రకాల ప్రజలు గౌరవంగా జీవించే పరిస్థితి ఉండాలి. ఇప్పటికైనా తక్షణ ప్లానింగ్, పక్కాగా అమలు చేయడం మంచిది. -
కరుణా గోపాల్, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ సిటీస్
హైదరాబాద్‌ను అత్యుత్తమ నగరంగా ..
జాతీయ సగటును మించి తెలంగాణలో పట్టణ జనాభా పెరుగుతోంది. ఈ దిశగా ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సౌకర్యాలు సమకూరుస్తున్నాం.
రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం రూ.1.21 లక్షల కోట్ల వ్యయం చేశాం. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల, స్థిరమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం తదితర నగరాల్లోనూ విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాం.
- అరవింద్‌కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్–పట్టణాభివృద్ధిశాఖ
మాస్టర్ ప్లాన్లు తక్షణ అవసరం
తెలంగాణలో నగరాలు, పట్టణాలు జనంతో నిండిపోతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగటం లేదు. హైదరాబాద్‌లో అయితే సహజసిద్ధ వనరులన్నీ ధ్వంసం అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లు, కాలనీలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడమే దీనికి కారణం. హైదరాబాద్‌కు మోక్షగుండం విశ్వశ్వేరయ్య ఇచ్చిన ప్లాన్ తప్ప కొత్త ప్లాన్ తీసుకురాలేదు. కొత్త ప్లాన్ తక్షణ అవసరం.
- పి.తిమ్మారెడ్డి,టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మాజీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment