World Population Day
-
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
జనాభా పెరుగుతోంది...కానీ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది!
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయంగతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ఆసియాలో సంతానోత్పత్తి రేట్లుప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్‌కాంగ్‌లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం. -
World Population Day 2024 : జనం.. ప్రభంజనం..ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్!
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.1987, జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న ("డే ఆఫ్ ఫైవ్ బిలియన్") రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’)కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం , మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం. ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన. ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
నగరాలు.. నిండుతున్నాయ్! టాప్–35 మహా నగరాల్లోకి హైదరాబాద్
అవకాశాల కల్పన,హక్కుల పరిరక్షణ,సుస్థిర భవిష్యత్..ఈ మూడు అంశాలే ప్రధానఎజెండాగా ముందుకు వెళ్లాలని ప్రపంచ జనాభా దినోత్సవంసందర్భంగా ఐక్యరాజ్యసమితి (2023, జూలై 11) ప్రపంచానికి పిలుపునిచ్చింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన, సౌకర్యాల కల్పన వంటివి జనాభా పెరుగుదల సగటుకంటే వేగంగా జరగాలని కూడా నిర్ధేశించింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి ఏదైనా జనం పట్టణాలు, నగరాల వైపే చూస్తున్నారు. క్రమంగా వలస బాట పడుతున్నారు. దీనితో తెలంగాణలో పట్టణ జనాభా శాతం ఏడాదికేడాది పెరిగిపోతూ వస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ జనాభాలో సగానికి పైగా పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని ‘నేషనల్ పాపులేషన్ రిపోర్ట్–2023’ అంచనా వేసింది. అర్బన్ జనాభా శాతం జాతీయ సగటు కంటే.. తెలంగాణలో 12 శాతం అధికంగా ఉంది. గత తొమ్మిదేళ్లలోనే ఏకంగా 8.61శాతం జనం పల్లెలను విడిచి పట్టణాలకు చేరారు. ఇది వచ్చే రెండేళ్లలో మరింత పెరుగుతుందని.. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో పెరుగుదల రేటు భారీగా ఉండొచ్చని అంచనా వేశారు. హైదరాబాద్ మహానగర జనాభా వచ్చే రెండేళ్లలో కోటికి మించిపోతుందని, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్–35 మహా నగరాల జాబితాలో చేరుతుందని పేర్కొంటున్నారు. వరంగల్ నగరం పది లక్షలు, ఆపై జనాభా ఉన్న నగరాల జాబితాలో చేరుతుందని అంటున్నారు. అవకాశాలు, భవిష్యత్తే అసలు సమస్య తెలంగాణ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలు, బిహార్, యూపీ వంటి ఉత్తర భారత రాష్ట్రాలు, పలు ఈశాన్య రాష్ట్రాల వారు కూడా ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో మౌలిక సదుపాయాల సమస్య తలెత్తుతోంది. భారీగా పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా సదుపాయాల కల్పన వేగం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజారవాణాలో వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం ట్రాఫిక్ ఇబ్బందులకు దారి తీస్తోంది. విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూగర్భ, వరద నీటి ప్రవాహ డ్రైనేజీలు లేక, ఉన్నవాటిని ఆధునీకరించక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా నగరం స్తంభించిపోయే పరిస్థితి నెలకొంటోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని 1,476 మురికివాడల్లో ఉన్న పది లక్షల మందికిపైగా ప్రజలు గౌరవ ప్రద నివాసాలకు నోచుకోలేదని.. ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను సిద్ధం చేసినా దరఖాస్తుదారులు పదిలక్షలకు పైగానే ఉన్నారని ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల కింద చేపట్టిన పనులు ఐదేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. నగరాల స్పీడ్,వసతులు ఇలా.. ప్రస్తుతం దేశ జనాభాలో 35.1 శాతం అర్బన్ జనాభా ఉంటే.. తెలంగాణలో ఇది 47.6 శాతం. 2036 నాటికి అర్బన్ జనాభా జాతీయ స్థాయి లో 39.1 శాతానికి చేరితే.. తెలంగాణలో 57.3 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో అర్బన్ జనాభా దేశంలోనే అత్యధికంగా 18శాతం పెరుగుతుందని పాపులేషన్ రిపోర్టులో పేర్కొన్నారు. తెలంగాణలో 2014లో అర్బన్ పాపులేషన్39శాతం కాగా.. 2023 చివరి నాటికి 47.61శాతానికి,2025 నాటికి 50శాతానికి చేరుతుందని అంచనా. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం గత తొమ్మిదేళ్లలో 1.21 లక్షల కోట్లను ఖర్చుచేశారు. ఈ నిధులతో భద్రమైన రహదారులు, ప్రజారవాణా, మంచినీరు, మురుగు నీటి శుద్ధి వంటి పనులు చేశారు. సదుపాయాల కల్పనలో వేగం లేదు తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా జనాభా పెరుగుతున్నంత వేగంగా శిక్షణ, ఉపాధి, కనీస అవసరాల కల్పన లేదు. పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి బాగాలేదు. మహిళల అభ్యున్నతికి అవసరమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు లభించటం లేదు. మహానగరం అంటే ఫ్లైఓవర్లు, సుందరీకరణ పనులు కాదు. అన్ని రకాల ప్రజలు గౌరవంగా జీవించే పరిస్థితి ఉండాలి. ఇప్పటికైనా తక్షణ ప్లానింగ్, పక్కాగా అమలు చేయడం మంచిది. - కరుణా గోపాల్, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ సిటీస్ హైదరాబాద్‌ను అత్యుత్తమ నగరంగా .. జాతీయ సగటును మించి తెలంగాణలో పట్టణ జనాభా పెరుగుతోంది. ఈ దిశగా ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సౌకర్యాలు సమకూరుస్తున్నాం. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం రూ.1.21 లక్షల కోట్ల వ్యయం చేశాం. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల, స్థిరమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం తదితర నగరాల్లోనూ విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాం. - అరవింద్‌కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్–పట్టణాభివృద్ధిశాఖ మాస్టర్ ప్లాన్లు తక్షణ అవసరం తెలంగాణలో నగరాలు, పట్టణాలు జనంతో నిండిపోతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగటం లేదు. హైదరాబాద్‌లో అయితే సహజసిద్ధ వనరులన్నీ ధ్వంసం అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లు, కాలనీలు, అపార్ట్మెంట్ల సెల్లార్లు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడమే దీనికి కారణం. హైదరాబాద్‌కు మోక్షగుండం విశ్వశ్వేరయ్య ఇచ్చిన ప్లాన్ తప్ప కొత్త ప్లాన్ తీసుకురాలేదు. కొత్త ప్లాన్ తక్షణ అవసరం. - పి.తిమ్మారెడ్డి,టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ -
తెలంగాణ జనాభా 4.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనాభా ప్రస్తుతం 4.10 కోట్లు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.6గా అంచనా వేసినట్టు తెలిపింది. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరిస్తామని తెలిపింది. స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా కుటుంబ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయాలని ఆ శాఖ కోరింది. రెండు విడతలుగా పక్షోత్సవాలు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతలుగా పక్షోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి పక్షోత్సవం ఈ నెల 27 నుండి జూలై 10వ తేదీ వరకు, రెండో పక్షోత్సవం జూలై 11 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి పక్షం రోజుల్లో జనాభా పెరుగుదల, దానివల్ల కలిగే అనర్ధాల గురించి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో పక్షోత్సవంలో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ తాత్కాలిక పద్ధతులు, కుటుంబ నియంత్రణకు శాశ్వత పద్ధతులతో క్యాంప్‌లు నిర్వహిస్తారు. కాపర్–టిపై అవగాహన ఈ క్యాంపుల్లో అర్హులైన పురుషులకు వేసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ప్రసవం అయిన 48 గంటల్లో వేసే కాపర్–టి గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కాపర్–టి 10 సంవత్సరాల వరకు కూడా పని చేస్తుంది. దీనివల్ల బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండటమే కాక అధిక ప్రమాదం గల గర్భములను, మాతృ మరణాలను నివారించవచ్చు. ఈ సేవలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయిన వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన అంతర ఇంజెక్షన్ వేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. గతేడాది ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న స్త్రీల సంఖ్య 1,14,141, వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న పురుషుల సంఖ్య 3,229 అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ అదనపు సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. -
ఏ గర్భిణీ ఇబ్బంది పడకూడదు...అందుకే ఈ పధకం
-
జనమే... జయమా?
అగ్రస్థానం అందరూ ఆశించేదే, ఆనందించేదే! కానీ, ఒక్కోసారి కొన్ని అంశాల్లో ప్రథమ స్థానం అంటే ఉలిక్కిపడాల్సి వస్తుంది. ఆగి, ఆలోచించాల్సి వస్తుంది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ జనాభాలో మన దేశమే నంబర్ వన్ అవుతుందన్న ‘ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం’ (యూఎన్‌పీడీ) తాజా అంచనా అలాంటి పరిస్థితే కల్పించింది. ప్రపంచ జనాభాలో ఇప్పటి దాకా చైనా తర్వాత రెండో స్థానంలో మనం ఉన్నాం. వచ్చే ఏడాది కల్లా చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించనుంది. అలాగే, ఈ నవంబర్ 15 నాటికే ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం ఐరాస వెలువరించిన ఈ తాజా నివేదిక అంచనా. దేశంలో ఇంతటి జనాభా పెరుగుదల మంచికా, చెడుకా అనే చర్చ మొదలైంది. మిగిలిన అంశాల్లో కాకున్నా కనీసం జనాభాలోనైనా అగ్రరాజ్యమైన చైనాను అధిగమిస్తున్నామని సంబరపడాలన్నది కొందరి వ్యంగ్య చమత్కృతి. అయితే, జనాభా పెరుగుదలతో సవాళ్ళే కాక, సమీక్షించుకొనే వీలూ చిక్కిందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండడం విశేషం. ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లయితే, అంతకన్నా కొద్దిగా తక్కువగా భారత జనాభా 141.2 కోట్లు. వచ్చే ఏడాది కల్లా ఈ పరిస్థితి తారుమారై, చైనాను భారత్ దాటేస్తుందన్నది ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి, 2027 నాటికి జనాభాలో మనం చైనాను దాటతామని గతంలో ఐరాస అంచనా. తీరా తాజా లెక్కల ప్రకారం అంతకన్నా నాలుగేళ్ళ ముందరే 2023లో ఆ ‘జనాభా ఘనత’ మనం సాధిస్తున్నామన్నమాట. దీనికి కారణం – జనాభా విధానాన్ని మన దేశం సక్రమంగా అమలు చేయకపోవడం కాదు. చైనాలో సంతాన సాఫల్యత అనుకున్న దాని కన్నా తక్కువ కావడం! ఒక్క బిడ్డే ఉండాలంటూ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు చైనా కఠినంగా జనాభా నియంత్రణ చేసింది. కానీ, 2016లో దాన్ని సడలించి, ఇద్దరు పిల్లల విధానానికి ఓకే చెప్పింది. 2021 నుంచి మరింత సడలించి, మూడో సంతానానికీ సరేనంది. తీరా అప్పటికే ఒకే బిడ్డ పద్ధతికే చైనాలో అలవాటు పడిపోయారు. ఫలితంగా డ్రాగన్ దేశంలో జీవితకాల సంతాన సాఫల్యతా రేటు (టీఎఫ్ఆర్) 1.16 మాత్రమే. అదే మన దేశంలో 2 ఉందని తాజా ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్ఎఫ్హెచ్ఎస్) తేల్చింది. అలా మన జనాభా గత అంచనా కన్నా ముందే చైనాను దాటేస్తోంది. దేశంలో జనగణన ఆధారంగా భవిష్యత్ జనాభాను అంచనా కట్టే రిజిస్ట్రార్ జనరల్ 2011 నాటి జనగణన ఆధారంగా 2019లో ఓ అంచనా విడుదల చేశారు. ఆ లెక్కలో చూస్తే మనం చైనాను దాటడానికి 2023 కన్నా కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. వారి వారి అంచనాలను బట్టి తేదీలు మారినా, రేపు కాకుంటే ఎల్లుండైనా జనాభాలో చైనాను భారత్ దాటేయడం నిస్సందేహమని అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే, ఏ దేశమైనా జనాభా స్థిరీకరణ సాధించాలంటే టీఎఫ్ఆర్ 2.1 ఉండాలని యూఎన్‌పీడీ ఉవాచ. మన దేశంలో ఇప్పుడు ఆ రేటు 2 గనక, మరికొన్నేళ్ళు మనం అదే రేటును కొనసాగించగలిగితే చాలు. మనం అత్యంత కీలకమైన జనాభా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టే! ఒకప్పుడు కుటుంబ నియంత్రణ విధానాన్ని గట్టిగా మొదలుపెట్టినప్పుడు టీఎఫ్ఆర్ 6 ఉన్న మన దేశం ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ విజయమే! చైనా లాంటి చోట్ల అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణకూ, మన దేశంలో అవగాహన, చైతన్యంతో ఒప్పించి సాధించిన జనాభా నియంత్రణకూ చాలా తేడా ఉంది. అయితే, ఇప్పటికీ లింగ వివక్ష ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి అనేక ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువ టీఎఫ్ఆర్ ఉంది. ఇది ఆందోళనకరం. అక్కడ ప్రజల్ని జన నియంత్రణకు ఉద్యుక్తుల్ని చేయాలి. నిజానికి, దేశంలో 70 కోట్ల మంది దాకా ఉన్న మహిళల్ని చైతన్యపరచాలి. జనాభా నియంత్రణ సహా సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో స్త్రీలను భాగం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాలి. ఒకప్పుడు ‘చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం’ అన్నాం. పెరిగిన సగటు ఆయుః ప్రమాణాలతో రాబోయే దశాబ్దాల్లో పిన్నలు తగ్గి, పెద్దలు పెరిగాక చిన్న కుటుంబాలతోనూ సమస్యలుంటాయని గుర్తించాలి. వ్యక్తిగత ప్రయోజనాల వ్యష్టి జీవన విధానం కన్నా, పెద్దలను పిల్లలు చూసుకొనే సమష్టి భారతీయ కుటుంబ వ్యవస్థను ఆశ్రయించడమే అందుకు పరిష్కారం. ఐరాస ప్రధాన కార్యదర్శి అన్నట్టు, పుడమి సంరక్షణలో మనందరి బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇదే సరైన సందర్భం. చేసుకున్న బాసలను నెరవేర్చడంలో ఇప్పటికీ ఎక్కడ వెనుకబడి ఉన్నామో ఆగి, ఆలోచించుకోవాల్సిన తరుణం. ఇప్పుడు జనసంఖ్య ఎంత ఉందనే దాని కన్నా, వారికి ఎంత నాణ్యమైన జీవితం గడిపే వీలు కల్పిస్తున్నామన్నదే ఆలోచించాల్సిన అంశం. అందరికీ కూడు, గూడు, గుడ్డ ముఖ్యం. దారిద్య్రాన్ని తగ్గించడం, జనాభా అంతటికీ విద్య, వైద్య వసతులు కల్పించడంపై దృష్టి మరల్చాలి. 25 నుంచి 64 ఏళ్ళ లోపు వారు ఎక్కువున్నందున ఉత్పాదకత, ఆదాయం రెండూ పెరిగే నైపుణ్యాలను వారికి అందించాలి. విజ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థలోకి ప్రయాణంలో యువతకు అవసరమైన సామర్థ్యాల్ని అందించాలి. దేశంలో 65 ఏళ్ళ పైబడిన వర్గం శరవేగంతో పెరుగుతున్నందున, పెద్ద వయసువారికి సామాజిక భద్రత కల్పనపై పాలకులు సమయం వెచ్చించాలి. ప్రపంచంలో ప్రథమ స్థానానికి పరుగులు తీస్తూ ‘జన భారత్’ అనిపించుకుంటున్న మనం అదే నోట ‘జయ భారత్’ అనిపించుకొనే రోజూ రావాలి! ఈ దేశానికి ఇప్పుడదే కావాలి!! -
నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!
జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing. Or #StaySingle like me and together we can contribute towards a sustainable future. Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr — Temjen Imna Along (@AlongImna) July 11, 2022 (చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం) -
World Population Day: ప్రభం‘జనం’..800
ప్రపంచ జనాభా ఈ ఏడాది ఒక మైలు రాయికి చేరుకోబోతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్లు కానుంది. వనరులు చూస్తే పరిమితం. జనాభా చూస్తే అపారం వీరందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తే అధిక జనాభా విసిరే సవాళ్ల నుంచి బయటపడతామా ? ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ఈ దిశగానే కృషి చేస్తోంది. ప్రస్తుతం 795 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ సారి ప్రపంచ జనాభా దినోత్సవం రోజు ఐక్యరాజ్య సమితి ప్రజల సుస్థిర భవిష్యత్‌పై దృష్టి సారించింది. భూమ్మీద ఉన్న పరిమితమైన వనరులతో తమకున్న అవకాశాలను, హక్కుల్ని వినియోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడడంతో ఆ దిశగా అందరిలోనూ అవగాహన కల్పించడానికి యూఎన్ నడుం బిగించింది. జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు, ప్రకృతి సమతుల్యతకు పెరుగుతున్న జనాభా ఎలా గొడ్డలి పెట్టుగా మారుతుందో ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్ధమైంది. తరాల మధ్య అంతరాలు, వనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం నిరుపేద దేశాల్లో ఆకలి కేకలు, ఆరోగ్యం అందకపోవడం వంటి సమస్యలుంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు బాగా చదువుకొని, మంచి ఆరోగ్యంతో , మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే మన భూమి పునరుత్పాదక శక్తి కంటే రెండింతలు ఎక్కువగా వనరుల్ని వాడేస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి మన అవసరాలు తీర్చడానికి మూడు భూమండలాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 కోట్ల మందికి కావల్సినంత పోషకాహారం దొరకకపోతే మరోవైపు 65 కోట్ల మందికి సమృద్ధిగా ఆహారం లభించి ఊబకాయం బారిన పడుతున్నారు. 2050 నాటికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం కంటే 70% ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యవసాయ దిగుబడులకు చేసే ప్రయత్నాలతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. నాణేనికి రెండువైపులా ఉన్నట్టే పెరిగిపోతున్న జనాభా అనేది సమస్య కాదని, ఎన్నో సమస్యలకు అది పరిష్కారం కూడా అవుతుందని మన అనుభవాలే పాఠాలు నేర్పిస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనెమ్ వ్యాఖ్యానించారు. జనాభా ఒక రకంగా శాపం. మరో రకంగా చూస్తే వరంగా మారే పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయం బలపడుతోంది. అత్యధిక దేశాల్లో జనాభా నియంత్రణపై అవగాహన ఉండడంతో ఇప్పుడు వనరుల సమాన పంపిణీపై అవగాహన పెంచే పరిస్థితులు వచ్చాయి. పిల్లల్ని కనకపోవడం వల్ల జపాన్, ఇటలీ వంటి దేశాల్లో వృద్ధులు పెరిగిపోయి ఒక సమస్యగా మారింది. చైనా కూడా వన్ చైల్డ్ పాలసీని రద్దు చేయాల్సి వచ్చింది. అదే భారత్‌ను తీసుకుంటే యువచోదక శక్తితో అభివృద్ధి పథంలో దూసుకువెళుతోంది. యువ భారతం ప్రపంచ జనాభాలో అయిదో వంతు మంది భారత్‌లోనే ఉన్నారు. ప్రతీ ఏడాది సగటున 1 శాతం జనాభా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లోనే యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉంది. దేశంలోని 130 కోట్ల జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు 25 శాతంపైనే ఉంది. దేశంలో యువ జనాభా సగటు వయసు 28 ఏళ్లు అయితే చైనాలో 38 ఏళ్లు, జపాన్‌లో 48గా ఉంది. ఈ యువశక్తితోనే భారత్ ప్రపంచంలో శక్తిమంత దేశంగా అవతరిస్తుంది. ఇక జనాభా మితిమీరి పెరిగితే మాత్రం వారి అవసరాలు తీర్చలేక సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. వృద్ధ జపాన్ ఆసియా, యూరప్ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించి ఉన్న వారు జపాన్ జనాభాలో 28% ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్, ఇటలీల్లో పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురుకానున్నాయి. 2025–2040 మధ్య కాలంలో జపాన్‌లో పని చేసే ప్రజలు (20–64 ఏళ్లు) కోటి మందికి పడిపోతుందని, దానిని ఎదుర్కోవడానికి ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యూఎన్ తాజా నివేదిక ► ప్రపంచ జనాభా 600 కోట్ల నుంచి 700 కోట్లకి చేరుకోవడానికి 12 ఏళ్లు పడితే, అంతే సమయంలో 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోబోతోంది. ► ప్రపంచ జనాభాకి మరో 100 కోట్ల మది పెరగడానికి ఈసారి 14.5 సంవత్సరాలు పట్టవచ్చునని యూఎన్ అంచనా వేసింది. ► 2080 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా వెయ్యి కోట్లకు చేరుకొని, 2100 వరకు అలాగే స్థిరంగా ఉంటుంది ► 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగం జనాభా ఆసియా దేశాల నుంచి ఉంటే, ఆఫ్రికా దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచి పుట్టుకొచ్చింది. ► ప్రస్తుతం జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో చైనా, నైజీరియా ఉన్నాయి. ► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని చేసే జనాభా (25 నుంచి 64 ఏళ్ల వయసు) పెరుగుతూ వస్తోంది. ► ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏళ్లకు చేరుకుంది. 1990 నుంచి చూసుకుంటే ఆయుర్దాయం తొమ్మిది సంవత్సరాలు పెరిగింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
జనాభా రాజకీయం
ఇద్దరు పిల్లలు ముద్దు... ఆపై ఇక వద్దు! తలకిందుల ఎర్ర త్రికోణం, చిన్న కుటుంబం బొమ్మతో... ఒక తరానికి సుపరిచితమైన కుటుంబ నియంత్రణ (కు.ని.) ప్రచార నినాదం ఇది. నలభై ఏళ్ళ పైచిలుకు క్రితం ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర సర్కార్ చేపట్టిన ఉద్యమ విధానం అది. అప్పట్లో ఆ విధానమెంత విజయవంతమైందీ, సంజయ్ గాంధీ సారథ్యంలో బలవంతపు కు.ని. శస్త్రచికిత్సలు ఎలా వివాదాస్పదమైందీ వేరే కథ. కానీ, ఇప్పుడు ఇద్దరు పిల్లలు దాటకుండా ఉంటేనే ప్రభుత్వ సాయమంటున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ పథకాలకూ, పదోన్నతులకూ, ఉద్యోగాలకూ, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి కూడా అనర్హులనే జనాభా నియంత్రణ బిల్లును ఆ రాష్ట్ర లా కమిషన్ ప్రకటించడం చర్చ రేపుతోంది. ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదన చేస్తున్నారని కొందరి వాదన. విద్య, సామాజిక చైతన్యం అంతగా లేని గ్రామీణ, సామాజిక బలహీన వర్గాల ప్రయోజనాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని విశ్లేషకుల మాట. కాంగ్రెస్, సమాజ్‌వాదీ లాంటి ప్రతిపక్షాలు ఈ బిల్లును విమర్శిస్తుంటే, మిత్రపక్షమైన జేడీయూ, సాక్షాత్తూ వీహెచ్‌పీ సైతం విభేదించడం గమనార్హం. కానీ, జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవ వేళ రానున్న పదేళ్ళ కాలానికి ‘జనాభా విధానం ముసాయిదా’ను ఆవిష్కరించిన యోగి... ఇద్దరు సంతానమే ఉండాలనే విధానంపై తనదైన వివరణ ఇచ్చారు. అధిక జనాభా వల్ల దారిద్య్రం పెరుగుతుందనీ, కాబట్టి దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన యూపీ ప్రజల్లో చైతన్యం తేవాలనీ ఈ కాషాయాంబరధర ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో కొట్టిపారేయడానికేమీ లేదు. కానీ సంతానాన్ని బట్టే సంక్షేమ పథకాలన్న మాటే తేనెతుట్టెను కదిలించింది. నిజానికి, ‘పరిమిత కుటుంబం... అది పరిమళ కుసుమ కదంబం’ అంటూ ఒకప్పుడు రేడియోలో మారుమోగిన కవి వాక్కు మన దేశమంతటికీ వర్తిస్తుంది. సందేహం లేదు. మన పక్కనే ప్రపంచంలోకెల్లా అధిక జనాభాతో చైనా ఇప్పటికీ సతమతమవుతూనే ఉంది. అందుకే, నియంత్రణ కోసం ఇద్దరే సంతానమనే షరతు పెట్టింది. చైనాతో పాటు వియత్నాం లాంటి దేశాలు జనాభా చట్టాన్ని అమలు చేశాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 2001–11 మధ్య కాలంలో భారతదేశ సగటు జనాభా పెరుగుదల 17.7 శాతం. మిగిలిన రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కొంత మెరుగ్గా ఉన్నా, యూపీ, బిహార్ చాలా వెనుకబడ్డాయి. ఇక దేశ జనాభాలో 16.5 శాతం యూపీదే! పరిస్థితి ఇలాగే కొనసాగితే, చైనాను మించిపోయి ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుందనీ, 2050 నాటి కల్లా మన జనాభా 169 కోట్లు దాటేస్తుందనీ అంచనా. తరుగుతున్న ప్రకృతి వనరులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఇన్ని కోట్లమందికి అన్నవస్త్రాలు, ఆశ్రయం అందించడం, ప్రాథమిక వసతులు కల్పించడం పోనుపోనూ అసాధ్యమే. సాక్షాత్తూ ప్రధాని మోదీ 2019లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పరిమిత కుటుంబాన్ని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తే అని ప్రవచించింది అందుకే. ఈ నేపథ్యంలోనే యూపీ, అస్సాం లాంటి రాష్ట్రాలు జనాభానియంత్రణ చట్టాల బాట పడుతున్నాయనుకోవచ్చు. ఎన్నికలైపోయిన అస్సాంలో క్రమంగా ఇద్దరు సంతానం చట్టాన్ని అమలులోకి తేవాలనుకుంటే, మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలున్న యూపీలో యోగి తొందరపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ గణనీయ సంఖ్యలో ముస్లింలు ఉన్నారనేది గణాంకాల లెక్క. మరి, ఇప్పటికిప్పుడు ఓ చట్టం చేసి, అధిక సంతానం ఉందనే ఒకే కారణంతో బలహీన, సామాన్య కుటుంబాల సంరక్షణ, సంక్షేమం, సమున్నతి లాంటి బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవచ్చా అన్నది ధర్మసందేహం. యూపీ తక్షణ బిల్లు ప్రతిపాదనలో పరమార్థం ఏమైనా, ఎన్నికల ముందు చేస్తున్న ఈ ‘జనాభా రాజకీయం’ ఫక్తు ‘మార్కెటింగ్ ఎత్తుగడ’గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఇద్దరు సంతానమే అయితే విద్యుత్, మంచినీటి చార్జీలు తగ్గిస్తామనీ, ఒకరే సంతానమైతే నగదు ప్రోత్సాహకాలిస్తామనీ యోగి సర్కార్ ఉవాచ. నిపుణులేమో ఇలాంటి ఏకైక సంతాన ప్రతిపాదన చివరకు లింగ నిష్పత్తి మొదలు అనేక అంశాలలో అసమతౌల్యానికి దారి తీసే ముప్పు ఉందంటున్నారు. ఇప్పటికైతే ఈ ప్రతిపాదిత చట్టం మీద ఈ నెల 19 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశమైతే ఇచ్చారు. కానీ, ఇంట్లో ఎంతమంది ఉన్నా రేషన్ కార్డు మీద నలుగురికే సరుకులిస్తామనీ, ఇద్దరు మించి సంతానమైతే స్థానిక ఎన్నికలలో పాల్గొనే వీలు లేదనే మాటలు సహజంగానే అందరికీ రుచించకపోవచ్చు. కొన్ని వర్గాలను సామాజికంగా, రాజకీయంగా దూరం పెడుతున్నారని అనుమానించవచ్చు. అయితే, స్థానిక సంస్థల పోటీపై షరతు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలులో ఉందని గుర్తించాలి. ఆధునిక కాలంలో ‘చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబం’ అనే మాటతో విభేదించేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ గత నవంబర్‌లో ‘లవ్ జిహాద్ చట్టం’, ఇప్పుడీ కొత్త జనాభా బిల్లు – ఇలా యూపీ సర్కార్ పడుతున్న హడావుడే అసలు సమస్య. అన్ని వర్గాలకూ వర్తింపజేస్తామనీ, అందరినీ కలుపుకొనిపోతామనీ పాలకులు చెబుతున్నా ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. వెరసి, 2019 లోక్‌సభ ఎన్నికలలో ‘ట్రిపుల్ తలాక్ బిల్లు’ లానే రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ బిల్లు ఓ ప్రధానాంశం కావచ్చు. అదే జరిగితే... ఓటర్ల తీర్పు కోరనున్న ఆదిత్యనాథ్‌కు ఈ ఇద్దరు పిల్లల కొత్త బిల్లు ఒకటికి రెండు ఓట్లు రాలుస్తుందా, లేక కష్టాల పాలు చేస్తుందా అన్నది వేచి చూడాలి. -
జనాభా కాదు... నైపుణ్యం ముఖ్యం!
ప్రపంచ జనాభా కోటి నుంచి వంద కోట్లకు చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. కానీ ఎప్పుడైతే సైన్సు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గి, జన విస్ఫోటనం పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ మార్కుకు చేరుకుంది. ఇది 2030లో సుమారు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. మనిషి సగటు జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 నుండి 2019 వరకు 72.6 ఏళ్లకు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా 1980లలో వన్–చైల్డ్ విధానం అమలు చేయడానికి ముందు జన్మించిన తరాలు నేడు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. రాబోయే పదేళ్ళలో 55 అంతకంటే ఎక్కువ వయసు గల 12.39 కోట్ల మంది అక్కడ ఉండబోతున్నారు. చైనా జనాభా సగటు వయసు 1990లో 25 ఏళ్లు ఉండగా, 2020లో 38 ఏళ్లకు పెరిగింది. జనాభా సంక్షో భాన్ని నివారించడానికి దశాబ్దాల నాటి వన్–చైల్డ్ పాలసీని సడలించి నప్పటికీ, చైనా జనన రేటు 2017 నుండి స్థిరంగా క్షీణించింది. ప్రధాన నగరాల్లో పిల్లలను పెంచడానికి అధిక వ్యయంతో పోరాడుతున్న జంటలు, మహిళా సాధికారత పెరగడం వల్ల సహజంగానే ప్రసవాలను ఆలస్యం చేయడం లేదా నివారించడం దీనికి కారణం. జనాభా నియంత్రణ విధానాన్ని తీసివేస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వానికి జనాభా శాస్త్రవేత్తలు సూచించారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ టెక్నాలజీ సాయంతో ప్రతికూల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చుననే వాదన కూడా చైనాలో ఉంది. మరోవైపు 2027 నాటికి చైనా జనాభాను భారతదేశం అధిగమిస్తుందని అంచనా. అయితే భారతదేశంలో ప్రపంచం లోనే అత్యధిక కౌమారులు, యువకులు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం, భారతదేశంలో ప్రతి ఐదవ వ్యక్తి కౌమార దశలో (10–19 సంవత్సరాలు) ఉన్నారు. మొత్తం 23.65 కోట్లు. అయితే దేశ భవిష్యత్తు కార్మికుల సంఖ్య పెంచడం కంటే, ప్రతి కార్మికుడి నైపుణ్యాలు, ఉత్పత్తి విలువను పెంచడం మీద ఆధారపడి ఉంటుంది. స్వాతంత్య్ర కాలంలో దేశ జనాభా 35 కోట్లు. అప్పటి నుండి నాలుగు రెట్లు పెరిగింది. 2019లో ఇది 1.37 బిలియన్లు. జనాభా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. అధిక జనాభా వల్ల సహజ వనరులను వేగంగా వినియోగించుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా పెరుగుతున్న జనాభా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దృష్ట్యా 2019 ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ’జనాభా విస్ఫోటనం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని ప్రకటించారు. జనాభా విషయంలో సామాజిక అవగాహన చాలా అవసరమని నొక్కి వక్కా ణించారు. దేశాల మధ్య జనాభా అసమతుల్యత కారణంగా విపత్కర పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒక రాష్ట్రం, దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా పటిష్టమైన విధానాన్ని అవలంబిం చాలి. తద్వారా పటిష్టమైన మానవ వనరులను ఏర్పరుచుకోవడా నికి అవకాశం ఉంటుంది. అది ప్రకృతి పైన భారాన్ని తగ్గించి, మానవ, జీవజాతుల శ్రేయస్సుకు దోహదకారి అవుతుంది. చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘ 91825 52078 (నేడు ప్రపంచ జనాభా దినోత్సవం) -
2050 నాటికి ఇండియా జనాభా ఎంతో తెలుసా ?
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. కానీ మనుషులు అన్ని దేశాల్లో ఒకేలా లేరు. ఒక చోట వనరులకు మించి జనాభా ఉంటే .. మరో చోట వనరులున్నా జనాభా తగ్గిపోతుంది. నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా ఎలా ఉంది. ఇక ముందు ఎలా ఉండబోతుందనే అంశాలపై ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి వెబ్ ప్రత్యేక కథనం 1989లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకు ముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పుడు మరణాలే నాగరికత నేర్చింది మొదలు రెండో ప్రపంచ యుద్ధం వరకు మనిషి మనుగడ అంత సులువుగా లేదు. ఎప్పుడో ఏదో ఒక ఉపద్రవం రావడం, యుద్ధాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకునేవి. పైగా వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అంటు రోగాలు, వ్యాధులుల విజృంభించేవి. శిశు మరణాల రేటు ఎక్కువ. దీంతో జనాభా వృద్ధి ఓ మోస్తరుగా ఉండేంది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, అంతకు ముందు వచ్చిన స్పానిష్ ఫ్లూ కారణంగా లక్షలాది మంది మరణించారు. బేబీ బూన్ 1950 నుంచి 1987 మధ్య కాలంలో ఒక్క సారిగా ప్రపంచ జనాభా విస్ఫోటనం జరిగింది. ప్రపంచ జనాభా 250 కోట్ల నుంచి 500 కోట్లకు చేరుకోవడానికి కేవలం 37 ఏళ్లు మాత్రమే పట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగవడం, భూస్వామ్య, రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యం రావడం, ఆధునిక వ్యవసాయం, తగ్గిపోయిన యుద్ధాలు తదితర కారణాలతో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ఈ 37 ఏళ్ల కాలాన్ని బేబీ బూన్గా వ్యవహరిస్తుంటారు జనాభా తగ్గిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొన్ని దేశాలు... తమ జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదు అవుతోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అంచనా. ఇండియా పరిస్థితి జపాన్, ఇటలీ స్థాయిలో కాకపోయినా ఇండియాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోత్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. 1950లో భారతీయ మహిళలు సగటున ఒక్కొక్కరు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తే.. ప్రస్తుతం అది 2.1గా ఉంది. మరో 25 ఏళ్లు సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే జనాభా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ దేశ లేదా ప్రాంత లేదా తెగకు చెందిన మహిళలకు 2.1 మంది పిల్లలకు జన్మనివ్వాలి. ప్రస్తుతం ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్ల మరో 25 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో భారత జనాభా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళా, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలు జన్మనిచ్చే రేటు 2.1 కంటే దిగువకు చేరుకుంది. 2047లో గరిష్ట స్థాయికి 2018-19లో చేపట్టిన ఆర్థిక సర్వేలో 2030 నాటికి ఇండియాలో జననాల రేటు 2 కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకు భారత దేశ జనాభా పెరుగుతూ పోయి గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదు అవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి ఇండియా జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. పెంచండి దాదాపు అర్థ దశాబ్ధం పాటు అత్యంత కఠిన జనాభా నియంత్రణ విధానాలు అమలు చేసిన చైనా ధోరణిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కన్నా పర్వాలేదు అంటోంది. మరోవైపు పోలాండ్ దేశం అబార్షన్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఒక్కో చిన్నారికి 100 యూరోల వంతున ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతీ నెల ఆర్థిక సాయం అందిస్తోంది. దక్షిణ కోరియా పిల్లలు ఎక్కువగా ఉన్న దంపతులకు ఇన్సెంటీవ్లు, హోం లోన్లు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తోంది. సువర్ణావకాశం జనాభా పెరిగిపోయిందని దేశంలో ఆందోళన నెలకొన్నా ఇప్పుడు ప్రపంచలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్ నిలబడింది. ఇప్పుడు యువ జనాభాలో నైపుణ్యం పెంచి కొత్త అవకాశాలు సృష్టిస్తేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవాళ్లం అవుతాం. అలా కానట్టయితే మరో ముప్పై ఏళ్లకు అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశంగా ఇండియా మిగిలిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి, మౌలిక సదుపాయాలతో వృద్ధ జనాభాతో నెట్టుకురావడం కష్టంగా మారుతుంది. ఇద్దరు చాలు ఇండియాలో 24 కోట్ల ప్రజలతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. అత్యధిక జనాభా కలిగిన టాప్ టెన్ దేశాల్లో ఉన్న బ్రెజిల్, నైజీరియా, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికోల కంటే ఉత్తర్ ప్రదేశ్ జనాభాయే ఎక్కువ. దీంతో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది యోగీ సర్కార్. దీని కోసం న్యూ పాపులేషన్ పాలసీ 2021-30ని అమల్లోకి తెచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారికి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సబ్సిడీలు అందవ్వమంటూ సీఎం యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన్ని కనండి జపాన్, పోలండ్ దేశాల తరహా పరిస్థితిని ఇండియాలో పార్సి మతస్తులు ఎదుర్కొంటున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు పార్సీల జనాభా ఇండియాలో లక్షకు పైగా ఉండగా ఇప్పుడు కేవలం 55,000లకు పరిమితమైంది. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మినహాయిస్తే నగరాల్లోనే అక్కడక్కడ పార్సీలు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంచుమించు వెయ్యి మంది పార్సీలు ఉండగా ఏపీలో అయితే రెండు అంకెలలోపే ఉండవచ్చని అంచనా. దీంతో పిల్లలు కనాలంటూ దంపతులను ప్రోత్సహించేందుకు ‘జియో పార్సీ’ అనే పథకాన్ని మైనార్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలు పార్సీ స్వచ్చంధ సంస్థలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. పార్సీల జనాభా తగ్గిపోవడానికి కారణం లేటు వయస్సులో పెళ్లిలు చేసుకోవడం, పెద్ద కుటుంబాల పట్ల అయిష్టత ఉండటం ముఖ్య కారణమని పార్సీ అంజుమాన్ ట్రస్టు బాధ్యులు జహంగీర్ తెలిపారు. జనాభా పెరుగుదల తీరుతెన్నులు భూమిపై మనిషి పుట్టుక మొదలైన తర్వాత వేల ఏళ్ల తర్వాత 1800లో మొదటి సారిగా జనాభా వంద కోట్లను దాటింది. - 1900 నాటికి జనాభా ఒకేసారిగా పెరిగి 200 కోట్లకు చేరుకుంది - 2000 వచ్చే సరికి జనాభా మూడింతలై 600 కోట్లకు చేరుకుంది - 2000 నుంచి 2012 అంటే పదేళ్లలో జనాభా 700 కోట్లు అయ్యింది - 2030 నాటికి రికార్డు స్థాయిలో 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చని అంచనా - 2100 నాటికి ప్రపంచ జనాభా 1000.90 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కకట్టింది -
‘ముగ్గురు నలుగురు వద్దు, ఒక్కరిద్దరే ముద్దు’
ఒంగోలు మెట్రో: పెరుగుతున్న జనాభా మానవ వనరుల వృద్ధికి ఊతంగా ఉపకరిస్తుందనేది ఎంత సత్యమో ఆకలి బాధలు కూడా పెరుగుతాయనేది అంతే సత్యం. ఏటికేటికీ పెరుగుతున్న జనాభా వల్ల నిరుద్యోగ సమస్య, ఆకలి మరణాలు, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికంతోపాటు నివాస సమస్య, నిరక్షరాస్యత లాంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏ కుటుంబమైనా, దేశమైనా అభివృద్ధి చెందడం అనేది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది. జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో కనిపించకపోవడం వల్ల జనాభా పెంపుదల మీద అదుపు లేకుండా పోతోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల..లాభనష్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రకాశం @పనామా ప్రపంచ జనాభాలో 40 శాతం ఆసియా దేశాలైన ఇండియా, చైనాలోనే ఉన్నారు. జూలై 11, 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరగా.. ఇప్పుడా సంఖ్య 540 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభా ఏటా 9.20 కోట్లు పెరుగుతోంది. దేశంలో 1881 నుంచి జనగణన ప్రారంభించగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో 2011లో జనగణన చేపట్టారు. ప్రస్తుత ఇండియాలో జనాభా 140 కోట్లకు చేరువలో ఉండగా ప్రకాశం జిల్లాలో 40 లక్షల మార్కుకు దగ్గరవుతోంది. మధ్య అమెరికాలోని పనామా దేశంతో సమానమైన సంఖ్యలో జిల్లాలో జనాభా ఉన్నారు. అంతేకాదు అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర జనాభాతో మన జిల్లా జనాభా సమానం. ఇక మే 2010 జనాభా లెక్కల ప్రకారం పనామా జనాభా 34,05,813. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా జనాభా కూడా ఇంతే ఉంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. 2011లో 34 లక్షలున్న జిల్లా జనాభా ఇప్పుడు 40 లక్షలు దాటే అవకాశం ఉంది. జిల్లాలో అక్షరాస్యత 63.53 శాతంగా ఉంది. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 981 మంది స్త్రీలు ఉన్నారు. తద్వారా లింగ వివక్ష ఉన్నట్టు రుజువవుతోంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో అక్షరాస్యత తక్కువ. జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 193గా ఉంది. జనాభా పెరుగుతుండటం వల్ల జీవనావసరాలు పెరిగి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతోంది. ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి నిరుద్యోగులు ఇతర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లకు క్యూకడుతున్నారు. ఇక ప్రజలు తాగడానికి పూర్తి స్థాయిలో నీటి సదుపాయాలు ఉండటం లేదు. పేద కుటుంబాల్లోనే జనాభా సంఖ్య పెరిగిపోతోందని అధికారిక గణాంకాలు, వివిధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ ప్రాధాన్యం, గర్భ నిరోధక సాధనాలపై అవగాహనా లేమి దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనాభా తక్కువగా ఉంటే.. జనాభా తక్కువగా ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. మంచి ఆహారం అందరికీ దొరుకుతుంది. మంచి నివాసాలు నిర్మించుకోగలరు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి దొరుకుతుంది. పేదరికం తగ్గిపోయి ఆకలి మరణాలు లేని కాలం ఎదురొస్తుంది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించగలుగుతారు. నష్టాలు అధికమే.. జనాభా పెరగడం వల్ల నివాస వసతికే పెద్ద చిక్కులు వస్తాయి. ఇరుకైన ఇళ్లు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఒకేచోట ఉండాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. దీంతో అంటురోగాలు, అనారోగ్యాలు పెరుగుతాయి. ఇంకోవైపు నిత్యావసరాలు పెరుగుతాయి. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ కారణంగా ఒకపూట తిండి మాత్రమే తినాల్సి వస్తుంది. ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయి. ఇక పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం కోసం వస్తు సామగ్రి విస్తృత ఉత్పత్తి కోసం పరిశ్రమలు ఏర్పడాలి. వాటి ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య, జీవితంలో నిరాశ, సోమరితనం, నిర్లిప్తత పెరిగి క్రమంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలంతా జనాభా పెరుగుదలను అరికట్టేందుకు తాత్కాలిక పద్ధతులను, శాశ్వత పద్ధతులను ఎంచుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆచరించాలి. జనాభా గణాంకాలు కీలకం ఒక దేశ ఆర్థిక ప్రణాళికలు, సామాజిక పథకాలు రూపొందించడానికి విధిగా జనాభా లెక్కలు అవసరమవుతాయి. ఇటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల గుర్తింపు లాంటివి జరిగి వాటిపై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తారు. అందువల్ల జనాభా లెక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిరోధించడం ఎలా? జననాల రేటు ఎక్కువగా ఉండి, మరణాల రేటు తక్కువగా ఉండటమే జనాభా పెరుగుదలకు సూచిక. జనాభా పెరుగుదలను కట్టడి చేయాలంటే దంపతులు కుటుంబ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఆడ అయినా, మగ అయినా సంతానాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేసుకుంటే మంచిది. ఇందుకుగాను ప్రభుత్వం ఉచితంగా కుటుంబ నియంత్రణ లాంటి సేవా సౌకర్యాలు ప్రవేశపెడుతోంది. శాశ్వత పద్ధతులుగా ట్యూబెక్టమీ, డీపీఎల్, ఎస్ఎస్వీ(వేసెక్టమీ) లాంటివి ఉన్నాయి. తాత్కాలిక పద్ధతులుగా నిరో«ధ్, మాత్రలు, ఐడీయూ లాంటివి ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఎవరికి వారు జనాభా నియంత్రణ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. పరిష్కార మార్గాలు రోజురోజుకీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ప్రకృతి వనరులు ఉండటం లేదు. కనుక అవసరాలకు తగినట్టు సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలి. ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కలిగించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ⇒ మహిళలు, బాలికల సంక్షేమం, చదువుపై శ్రద్ధ చూపాలి. ⇒ గర్భ నిరోధక సాధనాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలి. ⇒ పురుషులను సంతాన నిరోధక ఆపరేషన్లకు ప్రోత్సహించాలి. ⇒ వెద్య రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మీద అవగాహన పెంచాలి. ⇒ ‘ముగ్గురు నలుగురు వద్దు, ఒక్కరిద్దరే ముద్దు’ లాంటి సూచనలు పాటించాలి. ⇒ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లోని ప్రజలతో జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ అవగాహన పెంచాలి. ⇒ జనాభా నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. -
ఇక భూమిపై బతుకు భారం కాబోతుందా?
-
ఇక భూమిపై బతుకు భారం కాబోతుందా?
వంద కోట్ల మందికి పైగా రోజు మూడుపూట్ల తిండి దొరకడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికే తిండి, గూడు, గుడ్డ దొరకక అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. మరి ఇంతకు మరింత రెట్టింపుగా జనాభా పెరిగితే పరిస్థితి ఏమిటి? తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జనాభా గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉంది? అధిక జనాభా వలన కలిగే నష్టాలు ఏమిటి? జనాభానియంత్రణకు చేపట్టవలసిన విధానాల గురించి తెలుసుకుందాం.... -
భారత్ జనాభా పెరుగుదలలో అసమతుల్యం
జనాభాతో భూగోళం కిటకిటలాడిపోతోంది. ప్రతీ ఏడాది అదనంగా 13 కోట్ల మంది పుట్టుకొస్తూ ఉండడంతో ఈ ఆధునిక కాలంలో కూడా కుటుంబ నియంత్రణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఈ ఏడాది కూడా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణ మానవ హక్కు అన్న నినాదాన్ని యూఎన్ ప్రచారం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య జనాభా పెరుగుదల ఏకరీతిలో లేకపోవడం, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ యువతరం ఎక్కువగా ఉంటే, యూరప్ దేశాల్లో జనాభా పెరుగుదల ఆగిపోయి వృద్ధతరం పెరిగిపోతోంది. ఈ అసమతుల్యత రకరకాల సవాళ్లను విసురుతోంది. క్రాస్ రోడ్స్‌లో భారత్ భారత్‌లో వివిధ రాష్ట్రాల మధ్య జనాభా ఏకరీతిలో పెరగకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో యువతరం ఉరకలేస్తూ ఉంటే, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. ఉత్పాదక రంగంలో భాగస్వామ్యులయ్యే జనాభా (15నుంచి 64 ఏళ్ల వయసు) కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, పని చెయ్యలేని జనాభా (14 ఏళ్ల కన్నా తక్కువ, 65 ఏళ్లకు పైన ఉన్నవారు) మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేరళ, పంజాబ్, చండీగఢ్‌లో సంతాన సాఫల్య రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల మానవ వనరుల సమస్యని ఎదుర్కొంటూ ఉంటే, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం వంటి రాష్ట్రాల్లో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. భారత్ జనాభాలో 44శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉంది. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కారణంగానే 2024 నాటికే చైనాను అధిగమిస్తామనే అంచనాలున్నాయి. భారత్ జనాభాలో 27 శాతం 14 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే, 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న జనాభా 64.7శాతంగా ఉందని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. ఇక 60 ఏళ్లకు పై బడిన జనాభా భారత్‌లో 2016 నాటికి 8.3 శాతం ఉంటే, 2050 నాటికి 19 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నాయి. సంతాన సాఫల్య రేటులో (ఒక మహిళ ఎంతమంది పిల్లల్ని కంటోందనే విషయం ఆధారంగా అంచనా వేస్తారు) తేడాల కారణంగా మన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తీరు ఏకరీతిగా ఉండడం లేదు. 2006లో 2.7 గా ఉన్న సంతాన సాఫల్య రేటు 2016లో 2.2 కి తగ్గింది. పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరితనం ఎదుర్కోవడం, వృద్ధ్యాప్యంలో చూసే దిక్కులేక వయసు మీద పడిన వారికి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వయోవృద్ధులు పెరిగిపోవడం వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ ఇక సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు తరుముకొస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘వయోవృద్ధుల సంరక్షణ, ఒంటరిగా ఉండేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రక్షణ బడ్జెట్ కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేస్తున్నాయే తప్ప జనాభాలో అసమతుల్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు‘ అని మానవ వనరుల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విద్య, ఉపాధి, జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆయా ప్రాంతాలకు వలసలు పెరిగిపోతున్నాయి. పేదరికంలో మగ్గిపోతున్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి పంజాబ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోతున్నాయి. అసంఘటిత రంగంలో వలసదారులు పెరిగిపోయి స్థానికులకు, వారికి మధ్య ఘర్షణలు ప్రభుత్వాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు ప్రతీ నిముషానికి 250 మంది జననం 2024 నాటికే చైనా జనాభాను దాటేయనున్న భారత్ 2050 నాటికి భారత్‌లో 160 కోట్లకు పైగా జనాభా 2050 నాటికి భారత్ జనాభాలో 65 శాతం మాత్రమే చైనా జనాభా ఉంటుందనే అంచనాలు అమెరికన్ల కంటే నైజీరియన్లు ఎక్కువగా ఉంటారు గత 200 ఏళ్లలో ప్రపంచ జనాభా 600 శాతం పెరుగుదల ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో జనాభా పెరుగుదల అత్యధికం పశ్చియ యూరప్, రష్యా, జపాన్లలో జనాభా విపరీతంగా తగ్గిపోయి ఆ దేశాలకు మానవ వనరుల కొరత 2100 నాటికి భూమిపై ఉండే జనాభా 1100 కోట్లకి చేరుకుంటుందని ఒక అంచనా -
ప్రభం‘జన’ తొలి పది దేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.5 కోట్ల జనాభా పెరుగుతోంది. 2018 జూలై నాటికి ప్రపంచ జనాభా 760 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇదేవిధంగా పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి 840 కోట్లు, 2050 నాటికి 960 కోట్లకు జనాభా చేరుకుంటుంది. నేడు (జులై 11) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్లో ముందున్న పది దేశాల గురించి తెలుసుకుందాం. చైనా 1,415,171,198తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తొలి స్థానంలో నిలించింది. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 18.54 శాతం జనాభా చైనాలోనే ఉంది. ఒక చదరపు కిలోమీటరులో 151 మంది ప్రజలు నివసిస్తున్నారు. చైనా జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు. ఇండియా 1,354,464,444 జనాభాతో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 17.74 శాతం ప్రజలు భారత్‌లో నివశిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు 455 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇది చైనా కంటే రెండింతులు ఎక్కువ. భారతీయ జనాభాలో సగటు వయసు 27 ఏళ్లు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ తొలి స్థానంలో ఉంది. అమెరికా 326,830,645 జనాభాతో అమెరికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో అమెరికన్లు 4.28 శాతం మంది ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 36 మంది మాత్రమే నివశిస్తున్నారు. అమెరికన్ల జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు. ఇండోనేషియా 266,872,775 జనాభాతో దీవుల దేశం ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 3.5 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు 147 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 28 ఏళ్లు. బ్రెజిల్ 266,872,775 జనాభాతో ప్రపంచంలో బ్రెజిల్ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.76 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 26 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 31 ఏళ్లు. పాకిస్తాన్ 200,919,769 జనాభాతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో పాక్ జనాభా శాతం 2.63. ఒక చదరపు కిలోమీటర్‌కి 260 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి జనాభా సగట వయసు 22 ఏళ్లు. నైజీరియా 196,041,916 జనాభాతో నైజీరియా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో నైజీరియన్ల్ శాతం 2.57. ఒక చదరపు కిలోమీటర్‌కి 215 మంది నైజీరియన్లు నివశిస్తున్నారు. బంగ్లాదేశ్ 166,415,337 జనాభాతో భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.18. ఒక చదరపు కిలోమీటర్‌కి అత్యధికంగా 1278 మంది నివశిస్తున్నారు. వీరి జనాభా సగటు వయసు 26 ఏళ్లు. రష్యా 143,964,017 జనాభాతో రష్యా ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 1.89 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 9 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 38 ఏళ్లు. మెక్సికో 130,803,510 జనాభాతో మెక్సికో ప్రపంచంలో పదో స్థానం ఆక్రమించింది. ప్రపంచంలో వీరి జనాభా 1.71 శాతం. -
జనాభా వరమా? శాపమా?
ప్రపంచ జనాభా మొత్తంగా అదుపూ అడ్డూ లేకుండా పెరిగిపోతోంది. అవసరాలు తీర్చే వన రులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితం అయిపోతు న్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవ డాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే మరో గ్రహాన్ని వెతుక్కో వాల్సిందే అని ఇటీవల వినిపిస్తున్న ఘోష. జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివలన లాభ నష్టాలేమిటి? అసలు జనాభా అనేది దానికి అదే ఒక శాపమా? లేక వరమయ్యే అవకాశాలు న్నాయా? దానిని అదుపు చేయడమా? స్థిరీకరించడమా? పెరుగుదల వేగాన్ని తగ్గించడమా? వంటి అంశాలను ప్రపంచానికి తెలియజేయడా నికే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిందని జన గణన సంస్థలు ప్రక టించాయి. చరిత్రలో ఈ తేదీ గుర్తుగా ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్ణయించాయి కూడా. ఆపై కొద్ది కాలంలోనే ప్రపంచ జనాభా 2011 అక్టోబర్ 11 నాటికి 700 కోట్లకు చేరింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ ప్రభంజనంగా మారనుంది. అత్యధిక శ్రామిక శక్తిగా, ఉత్పాదక శక్తిగా అవతరించబోనుంది. ప్రపంచ జనాభాను పరిశీలిస్తే 700 కోట్ల సంఖ్య మన దేశానికే దక్కడం మరో విశేషం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక ఆడ శిశువు జన్మించింది. ఆ ఆడ శిశువు ‘బేబీ సెవెన్ బిలియన్’గా పేరు కెక్కింది. ప్రపంచ జనాభాలో 17.5 శాతం వాటా మనదే. ప్రస్తుతం జనాభా విషయంలో చైనా (సుమారు 134.4 కోట్లు) తరువాత 121 కోట్ల పైచిలుకు జనాభాతో 2వ స్థానంలో ఉన్నాము. 2050 నాటికి భారత్.. చైనాను దాటి అత్యధిక జనాభాగల దేశంగా అవతరిస్తుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం మన జనాభాలో 50 శాతం 25 ఏళ్లలోపు వాళ్లు కాగా, 35 ఏళ్లలోపు వాళ్లు 65 శాతంగా ఉన్నారు. 2030 నాటికి అత్యధిక యువ శక్తిగల దేశం భారతదేశమే అవుతుంది. మన మనుగడకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన సెవెన్ బిలియన్ క్యాంపెయిన్ కొన్ని సూచనలు చేస్తోంది. అవి 1. దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపు చేయడం. 2. చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆరోగ్యకర మైన కుటుం బాలకు దారి సుగమం చేయడం. 3 తక్కువ సంతానం, దీర్ఘాయుష్షుల వలన వృద్ధుల సంఖ్య పెరగడంపై జాగరూకతతో ఉండటం. జూలై 11, 2018న ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి కుటుంబ ప్రణాళికను ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణ యించింది. దీంతో తొలిసారిగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లల సంఖ్య, ఇంకా వారి మధ్య అంతరాన్ని గుర్తించడాన్ని ఒక ప్రాథమిక మానవ హక్కుగా వెలుగులోకి తెచ్చినట్లైంది. భారతదేశం అతి త్వరలో అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరించబో తోంది అని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆనాడే అన్నారు. ఆయన మానస పుత్రిక అయిన ‘గ్రామ స్వరాజ్యం’ కోసం పలు ప్రణాళికలను రూపొందించారు. ప్రభుత్వాలు కూడా వాటిని కొద్ది మార్పులతో ఆచరణలోకి తెచ్చాయి. తన సొంత ఖర్చుతో జాతీయ పాఠశాలలు, వినియో గదారులు, ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు వంటి వాటిని ఏర్పర్చి ప్రకాశం గారు చేసిన కృషిని మహాత్మాగాంధీ ప్రశంసిస్తూ అవి దేశప్రగతికి నిదర్శనాలని కితాబు ఇచ్చారు. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రత్యేకించి యువతరాన్ని ఉత్తేజపరచనుంది. తమ ఆరోగ్యం, శరీర పుష్టి, లైంగిక సమస్యలు వంటివాటిపై యువత సరైన నిర్ణయాలను తీసుకోగలిగేలా ప్రేరే పించడమే నేటి జనాభా దినోత్సవం లక్ష్యం. వ్యాసకర్త: టంగుటూరి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ మొబైల్ : 99514 17344 -
జనమే జనం
జనాభా పెరుగుదల, జనసాంద్రత ఎక్కువున్న జిల్లాగా రంగారెడ్డికి ప్రత్యేక స్థానముంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడే. 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు. రాజధానికి చుట్టూ విస్తరించి ఉండడం.. పట్టణీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు వలసల తాకిడితోనూ జనాభా సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాకు కొత్త ప్రాజెక్టుల రాక ఉత్సాహాన్ని నింపుతోంది. దేశంలోనే అతిపెద్ద ఔషధనగరి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. బహుల జాతి కంపెనీలు సైతం రాజధాని శివార్లలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో జనాభా పరంగా జిల్లా మరింత ముందుకువెళ్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం.. - సాక్షి, రంగారెడ్డి జిల్లా /ఘట్కేసర్ టౌన్/దోమ నేడు ప్రపంచ జనాభా దినోత్సవం జనాభా వృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. జనాభా పెరుగుదల పరంగా రాష్ర్టంలో తొలిస్థానం కైవసం చేసుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 35.75 లక్షలతో రెండోస్థానంలో ఉన్న జిల్లా 2011 నాటికి 52.96 లక్షలకు చేరుకుంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలసలు పెరుగుతుండడంతో జనసాంద్రతపై ప్రభావం చూపుతోంది. నగర శివార్లలో ఉపాధి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వలసలు, ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తున్నారు. దీంతో గత దశాబ్బంలో జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్‌కి గణనీయంగా పెరిగింది. దశాబ్దాకాలంలో జనాభా 48.15 శాతం వృద్ధి చెందింది. 1901లో 3.39 లక్షలున్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలు, 1991 నాటికి 25.51 లక్షలకు చేరుకుంది. జిల్లా జనసాంద్రత 707 కి.మీ., జిల్లా అక్షరాస్యత 78.05 కాగా పురుషులు 84శాతం, స్త్రీల అక్షరాసత్య శాతం 71.82గా ఉంది. విద్యా, ఉద్యోగం, నిరుద్యోగం తదితర కారణాలతో చాలామంది పల్లె నుంచి పట్టణాలకు మకాం మార్చినా పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉండడం విశేషం. 52.96 లక్షల జనాభాలో 34 లక్షల మంది గ్రామాల్లోనే జీవిస్తున్నారు. మూఢనమ్మకాలు, ఆడపిల్లలపై వివక్ష చూపడంతో జనా భాలో 12 లక్షల మంది మహిళలు తక్కువగా ఉన్నారు. పెరుగుతున్న సమస్యలు.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా కావడం లేదు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు రావడంతో వారికి వసతి, భద్రత, రక్షణ చర్యలు సదరు యాజమాన్యాలు కల్పించలేకపోతు న్నాయి. దీంతో రోడ్లపై జీవనం గడుపుతున్నారు. ము రికి వాడలు పెరు గుతున్నాయి. నిరుద్యోగం పెరిగి చోరీలు ఎక్కువవుతున్నాయి. రవాణ సౌకర్యం, కంపెనీలు సంఖ్య పెరిగి జల, వాయు కాలుష్యాలు పెరుగుతున్నాయి. చిన్న కుటుంబం మేలు.. జనాభా నియంత్రణ కోసం చిన్న కుటుంబాల లాభాల గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించాలి. మేమిద్దరం, మాకిద్దరు అన్న నినాదాన్ని అమలు చేస్తే పిల్లలకు విద్యా, వైద్య, ఆరోగ్య సమస్యలు తలెత్తవు. చిన్న కుటుంబంతో హాయిగా జీవిస్తున్నారని పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. పరిమిత సంతానం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అధిక జనాభాను అరికట్టాలని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, అధికారులు పరిమిత సంతానంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఎప్పటి నుంచి.. 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూలై 11న అంతర్జాతీయ జనాభా దినోత్సం నిర్వహిస్తోంది. అక్షరాస్యత జిల్లా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నా అక్షరాస్యతలో మాత్రం మహిళలు పురుషులకంటే వెనుకబడే ఉన్నారు. 2011 జనగణన ప్రకారం అక్షరాస్యతలో పురుషులు 84శాతం ఉండగా, స్త్రీలు 71.82 శాతం ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. జనసాంద్రత జిల్లాలో ఉపాధి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వలసలు పెరిగిపోయాయి. ఉద్యోగాల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయం పెరుగుతోంది. 2001 2011 477 707 నివాస సముదాయాలు రంగారెడ్డి అర్బన్ విస్తీర్ణం చ.కి.మీ 1,034.27 గృహాలు 8,86,201 రంగారెడ్డి రూరల్ విస్తీర్ణం చ.కి.మీ 6,458.73 గృహాలు 3,49,140 ఎస్సీ, ఎస్టీలు తక్కువే.. రంగారెడ్డి అర్బన్‌లో 3.27లక్షల మంది ఎస్సీలు, 84వేల మంది వరకు ఎస్టీలు నివసిస్తున్నారు. ఎస్సీలు మొత్తం : 3,26,525 పురుషులు : 1,64,435 స్త్రీలు : 1,62,090 ఎస్టీలు మొత్తం : 84,864 పురుషులు : 44,020 స్త్రీలు : 40,844 స్త్రీ, పురుష నిష్పత్తి .. నాగరికత ఎంత పెరిగినా మహిళల విషయంలో నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. సాంకేతిక పెరిగిన తర్వాత ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే కడతేరుస్తున్నారు. భ్రూణహత్యలు పెరుగుతున్న దరిమిలా రోజురోజుకూ స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి ఆందోళన కరంగా మారుతోంది. ప్రస్తుతం ప్రతి వేయి మంది పరుషులకు 955మంది స్త్రీలే ఉన్నారు. -
జనభారతం
జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 720 కోట్లు దాటింది. ప్రపంచ జనాభాలో 37 శాతం కేవలం చైనా, భారత్‌లలోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనసంఖ్యలో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలూ ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఖండాల వారీగా చూసుకుంటే, ప్రపంచ జనాభాలో 60 శాతం ఆసియాలోనే ఉంది. అయితే, ఆసియాలో జపాన్ మినహా అభివృద్ధి చెందిన దేశమేదీ లేదు. అధిక జనాభా కారణంగానే ఆసియా దేశాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోతున్నాయనే వాదనలు లేకపోలేదు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి భారత్ జనసంఖ్యలో చైనాను అధిగమిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో గడచిన రెండు శతాబ్దాల కాలంలోనే విపరీతమైన పెరుగుదల నమోదైంది. మరణాల రేటును మించి జననాల రేటు నమోదు కావడం, అధునాతన వైద్య సౌకర్యాలు విరివిగా అందుబాటులోకి రావడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అయితే, జనాభా ఎంతగా పెరిగినా భూ విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. అందుకే జనాభా పెరుగుతున్న కొద్దీ భూగోళం ఇరుకుగా మారుతోందనిపించే అవకాశాలు లేకపోలేదు. పెరుగుతున్న జనాభాకు తగినంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. ఇప్పటికైనా అధిక జనాభా గల దేశాలు మెలకువ తెచ్చుకుని జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో అనేక సామాజిక అసమతుల్యతలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జనాభా పెరుగుదల తీరుతెన్నులు, దానివల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినంగా ప్రకటించింది. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా 1987 జూలై 11న యూఎన్డీపీ 5 బిలియన్ డేగా ప్రకటించింది. అయితే, 1989న జూలై 11న మొదటిసారిగా ప్రపంచ జనాభా దినం జరుపుకోవడం ప్రారంభమైంది. దాదాపు రెండువందల దేశాలు అప్పటి నుంచి ఏటా జనాభా దినాన్ని పాటిస్తున్నాయి. ఈ వారంలో జరుపుకోనున్న ప్రపంచ జనాభా దినం సందర్భంగా ప్రపంచ జనాభా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలుయువతరంలో భారత్ నం:1 మొత్తం జనాభాలో భారత్ రెండో స్థానంలోనే ఉన్నా, యువతరం జనాభాలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10-24 ఏళ్ల లోపు యువతరం జనాభా 180 కోట్లు దాటింది. భారత్‌లో వీరి జనాభా 35.6 కోట్లు ఉండగా, చైనాలో 26.9 కోట్లు, ఇండోనేసియాలో 6.7 కోట్లు, అమెరికాలో 6.5 కోట్లు, పాకిస్థాన్‌లో 5.9 కోట్లు, నైజీరియాలో 5.7 కోట్లు, బ్రెజిల్లో 5.1 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.8 కోట్లు ఉన్నట్లు యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్‌పీఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. యువతరం జనాభా ఎక్కువగా ఉండి, జననాల రేటు అదుపులో ఉన్న దేశాలు శరవేగంగా ఆర్థిక పురోగతి సాధించగలవని యూఎన్‌పీఎఫ్ చెబుతోంది. ఆ లెక్కన జననాల రేటును నియంత్రించే చర్యలు తీసుకోగలిగితే, త్వరలోనే ఆర్థికశక్తిగా అవతరించే అవకాశాలు భారత్‌కు మెరుగుపడతాయి.పెరిగిన పట్టణ జనాభా గడచిన ఆరు దశాబ్దాల్లో ప్రపంచంలో పట్టణ జనాభా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1950 నాటికి పట్టణ జనాభా దాదాపు 74 కోట్లు ఉంటే, 2014 నాటికి 390 కోట్లకు చేరుకుంది. ప్రపంచ పట్టణ జనాభా 2045 నాటికి 600 కోట్లకు మించుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 2050 నాటికి పట్టణ జనాభా భారత్‌లో అత్యధికంగా 40.4 కోట్లు, చైనాలో 29.2 కోట్లు, నైజీరియాలో 21.2 కోట్లకు చేరుకుంటుందని కూడా అంచనా వేస్తోంది. పారిశ్రామికీకరణ, మెరుగైన ఉపాధి అవకాశాలు, పల్లెల్లో వ్యవసాయం కుదేలవడం, కుటీర పరిశ్రమలు కుంటుపడటం వంటి కారణాల వల్ల చాలామంది పల్లెలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారు. వలస వచ్చిన పల్లె జనాలు గత్యంతరం లేక పట్టణాల్లోనే స్థిరపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతోంది. -
శనివారం సాయంత్రానికి భారత్ జనాభా 127,42,39,769
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: శనివారం సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భారతదేశ జనాభా మొత్తం సంఖ్య ఇది. ప్రపంచ జనాభా దినం సందర్భంగా జాతీయ జనాభా కమిషన్, అమెరికా గణాంకాల సంస్థల సంయుక్త సమాచారం ఆధారంగా ఇండియాస్టాట్.కామ్ ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం ప్రపంచ జనాభాలో 17.25 శాతం మంది భారత్‌లోనే నివసిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏటా భారత జనాభా 1.6శాతం చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో 139కోట్ల జనాభా ఉందని, అయితే ఇంతటి వృద్ధిరేటుతో దూసుకెళ్తే 2050నాటికి 169కోట్ల జనాభాతో ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారత్ ప్రథమస్థానంలో నిలువనుంది. -
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
దేశమంటే మట్టి కాదోయ్...దేశమంటే మనుషులోయ్...! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్...!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరుస్తున్న దేశం మనది. ప్రగతి ఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపుణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం. ఏయూక్యాంపస్ : విశాఖ నగరానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పట్టణంలో నివసించే వారిలో అధికశాతం మంది ఇతర ప్రాంతాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఆ ప్రత్యేకత. విద్య, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో ప్రజలు నగరానికి వలస వస్తున్నారు. స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, జింక్, పోర్ట్ ట్రస్ట్ వంటి ప్రభుత్వ సంస్థలు, కోస్ట్‌గార్డ్, డాక్‌యార్డ్ వంటి రక్షణ సంస్థలతో పాటు వేలాదిగా పరిశ్రమలు ఉన్నాయి. ఇపుడు నవ్యాంధ్రలో వాణిజ్య, పారిశ్రామిక రాజధానిగా విశాఖ ముందడుగు వేస్తోంది. దీంతో ఒకనాడు పట్టణం నగరమైంది...ఇపుడు...మహానగరమైంది. కష్టించి పనిచేసే తత్వం, సానుకూల దృక్పథం ఉన్నవారిని నగరం ఎంతో ఆకర్షిస్తోంది. ట్రాఫిక్ పద్మవ్యూహం... గతంలో నగరంలో ఏ ప్రాంతానికైనా పావు గంటలో చేరుకునే వీలుండేది. పెరుగుతున్న వాహనాలు, ప్రజల అవసరాల కారణంగా నగరంలో ట్రాఫిక్ నానాటికి పెరిగిపోతోంది. ఎన్ఏడీ నుంచి మద్దిలపాలెం కూడలి వరకు జాతీయ రహదారిపైన, నగరంలోను ప్రధాన కూడళ్లో సైతం సాయంత్రం వేళల్లో ప్రయాణించాలంటేనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో సరైన సాంకేతికత వినియోగించకపోవడం, ఇరుకు రోడ్డు వెరసి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అలాగే పెరుగుతున్న జనాభాతో శాంతి భధ్రతలను కాపాడడం సవాలుగా మారుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు సరిపడినన్ని పోలీస్స్టేషన్లు, సిబ్బంది సైతం లేకపోవడం మరో ప్రధాన సమస్య. చదువుల కేంద్రం కేవలం కొద్దిపాటి ప్రభుత్వం పాఠశాలలు, ఏవీఎన్, వీఎస్క్రిష్ణా ప్రభుత్వ కళాశాలతో ప్రారంభమైన విశాఖ విద్యా వ్యవస్థ నేడు ముప్ఫైకి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు, వందల్లో డిగ్రీ కళాశాలు, అదే స్థాయిలో ఇంటర్ కళాశాలలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలతో విరాజిల్లుతోంది. నవ్యాంధ్రకు పెద్దదిక్కుగా నిలుస్తున్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, గీతం విశ్వవిద్యాలయం, గాయత్రీ విద్యాసంస్థలు విశాఖను విద్యల రాజధానిగా నిలుపుతున్నాయి. వైద్య రంగంలో సైతం విశాఖ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అందుకోవడానికి, పోటీ పరీక్షల్లో తమ ప్రతిభను చూపడానికి మారుమూల గ్రామాల నుంచి యువతరం పెద్దసంఖ్యలో విశాఖకు తరలి వస్తుంటారు. లింగ వివక్ష విద్యావంతులు నివసించే నగరంలో లింగ నిష్పత్తి కొంత ఆందోళన కలిగించే విధంగా ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 977, చిన్నారుల లింగ నిష్పత్తి కేవలం 959 మాత్రమే ఉంది. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1003 మంది స్త్రీలు ఉంటున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతంలోనే స్త్రీ జనాభా ఎక్కువగా ఉందనేది దీని ద్వారా స్పష్టమవుతోంది. పట్టణ వాసులు ఆలోచన విధానంలో మార్పురావాలనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. స్వల్పంగా తగ్గిన వృద్ధి రేటు దేశవ్యాప్తంగా పెద్ద పది పట్టణాలలో విశాఖ స్థానం కలిగి ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా నిలిచింది. నగరంలో 1991 నుంచి 2001 మధ్యకాలంలో జనాభా వృద్ధి రేటు 16.66 శాతం ఉండగా లింగ సమానత్వం 985గా ఉంది, 2011 పాటికి కొంత మేర వృద్ధిరేటు తగ్గి 11.89 శాతంగా ఉండి లింగ సమానత్వం 1003గా నమోదైంది. అడుగంటుతున్న నీటి వనరులు పెరుగుతున్న జనాభాకు అవసరమైన నీటి వనరులను అందించడం ఎంతో అవసరం. నాణ్యమైన నీటిని నిత్యం అందించడానికి ప్రస్తుతం ఉన్న జన వనరులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటిని శుభ్రం చేయక పోవడం, పూడికలు తొలగించి నిల్వ సామర్ధ్యాలను పెంచే చర్యలను తరచు చేపట్టాలి. దశాబ్ధాలుగా తూతూ మంత్రంగానే వీటిని పునరుద్దరించే చర్యలు చేస్తున్నారు. ప్రధాన నీటివనరులైన మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి జలాశయాలను సంరక్షించే చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలి. వర్షాభావ పరిస్థితులు తలెత్తినపుడు వీటి విలువ, ఆవశ్యకతను గుర్తించడం కంటే ముందుగానే మేలుకోవడం మేలు. అదే విధంగా ప్రతి ఇంటిలో వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలను తప్పని సరిగా అమలు జరపాల్సి ఉంది. పెరుగుతున్న అసంఘటిత రంగం.. నగరంలో అధిక శాతం పరిశ్రమలల్లో, ఉపాధిని వెతుక్కుంటూ గ్రామీణ ప్రజలు వస్తున్నారు. వీరికి తగిన భద్రత, రక్షణ చర్యలు సదరు సంస్థలు కల్పించడం లేదు. అలాగే వీరికి వసతి, సంక్షేమ కార్యక్రమాల అమలు కల్పించడం సమస్యగా మారుతోంది. అలాగే పరిశ్రమల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టడం, కార్మికుల భద్రతకు, సంక్షేమానికి చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. మౌలిక వసతులపై భారం... విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని మోదీ వాక్కులు నేటికి కార్యరూపంలో దర్శనమివ్వడం లేదు. నగరం విస్తరిస్తూ సరిహద్దులను చెరిపేస్తూ నానాటికీ పెరిగిపోతోంది. దానికితోడు జనాభా పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగడం లేదు. జీవీఎంసీ, వుడా చక్కని ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్మార్ట్‌సిటీ మారేముందు మురికి వాడలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉంది. అంకెల్లో విశాఖ 2011 జనాభా గణన ప్రకారం.... విశాఖ జనాభా : 17,30,320 పురుషులు : 8,75,199 స్త్రీలు : 8,55,121 అక్షరాస్యులు : 12,98,896 (సగటున 82.66 శాతం అక్షరాస్యత) -
వృద్ధాప్యంలో ఆదరించేది ఆడపిల్లలే
కాకినాడ క్రైం : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించేది ఎక్కువగా ఆడపిల్లలేనని, అందువల్ల లింగవివక్ష చూపించి వారిని చిన్న చూపుచూడవద్దని కలెక్టర్ నీతూ ప్రసాద్ హితవు పలికారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి, కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదరించేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్క ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న భార్యాభర్తలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వైద్య శాఖపై ప్రశంసల జల్లు : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో వైద్యసిబ్బంది కృతకృత్యులయ్యారని కలెక్టర్ ప్రశంసించారు. గతేడాది 34 శాతం మంది మాత్రమే ప్రసవాలకోసం ప్రభుత్వాస్పత్రులకు రాగా ఈ ఏడాది అది 46 శాతానికి పెరిగిందన్నారు. ఐసీడీఎస్, వైద్య శాఖ సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. వేసక్టమీ విభాగంలో తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐదు సీహెచ్‌సీల్లో స్కానింగ్ యంత్రాలు : గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులతో జిల్లాలోని 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్‌సీ)లో ఇప్పటికే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామని, ఏజెన్సీలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. తొలుత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నర్సింగ్ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ నీతూ ప్రసాద్ జండా ఊపి ప్రారంభించారు. సమావేశం అనంతరం వైద్య సేవల్లో ప్రతిభ కనబరిచిన వారికి, లక్కీడిప్ ద్వారా ఎంపికైన జంటలకు కలెక్టర్ నీతూ ప్రసాద్ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏజేసీ మార్కండేయులు, డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎంజే నిర్మల, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ ఎం. ప్రసన్న కుమార్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిత, జిల్లా ఫైలేరియా నియంత్రణాధికారి డాక్టర్ పి. శశికళ, సెట్రాజ్ సీఈఓ శ్రీనివాసరావు, సమాచార శాఖ ఏడీ ఫ్రాన్సిస్, డెమో ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
జనం పెరిగితే రణమే
విజయనగరం ఆరోగ్యం: ఆకలి బాధలు, దొంగతనాలు, దోపిడీలు, నిరుద్యోగ సమస్య, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికం, నివాస సమస్య..మంద ఎక్కువైతే మజ్జిగ పలచనైందన్న చందాన జనాభా పెరిగితే ఏర్పడే ఇబ్బందులు ఇవి. కుటుంబమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే అది జనాభాపైనే అధారపడి ఉంటుంది. శు క్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజల్లో జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ అది ఇంకా సరిపోనట్టు గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానం భారతదేశానిది. ప్రస్తుత భారత దేశజనాభా 128 కోట్లుకాగా ఆంధ్రప్రదేశ్ జనాభా4.5 కోట్లు ఉంది. జిల్లా జనాభా ప్రస్తుతం 23,68,219. ఇందులో పురుషులు 11,62,136 కాగాస్త్రీలు 12,06,083మంది. ఆరు ఏళ్ల లోపు బాలురు 1,23,311కాగా బాలికలు 1,18,357 మంది . 4954 మంది. జనాభా ఇలా పెరుగుతూ పోతుండడం వల్ల దేశంలో చాలామంది మూడు పూటలా కడుపు నిండా తినడానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అన్నింటి కంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఒక ఉద్యోగం సాధించడానికి వందలాది మంది పోటీ పడుతున్నారు. జనాభా ఎక్కువగా ఉండడం వల్ల దేశంలోనూ, జిల్లాలోనూ ప్రజలకు తాగడానికి నీరు కూడా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల నీటి యుద్ధాలు కూడా తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 1987లో తీవ్రమైన ఆహార కొరత, అంటువ్యాధులు, నిరుద్యోగం పెరిగిపోవడంతో జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో ఆ ఏడాది జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనాభా పెరుగుదల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జనాభా తక్కువగా ఉంటే.. జనాభా తక్కువైతే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మంచి ఆహారం దొరుకుతుంది. మంచి ఇళ్లు కట్టుకోగలరు. ఉద్యోగం అందరికీ దొరుకుతుంది. పేదరికం తగ్గి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అవగాహన చేపడుతున్నాం జనాభా నియంత్రణకోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఆడపిల్ల 21 సంవత్సరాలు, పురుషుడు 25 సంవత్సరాలకు వివాహం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా బిడ్డకు, బిడ్డకు మధ్య కనీసం ఐదు సంవత్సరాలు ఎడం పాటించేలా కుటుంబ సంక్షేమ తాత్కాలిక పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తున్నాం. బడిలో బిడ్డ ఒడిలో బిడ్డ అనే నినాదంతో పనిచేస్తున్నాం. ప్రతి ఏడాదీ కళాశాలల్లోనూ సీహెచ్‌సీ స్థాయిల్లో జనాభా పెరుగు దల వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తున్నాం. యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ -
వివరం: అంచనాలకు అందని వేగం
‘‘ఆఖరి చెట్టును కూడా కొట్టేసిన తర్వాత, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేశాక, చివరి చేపను కూడా పట్టేశాక.. అప్పుడు గుర్తిస్తావు నువ్వు డబ్బును తినలేమని!’’ ఆదిమ రెడ్‌ఇండియన్ల సామెత ఇది. వాళ్లను ఆదిమవాసులు అనుకోవడమే కానీ.. వారికున్న విజ్ఞత నాగరికులుగా పేరుపొందిన వాళ్లమైన మనకులేదు! అందుకు అనేక రుజువులున్నాయి. అలాంటి రుజువుల్లో ఒకటి పెరుగుతున్న జనాభా! భూమికి భారమవుతున్న జనాభా! ప్రకృతికి శాపంగా మారుతున్న జనాభా. పెరుగుతున్న జనాభా వల్ల వచ్చే అనర్థాల గురించి చర్చించేందుకు, అవగాహన నింపడానికి, ఆందోళ న వ్యక్తం చేయడానికి, అంతిమంగా హెచ్చరించడానికి నిర్ణయించినదే ‘పాపులేషన్ డే’. ఒక ఆందోళన కరమైన ‘అచీవ్మెంట్’కు జ్ఞాపిక ఈ పాపులేషన్ డే. ఐక్యరాజ్యసమితి ప్రతియేటా జనాభాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పాపులేషన్ డేను నిర్వహిస్తోంది! జూలై 11 నే ఎందుకంటే..! 11-07-1987 న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరింది. అందుకనే జూలై 11 ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. 17 యేళ్ల కిందట ప్రపంచజనాభా ఐదువందల కోట్లను చేరడాన్నే అత్యంత ఆందోళన కరమైన పరిణామంగా భావించింది ఐక్యరాజ్యసమితి. ఈ విషయంలో ప్రతిదేశంలోనూ అవగాహనను నింపడానికి 1989 నుంచి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం మొదలు పెట్టింది. తద్వారా జనాభానియంత్రణకు ప్రణాళికలను అమలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఏడొందల కోట్లు చేరింది! ప్రతి సెకనుకూ ఐదుగురు జన్మిస్తున్నారు, ఇద్దరు మరణిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం ప్రతి సెకనుకూ ప్రపంచ జనాభా ముగ్గురు చొప్పున పెరుగుతోంది. జనాభా నియంత్రణ విషయంలో పాపులేషన్ డేని జరుపుకోవడం 15 సంవత్సరాలు పూర్తి అయ్యే సరికి జనాభా 700 కోట్లు దాటింది. మరో 20 సంవత్సరాల్లో 900 కోట్ల ఫిగర్‌ను క్రాస్ చేస్తుందని అంచనాలున్నాయి. సర్వసమస్యలకూ మూలం! గత కొన్ని సంవత్సరాలుగా జనాభా పెరుగుదల గురించి విస్తృతమైన చర్చ, జనాభాను నియంత్రించడానికి తీవ్రమైన ప్రయత్నాలూ జరగడం లేదనేది వాస్తవం. చర్చించకుండా ఎవరికి వారు మరిచిపోయినంత మాత్రాన ఒక సమస్య మాయం కాదు కదా! అది కూడా భూ ప్రపంచంపై మనిషి ఎదుర్కొంటున్న సర్వసమస్యలకూ మూలం అధిక జనాభా అనే సమస్యేనని ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. సహజవనరులైతేనేమీ, సృష్టించుకొన్న వనరులు అయితేనేమీ... అధికంగా వినియోగించేయడానికి కారణం అవుతోంది జనాభా సమస్య. దీంతో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది తప్పేలా లేదు. వర్తమానం ఆందోళనకరం, భవిష్యత్ ప్రమాదకరం! దాదాపు వంద సంవత్సరాల నుంచి ఆయా సమయాల్లో వర్తమానంలో ఉన్న వారిని ఆందోళనకు గురి చేస్తూ, భవిష్యత్ తరాల మనుగడకు ప్రమాదకరంగా మారింది జనాభా సమస్య. అవకాశాల వేటలో ఉన్న ప్రస్తుత తరాలకు పోటీ ఎక్కువవుతోంది. మంది ఎక్కువై మజ్జిగ పలుచన అవుతోంది. అధిక జనాభా ఫలితంగా రెడ్ఇండియన్లు తరాల వెనుక చెప్పిందే ప్రస్తుతం జరుగుతోంది. ఈ తరంలోనే ఆఖరి చెట్టును కొట్టేయడం, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేయడం, చివరి చేపను కూడా పట్టేయడం జరిగిపోయేలా ఉంది. దీన్ని బట్టి భవిష్యత్తు, భవిష్యత్ తరాల ఉనికి ప్రశ్నార్థకమే! అందరూ ఒప్పుకొంటున్న చేదు వాస్తవం ఏమిటంటే... జనాభా ను ఒక సమస్యగా చూడటం బాగా తగ్గింది. 1970లలోనూ, 80లలోనూ మనదేశంలో కూడా జనాభా నియంత్రణ ప్రభుత్వానికి ఉన్న ముఖ్య బాధ్యతల్లో ఒకటి అయ్యింది. ప్రజల్లో ఈ అంశం గురించి అవగాహన నింపడం కూడా ప్రాముఖ్యతతో కూడిన అంశం అయ్యింది. అయితే సంస్కరణలు మొదలయ్యాకా.. దేశంలో మానవులు కూడా ఒక వనరులు అయ్యారు. అధిక స్థాయిలో జనసంఖ్యను కలిగి ఉండటం కూడా ఒక విధంగా మంచిదే .. ఈ వనరులను సరిగా ఉపయోగించుకొంటే ఆర్థికంగా వృద్ధి సాధింవచ్చనే అనే వాళ్లు ఎక్కువయ్యారు. ఈ గణాంకాలు సమస్య కాదంటున్నాయి! ప్రస్తుతం భూ ప్రపంచం మీద ఉన్న మానవుల జనాభా దాదాపు 700 కోట్లు. వీరిలో దాదాపు 40 కోట్ల మంది కూడూగుడ్డ లేకుండా ఉన్నారు. అర్ధాకలితో నిద్రపోతున్న వాళ్ల సంఖ్య మరో 60 కోట్ల మంది. అయితే యేటా ఇలలో పండుతున్న ఆహార వనరులతో అలవోకగా తొమ్మిది వందల కోట్ల మంది మనుగడ సాగించవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోని సాగుభూమికి 900 కోట్ల మందికి ఆహారాన్ని పెట్టే సత్తా ఉంది. ఏ అతివృష్టిలూ, అనావృష్టిలూ ఎదురుకాకపోతే.. ప్రపంచానికి దాదాపు 900 కోట్ల మందికి తిండి పెట్టగలదు. కానీ సమతుల్యమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఉన్న ఏడువందల కోట్లమందిలోనే వంద కోట్ల మందికి ఆహారం అందకుండా పోతోంది. ఇదికాక యేటా మూడు వందల కోట్ల మందికి సరిపడా ఆహారం వృధాగా పారబోయడమో లేక ప్రకృతి విపత్తుల వల్ల అసలు పండకుండాపోవడమో జరుగుతోంది! తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటికైనా ఆహారవనరులు, జనాభాలు సమతుల్యంగా అవుతాయి. అందుకే ఇప్పుడు జనాభాను నియంత్రించడం కన్నా వనరులను సద్వినియోగం చేసుకోవాలి.. ఆహారాన్ని వృధా కానివ్వకూడదు, వృధాగాపోతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయాలి.. అనే నినాదాలు వినిపిస్తున్నాయి. వీటి మధ్య అధిక జనాభాను అరికట్టాలన్న నినాదం కొంచెం వెనుకబడింది. అవసరం లేకపోయినా, అవగాహన లేక..! మన దేశం వరకూ జనాభాను నియంత్రించాలంటే అందుకు ఉన్న ఏకైకమార్గం ప్రజల్లో అవగాహన కల్పించడమే! ఎందుకంటే... ఇప్పటికీ మన దేశంలో గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రతియేటా 20 కోట్లమంది మహిళలు అసంకల్పితంగా గర్భం దాలుస్తున్నారంటే సమస్య మూలం ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు! అప్పటికే ఇద్దరు పిల్లల పరిమితిని దాటి, ఇంకా సంతానాన్ని వృద్ధి చేసుకోవాలన్న ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేకపోయినా... వాళ్లు పిల్లల్ని కంటున్నారు. జనాభాను పెంచి పోషిస్తున్నారు. దేశానికి సమస్యను తెచ్చి పెడుతున్నారు! మన దేశంలో సంతాన సఫలత రేటు కూడా ఎక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. చలి దేశాల కన్నా మనదేశంలో సఫలత రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో మన దగ్గర నూతన అతిధుల రాక ఎక్కువవుతోంది! గతంతో పోలిస్తే వృద్ధిరేటు తగ్గింది! 1991-2001 లమధ్య జనాభా వృద్ధి రేటుతో పోలిస్తే 2001-2011ల మధ్య జనాభా పెరుగుదల కొంత మేర తగ్గిందని అంటున్నాయి గణాంకాలు. వంద కోట్ల జనాభా వృద్ధి చేసిన జనాభాతో పోలిస్తే, 120 కోట్ల మంది వృద్ధి చేసిన జనాభా దాదాపు రెండున్నర శాతం తక్కువ. దీన్ని బట్టి మన వాళ్లలో అవగాహన పెరుగుతోందని చెప్పవచ్చు. అయితే ఒక దశలో జనాభా విపరీతంగా పెరగడం, ఇప్పుడు భారతీయుల ఆయుఃప్రమాణ రేటు పెరగడం వల్ల జనాభా పెరుగుదల మనకు పరిష్కారం కాని సమస్యే గానే మిగిలింది. ఇంతే నియంత్రణతో ముందుకెళ్లినా కేవలం రెండు దశాబ్దాల్లోనే మనదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశంగా అవతరించనుంది. ఇప్పుడు జనసంఖ్యలో మనకన్నా ముందున్న జనచైనాలో కఠినమైన నియంతృత్వం జనాభా వృద్ధిరేటును తగ్గిస్తోంది. మనదగ్గర అలాంటి ధోరణి లేకపోవవడంతో.. జనాభా విషయంలో టాప్ పొజిషన్‌కు చేరడం దాదాపుగా ఖాయమైంది. ఇది ‘కుటుంబ ప్రణాళిక హక్కు’ ఏడాది! పాపులేషన్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని ‘హ్యూమన్ రైట్ టు ప్లాన్ ఫర్ ఏ ఫ్యామిలీ’గా నిర్ణయించింది. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ప్రజల్లో అవగాహనను నింపడానికి కార్యచరణను రూపొందించి, ఏడాదిపాటు ప్రభుత్వాల సాయంతో అమలు పెట్టనున్నట్టు ప్రకటించింది. - అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం సింగపూర్. అక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకు 7,300 మంది ఉంటారు. - ప్రపంచ జనాభాలో స్త్రీ పురుషు జనాభాను చూసుకొంటే అది 1000:1010గా ఉంది. - పురుషుల సగటు ఆయుఃప్రమాణం 65 యేళ్లు కాగా, మహిళలు సగటున 69 యేళ్లపాటు జీవిస్తున్నారు - భూమిపై ఇప్పటి వరకూ 10,800 కోట్ల మంది ప్రజలు భూమిపైకి అతిధులుగా వచ్చారని అంచనా. వారిలో ప్రస్తుతం ఇలపై ఉన్న వారు దాదాపుగా ఏడు వందల కోట్ల మంది. ఇది కేవలం 6.4 శాతం మాత్రమే. - ఏడు బిలియన్ల జనాభాలో మీరు ఎన్నవవారు?! అనే విషయాన్ని చెబుతుంది పాపులేషన్ యాక్షన్ వెబ్ సైట్.. ఆ సైట్లోకి ఎంటర్ అయ్యి మీరు జన్మదిన వివరాలను ఇస్తే.. ఈ నంబర్ ఎంతో తెలుసుకోవచ్చు! నియంత్రణ మొదలు పెట్టింది మనమే నియంత్రణ విషయానికి వస్తే తొలిసారి అధికారికంగా దీన్ని అమలు చేసిన గొప్పదనం మన దేశానిదే! ప్రపంచ దేశాల కన్నా ముందే అధికజనాభా వల్ల సమస్యలను గుర్తించి వాటి నివారణ కోసం జనాభాను నియంత్రించాలని భావించింది. అయితే మనదేశ ంలో దశాబ్దాలుగా జనాభా విషయంలోని వృద్ధిరేటును గమనిస్తే కుటుంబ నియంత్రణ పథకం అనేది దారుణంగా విఫలమైందని అర్థం అవుతోంది. జనాభా సమస్యను అరికట్టడానికి ఇంకా చాలా కసరత్తే చేయాల్సి ఉంది. మన రాష్ట్రాలు దేశాలతో పోటీపడుతున్నాయి! ప్రపంచంలోని వివిధ దేశాల కన్నా మన దేశంలోని చాలా రాష్ట్రాల జనాభా అధికం అనే విషయం అందరికీ అవగాహన ఉన్నదే. గణాంకాల ప్రకారం తీసుకొంటే... ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ దేశ జనాభా కన్నా ఎక్కువ. మహారాష్ట్ర జనాభా మెక్సికోతో పోటీ పడుతోంది. బీహార్ జనాభా జర్మనీతో సమానం. - ఇక మన దేశంలోని బుల్లి రాష్ట్రాలు కూడా జనాభా విషయంలో చాలా దేశాల కన్నా ముందున్నాయి. అసమతుల్యత కూడా ప్రమాదమే! అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ముసలి వాళ్ల శాతం బాగా పెరిగిపోయింది. ఒకత రం వారు సంతానానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. యాంత్రికంగా తాము బతికితే చాలనుకొన్నారు. దీంతో జనాభాలో అసమతుల్యత. ముప్పై యేళ్లలో ఉన్న జనాలంతా ముసలివాళ్లు అయ్యారు. యువత చూద్దామన్న లేకుండా పోయింది. కేవలం ఈ నగరంలోనే కాదు..ఐక్యరాజ్యసమితి చేత జనాభాను తగ్గించుకొంటున్న దేశంగా కీర్తిని పొందిన జపాన్‌లో కూడా అసమతుల్యత ఎక్కువగా ఉంది. నియంతృత్వంతో జనాభాను నియంత్రిస్తున్న చైనాకు కూడా ఈ ప్రమాదం ఉంది. అయితే సమతుల్యత విషయంలో మనదేశం పరిస్థితి పర్వాలేదని అనుకోవాలి. యూరప్‌లో జనాభా తగ్గుతోంది... ఒకవైపు ప్రపంచ జనాభా పెరిగి పోతున్నా.. యూరప్ జనాభా మాత్రం క్రమంగా తగ్గుతోంది. ప్రత్యేకించి తూర్పు యూరప్, రష్యాల్లో జనాభా క్రమంగా క్షీణిస్తోంది. సంతాన సాఫల్యత రేటు తక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణం. ప్రస్తుతం యూరప్ జనాభా 740 మిలియన్లు కాగా 2050కి ఈ జనాభా 732 మిలియన్లకు తగ్గుతుందని అంచనా! ఆ దేశం పరిస్థితి తలకిందులైంది! జింబాబ్వే... ఒకప్పటి దక్షిణ రుడేషియా. చదరపు కిలోమీటరుకు 37 మంది జనాభాతో ఉండిన ఈ ఆఫ్రికన్ దేశం ఒకప్పుడు ‘బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా’గా పేరు పొందింది. అయితే క్రమంగా పెరిగిన జనాభా, తీవ్రమైన కరువు కాటకాలు ఆ దేశాన్ని ప్రమాదంలోకి పడేశాయి. ప్రస్తుతం మనుషుల జీవనం అత్యంత దుర్భరంగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది జింబాబ్వే. ఇలాంటి పరిణామాలన్నింటికీ కారణం అధిక జనాభానే! ఈ దేశాలు పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయి.. అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, డెన్మార్క్, రష్యా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్, యూకేల్లో ఎక్కువమంది పిల్లను కనే జంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలున్నాయి. నెగిటివ్ గ్రోత్ రేట్‌తో అసమతుల్యత వస్తుందనే భయంతో ఈ దేశ ప్రభుత్వాలు ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనే జంటలకు పోత్సాహాన్ని ఇస్తున్నాయి. పిల్లలను కంటామనే దంపతులకు ఉద్యోగవిధుల నుంచి సెలవులిచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నాయి! పిల్లల పోషణకు గానూ డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఒకరి సమస్యమాత్రమే కాదు! రోడ్డు మీద మనం బైక్ బాగా నడిపితే సరిపోదు... పక్కవాళ్లు కూడా జాగ్రత్తగా నడుపుతున్నప్పుడే మనం కూడా సేఫ్ జర్నీ చేయగలం. జనాభా విషయంలోనైనా అంతే... ఇది ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు.. అందరి చేతా అందరికీ సమస్యగా మారే సమస్య. ఏదో ఒక దేశం నియంత్రిస్తే సరిపోదు.. సమూహ జీవనంలో అందరూ బాధితులే అవుతారు. చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. ఈ దేశాలు ఇప్పుడు జనసంఖ్య విషయంలో టాప్ కంట్రీస్‌గా ఉన్నాయి. విస్తీర్ణం పరంగా తీసుకొంటే వీటిలో చైనా, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు జనాభా పెద్ద సమస్య. ఇక విస్తీర్ణం తక్కువగా ఉన్నా.. జనాభా ఎక్కువగా ఉండటంతో కూడా కొన్ని దేశాలు ఈతిబాధలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి విషయంలో ఆఫ్రికాదేశాలను ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలోని 77 దేశాలు అధిక జనాభా ఫలితంగా వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. తమ ఉత్పత్తులు చాలక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటూ మనుగడ కొనసాగిస్తున్నాయి. జనాభా నియంత్రణ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలది ప్రముఖమైనపాత్ర. అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక జనాభాకు కారణమవుతూ వనరుల విధ్వంసం చేస్తుంటే.. అభివృద్ధి చెందిన దేశాలతో మరో సమస్య. వీళ్లు అవసరార్థానికన్నా ఎక్కువ వనరులను వాడుతూ, వృధా చేస్తూ మరో రకమైన ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. భూమిపై తన ఇష్టానికి అనుగుణ ంగా సంతానాన్ని వృద్ధి చేసుకొని... కుటుంబంగా మనుగడ సాగించగలిగే అవకాశం ఉన్న జీవి మనిషి మాత్రమే. మరి జనాభా భువికే ప్రమాదకరంగా మారకూడదంటే నియంత్రించుకోవడం ఒకటే మనిషికి ఉన్న మార్గం. లేకపోతే ప్రకృతే ఆ పని చేస్తుంది! తనకు ఎక్కువైన భారాన్ని తగ్గించుకొంటుంది! - జీవన్‌రెడ్డి. బి