World Population Day 2021, Sakshi Special Story: 2050 నాటికి ఇండియా జనాభా ఎంతో తెలుసా ?- Sakshi
Sakshi News home page

World Population Day : 2050 నాటికి ఇండియా జనాభా ఎంతో తెలుసా ?

Published Sat, Jul 10 2021 4:57 PM | Last Updated on Sun, Jul 11 2021 6:28 PM

World Population Day Special Story  - Sakshi

దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్నాడు గురజాడ అప్పారావు. కానీ మనుషులు అన్ని దేశాల్లో ఒకేలా లేరు. ఒక చోట వనరులకు మించి జనాభా ఉంటే .. మరో చోట వనరులున్నా జనాభా తగ్గిపోతుంది. నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా ఎలా ఉంది. ఇక ముందు ఎలా ఉండబోతుందనే అంశాలపై ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా  సాక్షి వెబ్‌ ప్రత్యేక కథనం


1989లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకు ముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

అప్పుడు మరణాలే
నాగరికత నేర్చింది మొదలు రెండో ప్రపంచ యుద్ధం వరకు మనిషి మనుగడ అంత సులువుగా లేదు. ఎప్పుడో ఏదో ఒక ఉపద్రవం రావడం, యుద్ధాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకునేవి. పైగా వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అంటు రోగాలు, వ్యాధులుల విజృంభించేవి. శిశు మరణాల రేటు ఎక్కువ. దీంతో జనాభా వృద్ధి ఓ మోస‍్తరుగా ఉండేంది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, అంతకు ముందు వచ్చిన స్పానిష్‌ ఫ్లూ కారణంగా లక్షలాది మంది మరణించారు.

బేబీ బూన్‌
1950 నుంచి 1987 మధ్య కాలంలో ఒక్క సారిగా ప్రపంచ జనాభా విస్ఫోటనం జరిగింది. ప్రపంచ జనాభా 250 కోట్ల నుంచి 500 కోట్లకు చేరుకోవడానికి కేవలం 37 ఏళ్లు మాత్రమే పట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగవడం, భూస్వామ్య, రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యం రావడం, ఆధునిక వ్యవసాయం, తగ్గిపోయిన యుద్ధాలు తదితర కారణాలతో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ఈ 37 ఏళ్ల కాలాన్ని బేబీ బూన్‌గా వ్యవహరిస్తుంటారు

జనాభా తగ్గిపోతుంది
ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొన్ని దేశాలు... తమ జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్‌ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదు అవుతోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్‌, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అంచనా.

ఇండియా పరిస్థితి
జపాన్‌, ఇటలీ స్థాయిలో కాకపోయినా ఇండియాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోత్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. 1950లో భారతీయ మహిళలు సగటున ఒక్కొక్కరు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తే.. ప్రస్తుతం అది 2.1గా ఉంది. 

మరో 25 ఏళ్లు
సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే జనాభా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ దేశ లేదా ప్రాంత లేదా తెగకు చెందిన మహిళలకు 2.1 మంది పిల్లలకు జన్మనివ్వాలి. ప్రస్తుతం ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్ల మరో 25 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో భారత జనాభా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళా, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలు జన్మనిచ్చే రేటు 2.1 కంటే దిగువకు చేరుకుంది.

2047లో గరిష్ట స్థాయికి
2018-19లో చేపట్టిన ఆర్థిక సర్వేలో 2030 నాటికి ఇండియాలో జననాల రేటు 2 కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకు భారత దేశ జనాభా పెరుగుతూ పోయి గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదు అవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి ఇండియా జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా.

పెంచండి
దాదాపు అర్థ దశాబ్ధం పాటు అత్యంత కఠిన జనాభా నియంత్రణ విధానాలు అమలు చేసిన చైనా ధోరణిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కన్నా పర్వాలేదు అంటోంది. మరోవైపు పోలాండ్‌ దేశం అబార్షన్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఒక్కో చిన్నారికి 100 యూరోల వంతున ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతీ నెల ఆర్థిక సాయం అందిస్తోంది. దక్షిణ కోరియా పిల్లలు ఎక్కువగా ఉన్న దంపతులకు ఇన్సెంటీవ్‌లు, హోం లోన్లు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తోంది. 

సువర్ణావకాశం
జనాభా పెరిగిపోయిందని దేశంలో ఆందోళన నెలకొన్నా ఇప్పుడు ప్రపంచలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్‌ నిలబడింది. ఇప్పుడు యువ జనాభాలో నైపుణ్యం పెంచి కొత్త అవకాశాలు సృష్టిస్తేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవాళ్లం అవుతాం. అలా కానట్టయితే మరో ముప్పై ఏళ్లకు అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశంగా ఇండియా మిగిలిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి, మౌలిక సదుపాయాలతో వృద్ధ జనాభాతో నెట్టుకురావడం కష్టంగా మారుతుంది. 

ఇద్దరు చాలు
ఇండియాలో 24 కోట్ల ప్రజలతో అ‍త్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ నిలిచింది. అత్యధిక జనాభా కలిగిన టాప్‌ టెన్‌ దేశాల్లో ఉన్న బ్రెజిల్‌, నైజీరియా, బంగ్లాదేశ్‌, రష్యా, మెక్సికోల కంటే ఉత్తర్‌ ప్రదేశ్‌ జనాభాయే ఎక్కువ. దీంతో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది యోగీ సర్కార్‌. దీని కోసం న్యూ పాపులేషన్‌ పాలసీ 2021-30ని అమల్లోకి తెచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారికి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సబ్సిడీలు అందవ్వమంటూ  సీఎం యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పిల్లలన్ని కనండి
జపాన్‌, పోలండ్‌ దేశాల తరహా పరిస్థితిని ఇండియాలో పార్సి మతస్తులు ఎదుర్కొంటున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు పార్సీల జనాభా ఇండియాలో లక్షకు పైగా ఉండగా  ఇప్పుడు కేవలం 55,000లకు పరిమితమైంది. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మినహాయిస్తే నగరాల్లోనే అక్కడక్కడ పార్సీలు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంచుమించు వెయ్యి మంది పార్సీలు ఉండగా ఏపీలో అయితే రెండు అంకెలలోపే ఉండవచ్చని అంచనా. దీంతో పిల్లలు కనాలంటూ దంపతులను ప్రోత్సహించేందుకు ‘జియో పార్సీ’ అనే పథకాన్ని మైనార్టీ వెల్ఫేర్‌ మినిస్ట్రీ చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలు పార్సీ స్వచ్చంధ సంస్థలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. పార్సీల జనాభా తగ్గిపోవడానికి కారణం లేటు వయస్సులో పెళ్లిలు చేసుకోవడం, పెద్ద కుటుంబాల పట్ల అయిష్టత ఉండటం ముఖ్య కారణమని పార్సీ అంజుమాన్‌ ట్రస్టు బాధ్యులు జహంగీర్‌ తెలిపారు. 
 

జనాభా పెరుగుదల తీరుతెన్నులు
భూమిపై మనిషి పుట్టుక మొదలైన తర్వాత వేల ఏళ్ల తర్వాత 1800లో మొదటి సారిగా జనాభా వంద కోట్లను దాటింది.
- 1900 నాటికి జనాభా ఒకేసారిగా పెరిగి 200 కోట్లకు చేరుకుంది
- 2000 వచ్చే సరికి జనాభా మూడింతలై 600 కోట్లకు చేరుకుంది
- 2000 నుంచి 2012 అంటే పదేళ్లలో  జనాభా 700 కోట్లు అయ్యింది
- 2030 నాటికి రికార్డు స్థాయిలో 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చని అంచనా
- 2100 నాటికి ప్రపంచ జనాభా 1000.90 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కకట్టింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement