వివరం: అంచనాలకు అందని వేగం | World population growth speed more is not known expectancy | Sakshi
Sakshi News home page

వివరం: అంచనాలకు అందని వేగం

Published Sun, Jul 6 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

వివరం: అంచనాలకు అందని వేగం

వివరం: అంచనాలకు అందని వేగం

‘‘ఆఖరి చెట్టును కూడా కొట్టేసిన తర్వాత, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేశాక, చివరి చేపను కూడా పట్టేశాక.. అప్పుడు గుర్తిస్తావు నువ్వు డబ్బును తినలేమని!’’ ఆదిమ రెడ్‌ఇండియన్ల సామెత ఇది. వాళ్లను ఆదిమవాసులు అనుకోవడమే కానీ.. వారికున్న విజ్ఞత  నాగరికులుగా పేరుపొందిన వాళ్లమైన మనకులేదు! అందుకు అనేక రుజువులున్నాయి. అలాంటి రుజువుల్లో ఒకటి పెరుగుతున్న జనాభా! భూమికి భారమవుతున్న జనాభా! ప్రకృతికి శాపంగా మారుతున్న జనాభా.  
 
 పెరుగుతున్న జనాభా వల్ల వచ్చే అనర్థాల గురించి చర్చించేందుకు, అవగాహన నింపడానికి, ఆందోళ న వ్యక్తం చేయడానికి, అంతిమంగా హెచ్చరించడానికి నిర్ణయించినదే ‘పాపులేషన్ డే’. ఒక ఆందోళన కరమైన ‘అచీవ్‌మెంట్’కు జ్ఞాపిక ఈ  పాపులేషన్ డే. ఐక్యరాజ్యసమితి ప్రతియేటా జనాభాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పాపులేషన్ డేను నిర్వహిస్తోంది!
 
 జూలై 11 నే ఎందుకంటే..!
 11-07-1987 న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరింది. అందుకనే జూలై 11 ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. 17 యేళ్ల కిందట ప్రపంచజనాభా ఐదువందల కోట్లను చేరడాన్నే అత్యంత ఆందోళన కరమైన పరిణామంగా భావించింది ఐక్యరాజ్యసమితి. ఈ విషయంలో ప్రతిదేశంలోనూ అవగాహనను నింపడానికి 1989 నుంచి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం మొదలు పెట్టింది. తద్వారా జనాభానియంత్రణకు ప్రణాళికలను అమలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది.
 
  ఇంతలోనే ఏడొందల కోట్లు చేరింది!
 ప్రతి సెకనుకూ ఐదుగురు జన్మిస్తున్నారు, ఇద్దరు మరణిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం ప్రతి సెకనుకూ ప్రపంచ జనాభా ముగ్గురు చొప్పున పెరుగుతోంది. జనాభా నియంత్రణ విషయంలో పాపులేషన్ డేని జరుపుకోవడం 15 సంవత్సరాలు పూర్తి అయ్యే సరికి జనాభా 700 కోట్లు దాటింది. మరో 20 సంవత్సరాల్లో 900 కోట్ల ఫిగర్‌ను క్రాస్ చేస్తుందని అంచనాలున్నాయి.
 
 సర్వసమస్యలకూ మూలం!
 గత కొన్ని సంవత్సరాలుగా జనాభా పెరుగుదల గురించి విస్తృతమైన చర్చ, జనాభాను నియంత్రించడానికి తీవ్రమైన ప్రయత్నాలూ జరగడం లేదనేది వాస్తవం. చర్చించకుండా ఎవరికి వారు మరిచిపోయినంత మాత్రాన ఒక సమస్య మాయం కాదు కదా!  అది కూడా భూ ప్రపంచంపై మనిషి ఎదుర్కొంటున్న సర్వసమస్యలకూ మూలం అధిక జనాభా అనే సమస్యేనని ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. సహజవనరులైతేనేమీ, సృష్టించుకొన్న వనరులు అయితేనేమీ... అధికంగా వినియోగించేయడానికి కారణం అవుతోంది జనాభా సమస్య. దీంతో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది తప్పేలా లేదు.

 వర్తమానం ఆందోళనకరం, భవిష్యత్ ప్రమాదకరం!
 దాదాపు వంద సంవత్సరాల నుంచి ఆయా సమయాల్లో వర్తమానంలో ఉన్న వారిని ఆందోళనకు గురి చేస్తూ, భవిష్యత్ తరాల మనుగడకు ప్రమాదకరంగా మారింది జనాభా సమస్య. అవకాశాల వేటలో ఉన్న ప్రస్తుత తరాలకు పోటీ ఎక్కువవుతోంది. మంది ఎక్కువై మజ్జిగ పలుచన అవుతోంది. అధిక జనాభా ఫలితంగా రెడ్‌ఇండియన్లు తరాల వెనుక చెప్పిందే ప్రస్తుతం జరుగుతోంది. ఈ తరంలోనే ఆఖరి చెట్టును కొట్టేయడం, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేయడం, చివరి చేపను కూడా పట్టేయడం జరిగిపోయేలా ఉంది.
 
  దీన్ని బట్టి భవిష్యత్తు, భవిష్యత్ తరాల ఉనికి ప్రశ్నార్థకమే! అందరూ ఒప్పుకొంటున్న చేదు వాస్తవం ఏమిటంటే... జనాభా ను ఒక సమస్యగా చూడటం బాగా తగ్గింది. 1970లలోనూ, 80లలోనూ మనదేశంలో కూడా జనాభా నియంత్రణ ప్రభుత్వానికి ఉన్న ముఖ్య బాధ్యతల్లో ఒకటి అయ్యింది. ప్రజల్లో ఈ అంశం గురించి అవగాహన నింపడం కూడా ప్రాముఖ్యతతో కూడిన అంశం అయ్యింది. అయితే సంస్కరణలు మొదలయ్యాకా.. దేశంలో మానవులు కూడా ఒక వనరులు అయ్యారు. అధిక స్థాయిలో జనసంఖ్యను కలిగి ఉండటం కూడా ఒక విధంగా మంచిదే .. ఈ వనరులను సరిగా ఉపయోగించుకొంటే ఆర్థికంగా వృద్ధి సాధింవచ్చనే అనే వాళ్లు ఎక్కువయ్యారు.
 
 ఈ గణాంకాలు సమస్య కాదంటున్నాయి!
 ప్రస్తుతం భూ ప్రపంచం మీద ఉన్న మానవుల జనాభా దాదాపు 700 కోట్లు. వీరిలో దాదాపు 40 కోట్ల మంది కూడూగుడ్డ లేకుండా ఉన్నారు. అర్ధాకలితో నిద్రపోతున్న వాళ్ల సంఖ్య మరో 60 కోట్ల మంది. అయితే  యేటా ఇలలో పండుతున్న ఆహార వనరులతో అలవోకగా తొమ్మిది వందల కోట్ల మంది మనుగడ సాగించవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోని సాగుభూమికి 900 కోట్ల మందికి ఆహారాన్ని పెట్టే సత్తా ఉంది. ఏ అతివృష్టిలూ, అనావృష్టిలూ ఎదురుకాకపోతే.. ప్రపంచానికి దాదాపు 900 కోట్ల మందికి తిండి పెట్టగలదు.  కానీ సమతుల్యమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఉన్న ఏడువందల కోట్లమందిలోనే వంద కోట్ల మందికి ఆహారం అందకుండా పోతోంది. ఇదికాక  యేటా మూడు వందల కోట్ల మందికి సరిపడా  ఆహారం వృధాగా పారబోయడమో లేక ప్రకృతి విపత్తుల వల్ల అసలు పండకుండాపోవడమో జరుగుతోంది!
 
 తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటికైనా ఆహారవనరులు, జనాభాలు సమతుల్యంగా అవుతాయి. అందుకే ఇప్పుడు జనాభాను నియంత్రించడం కన్నా వనరులను సద్వినియోగం చేసుకోవాలి.. ఆహారాన్ని వృధా కానివ్వకూడదు, వృధాగాపోతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయాలి.. అనే నినాదాలు వినిపిస్తున్నాయి. వీటి మధ్య అధిక జనాభాను అరికట్టాలన్న నినాదం కొంచెం వెనుకబడింది.
 
 అవసరం లేకపోయినా, అవగాహన లేక..!
 మన దేశం వరకూ జనాభాను నియంత్రించాలంటే అందుకు ఉన్న ఏకైకమార్గం ప్రజల్లో అవగాహన కల్పించడమే! ఎందుకంటే... ఇప్పటికీ మన దేశంలో గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రతియేటా 20 కోట్లమంది మహిళలు అసంకల్పితంగా గర్భం దాలుస్తున్నారంటే సమస్య మూలం ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు! అప్పటికే ఇద్దరు పిల్లల పరిమితిని దాటి, ఇంకా సంతానాన్ని వృద్ధి చేసుకోవాలన్న ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేకపోయినా... వాళ్లు పిల్లల్ని కంటున్నారు. జనాభాను పెంచి పోషిస్తున్నారు. దేశానికి సమస్యను తెచ్చి పెడుతున్నారు! మన దేశంలో సంతాన సఫలత రేటు కూడా ఎక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. చలి దేశాల కన్నా మనదేశంలో సఫలత రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో మన దగ్గర నూతన అతిధుల రాక ఎక్కువవుతోంది!
 
 గతంతో పోలిస్తే వృద్ధిరేటు తగ్గింది!
 1991-2001 లమధ్య జనాభా వృద్ధి రేటుతో పోలిస్తే 2001-2011ల మధ్య జనాభా పెరుగుదల కొంత మేర తగ్గిందని అంటున్నాయి గణాంకాలు. వంద కోట్ల జనాభా వృద్ధి చేసిన జనాభాతో పోలిస్తే, 120 కోట్ల మంది వృద్ధి చేసిన జనాభా దాదాపు రెండున్నర శాతం తక్కువ. దీన్ని బట్టి మన వాళ్లలో అవగాహన పెరుగుతోందని చెప్పవచ్చు. అయితే ఒక దశలో జనాభా విపరీతంగా పెరగడం,  ఇప్పుడు భారతీయుల ఆయుఃప్రమాణ రేటు పెరగడం వల్ల జనాభా పెరుగుదల మనకు పరిష్కారం కాని సమస్యే గానే మిగిలింది. ఇంతే నియంత్రణతో ముందుకెళ్లినా కేవలం రెండు దశాబ్దాల్లోనే మనదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశంగా అవతరించనుంది. ఇప్పుడు జనసంఖ్యలో మనకన్నా ముందున్న జనచైనాలో కఠినమైన నియంతృత్వం జనాభా వృద్ధిరేటును తగ్గిస్తోంది. మనదగ్గర అలాంటి ధోరణి లేకపోవవడంతో.. జనాభా విషయంలో టాప్ పొజిషన్‌కు చేరడం దాదాపుగా ఖాయమైంది.
 
 ఇది ‘కుటుంబ ప్రణాళిక హక్కు’ ఏడాది!
 పాపులేషన్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని ‘హ్యూమన్ రైట్ టు ప్లాన్ ఫర్ ఏ ఫ్యామిలీ’గా నిర్ణయించింది. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ప్రజల్లో అవగాహనను నింపడానికి కార్యచరణను రూపొందించి, ఏడాదిపాటు ప్రభుత్వాల సాయంతో అమలు పెట్టనున్నట్టు ప్రకటించింది.
  -   అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం సింగపూర్. అక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకు 7,300 మంది ఉంటారు.
-     ప్రపంచ జనాభాలో స్త్రీ పురుషు జనాభాను చూసుకొంటే అది 1000:1010గా ఉంది.
-     పురుషుల సగటు ఆయుఃప్రమాణం 65 యేళ్లు కాగా, మహిళలు సగటున 69 యేళ్లపాటు జీవిస్తున్నారు
-     భూమిపై ఇప్పటి వరకూ 10,800 కోట్ల మంది ప్రజలు భూమిపైకి అతిధులుగా వచ్చారని అంచనా. వారిలో ప్రస్తుతం ఇలపై ఉన్న వారు దాదాపుగా ఏడు వందల కోట్ల మంది. ఇది కేవలం 6.4 శాతం మాత్రమే.
-     ఏడు బిలియన్ల జనాభాలో మీరు ఎన్నవవారు?! అనే విషయాన్ని చెబుతుంది పాపులేషన్  యాక్షన్  వెబ్ సైట్.. ఆ సైట్‌లోకి ఎంటర్ అయ్యి మీరు జన్మదిన వివరాలను ఇస్తే.. ఈ నంబర్ ఎంతో తెలుసుకోవచ్చు!
 
 నియంత్రణ మొదలు పెట్టింది మనమే
 నియంత్రణ విషయానికి వస్తే తొలిసారి అధికారికంగా దీన్ని అమలు చేసిన గొప్పదనం మన దేశానిదే! ప్రపంచ దేశాల కన్నా ముందే అధికజనాభా వల్ల సమస్యలను గుర్తించి వాటి నివారణ కోసం జనాభాను నియంత్రించాలని భావించింది. అయితే మనదేశ ంలో దశాబ్దాలుగా జనాభా విషయంలోని వృద్ధిరేటును గమనిస్తే కుటుంబ నియంత్రణ పథకం అనేది దారుణంగా విఫలమైందని అర్థం అవుతోంది.  జనాభా సమస్యను అరికట్టడానికి ఇంకా చాలా కసరత్తే చేయాల్సి ఉంది.
 
 మన రాష్ట్రాలు దేశాలతో పోటీపడుతున్నాయి!
 ప్రపంచంలోని వివిధ దేశాల కన్నా మన దేశంలోని చాలా రాష్ట్రాల జనాభా అధికం అనే విషయం అందరికీ అవగాహన ఉన్నదే. గణాంకాల ప్రకారం తీసుకొంటే... ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ దేశ జనాభా కన్నా ఎక్కువ. మహారాష్ట్ర జనాభా మెక్సికోతో పోటీ పడుతోంది. బీహార్ జనాభా జర్మనీతో సమానం.
- ఇక మన దేశంలోని బుల్లి రాష్ట్రాలు కూడా జనాభా విషయంలో చాలా దేశాల కన్నా ముందున్నాయి.
 
 అసమతుల్యత కూడా ప్రమాదమే!
 అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ముసలి వాళ్ల శాతం బాగా పెరిగిపోయింది. ఒకత రం వారు సంతానానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. యాంత్రికంగా తాము బతికితే చాలనుకొన్నారు. దీంతో జనాభాలో అసమతుల్యత. ముప్పై యేళ్లలో ఉన్న జనాలంతా ముసలివాళ్లు అయ్యారు. యువత చూద్దామన్న లేకుండా పోయింది. కేవలం ఈ నగరంలోనే కాదు..ఐక్యరాజ్యసమితి చేత జనాభాను తగ్గించుకొంటున్న దేశంగా కీర్తిని పొందిన జపాన్‌లో కూడా అసమతుల్యత ఎక్కువగా ఉంది. నియంతృత్వంతో జనాభాను నియంత్రిస్తున్న చైనాకు కూడా ఈ ప్రమాదం ఉంది.  అయితే సమతుల్యత విషయంలో మనదేశం పరిస్థితి పర్వాలేదని అనుకోవాలి.
 
 యూరప్‌లో జనాభా తగ్గుతోంది...
 ఒకవైపు ప్రపంచ జనాభా పెరిగి పోతున్నా.. యూరప్ జనాభా మాత్రం క్రమంగా తగ్గుతోంది. ప్రత్యేకించి తూర్పు యూరప్, రష్యాల్లో జనాభా క్రమంగా క్షీణిస్తోంది. సంతాన సాఫల్యత రేటు తక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణం. ప్రస్తుతం యూరప్ జనాభా 740 మిలియన్లు కాగా 2050కి ఈ జనాభా 732 మిలియన్లకు తగ్గుతుందని అంచనా!
 
 ఆ దేశం పరిస్థితి తలకిందులైంది!
 జింబాబ్వే... ఒకప్పటి దక్షిణ రుడేషియా. చదరపు కిలోమీటరుకు 37 మంది జనాభాతో ఉండిన ఈ ఆఫ్రికన్ దేశం ఒకప్పుడు ‘బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా’గా పేరు పొందింది. అయితే క్రమంగా పెరిగిన జనాభా, తీవ్రమైన కరువు కాటకాలు ఆ దేశాన్ని ప్రమాదంలోకి పడేశాయి. ప్రస్తుతం మనుషుల జీవనం అత్యంత దుర్భరంగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది జింబాబ్వే. ఇలాంటి పరిణామాలన్నింటికీ కారణం అధిక జనాభానే!
 
 ఈ దేశాలు పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయి..
 అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, డెన్మార్క్, రష్యా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్, యూకేల్లో ఎక్కువమంది పిల్లను కనే జంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలున్నాయి. నెగిటివ్ గ్రోత్ రేట్‌తో అసమతుల్యత వస్తుందనే భయంతో ఈ దేశ ప్రభుత్వాలు ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనే జంటలకు పోత్సాహాన్ని ఇస్తున్నాయి. పిల్లలను కంటామనే దంపతులకు ఉద్యోగవిధుల నుంచి సెలవులిచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నాయి! పిల్లల పోషణకు గానూ డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నాయి.
 
 ఒకరి సమస్యమాత్రమే కాదు!
 రోడ్డు మీద మనం బైక్ బాగా నడిపితే సరిపోదు... పక్కవాళ్లు కూడా జాగ్రత్తగా నడుపుతున్నప్పుడే మనం కూడా సేఫ్ జర్నీ చేయగలం. జనాభా విషయంలోనైనా అంతే... ఇది ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు.. అందరి చేతా అందరికీ సమస్యగా మారే సమస్య. ఏదో ఒక దేశం నియంత్రిస్తే సరిపోదు.. సమూహ జీవనంలో అందరూ బాధితులే అవుతారు. చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. ఈ దేశాలు ఇప్పుడు జనసంఖ్య విషయంలో టాప్ కంట్రీస్‌గా ఉన్నాయి. విస్తీర్ణం పరంగా తీసుకొంటే వీటిలో చైనా, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు జనాభా పెద్ద సమస్య. ఇక విస్తీర్ణం తక్కువగా ఉన్నా.. జనాభా  ఎక్కువగా ఉండటంతో కూడా కొన్ని దేశాలు ఈతిబాధలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి విషయంలో ఆఫ్రికాదేశాలను ప్రస్తావించుకోవాలి.
 
 ప్రస్తుతం ప్రపంచంలోని 77 దేశాలు అధిక జనాభా ఫలితంగా వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. తమ ఉత్పత్తులు చాలక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటూ మనుగడ కొనసాగిస్తున్నాయి. జనాభా నియంత్రణ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలది ప్రముఖమైనపాత్ర. అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక జనాభాకు కారణమవుతూ వనరుల విధ్వంసం చేస్తుంటే.. అభివృద్ధి చెందిన దేశాలతో మరో సమస్య. వీళ్లు అవసరార్థానికన్నా ఎక్కువ వనరులను వాడుతూ, వృధా చేస్తూ మరో రకమైన ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు.
 
 భూమిపై తన ఇష్టానికి అనుగుణ ంగా సంతానాన్ని వృద్ధి చేసుకొని... కుటుంబంగా మనుగడ సాగించగలిగే అవకాశం ఉన్న జీవి మనిషి మాత్రమే. మరి జనాభా భువికే ప్రమాదకరంగా మారకూడదంటే నియంత్రించుకోవడం ఒకటే మనిషికి ఉన్న మార్గం. లేకపోతే ప్రకృతే ఆ పని చేస్తుంది! తనకు ఎక్కువైన భారాన్ని తగ్గించుకొంటుంది!
 - జీవన్‌రెడ్డి. బి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement