ప్రపంచ జనాభా ఈ ఏడాది ఒక మైలు రాయికి చేరుకోబోతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్లు కానుంది. వనరులు చూస్తే పరిమితం. జనాభా చూస్తే అపారం వీరందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తే అధిక జనాభా విసిరే సవాళ్ల నుంచి బయటపడతామా ? ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ఈ దిశగానే కృషి చేస్తోంది.
ప్రస్తుతం 795 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ సారి ప్రపంచ జనాభా దినోత్సవం రోజు ఐక్యరాజ్య సమితి ప్రజల సుస్థిర భవిష్యత్‌పై దృష్టి సారించింది. భూమ్మీద ఉన్న పరిమితమైన వనరులతో తమకున్న అవకాశాలను, హక్కుల్ని వినియోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడడంతో ఆ దిశగా అందరిలోనూ అవగాహన కల్పించడానికి యూఎన్ నడుం బిగించింది.
జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు, ప్రకృతి సమతుల్యతకు పెరుగుతున్న జనాభా ఎలా గొడ్డలి పెట్టుగా మారుతుందో ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్ధమైంది. తరాల మధ్య అంతరాలు, వనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం నిరుపేద దేశాల్లో ఆకలి కేకలు, ఆరోగ్యం అందకపోవడం వంటి సమస్యలుంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు బాగా చదువుకొని, మంచి ఆరోగ్యంతో , మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఇప్పటికే మన భూమి పునరుత్పాదక శక్తి కంటే రెండింతలు ఎక్కువగా వనరుల్ని వాడేస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి మన అవసరాలు తీర్చడానికి మూడు భూమండలాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 కోట్ల మందికి కావల్సినంత పోషకాహారం దొరకకపోతే మరోవైపు 65 కోట్ల మందికి సమృద్ధిగా ఆహారం లభించి ఊబకాయం బారిన పడుతున్నారు. 2050 నాటికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం కంటే 70% ఎక్కువ అవసరం ఉంటుంది.
వ్యవసాయ దిగుబడులకు చేసే ప్రయత్నాలతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. నాణేనికి రెండువైపులా ఉన్నట్టే పెరిగిపోతున్న జనాభా అనేది సమస్య కాదని, ఎన్నో సమస్యలకు అది పరిష్కారం కూడా అవుతుందని మన అనుభవాలే పాఠాలు నేర్పిస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్‌ఎఫ్‌పీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనెమ్ వ్యాఖ్యానించారు. జనాభా ఒక రకంగా శాపం.
మరో రకంగా చూస్తే వరంగా మారే పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయం బలపడుతోంది. అత్యధిక దేశాల్లో జనాభా నియంత్రణపై అవగాహన ఉండడంతో ఇప్పుడు వనరుల సమాన పంపిణీపై అవగాహన పెంచే పరిస్థితులు వచ్చాయి. పిల్లల్ని కనకపోవడం వల్ల జపాన్, ఇటలీ వంటి దేశాల్లో వృద్ధులు పెరిగిపోయి ఒక సమస్యగా మారింది. చైనా కూడా వన్ చైల్డ్ పాలసీని రద్దు చేయాల్సి వచ్చింది. అదే భారత్‌ను తీసుకుంటే యువచోదక శక్తితో అభివృద్ధి పథంలో దూసుకువెళుతోంది.
యువ భారతం
ప్రపంచ జనాభాలో అయిదో వంతు మంది భారత్‌లోనే ఉన్నారు. ప్రతీ ఏడాది సగటున 1 శాతం జనాభా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లోనే యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉంది. దేశంలోని 130 కోట్ల జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు 25 శాతంపైనే ఉంది. దేశంలో యువ జనాభా సగటు వయసు 28 ఏళ్లు అయితే చైనాలో 38 ఏళ్లు, జపాన్‌లో 48గా ఉంది. ఈ యువశక్తితోనే భారత్ ప్రపంచంలో శక్తిమంత దేశంగా అవతరిస్తుంది. ఇక జనాభా మితిమీరి పెరిగితే మాత్రం వారి అవసరాలు తీర్చలేక సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి.
వృద్ధ జపాన్
ఆసియా, యూరప్ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించి ఉన్న వారు జపాన్ జనాభాలో 28% ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్, ఇటలీల్లో పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురుకానున్నాయి. 2025–2040 మధ్య కాలంలో జపాన్‌లో పని చేసే ప్రజలు (20–64 ఏళ్లు) కోటి మందికి పడిపోతుందని, దానిని ఎదుర్కోవడానికి ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
యూఎన్ తాజా నివేదిక
► ప్రపంచ జనాభా 600 కోట్ల నుంచి 700 కోట్లకి చేరుకోవడానికి 12 ఏళ్లు పడితే, అంతే సమయంలో 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోబోతోంది.
► ప్రపంచ జనాభాకి మరో 100 కోట్ల మది పెరగడానికి ఈసారి 14.5 సంవత్సరాలు పట్టవచ్చునని యూఎన్ అంచనా వేసింది.
► 2080 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా వెయ్యి కోట్లకు చేరుకొని, 2100 వరకు అలాగే స్థిరంగా ఉంటుంది
► 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగం జనాభా ఆసియా దేశాల నుంచి ఉంటే, ఆఫ్రికా దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచి పుట్టుకొచ్చింది.
► ప్రస్తుతం జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో చైనా, నైజీరియా ఉన్నాయి.
► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని చేసే జనాభా (25 నుంచి 64 ఏళ్ల వయసు) పెరుగుతూ వస్తోంది.
► ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏళ్లకు చేరుకుంది. 1990 నుంచి చూసుకుంటే ఆయుర్దాయం తొమ్మిది సంవత్సరాలు పెరిగింది.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment